Home ఆఫ్ బీట్ జాలువారే అందం.. కుంటాల జలపాతం

జాలువారే అందం.. కుంటాల జలపాతం

waterfalls

గల గల పారేసెలయేళ్లు..జలజల పారే జలపాతం.. ఆకుపచ్చని అడవులు.. కొండకోనలు.. వాగులువంకలు ఇలా కళకళలాడే కుంటాల జలపాతం అందరినీ కనువిందు చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి ప్రతి నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. ప్రకృతి ప్రేమికులకు దీన్ని మరో నయాగారగా పిలుచుకుంటారు. రాష్ట్ర రాజదాని హైదరాబాద్ నుండి జాతీయ రహదారిపై సమీపంలో ఈ కుంటాల జలపాతం సహజసిద్దంగా ఏర్పడింది. సుమారు 250 కీలోమిటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మన రాష్ట్రంతో పాటు చుట్టుపక్క గల మహారాష్ట్ర నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఇటీవల అవి శిథిలావస్థకు చేరుకోవడంతో పర్యాటకులకు ఇబ్బందులకు కలిగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకోని ఎకో టూరిజం పరిధిలో 10 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. వచ్చే ఏడాది నాటికి ఆ పనులు పూర్తైతే నిత్యం పర్యాటక ధామంగా నిలవనుందంటున్నారు.
కుంటాల పేరు ఇలా..
పూర్వం శకుంతల, దుష్యంతుడు ఈప్రాతంలో విహరిస్తూ అందాలను అస్వాదించే వారని కుంటాల గ్రామం పూర్వీకులు చెబుతుంటారు. అందుకే శకుంతల పేరులోని కుంతలను ఈ ప్రాతానికి పేరు పెట్టినట్లు చెబుతుంటారు. దీనికి కుంతాల జాపాతమని, ఆ తర్వత కుంటాల జలపాతంగా పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి యాత్రికులు వస్తుంటారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల క్రితం జలపాతం కింది వరకు మెట్లు నిర్మించారు. సందర్శకుల కోసం క్యాంటీన్ లు ఏర్పాటు చేశారు. సెలవు దినాల్లో కుంటాల జలపాతం వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. 42 అడుగుల ఎత్తు నుంచి సెలయేళ్లు…
కుంటాల జలపాతం 42 అడుగుల ఎత్తు ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. జిల్లా నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఈ జలపాతాన్ని దర్శించుకునేందుకు వస్తారు. దట్టమైన అడవుల్లో రెండు కొండల పై నుంచి ఈ జలపాతం పారుతుంది. పక్షుల కిలకిల రాగాలతో కూడిన ఈ ప్రాతం పర్యాటకులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. జలపాతం పై నుంచి నీరు కిందపడే చోట చిన్న రాతి గుహ ఉంటుంది. అందులో సోమేశ్వరుడు,నంది విగ్రలు ఉంటాయి. 10 మంది మాత్రమే ఈ గుహలోకి వెళ్లగలరు. జలపాతం దిగువన కుడి వైపు చెట్టు కింద కాకతీయుల నాటి దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ జలపాతం వద్ద సరైన సదుపాయలు లేక పొవడం తో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎన్ హెచ్ 44 రోడ్ పక్క నుండి నేరడిగొండ మండల కేంద్రం మీదుగా 12 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నూతనంగా రెండు వరుసల రహదారి 14 కోట్లతో నిర్మించారు.

గిరిపుత్రుల ఆరాధ్యదైవం..
సందర్శకులంతా కుంటాల జలపాతాన్ని పర్యాటక ప్రాతంగానే చూస్తారు. కానీ ఇక్కడి చుట్టుపక్కల ఉండే గిరిజనులు మాత్రం జలపాతాన్ని ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఆ కొండలపైన ఒక గూహలో శివలింగం ఉండడంతో అక్కడి నుండి పారేనీటిని సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావిస్తారు. దేవతల మొక్కులు, పండుగలు గిరిజనులు ప్రతి సంవత్సరం రెండు సార్లు పండుగలు జలపాతం వద్ద చేసుకుంటారు. దాదాపుగా అన్ని కాలల్లో ఈ జలపాతం వద్ద నీళ్లుండడంతో పండ్లు,ఇతర అటవీ సంపద ఈప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి దట్టమైన అడవుల్లో ఉండే వన్యప్రాణులు ఇక్కడికి వేసవిలో నీటికొసం వస్తుంటాయి. ఈ జలపాతం కింద బావొజిపెట్,సిరిచెల్మ గ్రామాలు పూర్తిగా రిజర్వు ఫారెస్టు అడవుల్లో ఉంటాయి. ఈ జలపాతం నీటిపై ఆధారపడి చుట్టు పక్కల 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
షూటింగ్‌లకు నిలయం
ఇక్కడ వేసవిలో ఎక్కువగా షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటివరకు 50కిపైన సీరియళ్లు, 20 పైగా సినిమాల్లోని సన్నివేశాలను, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. సంవత్సరాల క్రితం భారీ పెట్టుబడితో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రమదేవి చిత్రం సూటింగ్ ఇక్కడ వారం రోజుల పాటు కొనసాగింది.