Home ఎడిటోరియల్ విలువలు పెంచేదే విద్య

విలువలు పెంచేదే విద్య

Humanity book

 

నీలోని అత్యున్నత సామర్ధ్యాన్ని వెలికి తీసేదే అసలైన విద్య. మానవత్వమనే పుస్తకాన్ని మించిన పుస్తకం ఏముంటుంది? గాంధీ మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, మూర్తిమత్వాన్ని పెంపొందించేది , అంతర్గత శక్తులను బయటకు తీసేది, విలువలను పెంచేది, గమ్యాన్ని చూపిస్తూ మనస్సును సంపూర్ణంగా వికసించేటట్లు చేసేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది, ప్రకృతిలో సర్దుబాటుకు తోడ్పడేది, భావిజీవిత సవాళ్లను అధిగమించేందుకు శక్తినిచ్చేది విద్య అని తరచుగా విద్యా లక్ష్యాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అనేక పాఠ్యాంశాల ద్వారా ఏడాది పొడవునా బోధించిన విద్య ద్వారా ఎంతో కొంత విద్యా లక్ష్యాలు సాధించబడతాయని ఆశిస్తుంటే, పరీక్షల సమయంలో కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటికి పిల్లల్ని తయారుచేసి పరీక్షల నుండి బయటపడేసే నేటి చదువుల ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి నిర్మాణం జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. మరి అలాంటపుడు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడిపెట్టి నడుస్తున్న పాఠశాలలు ఏం సాధిస్తున్నట్లు? నేటి సమాజంలో టి.వి.లు., సినిమాల వల్లనైతేనేమి, యాంత్రికజీవితంవల్లనైతేనేమి అనేక సామాజిక రుగ్మతలతో సమాజం నిండి వుంది.

విద్యార్థులు క్షణికావేశానికి గురై తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఇటీవల మనం చూస్తున్నాము. పరీక్షలలో ఉత్తీర్ణత చెందలేదని, అనుకున్న ర్యాంక్ రాలేదని, ఎదుటివారు అవమానపరిచారని అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. మొక్కై వంగనిది మానై వం గునా? దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే శక్తి వున్న నేటి యువత ఇలా అనర్థాలకు బలికావలసిందేనా? విద్యా విధానంలో అనేక మార్పులు, ప్రయోగాలు చేసి విద్యార్థులను బలి తీసుకుంటున్నామా? ఒక్కసారి పరిశీలిస్తే ఆంగ్ల మాధ్యమం, ప్రైవేట్ చదువుల ప్రాబల్యంవల్ల నేటి విద్యార్థి నిరంతరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. మానసిక బలహీనత, న్యూనతాభావం కూడా మరికొన్ని కారణాలు. స్థాయికిమించి తల్లితండ్రుల ఆకాంక్షలు, అవి తీర్చలేక పిల్లల వ్యధలు దాదాపు ప్రతి ఇంటిలో మనం చూస్తున్నదే ఎందుకిలా.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో అక్కలు, బావలు, పిన్ని, బాబాయి, మామయ్య, అత్తయ్యలు, అమ్మమ్మ, తాతయ్య అందరూ కలిసి ఉండి పిల్లలకు మానసికంగా బలం ఉండేది. అప్పుడు ఎక్కడైనాన తప్పు చేయడానికి అవకాశం తక్కువ, ఒకవేళ జరిగిన మన వాళ్ళు నలుగురు వెనకే ఉండి ఆ తప్పును సరిదిద్దేవాళ్ళు. వెన్నెల రాత్రుల్లో సాయంత్రం పూట చక్కగా తిని అమ్మమ్మచెప్పే నీతి కథలు, తాతయ్య పాడే చక్కటి పద్యాలు పిల్లలకు స్ఫూర్తివంతంగా ఉండి, మనలో విలువలను తట్టిలేపి వ్యక్తిత్వ వికాసాన్ని నింపేవి. ఈ రకంగా బంధాలు, అనుబంధాలు తెలిసేవి. ఇప్పుడు బామ్మలు, అమ్మమలు సాయంత్రం ఐతే చాలు ప్రైమ్ టైంలో వచ్చే క్రైమ్ సీరియల్లు చూస్తూ విరామంమధ్యలో పిల్లలకువంట చేస్తున్నారు.

ఇటీవల కాలం వరకు కూడా గ్రామీణ ప్రాంతాలలో సంబంధాలు బలంగా వుండటం, రాకపోకలు, మాన వ సంబంధాలు బలంగా వున్ననాడు సామాజిక రుగ్మతలు తక్కువగా వుండేవి. కానీ నేటి యాంత్రిక జీవనంలో ప్రక్కవారితో కూడా కనీస సంబంధాలులేని నేటి స్థితిలో తల్లిదండ్రు లిద్దరు ఉద్యోగాలు చేయడం, పిల్లలను హాస్టళ్లలో నిర్బంధంగా వుంచడం, మార్కుల టార్గెట్ పెట్టడం విద్యార్థులు ఒత్తిడికి గురి కావడానికి కారణాలుగా భావించాలి. పిల్లలు హాస్టల్‌లో, తల్లి తండ్రులు ఆశ్రమాలలో ఉంటె ఆ పిల్లలకు బంధాల బంధం గురించి, అనుబంధాల అందం గురించి రంగరించి చెప్పేదెవరు?

కారణాలను పరిశీలిస్తే.. సమాజానికి, తల్లితండ్రులకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. ఈ మధ్య కాలంలో విద్య విలువని మనం భూమి విలువతోనో, స్టాక్ ఎక్స్ఛేంజ్ షేర్ల తో వ్యాపారంచేసే విధంగానో బేరీజు వేస్తున్నాము. విద్యార్ధి ఏ చదువుతోనైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్యనే మనం ప్రోత్సహిస్తున్నాము. అంతే కాని చదువుకున్న వారి శీల గుణాలు అభివృద్ధి చెందే విధానం గురించి ఆలోచించట్లేదు. ఇరుకు గదుల్లో , ఐదారు అంతస్తుల బిల్డింగులలో విద్యార్థుల భవిష్యత్తు కై కుస్తీలు జరుగుతుంటే, ఆటలంటే కంప్యూటర్ ముందు కూర్చోని ఆడేదే అనుకుంటుంటే, ఇటువంటి పరిస్థితులు ఉన్నంత కాలం విద్య యొక్క నిజమైన విలువను తెలుసుకుంటామని ఆశించలేము.

బ్రిటీషు వారి కాలంలో భారత దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి, ముఖ్యముగా రెండు మార్పులు మనం చెప్పుకోవాలి: ఒకటి అప్పటివరకూ ఎన్ని మార్పులు జరిగినా భారతదేశంలో విద్యా వ్యవస్థ మత ప్రధానమైనదిగానే ఉండినది, అయితే హిందూ మతము, లేదా బౌద్ధ్ద మతము లేదా ముస్లిం మతము, కానీ బ్రిటీషువారు వచ్చిన తరువాత భౌతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినది, ప్రజలు సైన్సు చదవడం మొదలుపెట్టినారు. ఇక రెండవ ముఖ్యమైన మార్పు ఇంగ్లీషు భాషలో విద్యాబోధన, అప్పటి వరకు వివిధ భారతీయ భాషలలో ముఖ్యంగా సంస్కృతములో లేదా అరబిక్ లేదా ఉర్దూ లలో జరిగే విద్యా బోధన ఇంగ్లీషు భాషలోనికి మార్చబడినది, అంటే మొత్తం మార్చబడినది అని కాదు, కానీ పరిపాలకుల ఆర్థిక సహాయం కేవలం ఇంగ్లీషు బోధించు పాఠశాలకే ఇవ్వసాగినారు, దానితో ఇంగ్లీషునకు ప్రాముఖ్యత పెరిగింది.

బ్రిటీషు వారి విద్యావిధానంలో ఎన్నో కమిటీలు వేసినారు, ఎన్నో సంస్కరణలు ప్రయత్నించారు, కానీ వారు భారతదేశాన్ని వదిలే సమయానికి దేశంలో అక్షరాస్యత పది శాతం కూడా లేదు. దీనికి కారణం పరిశీలిస్తే మొదటిది వారికి తర్జుమా చేయడానికి, సంధానకర్తలుగా ఉండడానికి, వారికి అనుకూలంగా ఉండే వారికి మాత్రమే చదువుకునే అవకాశం ఇవ్వగా, రెండవదివారు పాటించిన జల్లెడ పద్ధతి, దీని ద్వారా కేవలం పై తరగతి వారికి చదువు చెబితే వారు క్రింది తరగతి వారికి నేర్పుతారు అని భావించడం జరిగినది. కానీ అది ఆచరణలో పెద్ద ఫెయిల్యూరుగా మిగిలినది. ఈ పరిస్థితుల నుండి మన విద్యా విధానాన్ని మనమే తయారు చేసుకునే దశకు వచ్చినా, వారు వదిలి వెళ్ళిన వాసనలను మనం కడిగి పారేయ్యలేకపోతున్నాము. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా మనం ఇంకా ఆ జాడ్యం నుంచి బయటకు రాలేకపోతున్నాము.

ఇలాంటి వికృత చేష్టలకు విరుగుడుగా చిన్ననాటి నుండే వ్యక్తిత్వ వికాస విద్య బోధింపబడాలి. తద్వారా విద్యార్థులు ఊహా లోకంలో కాకుండా నిజ జీవితంలో జీవిస్తారు. భ్రమలకు లోనుకారు. కనుక, విపరీత పరిణామాలు చోటు చేసుకోవు. దీని ద్వారా ప్రతి దానికి ఆలోచించి, పరిష్కరించే నేర్పు, సమయస్ఫూర్తి, సందర్భోచిత చర్యలు అలవడతాయి. విజయం ఆశిస్తారే కాని తగిన చర్యలు తీసుకోరు. దానికి శ్రమను ఆయుధంగా చేసుకోవాలని, నిరంతర సాధన, పట్టుదల, కార్యదీక్షతో ముందుకెళ్లాలని చెపుతూనే ఈ స్పృహ లేకపోతే అపజయం పాలవుతామని తెలియజేయాల్సి వుంటుంది.

చిన్ననాడే ఇలాంటి వారిలోని బలహీనతలను తగ్గించకపోతే పెద్దవారైన తర్వాత జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోలేక బలహీనులయ్యే ప్రమాదముంది. ఉన్నతస్థాయికి ఎలా చేరుకోవాలి? అంచెలంచెలుగా చేయవలసిన కృషి, అనుభవాలు, జ్ఞాపకాలు, మహానుభావుల జీవిత చరిత్రలు కూడా జోడించడం ద్వారా విద్యార్థులకు మరింత ప్రయోజనముంటుంది. కోపాన్ని జయించడం, దుఃఖం నుండి బయటపడడం, వివిధ మానసిక సంఘర్షణలు, భావావేశాల నుండి రక్షింపబడటం కూడా ముఖ్యమైన సందర్భాలే. వాయిదావేసే తత్వాన్ని మార్చుకోవడం, అవాంతరాలను అధిగమించడంతో పాటు సహకారం, ప్రేమ, ఆత్మీయత, త్యాగం, జాలి, కరుణ మొదలగు మానవతా విలువలను పెంచే విధంగా కృషి చేయాలి.

ప్రేమోన్మాదం పేరున జరిగే హత్యలు, రాగింగ్ దుర్మార్గాలు, తుపాకి సంస్కృతి, భౌతిక దాడులు లాంటివి తగ్గిపోయి మానవత్వంతో ఆలోచించే ప్ర శాంత పరిస్థితులు పాఠశాలల్లోను, సమాజంలోను నెలకొనాలి. తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే, ఇరుగు పొరుగువారితో కష్టసుఖాలలో పాలుపంచుకునే మహోన్నత సంస్కారం చిన్ననాటి నుండే ప్రతివ్యక్తిలో అలవడాలి. ఆ వైపుగా సమాజాన్ని నడిపించాలంటే నేటి విద్యార్థులు, యువతలో పెను మార్పులు రావాల్సి వుంది. దానికి సామాజిక చైతన్య కార్యక్రమాలు, మానసిక విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా విద్యార్థుల కనుగుణంగా వ్యక్తిత్వ వికాస విద్య ప్రణాళికను రూపకల్పన చేయించి ప్రతి పాఠశాలలో తప్పకుండా అమలు పరచవలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. అయినప్పటికీ దారి తప్పుతున్న యువతను సక్రమ మార్గంలో పెట్టె బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు ఉపాధ్యాయులు, తల్లితండ్రులు దానికి తోడూ సమాజం, కుటుంబం కూడా తనవంతు బాధ్యత తీసుకుని వారు ఆదర్శప్రాయంగా ఉంటూ యువతకు, విద్యార్థులకు స్పూర్తినిస్తూ ఒక బాధ్యతగా సక్రమంగా పని చేస్తేనే రాబోయే కాలంలో మనం ఆశించిన విద్యా ఫలితాలు చూడగలుగుతాము

Article about Humanity book

Telangana Latest News