Home ఎడిటోరియల్ ఉర్రూతలూగించిన సాకర్ సమరం

ఉర్రూతలూగించిన సాకర్ సమరం

Article about Modi china tour

రష్యాలో నెల రోజులపాటు అద్భుతంగా జరిగిన 21వ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమరంలో ఫ్రాన్స్ జగజ్జేతగా నిలిచింది. 1998లో స్వదేశంలో కప్పు గెలిచిన తదుపరి ఫ్రాన్స్‌కు ఇదే మలి ఫైనల్ విజయం. అంచనాలకందని రీతిలో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఒక చిన్న దేశం క్రొయేసియా జట్టు 24 గోల్స్‌తో ఓటమి పొందినప్పటికీ సగర్వంగా తలెత్తుకుని వెనుదిరిగింది. మూడవ స్థానం కొరకు జరిగిన పోటీలో బెల్జియం 10తో ఇంగ్లండ్‌ను ఓడించింది. పక్షం రోజులకు ముందు గ్రూపు పోటీలోను ఇంగ్లండుపై బెల్జియం గెలుపొందటం గుర్తు చేసుకోదగింది. మొత్తం 32 దేశాలు పాల్గొన్న ఈ మహా సంరంభానికి రష్యా ఆతిథ్యం అపోహలను తొలగించింది, అందరి ప్రశంసలు పొందింది.
ప్రతి నాలుగేళ్లకొకసారి ఫిఫా ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడాయుద్ధం కొందరు ప్రసిద్ధ ఆటగాళ్లను తెరమరుగు చేస్తుంది, కొందరు యువ ప్రతిభులను స్టార్‌లను చేస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ, అంతకు ముందు 2010, 2014 ఛాంపియన్‌లు వరుసగా ఇటలీ, స్పెయిన్‌వలె గ్రూపు దశ దాటలేకపోయింది. మెక్సికో, దక్షిణ కొరియా చేతిలో ఓటమి పొందిన నాలుగు పర్యాయాల ఛాంపియన్ తన గ్రూపులో అట్టడుగుస్థానంతో ఎలిమినేట్ అయింది. గత దశాబ్దంలో అగ్రశ్రేణిలో నిలిచిన మెస్సీ (31సం.) రోనాల్డో(33)లకు ఇది చివరి వరల్డ్ కప్ టోర్నమెంట్ అయింది. మెస్సీ అర్జెంటీనా, రోనాల్డో పోర్చుగల్ జట్లు చివరి 16 జట్ల స్థానాన్ని చేరుకోలేకపోయాయి. ఆతిథ్య దేశం రష్యా జట్టు కూడా క్రొయేసియా చేతిలో క్వార్టర్ ఫైనల్‌తో విశ్రాంతి తీసుకుంది. మొత్తం 6 గోల్స్‌తో హార్రీ కానె (ఇంగ్లండ్) బంగారు బూటు, ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌గా టుకా మోడ్రిక్ (క్రొయేసియా) బంగారు బంతి, ఉత్తమ గోల్ కీపర్‌గా థిబాట్ కోర్టోయిజ్ (బెల్జియం) బంగారు గ్లోవ్ అందుకోగా ఉత్తమ యువ క్రీడాకారుని టైటిల్ కిలియన్ ఎంబప్పీ (ఫ్రాన్స్)కు దక్కింది. ఫెయిర్ ప్లే ట్రోఫీ స్పెయిన్‌కు లభించింది. మొనాకో నుంచి పారిస్ క్లబ్‌కు మారిన 19 ఏళ్ల ఎంబప్పీ అర్జెంటీనాపై ఫ్రాన్స్ విజయం (43) లో రెండు గోల్స్ చేసి కొత్త ఆకర్షణగా ముందుకు వచ్చాడు. ఫైనల్స్‌కు చేరుకునే బాటలో ఫ్రాన్స్ నిర్ణీత సమయంలో విజయాలతో (డెన్మార్క్‌తో డ్రా) దూసుకెళ్లగా, క్రొయేసియా మూడు మ్యాచ్‌లను అదనపు టైంలో పెనాల్టీలతో గెలిచింది. ఫైనల్‌లో ఆ అదృష్టం లభించలేదు.
18 క్యారెట్ల బంగారు ట్రోఫీని సొంతం చేసుకోవటంతో ఫ్రాన్స్ రెండవసారి ఛాంపియన్ గా అవతరించిన ఆరవ దేశంగా అవతరించింది. బ్రెజిల్ 5 సార్లు, జర్మనీ 4 సార్లు, ఇటలీ 4 సార్లు, అర్జెంటీనా 2 సార్లు, ఉరుగ్వే 2 సార్లు ఆ అద్భుతం సాధించాయి. యూరప్, లాటిన్ అమెరికా ఆధిపత్యం వహిస్తున్న ఈ ప్రజాకర్షక క్రీడలో ఆఫ్రికా టీములు గ్రూపు దశలో వెనుదిరుగుతున్నాయి. నైజీరియా, సెనెగల్, ట్యునీషియా, ఈజిప్టు, మొరాకో ఈ పర్యాయం మూడు మ్యాచ్‌లే గెలిచాయి. గ్రూపు హెచ్‌లో రెండవ స్థానం అవకాశాన్ని సెనెగల్ జట్టు క్రమ శిక్షణ రికార్డు లోపంతో జపాన్‌కు కోల్పోయింది. మన దేశంలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి కొద్ది రాష్ట్రాలకే పరిమితమైన ఫుట్‌బాల్ ప్రోత్సాహ లోపంవల్లనో, యువతలో పట్టుదల లోపించటం వల్లనో వ్యాప్తి చెందటం లేదు. ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేదు. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల సమయంలో అభిమానులూ, స్టేడియానికి రండి, ఈ జట్టును ప్రోత్సహించండి అని కెప్టెన్ విజ్ఞప్తి చేసినా, అటు తర్వాత సచిన్ టెండూల్కర్, గంగూలీ లాంటి కొందరు స్పందించినా ఫలితం నామమాత్రమే. క్రికెట్ మానియా అన్ని ఆటల్నీ మింగేసింది. పునరాలోచన అవసరం.
భవిష్యత్ ప్రపంచ కప్ వేదికను ఫ్యాన్స్, జర్నలిస్టులు నిర్ణయించవలసి వస్తే వారు రష్యాకే శాశ్వత హక్కుయిస్తారన్న ఒక క్రీడా విలేకరి వ్యాఖ్య రష్యా ప్రభుత్వ నిర్వాహక సామర్థానికి, రష్యన్‌ల ఆతిథ్యానికి అద్దంపట్టింది. తమ దేశం గూర్చిన అభూతకల్పనలు పటాపంచలైనాయని అధ్యక్షుడు ఫుతిన్ ప్రీ ఫైనల్ పత్రికా గోష్టిలో ప్రకటించారు. ఫిఫా లెక్క ప్రకారం నెల రోజుల్లో 10లక్షల మందికిపైగా విదేశీయులు వచ్చారు. మ్యాచ్ టిక్కెట్లున్న ఫ్యాన్స్ అందరికీ దేశమంతటా బస్సు, రైలు ప్రయాణం ఉచితం. సుదూర ప్రయాణ రైళ్లలో కూడా ఉచిత ప్రయాణమే. మాస్కో వీధుల్లో రాత్రిళ్లు తిరిగినా భయానికి తావులేదు. విదేశీయులపట్ల రష్యన్‌లు ఎంతో మర్యాద చూపారు. అది సోవియట్ యూనియన్ కాలం నుంచీ అలవడిన క్రమశిక్షణ. 2022లో జరిగే తదుపరి ప్రపంచ కప్ పోటీలను ఫిఫా చిన్న గల్ఫ్ రాజ్యం కతార్‌కు కేటాయించింది. ఆ రాజ్యం ఒక కొన నుంచి మరో కొనకు 180 కిలోమీటర్లు, జనాభా 25 లక్షలు. నిర్వహణ దోహాకు పెద్ద సవాలు.