Home ఆఫ్ బీట్ ప్రఖర క్రాంత దర్శి – పాలకుర్కి సోమన

ప్రఖర క్రాంత దర్శి – పాలకుర్కి సోమన

somana

తెలుగు భాష అత్యంత ప్రాచీనమైనదని, 2000 సంవత్సరాలకు పూర్వమే ఉనికిలో ఉందని పరిశోధనల్లో తేలింది. అయితే తొలి తెలుగు రచనల్లో సంస్కృత భాషా పదాలు చాలా ఉన్నాయి. అచ్చ తెలుగులో సాహితీసృజన చేసింది పాల్కురికి సోమనాథకవి. తెలంగాణలోని పాలకుర్తి గ్రామములో జన్మించిన ఆయన ప్రఖర క్రాంతదర్శి, సంస్కరణాభిలాషి. ఈ విషయం అతని రచనల ద్వారా తెలుస్తుంది. ఆయన ప్రజాకవి. ఆయననే తొలి దేశీకవి అన్నారు. ఆయన జీవన యానం క్రీ.శ. 1190 నుండి 1270 వరకు కొనసాగింది. అది కాకతీయుల పాలనాకాలము.
ఆనాటి సమాజములో కులాల కుమ్ములాటలు, మూఢాచారాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఛందస్సులో ద్విపద ప్రక్రియకు ఆయనే సృష్టికర్త. కోడికూసిన కొక్కొరకోను కూడా ద్విపద కావ్యములో, అచ్చతెలుగులో వర్ణించిన సృజనశీలి. బసవేశ్వరుని సాంఘిక సంస్కరణలచే ప్రభావితుడై ఆయన బాటలోనే పయనించిండు. అంతేకాదు, తెలుగులో మొదటి ద్విపద కావ్యము, బసవపురాణమును భాగవత కథల్లాగా రాసి ప్రచారం చేసాడు. ద్విపద ఆయన ఊహల్లో ఉయ్యాలలూగి ఛందోరూపాన్ని సంతరించుకుంది.
సోమనాథకవి వీరశైవ మతాన్ని త్రికరణశుద్ధిగా ప్రచారం చేసినా తెలుగులో తొలి దేశీ పురాణం, చారిత్రిక కావ్యాలు రచించాడు. తొలి తెలుగు ఉదాహరణ కావ్యం, తొలి అచ్చ తెలుగు (మకుట సహిత) శతకము, వృషాధిప శతకము ఆయన కలము నుండి జాలువారినవే. వృషాధిప శతకములోని పద్యాలుబసవా! బసవా! వృషాధిపా మకుటముతో సాగినవి. రగడ దేశీ ప్రక్రియకు ఆయనే ఆద్యుడు. ఆయన రచించిన బసవపురాణం తొలి తెలుగు దేశీకావ్యముగా, పండితారాద్య చరిత్రము తొలి చారిత్రిక కావ్యంగా తెలుగు సాహితీ చరిత్రలో సుసంపన్నమైనవి.
సోమనాథుడు బహుభాషా కోవిదుడు. సమకాలీన సమాజములోని దురాచారాలను, మూఢనమ్మకాలను సాహిత్యం ద్వారా అంతం చెయ్యాలని పట్టుబట్టి 30 గ్రంథాలు రచించాడు. అక్షరాన్ని ఆయుధముగా చేసి రచనా వ్యాసంగము సాగించిండు. అన్ని కావ్యాల సారము సంఘ సంస్కరణలకే పట్టం కట్టింది.
ఆనాడు చదువుకున్నవారు చాలా తక్కువ. సోమనాథుడు సామాన్య ప్రజలకు చదువు విలువలను వివరించి, అందరూ విద్యావంతులు కావాలని నచ్చ జెప్పిండు. విద్యలేని మనిషిని వింత పశువుగా భావిస్తారని చెప్పిండు. ఆడవారు కూడా మగవారితో సమానంగా చదువుకోవాలని ప్రోత్సహించిండు.
ప్రజలు కులాలుగా విడిపోయి తమ కులమే గొప్పదని కీచులాడుకునేవారు. సోమనాథుడు వారి దురవగాహనను మార్చాలనుకున్నాడు. దళితులతో సహా అన్ని కులాలవారిని సమావేశపరిచి పుట్టినప్పుడు ఎవ్వరూ కులాన్ని వెంట తీసుకురాలేదని, మనిషి గుణమే ప్రధానమని అందరికీ నచ్చజెప్పాడు. అందరి దేవుడు ఒక్కడేనని శివతత్వాన్ని బోధించాడు. మనసులను మార్చాడు.
సృష్టిలో ఆడ-మగ సమానమని, ఆడవారు మగవారితో సమానమని, అందరికీ సమాన హక్కులు-బాధ్యతలున్నాయని సవివరంగా బోధించిండు. అన్నికులాల ఆడ-మగ వారిని ఒకచోట చేర్చి సహపంక్తి భోజనాలేర్పాటు చేసాడు.
భర్త చనిపోయిన స్త్రీని శుభకార్యాలకు రాకుండా నిరోధించేవారు. వితంతువులు బొట్టు, పూలు పెట్టుకోరాదనేవారు. ఆ దురాచారాన్ని ఆపేందుకు సోమనాథుడు స్వయంగా తిరిగి భర్తృహీనలు, ఇతర స్త్రీలతో సమానమని, అందరూ మనుషులేనని నచ్చజెప్పి ఆదురాచారాన్ని అరికట్టే ప్రయ త్నం చేసిండు. చావు-పుట్టుకలనేవి మనిషి చేతుల్లో లేవనే నిజాన్ని చెప్పి భార్య చనిపోయిన భర్త మళ్ళీ పెళ్ళి చేసుకున్నట్టే భర్త చనిపోయిన స్త్రీలు మళ్ళీ పెళ్ళి చేసుకోవడం సదాచారామని చెప్పాడు. తానే దగ్గరుండి కొందరు వితంతువుల వివాహాలు చేయించిండు. అలా అభాగ్యులైన స్త్రీల జీవితాలను తిరిగి చిగురింపజేసి, వాళ్ళ కళ్ళల్లో కాంతులు మెరిపించిండు.
ఆ రోజుల్లో స్త్రీలను (కొందరు) దైవ పూజకు దూరంగా ఉంచేవారు. అది దురాచారమని బోధించి స్త్రీలందరిచేత లింగధారణ చేయించిం డు. అలా దైవపూజలో పాల్గొనేలా చేసాడు. దైవతత్వాన్ని అందరికీ బోధించి దైవదూషణ చేసేవారికి బుద్ధిచెప్పిండు. తన రచనల్లో గూడా మూఢాచారాలను, దురాచారాలను వ్యతిరేకించిండు.
జంగమ దేవరలు సన్యాసులుగా జీవిస్తారు, కాబట్టి వారిని తాను గౌరవించి, ఇతరులచే గౌరవింపజేసేవాడు. మూఢాచారాలకు పాల్పడే మతవాదులతో తీవ్రమైన చర్చలు చేసి వారిలోని వికృతులను దూరంచేసిండు. మూఢనమ్మకాలుగల బ్రాహ్మణులతో చర్చలు జరిపి వారి కళ్లు తెరిపించేవాడు. సంఘసంస్కరణల అమలులో తీవ్రవాది అయినా అవసరమైన చోట సంయమనం పాటించేవాడు.
కులాల కుమ్ములాటలను నిరోధించి, కులాంతర వివాహాలను ప్రోత్సహించిండు. నిమ్నకులాల వారి కళ్ళల్లో వెలుగులు నింపిండు. ఓ బ్రాహ్మణుడు బసవపురాణాన్ని ద్వేషించిండు. అతన్ని చంపాలని శివ భక్తులు వెంబడించారు. ఆ విషయం తెలిసిన సోమనాథుడు బ్రహ్మహత్య మహాపాపమని అక్కడి రాజును సముదాయించి ఆ బ్రాహ్మణుని ప్రాణాలు రక్షించిండు.
ఆ రోజుల్లో కవులు సామాన్య జనాలకు అర్థంకాని భాషలో రచనలుచేసి తమ పండిత ప్రకర్షను చాటుకునేవారు. సోమనాథకవికాపద్ధతి నచ్చలేదు. తన రచనల్లో సామాన్యులకు గూడా అర్థమయే భాషాపదాలనే ఉపయోగించిండు. ఆయన రచించిన బసవపురాణములో 90 కథలున్నాయి. అవన్నీ ద్విపద ఛందస్సులో వున్నాయి. ఆ కథల్ని అందరూచదివి అర్థం చేసుకుని పాటలుగా పాడుకున్నారు. బసవేశ్వరుని జీవిత చరిత్ర, సంస్కరణలు మానవాళికాదర్శమని నిరూపించిండు.
బసవపురాణములో సంఘసంస్కరణ అంశాలెన్నో వున్నాయి. గంగపుత్రుడు మాచయ్య, తాళ్లుపేనుకునే చంద్రయ్య, పశువులకాపరి రామన్న, వ్యవసాయదారుడు ముద్దయ్య, చేనేత రామవ్వ, పోలీసు రామిదేవ, నూనెమిల్లు కన్నయ్య, వడ్రంగి బసప్ప, తోళ్ల వ్యాపారి కనకయ్య, సామాన్యుడు హరలయ్య అందరూ కలిసి అనుభవమంటపమ్మీద సమావేశమై దురాచారాలనిర్మూలన కోసం చేసుకున్న చర్చలను హృద్యంగా చెప్పిండు. వేర్వేరు కులాలకు చెందిన మధువారస కూతురును, సామాన్యుడైన హరలయ్యకుమారునికిచ్చి పెళ్ళి చేయించిన బసవేశ్వరుడిని సోమనాథుడు ఆదర్శంగా స్వీకరించిండు.
అట్లానే పండితారాద్య చరిత్రము ద్విపద కావ్యములో మరెన్నోకథల ద్వారా సంఘ సంస్కరణ ఘట్టాలను పొందు పరిచిండు. ఆయన కావ్యాలలో చోటుచేసుకున్న బెజ్జమహాదేవికథ, సంగళవ్వ కథ, కిన్నెర బ్రహ్మయ్య కథ, చిక్కమాదరస కథ మొదలైనవన్నీ సంస్కరణాపేక్షితాలే. పండితారాద్య చరిత్రములో వేశ్య ప్రౌఢవతి, చిక్కమాదరస కథల్లో మహిళల పాత్రలను ఉదాత్తంగా మలిచిండు.
సోమనాథుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని, సంఘ సంస్కరణలను ప్రచారం చేస్తూ జీవితాంతం కష్టాలనుభవించిండు. జీవన సంధ్యాసమయంలో ప్రతాపరుద్ర చక్రవర్తికి మంత్రియైన తన శిష్యుడు ఇవటూరు అన్నయ్యను పిలిపించి పేదరికాన్ని అనుభవిస్తున్న భక్త జనాలకు డొకిపర్రు గ్రామాన్ని అగ్రహారముగా ఇప్పించిండు.
రెండవ ప్రతాపరుద్రుని కాలమునాటివాడైన సోమనాథుడు సాహిత్యాంబరములో ధృవతార అయినాడు. ఆయన రచనల్లో బసవ పురాణము, పండితారాధ్య చరిత్రము, వృషాధిప శతకము, చెన్నమల్లు సీసములు, చతుర్వేదసారము, అను భవసారము, సోమనాథభాష్యం, రుద్ర భాష్యం మరెన్నో గ్రంథాలు ప్రసిద్ధాలైనవి.
భారతీయులు ఐకమత్యంగా ఉండకపోతే తురుష్కులు ఈ దేశాన్ని ఆక్రమిస్తారన్నాడు. ఆయన మాట నిజమైంది గదా! ఎన్నో శాస్త్రాలను తన రచనల్లో వివరించిన సోమనాథుడు ప్రఖరక్రాంతదర్శిగా మానవసేవయే మాధవసేవగా భావించి ధన్యుడైనాడు.

ఐతా చంద్రయ్య
9391205299