Home లైఫ్ స్టైల్ బతుకుపోరులో భవాని

బతుకుపోరులో భవాని

Female Auto Driver Bhavani

 

“టీనేజీలోనే, పెళ్లయింది. నా భర్తకి తోడుగా చిన్న టీ కొట్టు నడుపుతూ, పొట్ట పోసుకునే వాళ్లం. ముగ్గురు పిల్లలు పుట్టాక భర్త అనారోగ్యంతో మరణించడం నా జీవితంలో అంతులేని విషాదం.

దానికి మించిన మరో ఘోరం…
నాక్కూడా భర్త వల్ల హెచ్‌ఐవీ వైరస్ సోకిందని తెలిసింది. ఇక పిల్లలకి కూడా తప్పదేమోనని అనుమానంతో, అందరం కృష్ణానదిలో దూకుదామని బయలుదేరాం. అదృష్టవశాత్తూ నా ముగ్గురి బిడ్డల్లో ఎవరికీ వైరస్ లేదని రిపోర్ట్ రావడంతో ఆగిపోయాం…” చెప్పడం ఆపి కళ్లు తుడుచుకుంది భవాని.

ఇలాంటి పరిస్థితుల్లో ఇరవై మూడేళ్ళ భవాని కుటుంబభారాన్ని చేతుల్లోకి తీసుకుంది. బతుకుదెరువు కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ ముందుకు సాగింది. పిల్లలను సమాజానికి భారం కాకుండా పెంచడం ఆమె ముందున్న లక్ష్యం. ఉపాధి కోసం ప్రతీ రోజూ వెతుక్కోకుండా స్వయంగా ఏదైనా చేయాలనే తపనతో ఆటో డ్రైవింగ్ నేర్చుకుని, గుంటూరులో మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్ అయింది. ఆమెకున్న ప్రాణాంతక వ్యాధి మరో రకంగా మేలు చేసింది ఆమెకు.

“ఆడది కనిపిస్తే, కామెంట్లు చేస్తూ వెంటపడే మగాళ్లు …నా వైరస్ గురించి తెలుసుకుని అమ్మా, చెల్లీ.. అని పిలుస్తూ లైట్ తీసుకోవడం అంత బాధలోనూ కొంత ఊరట…” అంటోంది భవానీ. ఆమె జీవన చిత్రాన్ని మీడియా ఫోకస్ చేయడంతో, అక్కినేని నాగార్జున “మీలో ఎవరు కోటీశ్వరుడు” టీవీ షోలో పాల్గొనే అవకాశం ఇచ్చాడు. నిరంతరం పోరాటం అలవాటైన ఆమె అక్కడ కూడా, నలభై వేలు గెలుచుకుని పెద్ద కొడుక్కి కాలేజీ ఫీజు కట్టింది.

ఇది భవానీ కథ. ఇది వింటే ఆమె మీద జాలి కంటే గౌరవం కలుగుతుంది. కానీ, సదరు అక్కడి ప్రభుత్వానికి ఆమె మీద ఇంకా దయ కలగలేదు. ఉండటానికి చిన్న నీడను, తన బిడ్డలకు ఉపాధి కల్పించమని కలెక్టరాఫీసు చుట్టూ తిరుగుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని ’రూరల్‌మీడియా’ తో దీనంగా చెప్పింది. అలాగని సర్కారీ దయకోసం ఎదురు చూడకుండా తన ఊపిరి ఉన్నంత వరకు ఆటోను తిప్పుతూ, కుటుంబాన్ని నడుపుతానని ఆత్మవిశ్వాసంతో అంటోంది. మగవాడి అడ్డాలోకి దూసుకెళ్లిన కల్పనా చావ్లా, కిరణ్ బేడీ, ఇందిరాగాంధీ, పూలన్ దేవి లాంటి వాళ్ళ కంటే భవానీ లాంటి వాళ్ళు ఏమీ తక్కువ కాదు. నిజానికి వాళ్లందరికంటే ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని నిలదొక్కుకున్న ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు.. కొందరుంటారు…సాధికారతని మాటల్లోనూ, రాతల్లోనూ, పోస్టుల్లోనూ, ట్వీటుల్లోనూ కాకుండా బతుకుపోరులో చూపిస్తారు. ఆమే భవాని…

                                                                                                                                     – శ్యాంమోహన్
Article about Female Auto Driver Bhavani Life Story