Home లైఫ్ స్టైల్ ఈ బంధం అపురూపం!

ఈ బంధం అపురూపం!

 

స్త్రీల మధ్య అనుబంధాలను కించపరిచే వ్యక్తులని పూర్వకాలం నుంచి వింటూ ఉంటాం. ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులు, రెండు కొప్పులు ఒక చోట చేరితే..వంటివి విలువలేని అభిప్రాయాలు అంటారు విజ్ఞులు. స్త్రీల మధ్యే కాదు ప్రపంచంలో ఏ ఇద్దరి మధ్య స్నేహం అంటే కష్టంతో ఆడుకోవటం అని అర్థం కానే కాదు. అది నిర్వచనానికి చెందని ఒక అనుభూతి. భిన్న సామాజిక ఆర్థిక సాంస్కృతిక ప్రాంతాలకు చెందిన వారైనా స్నేహితులుగా కలసి పోరాటానికి అది మనసుకి సంబంధించిన ఒక రసాయన చర్య కావటమే కారణం.

ఎవరిపైన ప్రేమ ఎందుకు కలుగుతుందో తెలియనట్లే, స్నేహం ఎందుకు ఎవరితో ఏర్పడుతుందో ఎవరూ చెప్పలేరు. విలువైన స్నేహం ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య ఏర్పడుతుంది. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకొంటారు. ఇద్దరిలో మంచితనం వాళ్లను ముందుకు నడిపిస్తుంది. ఇలాంటప్పుడు స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న పదం ఎందుకొచ్చిందీ అంటే ..ఏనాడో ఒకసారి తనకంటూ ఒక స్వతంత్రత లేకపోవటం, స్త్రీలు మగవాడి ఆదరణ కోసం యాచించే పరిస్థితి ఉన్నప్పుడు, మగవాడి జీవితంలో కీలక పాత్ర పోషించే భార్య, తల్లి, చెల్లెళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడి ఉంటుంది.
ఆ సందర్భాలను నిర్వచించే క్రమంలో ఈ పదం సృష్టించి ఉంటారు. కానీ ఇప్పుడు తరంలో అన్నింటా అమ్మాయిలు ముందే ఉంటూ, చదువుల్లో , ఉద్యోగాల్లో సమానంగా ఉంటూ, సమాజంలో గుర్తింపు తెచ్చుకొంటూ ఉన్న రోజుల్లో ఈ పాత సామెత మాసిపోయినట్లే. ఒకమ్మాయిని ఇంకో అమ్మాయి అర్ధం చేసుకొన్నట్లు పురుషుడికి అర్ధం కావటం కష్టమే. ఇప్పుడు ఆడపిల్లల మధ్య ఎంతో అవగాహన పెరిగింది. కార్పొరేట్ వ్యవస్థలో ఒకళ్లతో ఒకళ్లు స్నేహంగా ఉంటే జీవితం ముందుకు వెళ్తుంది.
ఉద్యోగాల కోసం, చదువు కోసం నగరాలకు వస్తున్న అమ్మాయిలు హాస్టళ్లలో, పేయింగ్ గెస్ట్‌లుగా, రూమ్మేట్లుగా హాయిగా కలసి ఉంటున్నారు. కలసి విహార యాత్రలకు వెళుతున్నపుడు జీవితంలో వచ్చేప్రతి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకొంటున్నారు. నిజానికి మనుష్యుల మధ్యనే స్నేహ సంబంధాలు చాలా అవసరం. సోషల్ నెట్ వర్క్‌లు, ఫేస్‌బుక్‌లు ట్విట్టర్‌లు వచ్చాక సుదూర ప్రాంతాల్లో వాళ్లు కూడా దగ్గరవుతున్నారు. ఒకే రకం అభిప్రాయాలు ఉన్న వాళ్లు స్నేహితులవుతున్నారు. అపార్ట్‌మెంట్ సంస్కృతి వచ్చాక ఒక్క చోట కొన్ని కుటుంబాలు కలసి ఉంటారు. ఎక్కడెక్కడ నుంచో ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వచ్చినవారు చుట్టు పక్కలవాళ్ళే బంధువులు, స్నేహితులు అనుకొంటున్నారు. కలసి పండగలు సెలబ్రేట్ చేసుకొంటారు.
ఇలాంటప్పుడు ఒక ఆఫీసులో ఒక కొత్త అమ్మాయి ఉద్యోగంలో చేరగానే వెంటనే ఆ ఆఫీస్ అమ్మాయిలంతా ఏకం అవుతారు. క్షణాల్లో స్నేహం చేసుకొంటారు. సౌకర్యాలు గురించి చర్చిస్తారు. ఎక్కడ స్థిరపడేదాకా తెలిసిన సోర్స్‌లన్నీ ఇచ్చేస్తారు.
ఉదయం పనిలో చేరిన అమ్మాయి సాయంత్రానికి తనకు మనసుకి దగ్గరగా అనిపించిన అమ్మాయిలు రూమ్ షేర్ చేసుకొనేందుకు కాలు బయటపెడుతుంది. లేదా ఆ పది మంది పేయింగ్ గెస్ట్‌లుగా ఉన్న ఇంట్లో కొత్తమ్మాయి కోసం ఇంకో మంచం ఏర్పాటవుతుంది. ఆ పది మంది మంచి చెడ్డలు చూసే ఇంటి యజమానురాలు ప్రేమగా నగరం వచ్చిన అమ్మాయిని చేరదీస్తుంది. ఇష్టాఇష్టాలు కనుక్కుంటుంది.
అవసరాలు ఎలా తీర్చగలరో చెబుతుంది. అది డబ్బు చెల్లిస్తే దొరికే ఒక అకామిడేషన్ కావచ్చు. కానీ చుట్టూ ఆడవాళ్లు పంచేది ప్రేమ మాత్రమే. మరి అసూయ ముందు ఆడవాళ్లు తర్వాత, అత్త లేని కోడలు… వగైరా సామెతలు పట్టి కూర్చిన రచయితలు ఇప్పుడు ఏం చెబుతారు! కాలం మారింది.
ఒక చీకటి కోణం లోంచి బయట పడి వెలుగులోకి వచ్చాక అభిప్రాయాలు మారిపోతాయని అర్థం చేసుకొంటారు? నిజం. పాత రోజులు మారిపోయాయి. కొత్త కోడలు వచ్చి తన పెత్తనం లాక్కుంటుందీ అన్న తరం అత్తగారు ఇప్పుడు లేదు. తన కొడుకు జీవితాన్ని నందనవనం చేయటానికి వచ్చిన కోడలు బాగోగులు తన బాధ్యత అనుకోవటం లేదు.
నవ్వుతూ తన వైపు ఆదరంగా చేయి చాచిన వదినగారు తనకు భవిష్యత్తు మార్గదర్శకంగా ఉంటుందని ఆడబిడ్డ అనుకోదా? ఇద్దరు స్నేహితులు అక్క చెల్లెళ్ళులాగే కలసి కష్ట సుఖాల్లో తోడుగా ఉంటామని రుజువు చేస్తున్నారు. స్నేహం ఏ ఇద్దరి జీవితాల్లోనూ అపురూపం అని అందరూ గ్రహించాలి. అది ఇద్దరు స్నేహితులు, లేదా అత్తాకోడళ్లు, తల్ల్లీ కూతుళ్లు, అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఎవరి మధ్య అయినా ఇప్పుడు ఉన్నది, ఉండవలసింది స్నేహం మాత్రమే. అందుకే ఈ స్నేహాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
పలకరించుకోవాలి, కుటుంబపరమైన ఫంక్షన్స్‌లో ఆహ్వానాలు ఇచ్చుపుచ్చుకోవాలి. అయితే చుట్టూ ఉన్న వాళ్లలోనే ప్రమాదాలను తెచ్చిపెట్టేవాళ్లు వివాదాల్లోకి లాగేవాళ్ళు, ప్రచారాలు చేసేవాళ్లు, అపకారం తల పెట్టేవాళ్లు ఉంటారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగే స్త్రీలయినా పురుషులైనా ప్రతికూలతలన్నీ పక్కనపెట్టి ఎదుటవాళ్ల లోపాలతో సహా అంగీకరించి స్నేహం చేయటమే. ఇంట్లో అత్తగారు కొడుకుపై అవకాశం చూపించాలనుకొంటే చూపెట్టనివ్వండి. అవకాశం ఇవ్వటమే. తన పెత్తనం సహిస్తూ కొడుకుతో స్నేహంగా మెలిగే కోడల్ని అత్తగారు ఏం చేయగలరు. అలాగే అత్తగారు నా కొడుకు అనుకొనే కోడలిగా ఒక అవకాశం ఇవ్వచ్చు.
ఆమె తన భర్తను తనకు సొంతంగా ఇచ్చిందని తెలుసుకొనే వరకు కాస్త ఓపిక పడితే ఇవన్నీ అసాధ్యాలు కావు. ఈ ప్రపంచంలో ఎన్నింటినో సర్దుకొంటేనే ప్రశాంతమైన జీవితం అందుతుంది. మరి అనుబంధాలున్న చోట్ల ఆ మాత్రం సర్దుకోలేమా? చీకటి పోయి తెల్లారు తుంది. వెలుగు వస్తుంది.స్నేహం కోసం చాచిన చేతుల వైపు చూడకుండా ఉండటం
సాధ్యమా?

Article about on Womens bond