Home కలం జీవనదర్పణం ‘కొలిమంటుకున్నాది’

జీవనదర్పణం ‘కొలిమంటుకున్నాది’

km

జీవన వాస్తవికతకు దర్ప ణం‘కొలిమంటుకున్నాది’ విప్లవ రాజకీయాలకు నిబద్ధత వహించి సృష్టించిన సాహిత్యం విప్లవ సాహిత్యం. సమసమాజనిర్మాణానికి మార్కిస్టు సిద్ధాంతాన్ని ఒక సాధనంగా అంగీకరించి ఆచరణలో స్వీకరించి నడిపే రాజకీయాలను విప్లవ రాజకీయాలు అని చెప్పవచ్చు. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటానికి కొనసాగింపుగా ఒక సమాంతర సాంస్కృతిక ఉద్యమంగా విప్లవ సాహిత్యం నిర్మితమైంది. విప్లవ కవిత్వ ఉద్యమ ప్రారంభానికి దోహదపడింది దిగంబర కవిత్వం. వాస్తవికతతో కూడిన జీవితం కవిత్వ రంగంలో కనిపించకుండా అవినీతి, అధికార కల్మషాలు పెరిగినపుడు బలమైన తిరుగుబాటుగా వచ్చిన దిగంబర కవి త్వం ఒక గొప్ప వాతావరణాన్ని విప్లవ కవిత్వానికి కల్పించింది. 1970 లో విప్లవ రచమితల సంఘం ఏర్పడింది. విప్లవ కవితా ఉద్యమాన్ని పరిపృష్టవంతం చేసిన కవులలో శ్రీశ్రీ, శివసాగర్, చెరబండరాజు, వరవరరావు, గద్దర్, వంగపండు ప్రసాదరావు మొదలైన –ఎందరెందరో ఉన్నా రు. చెరబండరాజు దిగంబర కవులలో ఒకరై పాట కు బహుళ జనాదరణను తీసుకొచ్చారు.నిబద్ధతతోపాటు ఎంతెంతో నిమగ్నత కలిగిన కవి చెరబండరాజు రాసిన ఆలోచనాత్మకమైన పాట ‘కొలిమంటుకున్నాది’.
చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర రెడ్డి. అచ్చమైన ప్రజలపాటలు రాసి విప్లవోద్యమ సాంస్కృతిక నాయకునిగా, ప్రజాగాయకునిగా పేరుపొందారు చెరబండరాజు. ప్రజల భాష, బాణీ, యాసలను పాటలలో బలంగా చూపి చిరకాలం నిలిచే సాహిత్యాన్ని అందించారు. ప్రజలనాలుకలపై కదలాడే పాటలు చెరబండరాజువి. భువనగిరికి దగ్గరలోని అంకుశాపురం గ్రామంలో రైతుకుటుంబంలో పుట్టి పెరిగిన భాస్కర రెడ్డి చిన్ననాటినుండే పద్యాలు రాయడం ప్రారంభించారు. హైద్రాబాదులో ఓరియంటల్ స్కూలులో తెలుగు పండితునిగా పనిచేస్తూ ఆసక్తి కనబరిచారు. దిక్సూచి, ముట్టడి వంటి కవితాసంపుటాలను ప్రచురించడమే కాకుండా దిగంబర కవులో ఒకడుగా మూడు సంపుటాలను ఆయన ఆవిష్కరించారు. పౌరహక్కుల ఉద్యమాలలో చెరబండరాజు చురుకుగా పాల్గొన్న చెరబండరాజు విరసం సభ్యులుగానే కాకుండా జన నాట్యమండలి రూపకల్పనలో ప్రధానపాత్ర వహించారు.
ఉద్యమకవిగా,ప్రగతిశీల భావనాత్మక నిర్మాతగా పేరొందిన చెరబండరాజు ‘చిరంజీవి’ కథలసంపుటి, మా పల్లె, ప్రస్థానం, నిప్పురాళ్ళు, దారిపొడవునా మొదలైన నవలలు రచించారు. 1982 లో వరవరరావు సంపాదకత్వంలో చెరబండరాజు కవితలు, పాటలు సం కలనంగా వచ్చాయి. తెలుగు కవిత్వాన్ని ఒక రకమైన స్తబ్ధత నుంచి మేల్కొల్పడానికి చెరబండరాజు ప్రయత్నించారు. చెరబండరాజులో దిగంబర కవిగా, విప్లవకవిగా గుర్తించదగిన పరిణామం కన్పిస్తుంది. నిబద్ధత, నిమగ్నత వెరసి చెరబండరాజు.
ఎమర్జన్సీ కాలంలో వేదన, క్షోభ, నిరంతర నిఘాలకు గురై చెప్పలేని యాతనలను అనుభవిస్తూనే వెన్నుచూపకుండా ఎందరెందరో పోరాటయోధులకు, విప్లవకవులకు ఆదర్శంగా నిలిచిన చెరబండరాజు తన చివరి ఊపిరి వరకు నమ్మిన లక్షాన్ని నెరవేర్చే కృషి చేసారు. బలమైన వచన కవిత్వాన్ని విరసం ఏర్పడక ముందు రాసిన చెరబండరాజు ఆ తరువాత తన పంథాను మార్చుకుని సామాన్య ప్రజలకు అర్థమయ్యే తేలిక భాష లో సరైన ఊహలతో, కవితా పరిమళంతో, సిద్ధాంతాన్ని ప్రతిఫలించే కదిలించే పాటలెన్నో రాశారు. కవిత్వం ప్రజలనుండి దూరమై అస్పష్టంగా మారినప్పుడు ప్రజల బాణీలో పాటలు రాసి స్ఫూర్తినిచ్చిన పాణిగ్రాహీ, శివసాగర్ లతోపాటు చెరబండరాజు ముఖ్యులు. అక్షరాస్యులను ఆకర్షించడం వేరు, చదవటం, రాయటంరానివాళ్ళను కదలించడం వేరని గ్రహించిన చెరబండరాజు తేలిక మాటల్లో ఉండే అనితర సాధ్యమైన పాటను ఎంచుకుని తన ప్రతిభావ్యుత్పత్తులను బలంగా చాటగలిగారు. సామాన్య ప్రజల బతుకును, ఆలోచనాసరళిని, భావనారీతిని తన పాటలైన ‘కొండలు పగలేసినం’, ‘కొలిమంటుకున్నాది, ‘రాయి రప్పకు సెప్పనా’, ‘ఏ కులమబ్బీ’ వంటి ఎన్నో పాటల్లో చెప్పి మెప్పించారు. చెరబండరాజు కలంనుండి జాలువారిన అత్యద్భుతమైన జీవనచిత్రం కలిగిన, వాస్తవికతకు దర్పణం పట్టిన పాటలలో చెప్పుకోదగింది ‘కొలిమంటుకున్నాది’. విప్లవ ప్రబోధాన్ని, ఒక మేల్కొలుపును ఈ పాటలో గమనిస్తాం.
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా వున్నాది
నిప్పారిపోనీకు- రామన్నా
పొద్దెక్కిపోనీకు-లేవన్నా

నీ పక్కపొలమోడు
దుక్కి సాగిండన్న
కాల్జాపి కూకోకు-రామన్నా
కార్తె పోతేరాదు-యినుమన్నా

ఎరువు కావాలింక
గుడిసేసుకోవాల
నీ బండి పట్టాలు-రామన్నా
కొత్తయే కావాల-యినుమన్నా

ఉత్తరానురిమింది
రోజూమొగులవుతూంది
ఎర్ర మెరుపూ సూడు-రామన్నా
కర్రు పారా సాన- బెట్టన్నా

కంచాన గంజికీ
గద్దలూ కాకులూ
వడిసేల పేనుకో-రామన్నా
వడివడిగా రాళ్ళేసి-కొట్టన్నా

ఇనుపముక్కలు కొడుకులుండి
ఫలమేముంది
పగలు నిద్రమాని-రామన్నా
కూడబెట్టిందేమి-లేదన్నా

చట్టాలు అన్నారు
పట్టాలు అన్నారు
పొలములో కాలెడితె-రామన్నా
పోలీసులొచ్చేరు-ఏలన్నా

కౌలుకిచ్చినోడు
కన్నెర్రసేసేడు
అప్పులిచ్చినోడు
ఆలినే సూసేడు

దయజెప్పు సర్కారు
దాదాలె అయ్యేరు
నీ దారి గోదారి-రామన్నా
కానీక కదనాన-నిలువన్నా
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా ఉన్నాది
నిప్పారిపోనీకు-రామన్నా
సందేలకానీకు-లేవన్నా
కర్రూ పారా సాన-బెట్టన్నా
బతుకుయుద్ధములోన-నిలుమన్నా.
రైతుల కష్టాలు చిత్రితమైన పాట ’కొలిమంటుకున్నాది’. పేదరైతుల కష్టనష్టాలు ఎంతటివో చెరబండరాజు ఇందులో చెప్పారు. విప్లవ ప్రబోధాత్మకతనుచెప్పిమేల్కొల్పును రగిల్చే పాట ఇది. రైతువృత్తిని, కాయకష్టాన్ని స్మరించే పాటగా కొలిమంటుకున్నాదిని గమనించవచ్చు. మేల్కొలుపులా ప్రారంభమవుతుంది ఈ పాట. పోరాటం రాజుకుందని, బతుకుపోరుకు సంసిద్ధంకావాలని, ఆలస్యం చేస్తే నష్టమేనంటూ అన్యాపదేశంగా ఇలా అంటారు చెరబండరాజు.
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా వున్నాది
నిప్పారి పోనీకు రామన్నా
పొద్దెక్కిపోనీకు లేవన్నా
ఎంత కష్టపడినా భూమి స్వంతదారులు వేరే అంటూ చట్టాలు, పట్టాలు అంటూ పోలీసులు సృష్టించే కల్లోలం గురించిన ప్రస్తావన చేశారు. కౌలుకిచ్చిన వాళ్ళు, పంటలకు అప్పులిచ్చిన వాళ్ళు, ఆసాములు, సర్కారు దొరల దౌర్జన్యాలను ఒక్కొక్కటిగా చెప్పారు. ఇంత జరిగాక కూడా ఆత్మస్థైర్యం విడవద్దన్న భరోసాను పెంచే ప్రభోధాన్ని కూడా ఇదే క్రమంలో అందిస్తారు.
నీ దారి గోదారి రామన్నా
కానీక కదనాన నిలువన్నా
కర్రు పార సాన బెట్టన్నా
బతుకు యుద్ధములోన నిలుమన్నా
బతుకుపోరుతో ఎదురయ్యే కష్టనష్టాలను లెక్కచేయకుండా కదనానికి సిద్ధం కమ్మని కవిగా చెరబండరాజు రైతుకు పిలుపునిస్తారు. భూమిని నమ్ముకున్న రైతుల వెత ఈ పాటలో అడుగడుగునా కన్పిస్తుంది. రైతుకు దినదినమూ గండంగానే ఉంటుంది. కాలంకాగానే ఎరువులు తేవాలి. పోయిన గుడిసెను మళ్ళీ వేసుకోవాలి. ఆ సమస్య తీరకముందే బండి ఇరుసులు పోతే కొత్తవి వేసుకోవాలి. ఇలా దినదినమూ సమస్యలతో సతమతవుతున్న రైతు జీవనచిత్రణాన్ని కళ్ళముందుంచుతారు చెరబండరాజు. సహజమైన పల్లెజీవితం ఈ పాట లో కన్పిస్తుంది. కాల్జాపి కూకోకు అంటూ వ్యవసాయదారుడు బద్ధకంగా కూర్చోలేడని ఒక వేళ అలా జరిగితే ‘కార్తె’చేతికందకుండా పోయి నష్టంలో కూరుకుపోతారని కవి హెచ్చరిస్తారు.
రోజూ వస్తున్నట్టే భ్రమింపజేసి రాకుండా ముఖం చాటేసి వెళ్ళేవర్షంతో కలిగే భరింపలేని కష్టం ఒక్క రైతులకే తెలుస్తుందంటారు.
కంచాన గంజికే….కాకులూ గద్దలూ….. అంటూ కష్టపడి పండించే పంటతో కంచంలో రైతులు గంజినీళ్ళు తాగుతుంటే వాటినీ దక్కనీయని కాకులు, గద్దల్ని కొట్టడానికి వడిసెలను సిద్ధం చేసుకొమ్మంటారు కవి. సరిగ్గా ఇక్కడే కవి పాటలోని అంతర్లీన భావాన్ని పట్టుకోవచ్చు. నోటిదగ్గరకు వచ్చిన తిండినితిననీయని దుర్మార్గులు, అవినీతిపరులు కలిగిన ఈ సమాజంపై తన నిరసనను కవి ప్రకటించారు.
రైతుల కష్టాలు, కడగండ్ల జీవితాన్ని స్వాభావికంగా చిత్రించే క్రమంలో రెక్కలు ముక్కలు చేసుకున్నా ఒరిగిందేముంది? కూడబెట్టిందేముంది అని ప్రశ్నిస్తారు. చట్టా లు ఎన్నొచ్చినా పట్టాలు రాకపోగా పొలందున్నేందుకు కెళ్ళిన ప్రజలు, రైతులకు చివరకు మిగిలేవి పోలీసుదెబ్బలేనన్న సత్యాన్ని చెరబండరాజు ఈ పాటలో చెబుతారు.
విప్లవానికి అనువుగా ఉన్న వాతావరణాన్ని సూచి స్తూ నిప్పారిపోనీకు రామన్నా, పొద్దెక్కిపోనీకు లేవన్నా అని ఉద్బోధిస్తారు. చట్టాలు, ప్రభుత్వాలు సంక్షేమం కోసమే ఉండాలన్న సత్యాన్ని నిర్భయంగా వెల్లడించారు చెరబండరాజు.తొలకరి వాన రాకను సూచిస్తూ దుక్కికి సిద్ధం కమ్మని రైతుకు సూచించే సందర్భంలో చెరబండరాజు సాధారణమైన మాటలనే అసాధారణంగా కూర్చ టం ద్వారా ఒక జీవిత సత్యాన్ని, ఒక జీవన సందర్భాన్ని ఆవిష్కరించారు. స్వాభావిక పల్లె చిత్రణలోనే తన ఆలోచనా సరళిని ఇలా చెబుతారు.
ఉత్తరానురిమింది
రోజు మొగులవుతుంది
ఎర్రమెరుపు సూడు-రామన్నా
కర్రు పారా సాన-బెట్టన్నా
పోరాట స్ఫూర్తి, సందేశం కలిగిన పాట ‘కొలిమంటుకున్నాది’.అంటుకున్న నిప్పు ఆరిపోతే మళ్ళీ అంటుకోవడం కష్టమనీ, ప్రజల్లో చైతన్యం రగులుకుందనీ, రగిల్చిన చైతన్యంతో ముందుకు సాగాలని అంటారు. పోరాడి బతుకు యుద్ధంలో గెలవమనే సందేశమిస్తారు.
పాటను ఆయుధంగా మలచుకుని విప్లవ కార్యాచరణకు పూనుకున్న నిబద్ధత, నిమగ్నత కలిగినకవి చెరబండరాజు. ప్రజాసమస్యలను వారికి అర్థమయ్యే అతి సులువైన భాషలో, పరిచయమైన బాణీలలోనే పాటలను రాసిన అసలు సిసలైన ప్రజాకవి చెరబండరాజు. విప్లవ సాంస్కృతికోద్యమాన్ని విప్లవోద్యమానికి చేదోడుగా నడుపుతూ విప్లవ రాజకీయాలను సునిశితంగా పరిశీలించిన నిమగ్న కవి చెరబండరాజు. స్వభావిక పల్లె చిత్రణలు, ప్రజా సమస్యల వాస్తవిక చిత్రాలుగా ఆయన రాసిన పాటలు గుర్తింపు పొందాయి. ప్రతిభ ఉన్న కవి భాషను యధా తథంగా వాడుకోకుండా తాను చెప్పదలుచుకున్న భావానికి అనుగుణంగా భాషను మలుచుకోవడాన్ని సాహిత్య విమర్శకులు ‘డిక్షన్’గా చెబుతారు. చెరబండరాజు కూడా రచన చేసి వాస్తవ ప్రజాజీవిత ఆవిష్కరణ చేశారనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే పాట కొలిమంటుకున్నాది. ఒక విప్లవ సందర్భం ఎత్తుగడ నుండి ముగింపు వరకు భావైక్యతతో కొనసాగుతూ విప్లవాచరణ పరిణామాన్ని సూచించిన ప్రజలపాట ఇది.