Home ఎడిటోరియల్ హిందూధర్మం ఏమంటోంది?

హిందూధర్మం ఏమంటోంది?

edit

ఒక జాతి మానవత్వానికి కట్టుబడుతుందా లేక అమానుషంగా వ్యవహరిస్తుందా తెలియజేసే సందర్భాలు ప్రతి జాతి గమనంలోనూ ఎదురవుతాయి. జాతి ఉత్థాన పతనాలను నిర్వచించే సందర్భాలవి. ఈ సంవత్సరం జనవరిలో జమ్ములోని కథువా పట్టణంలో బక్రావాల్ సంచార ఆదివాసి గుజ్జార్ ముస్లిం తెగకు చెందిన ఎనిమిది సంవత్సరాల బాలిక గుర్రాలను మేపుతున్నప్పుడు ఆమె ఇంటి వద్దే ఆమెను అపహరించి ఎత్తుకుపోయి ఆమెకు మత్తుమందిచ్చారు. స్థానికంగా ఉన్న ఒక గుడిలో అనేక రోజుల పాటు సామూహికంగా చెరిచారు. తుదకు చంపేశారు. ఇప్పుడు ఈ అత్యంత హీనమైన నేరం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితులు – అరవయ్యేళ్ళ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఈ నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు పోలీసు అధికారులు, పరోక్షంగా నేరానికి సహకరించిన ఇద్దరు పోలీసు ఉద్యోగులు, సామూహిక మానభంగానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ఒక యువకుడు. ఆ చిన్నారి కనిపించకుండా పోయిన తర్వాత వారం రోజుల పాటు పోలీసులు ఆమెను వెదకడానికి చేసిన ప్రయత్నం ఏదీ లేదని ఆ బాలిక కుటుంబం, తెగపెద్దలు ఆరోపిస్తున్నారు. మీడియా ఈ కేసును ప్రజల ముందుకు తీసుకువచ్చింది.
ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినపుడు దేశమంతా నిరసన జ్వాలలతో రగిలిపోయింది. కతువా విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. రేపిస్టులను సమర్ధిస్తూ అరెస్టయిన పోలీసువారిని వెంటనే విడుదల చేయాలని జాతీయ జెండాలు చేతపట్టి, ర్యాలీలు తీసినవారి గొంతులే వినపడ్డాయి. వీరికి సుపరిపాలన కోసం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తోడ్పడ్డారు. న్యాయం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేసిన వృత్తిలో ఉన్న లాయర్ల వల్ల ఈ గొంతులు మరింత గట్టిగా వినబడ్డాయి. సిబిఐ విచారణ కోరడం ఇక్కడ కేవలం ఎత్తుగడ మాత్రమే. చార్జిషీటును అడ్డుకోడానికి, చార్జిషీటు దాఖలు కావడం ఆలస్యమయ్యేలా చేయడానికి ఆ రకంగా ఈ నేరంలో నేరస్తులకు సమయం, అవకాశం కల్పించడానికి వేసిన ఎత్తుగడ ఇది. సిబిఐ కూడా కావలసినంత జాప్యం చేసింది. ఈ డిమాండుతో నేరస్థులకు కొంత సమయం లభించేలా చేశారు. లభించిన ఈ సమయాన్ని వాడుకున్నారు. జమ్ములో హిందువులను రెచ్చగొట్టారు. పసిపాపను మానభంగం చేసిన నేరస్థులను సమర్ధిస్తూ వీధుల్లోకి వచ్చేలా చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? మతసామరస్యాన్ని కాపాడ్డానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి ఉద్యమించకుండా ప్రతిపక్షాలను ఆపింది ఎవరు? కథువా సంఘటన ఒక మానభంగం మాత్రమే కాదు, అంతకన్నా చాలా హీనమైనది. దీనిపై ప్రతిపక్షాలు గనక మాట్లాడి ఉంటే, వారి సెక్యులర్ స్వరాలు, అభిప్రాయాలు ఈ సంఘటనపై జాతీయాభిప్రాయాన్ని జాతి సానుభూతిని కూడగట్టేవి. అన్నింటికి మించి అసలు జమ్ము కశ్మీర్ రాష్ట్ర పాలనాయంత్రాంగం ఏం చేస్తోంది? మతతత్వ ఒత్తిళ్ళకు లొంగిపోయిందా లేక నిష్పక్షపాతంగా పనిచేస్తోందా? ఈ కేసు విచారణకు మూడవ మతానికి చెందిన అధికారులను పిలుచుకురావడం ద్వారా ప్రభుత్వం స్వయంగా తన విశ్వసనీయతను దెబ్బతీసుకొన్నది. రాష్ట్రపోలీసుల విశ్వసనీయతను నాశనం చేసింది. మనం అగమ్యగోచరమైన మార్గాన పడి పోతున్నాం. మావాళ్ళు ఏం చేసినా రైటే అని చెప్పే మతతత్వ విభజనను ప్రోత్సహిస్తున్నాం. ఏడు దశాబ్దాలుగా బహుళత్వం ఉన్న మన సమాజాన్ని సమైక్యంగా ఉంచిన లౌకిక విలువలు అంతరించి పోయాయని దీని భావమా? నెమ్మదిగా మనం కూడా మన పొరుగుదేశంలా మారిపోతున్నామా?
ఇలాంటి పరిస్థితుల్లో సంయమనంతో ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఈ దేశంలో మైనారిటీలపై మానభంగాలు, హత్యలు హింసాకాండల చరిత్రను కూడా మనం ఒకసారి చూడాలి. ఒక నిరంతర రాజకీయ ఎజెండా ఈ హింసాకాండ తప్పుకాదన్న స్థితిని కలిగించింది. సరే, కథువాలో ఆ పసిబాలికపై మానభంగం జరగలేదు, చిత్రహింసలూ పెట్టలేదని వాదనకోసం అనుకున్నా చంపడమైతే జరిగింది. ఎందుకంటే ఒక సముదాయం పట్ల ఉన్న కోపాన్ని తీర్చుకోడానికి. పసిదాన్ని చంపేశారు. ఆ పసిబాలికపై సామూహిక అత్యాచారం అనేది చాలా హీనమైన నేరం, చాలా ముఖ్యమైనది అయితే అంతకన్నా ముఖ్యమైనది దీని చుట్ట్టూ అల్లుకుని ఉన్న రాజకీయం. మీడియాలో జరగిన చర్చల్లో ఎంత క్రూరంగా ఆ బాలికను చంపారన్నది వచ్చింది. ఈ చర్చ మీడియాలో జరగడం అవసరమే, అయితే ఆ పసిదాన్ని ఎన్ని సార్లు రేప్ చేశారు, ఎంతమంది రేప్ చేశారన్న ప్రశ్నల కంటే ఎందుకు రేప్ చేశారన్నది ముఖ్యమైన ప్రశ్న. అంతకన్నా ముఖ్యమైనది లాయర్లు చార్జిషీటును దాఖలు చేయకుండా అడ్డుకోవడం, అక్కడి జడ్జి కూడా దానికి తలూపడం, చివరకు హైకోర్టు కలగజేసుకోవలసి రావడం ఇవన్నీ ముఖ్యమైనవి. వీటన్నింటిని చూస్తే నిందితులు నిజంగా అమాయకులా లేక రేప్, మర్డర్ కు గురైన బాలిక మతం వేరు కాబట్టి, నిందితుల మతస్థులంతా వాళ్ళకు కొమ్ముకాస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు, అనుమానాలకు జవాబు ఇప్పుడు జరిగిన సంఘటనల్లో లేదు, 400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్లో ఉంది. ఒకసారి 17వ శతాబ్దంలోకి తొంగి చూడవలసిన అవసరం ఉంది. పలుకుడి, బలం ఉన్న ఒక మదాంధుడు ఒక ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లోని అందరి ముందు ఇంటి మహిళపై మానభంగానికి పాల్పడ్డాడు. వాడికి పలుకుబడి ఉంది, బలముంది, అధికారముంది. ఏం చేసినా చెల్లుతుంది. హీనమైన నేరం చేసిన తర్వాత గర్వంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేరస్థుడు, బాధిత కుటుంబం అందరూ హిందువులే. ఈ నేరస్థుడు చివరకు పట్టుబడ్డాడు. నేరం రుజువైంది. శివాజీ యువరాజుగా ఆయన సమక్షంలో ఈ విచారణ జరిగింది. కాళ్ళు చేతులు నరికేసే అత్యంత కఠినమైన శిక్ష విధించాడు యువరాజు. ఈ శిక్ష విన్న దర్బారు కంపించిపోయింది. గుడిలో ఉన్న భవానీ దేవతకు, ఇంటిలో ఉన్న ఇల్లాలికి మధ్య తేడా లేదు, ఒకరిని పూజించి మరొకరిని అవమానించడం కుదరదని, న్యాయం తక్షణం లభిస్తుందని, నేరస్థుడెవరైనా శిక్ష తప్పదన్న స్పష్టమైన సందేశం ఇచ్చిన సంఘటన ఇది.కొన్ని సంవత్సరాల తర్వాత శివాజీ రాజయ్యారు. ఆయన సమక్షంలోకి ఒక ముస్లిం నవవధువును తీసుకువచ్చారు. ఒక పోరాటంలో ఆమె పట్టుబడింది. ఆమెను బహుమతిగా సైన్యం శివాజీ వద్దకు తీసుకువచ్చింది. శివాజీ పురుషుడు, ఆమె స్త్రీ. శివాజీ ముగల్ సామ్రాజ్యంతో యుద్ధంలో ఉన్నాడు. ఆమె యుద్ధసొత్తుగా దొరికింది. అప్పటి ఆచారాల ప్రకారం అలా దొరికిన ఆడవాళ్ళను రాజభవనాలకు ఇచ్చేవారు. చరిత్రలో అప్పుడేం జరిగిందో కాని ఈ సంఘటనకు సంబంధించి చాలా కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ కథనాల ప్రకారం శివాజీ ఆమెను తన తల్లిలా ఉన్నారని చెప్పాడంటారు. ఆమెను సగౌరవంగా తిరిగి ఆమె కుటుంబం వద్దకు పంపేయడం జరిగింది. మతాలన్నీ మానవత్వాన్నే నేర్పాయి. హిందూ ధర్మంలోనూ ఇదే అద్భుత లక్షణముంది.ఇది చరిత్ర. నేడు ఏం జరుగుతోంది? ఆ పసిదాన్ని ఎందుకు రేప్ చేశారు. ఏదో అవకాశం దొరికిందని చేయలేదు. ఆలోచించి చేశారు. సరదా కోసమో, సంతోషం కోసమో చేయలేదు, ఆమె కుటుంబాన్ని, ఆమె సముదాయాన్ని బెదిరించడానికి, ఈ దేశంలో ఉండాలంటే అణగిమణిగి చెప్పులా పడి ఉండాలని చెప్పడానికి చేసిన నేరం అది. కుర్రవాళ్ళు కాలేజీల నుంచి రావడం నాకు బాల్కనీ నుంచి కనిపిస్తుంది. రేపటి భవిష్యత్తు గురించిన నమ్మకం వారి ముఖాల్లో కనిపిస్తున్నది. కాని రేపు ఎలాంటిది? నా వయసు కూడా దేశ స్వాతంత్య్రానికి సమానమైనది. మువ్వన్నెల జెండా ఎప్పుడూ మువ్వన్నెల్లోనే ఉండాలన్నది నా కోరిక. నేను మ్యాగజైన్ పక్కన పెట్టి యువరాజుగా శివాజీ గురించి పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాను. ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, శివాజీ కనుక నేడు బతికి ఉంటే కథువాలో నేరస్థులను సమర్ధిస్తున్నవాళ్ళు చేస్తున్నది పాపం, నేరం అని నిర్మోహమాటంగా చెప్పేవాడు. ఇది హిందూ ధర్మం కానేకాదనేవాడు. చెడ్డరోజులు వ్యక్తులకే కాదు, జాతులకు కూడా వస్తాయి. కాబట్టి ఈ చీకట్లలో మునిగే బదులు నేను నాకు ఇష్టమైన పాట “జానకీ జానె” వినడం ప్రారంభించాను. ఇది శ్రీరామచంద్రుడిని స్తుతిస్తూ యూసుఫలీ కచేరీ అనే ముస్లిం సంస్కృతంలో రాసిన పాట. దీనికి బాణీ కట్టి సంగీతం సమకూర్చింది నౌషాద్ అలీ, మరో ముస్లిం. ఈ పాట పాడిన గాయకుడు జేసుదాస్, ఒక క్రయిస్తవుడు. ఈ పాట వినండి. ఈ పాట మీతో మాట్లాడుతుంది.

 * యశ్వంత్ తోరాత్   (ది వైర్)