Home ఎడిటోరియల్ జి.ఎస్.టి.లో పూడని లోట్లు

జి.ఎస్.టి.లో పూడని లోట్లు

GST collects below Rs 1 lakh crore

వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) అమలులోకి వచ్చి ఏడాది దాటింది. మొదట్లో ఎదురైన కొన్ని బాలారిష్టాలు అధిగమించినట్టు కనిపిస్తోంది. కొన్ని వస్తువులను ఏ ధరల వర్గీకరణలో చేర్చాలన్న సమస్య కొలిక్కి వచ్చినట్టుంది. జి.ఎస్.టి. లెక్కలు (రిటర్నులు) సమర్పించే విషయంలో ఎదురైన ఇబ్బందులు కూడా తాత్కాలికంగానైనా పరిష్కారమైనట్టు కనిపిస్తోంది. జి.ఎస్.టి. వల్ల కలిగిన ప్రధాన ప్రయోజనం ఏమిటంటే పన్ను చెల్లించే వారు నమోదయ్యే సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే 70 శాతం మంది మాత్రమే సమయానికి రిటర్నులు దాఖలు చేస్తున్నారు. మరి కొంత గడువిస్తే 90 శాతం మంది దాకా రిటర్నులు దాఖలు చేయవచ్చు.
అయినప్పటికినీ జి.ఎస్. టి.లో చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. పన్ను రేటు వర్గీకరణలు తక్కువగా ఉండాలన్న అభిప్రాయం ఎక్కు వ మందిలో ఉంది. కొంతమంది అన్ని వస్తువుల మీదా పన్ను రేటు ఒకే రకంగా ఉండాలని, మరి కొంత మంది రెండు మూడు రకాల రేట్లు ఉండవచ్చునని అంటున్నారు. ప్రభుత్వ ఆదాయం ఏ మేరకు ఉంటుందన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత పన్ను రేట్లను హేతుబద్ధం చేసే అవకాశం ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి సూచన ప్రాయంగా చెప్పారు. ఈ విషయంలో జి.ఎస్.టి. మీద వివాదాలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. రెండవది లెక్కలు (రిటర్న్) దాఖలు చేసే పరిస్థితి ఇంకా సుస్థిరం కావలసి ఉంది. రిటర్నుల్లో ఏకరూపత ఉండడానికి తగిన యంత్రాంగం ఏర్పాటు చేయాలని జి.ఎస్.టి. కౌన్సిల్ ఆలోచిస్తోంది. అంటే ఈ విషయంలో మార్పుల గురించి ఆలోచిస్తున్నారన్న మాట. మూడవది జి.ఎస్. టి.కి ఆవల చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ముడిచమురు, పెట్రోలియం, సహజ వాయువు, పెట్రో ల్, డీజిల్, వైమానిక ఇంధనం, విద్యుత్తు, మద్యంలాంటివి జి.ఎస్.టి. పరిధిలోకి రావలసి ఉంది. ప్రభుత్వ రాబడిపై జి.ఎస్.టి. ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఏ మేరకు ఉంటుందో అంచనా వేయాలంటే ముందు ఈ విషయాలు ఓ కొలిక్కి రావాలి. జి.ఎస్.టి. ప్రవేశపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రాబడిపై చాలా సానుకూలమైన ప్రభావం ఉంటుందని అనుకున్నారు. కానీ జి.ఎస్.టి. సంస్కరణ పూర్తి అయితే తప్ప ఈ ప్రభావం ఏమిటో తెలియదు.
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థపై మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రభావం ఏమిటో అంచనా వేయడానికి ఇది అదును కాదు. పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం జి.ఎస్.టి. మీద ఉండకూడదు. త్రైమాసిక స్థూల జాతీ య ఉత్పత్తిపై తగ్గుదల ప్రభావం క్రమంగా తగ్గుతోంది. పెట్టుబడి సమకూరడం మీద కూడా సానుకూల ప్రభావం ఉంది. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి సంకేతం.
జి.ఎస్.టి. వల్ల ప్రభుత్వ ఆదాయంపై ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రాబడి మీద ప్రభావం తటస్థంగా లేదు. రాష్ట్రాల రాబడి 14 శాతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రాష్ట్రాల రాబడి కొన్ని సంవత్సరాలకన్నా 14 శాతం కన్నా తక్కువే ఉంది. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన హామీవల్ల స్వల్పకాలంలో ప్రయోజనం ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి అయితే రాబడిలో తటస్థత లేదు. జి.ఎస్.టి. వల్ల కలిగే రాబడికి కలిగే నష్టం పరిహారం చెల్లించడంవల్ల పూరించాలి. అంటే కేంద్రానికి ఎక్కువగా సమకూరే ఆదాయం తన వ్యయం కోసం వినియోగించుకోకూడదు. సమీకృత జి.ఎస్.టి.లో కొంత రాష్ట్రాలవల్లే సమకూరుతోంది. ఈ అంశాలను గమనంలోకి తీసుకుంటే గత 12 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదా యం జి.ఎస్.టి. అమలు కాక ముందు సంవత్సరంలో పరో క్ష పన్నుల వల్ల సమకూరిన ఆదాయంలో సమానంగా లేదు.
జి.ఎస్.టి.వల్ల ప్రధానం గా ఆశించింది ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ. నిజానికి జి.ఎస్.టి. ఒక రకంగా మరింత సమగ్రమైన మూల్యవర్ధిత పన్నే. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు నియత రంగంలోకి రావాలని భావించాలి. ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధమైతే రెండు పరిణామాలు ఉండవచ్చు. ఒకటి – ఇంతకు ముందు అనియత రంగంలో ఉన్న రంగాలు నియత రంగంలోకి ప్రవేశించాలనుకోవచ్చు. లేదా ఇంతవరకు అనియత రంగం తీర్చిన డిమాండును ఇక మీదట నియత రంగమే చేయవచ్చు. నమోదు కాని సరఫరాదార్ల నుండి సేకరించే వస్తువులకు నమోదు అయిన సరఫరాదార్లు తాము ఎవరి నుంచి సరఫరాలు సేకరించారో చెప్పాలి. పన్ను కూడా వారే వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి మళ్లీ వెనక్కు తీసుకోవచ్చు. అంటే సరుకు సరఫరా చేసేవారికి బదులు సరుకు కొనేవారు పన్ను చెల్లించడానికి బాధ్యత వహించాలి. జి.ఎస్.టి. చెల్లించే మొత్తం ముఖ్యంగా చిన్న మొత్తంలో సరఫరా చేసే వారి దగ్గరనుంచి ఎక్కువగా ఉంటే అనియత సరఫరాదార్లు తొలగిపోయి ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధం అవుతుంది.
జి.ఎస్.టి.కి కట్టుబడి ఉండే వారిలో పెరుగుదల, నమోదయ్యే పన్ను చెల్లింపుదార్లలో పెరుగుదల, రిటర్ను లు దాఖలు చేసే వారిలో పెరుగుదల ఉన్నప్పటికి ప్రభుత్వానికీ సమకూరే రాబడి పెరగకపోతే జి.ఎస్.టి.లో ఇంకా సాధించవలసింది చాలా ఉందని అర్థం. జి.ఎస్. టి. మండలి ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది.

* (ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)