Friday, April 26, 2024

హరిత భావజాల విస్తృతి

- Advertisement -
- Advertisement -

Article About Haritha Haram Programme

ఉద్యమ సమయంలో తెలంగాణలో ఎక్కువగా వినిపించిన పదం భావజాల వ్యాప్తి. తెలంగాణ వెనుకబాటుకు కారణాలను విశ్లేషిస్తూ, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాన్ని వివిధ రూపాల్లో జనంలోకి తీసుకువెళ్లిన విధానమే తెలంగాణ భావజాల వ్యాప్తి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక అభివృద్ధి, సంక్షేమాలకు తోడు తెలంగాణను పర్యావరణపరంగా అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా మలుచుకోవాలనే తపన ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఇందుకోసం గతంలో ఎన్నడూలేని విధంగా అడవుల రక్షణకు, పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది. తెలంగాణకు హరితహారం పథకాన్ని ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా తీసుకుని అమలు చేస్తోంది. గత ఆరేళ్లలో అడవుల లోపల, బయట కలిపి సుమారు రెండు వందల కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. పచ్చదనం పెంపు ఫలితాలు ఇప్పుడు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. ప్రజల్లో, సామాన్యుల్లో పర్యావరణ స్పృహ మరింత పెరిగింది. పరిసరాలు శుభ్రంగా, పచ్చదనంతో ఉండాలన్నఆకాంక్ష ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా స్వయంగా అవకాశం వచ్చిన ప్రతిసారీ ఈ హరిత భావజాలాన్ని ప్రజల మదిలో బలంగా నాటే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ హరిత స్ఫూర్తిని అందుకున్న అనేక మంది తాము సైతం అంటూ హరిత తెలంగాణ కోసం ముందుకు వస్తున్నారు. వనజీవి రామయ్య లాంటి వాళ్లు తమ జీవితాన్నే మొక్కలకు అంకితం చేసి జాతీయ స్థాయి పురస్కారమైన పద్మ శ్రీ అందుకునే దాకా వెళ్లారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్య కాలేజీ ఆవరణలోనే జీవ వైవిధ్యంతో కూడిన బొటానికల్ పార్కును సృష్టించారు. క్లాస్ రూమ్ బోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు క్షేత్రస్థాయిలో తెలియచెప్పారు. పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీర్ మహమ్మద్ షేక్ స్కూలు ఆవరణను పచ్చదనంతో నింపేశారు. పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ చెట్లు నాటడంతో పాటు, ఆవరణలోనే కూరగాయలు పెంచి, మధ్యాహ్నం భోజనంలో ఉపయోగించేలా ప్రోత్సహించారు.

ఇక యువ పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభలో అడుగుపెట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ పచ్చదనం పెంపు దిశగా వినూత్న పంథాను ఎంచుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి మూడేళ్లుగా పట్టువదలకుండా అమలు చేస్తున్నారు. ఒక్కరు ఒక మొక్క నాటి, దాని సంరక్షణ బాధ్యత తీసుకుంటూ మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసరటమే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. మెల్లగా మొదలైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు ఉద్యమ రూపాన్ని తీసుకుంది. హరా హై తో భరా హై (పచ్చదనం ఉంటే కళ్లకు ఇంపుగా ఉంటుంది.) అనే సందేశంతో దూసుకుపోతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులు దీనిలో భాగస్వామ్యం అవుతున్నారు. లక్షల మంది ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని కోట్ల మొక్కలు నాటే దాకా వెళ్లింది. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మొదలు సామాన్యుల దాకా స్వచ్ఛందంగా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు.
తాజాగా ఈ గ్రీన్ ఛాలెంజ్‌లోనే భాగంగా సంతోష్ కుమార్ మరో కొత్త ప్రయోగం చేశారు. వినాయక చవితి సందర్భంగా విత్తన గణపతిని పంపిణీ చేస్తున్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటిలో ఒక వేప మొక్క ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు. అనేక ఔషధ గుణాలున్న వేప వల్ల ప్రతి ఒక్కరికీ ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంతో పాటు మనం నిత్యం వాడే అనేక వస్తువుల్లో వేప చెట్టు భాగాలను వాడుతున్నారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న ఎంపి సంతోష్ కుమార్ విత్తన గణపతి ఆలోచనను తెరపైకి తెచ్చారు. కాలుష్య కారకాలైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులను పక్కన పెట్టి స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన వినాయకుడు, అందులో వేప విత్తనాలను పెట్టి, కొబ్బరి పీచుతో తాయారు చేసిన కుండీలో అందిస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో విగ్రహాల పంపిణీ పూర్తియింది. ఈ ప్రయత్నంలో మంచిని, పర్యావరణ హితాన్ని కూడా గ్రహించిన అనేక కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందకు వచ్చాయి. తాము కూడా విత్తన గణపతులను అందిస్తామంటూ రంగంలోకి దిగాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే గణనాధుడికి పూజలు చేయటం, వారం పది రోజుల్లో మొలకెత్తే వేప విత్తనంతో పాటు, వినాయకుడిని అదే కొబ్బరి తొట్టిలో నిమజ్జనం చేసి మొక్కగా నాటవచ్చు.

భక్తి విశ్వాసాలను గౌరవిస్తూనే పచ్చదనం అవసరం, ఆవశ్యకతను వివరించే భావజాల వ్యాప్తి ఈ రకంగా జరుగుతుందన్న మాట. ప్రతి ఇంటికీ, కుటుంబానికీ, పిల్లలకు దీని వెనుక ఉద్దేశం అర్థం అవుతుంది. ఈ కార్యక్రమానికి వార్తా పత్రికలు, టివి రంగం అందించే ప్రచారానికి తోడు ప్రస్తుతం బహుళ ప్రచారంలో ఉన్న సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. గ్రీన్ ఛాలెంజ్ కూడా సోషల్ మీడియా వేదికగానే దేశ విదేశాలకు పాకింది. కొందరు ప్రముఖులు నాటిన మొక్కలకు, వారు చెప్పిన పర్యావరణ సందేశాలకు లక్షలు, కోట్లలో వ్యూస్ వచ్చాయి అంటే సోషల్ మీడియా ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా చూడటం అంటేనే సమయం వృథా అనే అపోహ నుంచి అత్యంత అవసరమైన సామాజిక కార్యక్రమాలకు వేదికగా వాడవచ్చు అనే విషయం తెరపైకి తేవడంలో సంతోష్ కుమార్ విజయవంతం అయ్యారు. వివిధ రంగాలకు, వ్యక్తులకు పుట్టిన రోజు లేదా వారి ప్రత్యేక సందర్భాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటాల్సిందిగా కూడా సంతోష్ కోరుతున్నారు. అలా మొక్కలు నాటుతున్న వాళ్లు తమ స్నేహితులకో, సన్నిహితులకు గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇలా సోషల్ మీడియా మాధ్యమం ద్వారానే ఓవైపు సమాజహిత కార్యక్రమం, మరో వైపు మానవ సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయి. ఇటీవల సంతోష్ కుమార్ స్ఫూర్తితో గ్రీన్ ఛాలెంజ్ లో వరుసగా తెలుగు హీరో మహేష్ బాబు, తమిళ సూపర్ స్టార్ విజయ్, హీరోయిన్ శృతిహాసన్ లాంటి ప్రముఖులు పాల్గొనటంతో దేశ వ్యాప్తంగా ట్విట్టర్‌లో రెండో స్థానంలో ట్రెండింగ్ అయ్యింది. పట్టణాలు, ప్రముఖులకే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా గ్రీన్ ఛాలెంజ్ వెళ్లింది. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల మారుమూల ముఖ్రా (కే) గ్రామం ఈ కార్యక్రమంలో పాల్గొని వేల సంఖ్యలో మొక్కలు నాటింది. గత యేడాది నాటిన మొక్కలన్నింటినీ సంరక్షించి చూపి ఆదర్శంగా నిలిచింది.

పచ్చదనం పెంపు, అడవుల రక్షణ, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం ఆచరణ సాధ్యం చేసి చూపించింది. దేశ వ్యాప్తంగా కూడా పర్యావరణ హిత కార్యక్రమాలకు ఆదర్శంగా నిలిచింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2015-18 ల మధ్య తెలంగాణలో లక్షా 85 వేల ఎకరాల్లో పచ్చదనం పెరిగింది. అలాగే క్షీణించిన అడవుల పునరుద్ధరణను కనోపీ డెన్సిటీ పెరుగుదల ఆధారంగా నిర్ధారిస్తారు. దీనిలో కూడా తెలంగాణ రాష్ట్రం చెప్పుకోదగిన ప్రగతి సాధించింది. ఈ యేడాది కూడా మరో 920 అటవీ బ్లాకుల్లో 2.10 లక్షల అటవీ పునరుద్ధరణ లక్ష్యంగా అటవీ శాఖ పెట్టుకుంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు రానున్న నాలుగేళ్లలో మొత్తం క్షీణించిన అడవి పునరుద్ధరించాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు మానవ మనుగడకు పెను సవాళ్లు విసురుతున్నాయి. అప్రమత్తంగా ఉంటూ భూతాపాన్ని తగ్గించుకునే ఆచరణాత్మక ప్రయత్నాలు తక్షణం చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. లేదంటే కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందాన మన పరిస్థితి తయారవుతుంది. యువ ఎం.పిగా సంతోష్ కుమార్ తీసుకున్న చొరవను అందరూ పాటించాలి. పచ్చదనం పెంపు దిశగా టార్చ్ బేరర్ పాత్రను ఆయన పోషిస్తున్నారు. పట్టు వదలకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయంగా కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని కూడా తన పట్టుదలను మరోసారి చాటారు. ఈ చొరవ, పట్టుదలలే మరింత మందికి ఆదర్శమైతే మన పరిసరాలు పచ్చదనమై, అడవులు రక్షితమై జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

 బందు శ్రీకాంత్ బాబు
(ప్రజా సంబంధాల అధికారి, తెలంగాణ హరితహారం)

Article About Haritha Haram Programme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News