Home లైఫ్ స్టైల్ మానవాళికి మార్గదర్శి గీత

మానవాళికి మార్గదర్శి గీత

lf2

డాక్టర్ మధుసూదన్..వృత్తిరీత్యా పిల్లల డాక్టర్. ప్రవృత్తిరీత్యా భగవద్గీత ఉపాసకులు. డాక్టర్‌గా ఎంతో బిజీగా ఉన్నాసరే కొంత టైము కేటాయించుకుని భగవద్గీత గురించి వివరించడానికి, కృష్ణతత్తాన్ని ప్రచారం చేయడానికి అంకితమయ్యారు. హరేరామ హరే కృష్ణ ఉద్యమాన్ని ఒంటబట్టించుకుని కృష్ణభక్తితో తన్మయులవుతుంటారు. భగవద్గీత పేరెత్తితే చాలు పులకరించిపోయి ఎక్కడెక్కడి విషయాలు కూలంకషంగా విడమరిచి చెబుతారు. పేషెంట్లకు మందులు ఇవ్వడంతోపాటు హరే కృష్ణ నినాదాన్ని కూడా అందిస్తారు. ఆ కృష్ణనామాన్ని జపిస్తే అన్ని రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని గట్టిగా నమ్మే ఆయన దాన్నే అందరికీ ప్రచారం చేసి చెబుతుంటారు. అవకాశం ఉన్నప్పుడల్లా హాస్పిటల్ విజిటింగ్‌కు వెళ్ళి రోగాలతో బాధపడేవారికి ధార్మిక బోధ చేయడం ద్వారా మానసిక స్వస్థత కలిగిస్తుంటారు. భగవద్గీత యథాతథం చదివాక కృష్ణుడి గురించి బాగా తెలుసుకోగలిగాను అనే డాక్టర్ మధుసూదన్‌గారితో ముఖాముఖి.. 

ప్ర: భగవద్గీత ఎందుకు చదవాలి?
జ: మహాభారతం ఈనాటిదికాదని మన నమ్మకం. 5 వేల సంవత్సరాల క్రితం పుట్టిందని చరిత్రకారుల నిర్ధారణ. వాళ్ళ మాటనే పరిగణనలోకి తీసుకున్నా గీత పుట్టి 5 వేల సంవత్సరాలు దాటాయి. ఇన్నేళ్ళు ఒక గ్రంథం పరమ ప్రామాణిక గ్రంథంగా నిలిచినందుకు గీతను చదవాలి. చదివిన ప్రతీ ఒక్కరూ చేతులు జోడించి మొక్కుతున్నారు. అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోడానికి గీత చదవాలి. కిం కర్తవ్యం అనే సందేహగత ప్రాణులకు మార్గనిర్దేశనం చేసి విజేతలుగా నిలబెడుతున్నందుకు గీత చదవాలి. ఈ రోజుకూ పర్సనాలిటీ డెవలెప్‌మెంట్‌కు, మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని అధునాతన మేధావులు అంటున్నందుకైనా గీత చదవాలి. న్యాయస్థానాలలో అతిపవిత్ర గ్రంథంగా పరిగణించి ప్రమాణం చేయించడానికి ఉపయోగిస్తున్నందుకు గీతను చదవాలి. అన్నిటికీ మించి భగవంతుడు చెప్పిన మాట కనుక నమ్మకంతో చదవాలి. ఏం చెప్పాడో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో చదవాలి. ఇది గొప్ప గ్రంథం కాకపోతే ఇంతకాలం నిలిచేదా? ఇన్ని తరాలను దాటుకుని మనదాకా వచ్చేదా?
ప్ర: అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు కదా గీత అంటే! మరి దీన్ని కృష్ణగీత అనకుండా భగవద్గీత అంటారేమిటి?
జ: కృష్ణస్తు భగవాన్ స్వయం..కృష్ణుడే స్వయంగా భగవానుడు కనుక దీన్ని భగవద్గీత అన్నారు.
ప్ర:ఎపటికప్పుడు బాబాలు, భగవాన్‌లు, యతులు, జీయర్‌లు సమాజానికి అవసరమైన ఉపదేశాలిస్తున్నారు కదా..వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పిన గీతను నమ్ముకోవడమెందుకు?
జ: బాబాలు, భగవాన్‌లకు, యతులకు, జీయర్‌లకు ఎక్స్‌పైరీ డేట్లుంటాయి. కానీ గీతకు లేదు. దీనికి కులమత భేదాలులేవు. ఎవ్వరైనా చదువుకోవచ్చు. అడ్డనామాలవాళ్ళు, నిలువునామాలవాళ్ళు, ఏ నామం లేనివాళ్ళు ఎవరైనా దీన్ని చదువుకోడానికి అర్హులే! ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటివారు కూడా గీతకు భాష్యాలు చెప్పడం ద్వారా సమాజానికి పాఠాలు బోధించిన వారే! ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా గీతలో సమాధానాలుంటాయని ఐన్‌స్టీన్, థామస్ సక్లీ ఓపెన్ హీమర్ వంటి సైంటిస్ట్‌లు, పాప్‌సింగర్ జార్జిహారిసన్, రాజకీయనేపథ్యం ఉన్న తిలక్, మహాత్మాగాంధీ, రవీంద్రనాథఠాగోర్ వంటి వారెందరో నిరూపించారు. వీరంతా చరిత్రలో ఉన్నవారే! వీళ్ళేందుకు చదివారు? అందులో సమ్‌థింగ్ ఉంది కనుక చదువుతున్నారు.
ప్ర: ఏమిటా సమ్‌థింగ్?
జ: ఈ ప్రపంచానికి ఒక పద్ధతి ఉంది. పగలు, మధ్యాహ్నం, రాత్రి, కాలాలు, చావులు, పుట్టుకలు, రోగాలు, ముసలితనం ఇలా ఒక క్రమం ఉంది. ఈ క్రమం ఒక చక్రంలా తిరుగుతు ఉంటుంది. ఈ క్రమంలో దొర్లివచ్చే పౌర్ణమి, అమావాస్య, గ్రహణాలను సైంటిస్టులు, జ్యోతిష్కులు ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. వీటిని నడిపించే శక్తి ఒకటి ఉందని అంగీకరిస్తున్నారు. ఈ క్రమమంతా ఒకరి బ్రైన్ వర్క్‌లా కనిపిస్తుంది? ఎవరిదా బ్రైన్‌వర్క్? దాన్ని నడిపించే శక్తి తత్త్వమేమిటి? వంటి అనేక అంశాలు భగవద్గీతను చదివితే తెలుస్తాయి. అన్ని వర్గాలు చదువుతున్నాయి. అన్నిదేశాల వారూ చదువుతున్నారు. భగవతత్తాన్ని తెలుసుకుంటున్నారు?
ప్ర: ఎవరీ భగవంతుడు? ఎక్కడుంటాడు? ఉంటే ఎవ్వరికీ కనబడడెందుకు?
జ: ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే భగవద్గీత చదవాలి. అన్ని తరాల వారు చదవదగ్గది, తెలుసుకోదగ్గది భగవద్గీత. కేవలం కనబడడంలేదు కనుక భగవంతుడు తెలియడంలేదనడం సరికాదు. అనాథకి తన వాళ్ళెవరో, తనను కన్నవారెవరో తెలియదు. అంత మాత్రాన వాళ్ళులేనట్టు కాదుకదా..! అమ్మానాన్న లేకుండా ఆ అనాథ పుట్టే అవకాశమేలేదు కదా! కంటికి కనిపించలేదు కనుక వాళ్ళు లేరు అంటే అంతకన్నా మూర్ఖత్వమేముంటుంది?
ప్ర: ఈ ప్రపంచమంతా స్వశక్తిమీదే నడుస్తున్నప్పుడు కంటికి కనిపించని శక్తి ఏదో ఉందని దాన్ని నమ్ముకు బతకడంలో అర్థముంటుందా?
జ: ట్రాఫిక్‌లైట్లు వాటంతట అవే వెలుగుతుంటాయి. ఆరుతుంటాయి. ఒకొక్క డైరక్షన్‌లో ఒకొక్క రకంగా రంగులు మార్చుకుంటాయి. ఈ రకమైన మార్పులన్నీ వాటంతట అవే చేసుకుంటాయి. అంత మాత్రాన అదంతా వాటి ప్రతిభేనా? అంటే ఖచ్చితంగా కాదు. వాటిని అలా ప్రోగ్రాం చేసినవాడు, ట్యూన్ చేసినవాడు వేరే ఉన్నాడు. ఈ ప్రతిభ అంతా అతనిది. ఆయన కనబడడంలేదు కనుక లేడు అంటే నిజమవుతుందా?
ప్ర: ఒకరిని కేంద్రబిందువుగా చేసుకుని సాగుతున్న సింగిల్ పర్సన్ పార్టీలు పడిపోతాయన్నది లోకనీతి. మరి సింగిల్ పర్సన్‌గా సాగిన గీత ఇంకా నిలబడి ఉందే! ఇదెలా సాధ్యమైంది?
జ: గీతకు కేంద్రబిందువుగా ఉన్నది వ్యక్తికాదు. ఆదినారాయణ శక్తి. ఇది వ్యక్తితోపాటే తుడిచిపెట్టుకుపోయేదికాదు. అందుకే కృష్ణుడు గీతచెప్పి ఇంతకాలమైనా, ఆయన నివసించిన యుగం మాటుమణగిపోయినా గీత మాత్రం ఇంకా బలంగా ఉంది. నానాటికీ ఊడలేసుకుంటూ ఇంకా ఇంకా బలపడుతోంది. మనిషిలోని శూన్యతను, మనసులోని వెలితిని తొలగించేది గీత. అది శూన్యాన్ని మిగులుస్తూ కాలగర్భంలోకి వెళ్ళిపోదు. చెప్పినవాడు సాధారణ మానవుడు కాడు. గురూర్ గరీయసి గురూత్తముడు. అందుకే ఆయన బోధలకు ఇంత కాలం బతికే యోగ్యత లభించింది.
ప్ర: గీతలో కృష్ణుడు నేను నేను అని నొక్కి నొక్కి చెప్పుకుంటాడు. అంత అలా చెప్పాల్సిన అవసరమేముంది? ఆయనకు అంత ఐడెంటిటీ క్రైసిస్ ఉందా? లేక నేనులేకపోతే ఏదీలేదు అనే అహంభావం ఉందా?
జ: నేను అనేది అహంకారంతోనో, అహంభావంతోనో చెపిన మాట కాదు. తన ఐడెంటిటీని అపోహలకు అతీతంగా స్పష్టం చేసేందుకు చెప్పిన మాట. అలా అనగల ధైర్యం, చెప్పుకోగల సాహసం ఆయనకు తప్ప మరెవ్వరికీ లేవు కనుక ధైర్యంగా చెప్పుకున్నాడు. దాన్ని కాదనే దమ్ములెవ్వరికీ లేవు కనుక ఎవ్వరూ ఖండించలేకపోయారు. కృష్ణుడు గొప్ప సైకాలజిస్ట్.. అందరికీ చెందిన గురువు. అందుకే ఆయన బోధలు అన్ని దేశాలవారికి, అన్ని జాతుల వారికి, అన్ని ఖండాల వారికి చెందుతున్నాయి. కృష్ణుడు ఎర్లియెస్ట్ మానవుడు. కృష్ణుడు మనసుకు, శరీరానికి కూడా శక్తినివ్వగల జగద్వైద్యుడు..వైద్యనారాయణుడు! ఆయన చెప్పిన గీత ప్రిస్క్రిప్షన్..అది సర్వరోగ నివారిణి!
ప్ర: దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మపరిరక్షణ కోసం యుగానికొకసారి పుడతానని చెప్పిన కృష్ణుడు ఒక్క కృత యుగంలోనే అనేక అవతారాలు ఎత్తాడు. మరీ ముఖ్యంగా దితి పిల్లల కోసం పనిగట్టుకుని మూడు అవతారాలెత్తాడు. ఇది చూస్తే చేసేది ఒక్కటి.. చెప్పేది మరొక్కటి అని అనిపించడంలేదా?
జ: భగవంతుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మపరిరక్షణ కోసం యుగానికొకసారి ఎవ్వరూ పిలవకపోయినా తన ధర్మంగా భావించి వస్తాడు. పరిస్థితులు ప్రమాదకరంగా మారుతుంటే మొన్నేగా వచ్చింది వచ్చే యుగంలో చూద్దాంలే అని వాయిదా వేయడు. ఆయన స్టేట్‌మెంట్‌లో దుష్టులు చెలరేగితే, శిష్టులు అణగారితే, ధర్మం నాశనమైతే అనే మూడు షరతులు ఉన్నాయి. ఇలా ఎప్పుడు జరిగినా తక్షణం వస్తానని, ఏ సమయంలోనైనా, ఎన్నిసార్లయినా వస్తానని ఆయన మాటల సారాంశం. అందుకే హిరణ్యాక్షుణ్ణి చంపడానిక ఒకసారి, హిరణ్యకశ్యపుని చంపడానికి ఒకసారి, ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తికోసం ఇంకోసారి వచ్చాడు. ఎప్పుడు రావాలనుకున్నా గరుడవాహనం రెడీగా ఉంటుంది. ఇక్యూలు, వైటింగ్‌లిస్ట్‌లు, రిజర్వేషన్ల వంటి ఇబ్బందులేం లేవు.
ప్ర: ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేకాడికి యుగానికొకసారి వస్తానని చెప్పుకోవడం దేనికి?
జ: భగవంతుడు సమస్తలోకానికి బిగ్‌బాస్! ఆయన ఎప్పుడైనా వస్తాడు. ఎప్పుడైనా వెళతాడు. ఉండాలనుకున్నంత కాలం నిరాపేక్షణీయంగా ఉంటాడు. టైముకి రాలేదనో, త్వరగా వెళ్ళిపోయావేమనో అడగడానికి లేదు. బాస్‌ని ప్రశ్నించే హక్కూ అధికారం, సబార్డినేట్‌కు ఉండదు కదా..! జీతం తీసుకు పనిచేసే వారికే టైమింగులు, సెలవులు, పర్మిషన్లు. ఆయనకు అలాంటివేవీ ఉండవు. ఇటీవలే రామదాసును రక్షించుకోడానికి రామోజీ, లకో్ష్మజీ అనే పేరుతో వచ్చాడు కదా!
ప్ర:రామ, లక్ష్మణులు తానీషాకు శ్రీరామ మాడలు ఇచ్చారంటారు. రాముడు తన కాలం నాటి నాణాలు ఇస్తే అవి ఎలా చెల్లుబాటవుతాయి? పైగా నిజాం రాజ్యం అయోధ్యలో అంతర్భాగం కూడా కాదు కదా..?
జ: రాముడు ఇచ్చినవి తోలునాణాలో, ఇనపనాణాలో కావు. బంగారు, వెండితో తయారుచేసిన నాణాలు. బంగారానికి వెండికీ చెల్లుబాటుకాకపోవడమనేది ఏముంటుంది? దేశ, కాలాలకు అతీతంగా ఇవి చెలామణి అవుతునే ఉంటాయి.
ప్ర: కృష్ణుడు గొల్లపిల్లలతో రాసక్రీడలాడాడంటారు..ఇది మర్యాదస్తుడి లక్షణమేనా?
జ: ఒక్క గోపికలతోనేనా..గోపకులతోకూడా ఆడుకున్నాడు. ఈలోకంలో ఉండేవాళ్లంతా ఆయనకు కావలసినవాళ్ళే కనుక ఎవరితోనైనా ఆడతాడు. పాడతాడు. అయినా ఆడినవారికి, ఆడినవాడికీ లేని ఇబ్బంది నోరుపారేసుకునే వీళ్ళకెందుకు?
ప్ర: కృష్ణుణ్ణి పాండవ పక్షపాతి అన్నారు కదా! నిజమేనా?
జ: ఆయనకు పక్షపాత బుద్ధిలేదు. పాండవులు ఎంత దగ్గరి బంధువులో కౌరవులు అంతకన్నా దగ్గరి బంధువులు. కౌరవుల మేలుకోరి ఎంతగానో ప్రాథేయపడినవాడు పాండవపక్షపాతి ఎలా అవుతాడు? అయిన వాళ్ళపట్ల పక్షపాతం ఉంటే మేనమామ కంసుని..మేనల్లుడు శిశుపాలుని నిండుసభలో ఎందుకు చంపాడు? ఆయనది ధర్మబుద్ధేతప్ప ఆక్రమణల బుద్ధికాదు. జన్మకర్మచ మే దివ్యం అని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన జన్మ దివ్యం. చర్యలు దివ్యం. మేనమామ కంసుని చంపి రాజ్యాన్ని తాత ఉగ్రసేనుడికే ఇచ్చేశాడు. నరకాసురుని చంపాడు..వాడి కొడుకు సహదేవుడికే ప్రాగ్జోతిషపురాన్నిఇచ్చేశాడు. కురుక్షేత్రమహా సంగ్రామంలో శత్రువులందరినీ సమూలంగా చంపేశాక రాజ్యాన్ని ధర్మరాజుకే ఇచ్చేశాడు. ఆ సువిశాల సామ్రాజ్యాన్ని చూసి టెంప్ట్ అయి ‘నాదీ’ అనలేదు. అలా అన్నా నోరెత్తే దమ్మూధైర్యం ఏ ఒక్కరికీ లేదు. కానీ ఆయనలో అలాంటి స్వార్థ, సంకుచిత బుద్ధిలేదు. మోక్షాన్నే ఇచ్చే వాడికి ఈ పిల్ల పిచిక రాజ్యాల మీద ఆసక్తి ఉంటుందా?
ప్ర: కృష్ణడు పరమ సాత్తిక పురుషుడు..అంత శాంతం ఆయనకు ఎలా సాధ్యమైంది?
జ: ఆయనకు క్రియ మీద దృష్టి లేదు. ఉన్నదంతా కర్మమీదనే! అందుకే ఆయనలో ఆధిపత్య ధోరణులు కనిపించవు. డిప్రషన్, యాంగ్జైటీ కనబడదు. అజ్ఞానం, అహంకారం వంటివి మచ్చుకు కూడా కనబడవు.