Home లైఫ్ స్టైల్ మన ‘హైఫై’ వ్యవహారాలు పైపై వేషాలేనా?

మన ‘హైఫై’ వ్యవహారాలు పైపై వేషాలేనా?

life

ప్రతీ విషయంలో ఇది 21వ శతాబ్దం అంటూ మాట్లాడుతున్న మనం దానికి తగ్గట్టే ఉన్నామా?
ప్రతీదానికి ప్రపంచీకరణ మంత్రం చదువుతున్న మనం దానికి మన భావాలను ప్రపంచస్థాయికి తీసుకువెళ్తున్నామా? అన్నిటికీ గ్లోబలైజేషన్ అంటున్న మనం మన పాతకాలం ఆలోచనలకు చెల్లుచీటి రాసి గ్లోబల్ బాట పడుతున్నామా? గ్లోబెల్ ప్రచారాలు మానుతున్నామా? అంటే లేదనే చెప్పాలి..
పంచలు, లుంగీలు మానేసి జీన్స్‌ప్యాంట్లు, షార్ట్‌లు వేస్తూ గడ్డాలు పెంచుకుని మీసాలు దువ్వుకుని, హెడ్‌ఫోన్స్ తగిలించుకుని జనంలో ఉన్నామని కూడా చూసుకోకుండా డ్యాన్స్‌లు చేస్తున్న మనం, ఇంట్లో పెద్దవాళ్ళ ఆర్డర్లకు అనుగుణంగా చిందులు వేయడం మానేస్తున్నామా? అంటే లేదనే చెప్పాలి..
ఆకారం, ఆహార్యం మార్చినా..మునిగితేలే ఫ్యాషన్‌కు తగ్గట్టుగా తళుకులు, కులుకులు, సొగసులు, సొబగులు మారుతున్నా అందుకు తగ్గట్టుగా వైఖరి మారుతోందా? అంటే లేదనే సమాధానం వస్తోంది.

ఈ సమాధానం చెప్పిన వారెవరో దారిన పోయే దానయ్యలుకాదు. యువత పోకడపై అధ్యయనం చేసిన స్కాలర్లు చెప్పినమాట. భారత దేశంలో యువతపోకడ ఎలా ఉంటోంది? కాలంతోపాటే వారూ మారారా? వేషం ఒక్కటే మార్చి మనుషులు అలాగే ఉండిపోయారా? అన్న కోణం నుంచి వీరి అధ్యయనం సాగింది. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డవలపింగ్ సొసైటీస్, కోన్రాడ్ అడెనార్ స్టిఫ్‌టంగ్, లోక్‌నీతి సంస్థలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఇందుకోసం 19 రాష్ట్రాలలోని 1534 సంవత్సరాల వయసున్న 6, 122 మంది యువతీ యువకులను ఎంచుకున్నారు. కుర్రతరం ఆలోచనలు, ఆదర్శాలు, ధోరణులు, భావోద్వేగాలు గమనించేందుకు వీరు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇటీవల కాలంలో మరణ శిక్ష ఉండాలా..వద్దా.. అన్న విషయంలో న్యాయస్థానాలతో సహా మేధావులందరూ మల్లగుల్లాలు పడుతున్న ప్రస్తుత సమయంలో యువతరం ఎలా ఆలోచిస్తోందో తెలుసుకోడానికి వీరిపై ఈ ప్రశ్నను సంధించారు. సమాధానమిచ్చినవారిలో 49% మంది మరణశిక్ష ఉండాలని వాదించగా 23% మంది వద్దని దాన్ని రద్దుచేయాలని అన్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు మత భావనలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి..ఇలాంటి సినిమాలు ఉండాలా వద్దా అని అడిగితే 60% మంది ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయొద్దన్నారు. ఇలా అన్న వారిలో అన్ని రకాల మతాల వారూ ఉన్నారు. కాగా 23% కుర్రవాళ్ళు మాత్రం ఇలాంటి సినిమాలు బ్యాన్ చేయాలన్నారు. యూనివర్శిటీ స్థాయిలో విద్యార్థులకు పెట్టే భోజనంలో గొడ్డుమాంసం పెట్టాలన్న వాదనను వీరి ముందుకు తీసుకురాగా 36% మంది అలాంటి భోజనం పదిమందీ తినే చోట వద్దని అభిప్రాయపడగా 46% మంది భోజన అలవాట్లు వక్తిగతమైనవి. ఎవరికి ఇష్టమైన ఆహారాన్ని వారు తింటుంటారు. దాని విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదు. తాను తినే దాన్ని పక్కవాడు కూడా తినాలని ఒత్తిడిపెట్టడం మంచిదికాదని వారు అభిప్రాయపడ్డారు. 40% మాంసాహార హిందూ యువతీ యువకులు, 90% వామపక్ష భావాలు గలవారు గొడ్డుమాంసం తినడం వల్ల ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరంలేదని, తాము ఈ విషయంలో పక్కవాడి అలవాట్లను పట్టించుకోమని చెప్పారు. హిందూ యువతను శాకాహార, మాంసాహార భక్షణ గురించి ప్రశ్నించగా 58% మంది మాంసాహారులుగా ఉండడానికే ఇష్టపడ్డారు. మిగిలినవారిలో 30% మంది ప్యూర్ వెజిటేరియన్లమని చెప్పుకోగా, 9% మంది గుడ్డును తింటామని దాన్ని మాంసాహారంగా భావించడంలేదని చెప్పారు.
ప్రేమపేరుతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం, సహజీవనం చేయడం వంటి ధోరణులను 67% మంది వ్యతిరేకించారు. మతాంతర వివాహాలను 45% మంది వ్యతిరేకించగా, 28% మంది బలపరిచారు. భర్తమాటను భార్య వినాలని 51% మంది వాదించగా, పెళ్ళి తర్వాత ఆడపిల్లలు పనిచేయకూడదని 41% మంది అభిప్రాయపడ్డారు. ఇద్దరూ ఆఫీసులని వీధులు పట్టుకుపోతే ఇంటిని ఎవరు పట్టించుకుంటారు? ఇద్దరూ ఆఫీసు పనిలో అలసిపోయి ఇంటికి చేరి చిటపటలాడుతుంటే వారి కోపతాపాలను ఎవరు తీరుస్తారు? ఇద్దరూ అసహనపడితే సంసారమేమైపోతుంది? ఇద్దరూ ఆఫీసుపనిలో మునిగిపోతే పిల్లల బాగోగులు ఎవరు చూస్తారు? అంటూ వారు ప్రశ్నించారు. ఆడపిల్ల పనిచేసి ఇన్ని సమస్యలు తెచ్చుకునే కంటే ఇంటి పట్టున ఉండి ఇంటిని చల్లగా ఉండేలా చూడడమే మేలు అని వారు అభిప్రాయపడ్డారు. ఒక్క జీతంతో ఇల్లు గడవదుకదా..అని అంటే వేణ్ణీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్టు ఉండాలంటే ఆడపిల్ల ఉద్యోగాలు చేసి, ఊళ్ళేలి సంపాదించనవసరంలేదని, భర్త తెచ్చి ఇచ్చే డబ్బు సద్వినియోగం అయితే చాలు అని వారు అన్నారు. పొదుపు పాటించడం, దుబారా అరికట్టడం కూడా ఆదాయం సృష్టించడం వంటిదేనని అన్నారు. ఖర్చులకు అంతా..పొంతా? ఎంత సంపాదిస్తే దరిద్రం తీరుతుంది? సంపాదన పెరిగే కొద్దీ టాక్స్‌లు కట్టాలి. టాక్స్ బెడద తప్పించుకోడానికి అడ్డదారులు తొక్కాలి. ఎందుకొచ్చిన బెడద ఇది అని వారు అన్నారు. పెళ్ళికి ముందే మేటింగ్‌లనీ, డేటింగ్‌లనీ జల్సాచేసుకోడాన్ని 53% మంది వ్యతిరేకించారు. అలాగే 40% యువతీయువకులు వాలెంటైన్స్‌డేను వ్యతిరేకించారు.
ఇక కులాంతర వివాహాల విషయానికి వస్తే ఈ తరహా వివాహాలు మంచివే అని అంగీకరించిన వీరిలో 84% మంది తమ కులం వారినే వివాహం చేసుకున్నామని చెప్పారు. కులాన్ని కూలదోసి మనుషులంతా ఒక్కటే అన్న అవగాహన పెరగాలని అన్నా వీరిలో 50% మంది పెద్దలు కుదిర్చిన వ్యక్తితోనే వివాహం చేసుకున్నామన్నారు. పెద్దలు ఎలాగూ సొంత కులానికి చెందిన వ్యక్తినే చూస్తారు కనుక వీళ్ళ వివాహం సహజంగానే సొంత కులం వారితోనే జరిగిపోయింది. అలాగే వివాహానికి ముందే పరస్పరం పరిచయం ఉండాలని, ప్రేమలు ఒకరినొకరు అర్థం చేసుకోడానికి బాగా ఉపయోగపడతాయని అన్న వీళ్ళలో చాలా కొద్దిమంది మాత్రమే ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇక దేవుడి విషయానికి వస్తే పూజలు, నోములు, వ్రతాలు ఆర్భాటాలు వగైరాలు పెట్టుకోకపోయినా రోజూ దేవుణ్ణి తలచుకుని దణ్ణం పెట్టుకుంటామన్న వారి సంఖ్య 78% ఉంది. కాగా తమకు అందుబాటులో ఉండే గుడికో, గోపురానికో, ప్రార్థనా మందిరానికో, భజన మందిరానికో వెళ్తున్నామన్న వారి సంఖ్య 68% ఉంది. ఆడా, మగా అసమానత్వం పోవాలి..అంతా ఒక్కటే..సమాన పనికి సమాన వేతనం వంటి నినాదాల విషయంలో వీరిలో ఎలాంటి సానుభూతి కనిపించలేదు. వారు ఈ నినాదాలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఒబిసి కోటా ఉండాలని 48% కోరుకోగా, 26% వద్దని అభిప్రాయపడ్డారు.