Home కలం తెలంగాణ తొలి సమాజకవి.. సిద్దప్ప వరకవి రాజయోగి

తెలంగాణ తొలి సమాజకవి.. సిద్దప్ప వరకవి రాజయోగి

Siddappa Varma Rajyogi

వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప- కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప.. అనే మకుటంతో సామాజిక అంశాలు ఇతివృత్తంగా అనేక పద్యాలు రచియించి సమాజాన్ని మేల్కొల్పిన సిద్దప్ప వరకవి రాజయోగి నాటి కరీంనగర్ నేటి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శాలివాహన కుల దంపతులు లక్ష్మి పెదరాజయ్య కుమారుడు. 1903 వ సంవత్సరం జూలై 9వ తేదీన జన్మించిన సిద్దప్ప ఆ కాలంలో 7వ తరగతి వరకు చదివారు. చిన్న తనం నుండే సాహిత్యం పట్ల అభిమానం కల్గిన వీరు సరస్వతీ కటాక్షంతో 40 వరకు గ్రంథాలను రచించారు. తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పండిత పామర జనులు సైతం అలవోకగా పాడుకునే విధంగా రచనలు చేసిన సిద్దప్ప పద్యాల్ని నేటికి ప్రతి భజన మండళ్లలో పాడుతుంటారు.

‘తెలంగాణ తొలి సమాజ కవి’గా, ’తెలంగాణ వేమన’గా వెలుగొంది ‘గోల్కొండ కవి’గా గోల్కొండ కవుల సంచికలో ఒకరిగా వెలుగొందుతున్నారు.తెలుగు సాహిత్య చరిత్రలో శాలివాహన కులం నుండి మొల్ల తర్వాత సిద్దప్ప అంతటి ప్రాచుర్యం పొందారు. సాహిత్యంతో పాటు జ్యోతిషం, వాస్తు, ఆయుర్వేదం, యోగ విద్యల్లో ప్రావీణ్యం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో భక్తులను, అభిమానులను చూరగొన్నారు. సిద్దప్ప జీవితం, సాహిత్యంపై పలు సదస్సులు జరిగాయి. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణ పాఠ్యాంశాల్లో తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో తన పద్యాల్ని కూడా పరిచయం చేశారు. వీరి రచనల్లో సిద్దప్ప వరకవి జ్ఞాన బోధిని నాలుగు భాగాలు విస్తృత ప్రజాధరణ పొందింది. తన రచనల ద్వారా సమాజ మూఢత్వాన్ని ముక్కుసూటిగా ఖండించిన సిద్దప్ప 1984 వ సంవత్సరం మార్చ్ 23న తనువు చాలించారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతియేటా కార్తీక పౌర్ణమి రోజున వేలాది భక్తుల మధ్య గుండారెడ్డిపల్లిలోని ఆశ్రమంలో గల సమాధి విగ్రహం వద్ద గురుపూజోత్సవం నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరవాత సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన గోల్కోండ కవి సిద్దప్ప వరకవిని గుర్తించడం శుభపరిణామం. గత సంవత్సరం జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సిద్దప్ప వరకవి కళాతోరణాన్ని ఏర్పాటు చేసి మంచి గుర్తింపుని ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన తెలుగువాచకం తొమ్మిదో తరగతిలో సిద్దప్ప వరకవి రాసిన పద్యాలను ప్రచురించి తగిన ప్రాధాన్యం ఇచ్చారు. తను రాసిన బాగా ప్రాచుర్యంలోనికి వచ్చిన సిద్దప్ప వరకవి నాలుగు భాగాలలోని రెండు పద్యాలను ప్రచురించారు. కాని గోల్కోండ కవిగా ప్రసిద్దికెక్కిన అతడి చరిత్రతో పాటుగా రాసిన గ్రంథాలను వివరిస్తూ మొత్తం పాఠ్యాంశ రూపంలో ఇస్తే బాగుంటుందని సిద్దప్ప వరకవి కుటుంబ సభ్యులు, శిష్యులు, అభిమానులు కోరుచున్నారు.
– అనంతవరం సిద్దిరామప్ప

Article about Siddappa Varma Rajyogi is poet of Telangana

Telangana Latest News