Home ఎడిటోరియల్ మూకస్వామ్యం మహమ్మారి!

మూకస్వామ్యం మహమ్మారి!

Article about Modi china tour

ఇటీవల కాలంలో దేశంలో పెచ్చరిల్లుతున్న మూకహత్యల పరంపరపట్ల సుప్రీంకోర్టు ధర్మాగ్రహం వ్యక్తం చేయటం స్వాగతించదగింది. గుంపులు చట్టాన్ని తమ చేతులోకి తీసుకుని, తామే చట్టంగా వ్యవహరిస్తూ తోటి మనుషులను కొట్టి చంపటాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన “మూకస్వామ్య బీభత్స చర్యలు” గా గర్హించిన ధర్మాసనం, వీటిని ప్రత్యేక నేరాలుగా పరిగణిస్తూ చట్టం తీసుకురావలసిందిగా పార్లమెంటుకు సిఫారసు చేసింది. ఇప్పుడే కఠినంగా వ్యవహరించకపోతే ఇటువంటి ఘటనలు బ్రహ్మరాక్షసి లాంటి పెనుతుపానుగా దేశమంతటా తలెత్తుతాయని హెచ్చరించింది. నేరానికి మతంలేదని, వాటిని కులం, వర్గం అద్దంలోంచి చూడరాదని చెప్పింది. గోరక్షణ దళాలుగా చెప్పుకునే గుంపులు సాగిస్తున్న హింసను అదుపు చేయాలని కోరుతూ సామాజిక క్రియాశీలుడు తవాసీన్ పూనావాలా, మహాత్మాగాంధి మనుమడు తుషార్ గాంధి దాఖలు చేసిన పిటిషన్‌ల విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అధ్యక్షత వహిస్తున్న త్రిసభ్య బెంచి ఈ వ్యాఖ్యలు చేసింది. తాము లోగడ జారీ చేసిన మార్గదర్శకాలపై తీసుకున్న చర్యలేమిటో నాలుగు వారాల్లోగా తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
‘భావాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా పని చేయటాన్ని, పరస్పర విరుద్ధ దృక్పథాలు సహజీవనం చేయటాన్ని అనుమతించే లౌకికత, బహుళత్వం, బహుళ సంస్కృతితో కూడిన సామాజిక వ్యవస్థను నిర్మించటం రాజ్యం ప్రాథమిక బాధ్యత’ అని చెప్పటం ద్వారా ధర్మాసనం ఆ విలువలకు విఘాతం కలుగుతున్నట్లు చెప్పకనే చెప్పింది. గో రక్షకుల హత్యలు, అఘాయిత్యాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో కొద్ది మాసాల క్రితం పిటిషన్‌లు దాఖలైనప్పటికీ, పిల్లల్ని ఎత్తుకుపోయేవారనే వదంతుల వ్యాప్తితో కొద్ది మాసాలుగా వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న మూక హత్యలు అదనపు అత్యవసరాన్ని జోడించాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా సాగుతున్న మూక హత్యల్లో ప్రధానంగా బలి అవుతున్నది ముస్లింలు, దళితులే. పిల్లల్ని ఎత్తుకపోయేవారంటూ వాట్సప్ గ్రూపు సందేశాల ద్వారా సాగిస్తున్న హత్యలు ఒక రకంగా సంఘటిత హత్య లే. గోరక్షణ పేరుతో అనేక హత్యలు జరగ్గా, తాజా ఉన్మాదంలో 7 రాష్ట్రాల్లో 27 మంది హతులైనారు.ఇటువంటి సందర్భాల్లో అనుమానితుల్ని నిలదీయవచ్చు, పట్టి పోలీసులకు అప్పగిస్తే వారే నిజానిజాలు తేలుస్తారు. అలాకాకుండా పట్టి, కొట్టి చంపటాన్ని మించిన రాక్షసత్వం మరోకటి ఉండదు. హతులందరూ నిరాయుధులే కావటం ప్రత్యేకించి గుర్తు చేసుకోదగింది.
ఈ దురాగతాల వెనుక ఒకవిధమైన ఆధిక్య భావజాలం మూకోన్మాదాన్ని ప్రేరేపిస్తోంది. కొన్నేళ్లుగా పెరుగుతున్న అసహన వాతావరణంలో, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియాపరత్వంలో, కొన్ని ఘటనల్లో అధికారంలో ఉన్నవారి అండలో వీటి మూలాలను ఎవరైనా చూడవచ్చు. మూకహత్య కేసుల్లో కింది కోర్టు విధించిన శిక్షపై హైకోర్టులో స్టే తెచ్చుకుని బెయిలుపై బయటక వచ్చిన వారిని కేంద్రమంత్రి జయంత్ సిన్హా హజారీ బాగ్‌లో పూలదండలు వేసి గ్రూపు ఫోటో దిగటం ఇటీవలనే సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రధాన మీడియా కెక్కింది. అటువంటి ఘటనలను ఏదోక రూపంలో సమర్థించిన వారిలో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, మహేశ్ శర్మ, గిరిరాజ్ సింగ్, నితీన్ గడ్కరి కూడా ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తూ వారి రాజీనామాకు డిమాండ్ చేసింది.
సుప్రీంకోర్టు సూచించిన ప్రత్యేక చట్టం మూకహత్యలను నిరోధించలేకపోవచ్చు. అదే సమయంలో సమాజంలో సహన శీలతను పెంపొందించేందుకు, ప్రజలు చట్టం పరిధిలో వ్యవహరించేందుకు, పోలీసులు తమ పని తాము చేసుకుపోయేందుకు అనుమతించే వాతావరణం సృష్టించటం అవసరం. అధికారంలోని వ్యక్తులు అరాచక మూకలకు అండగా నిలవకపోతే అటువంటి హత్యలు తగ్గుతాయి, పోలీసు నిర్భీతితో చర్యతీసుకోగలుగుతారు. ఘర్ వాపసీ, లవ్ జిహాద్, గో రక్షణ వగైరాల పేర్లతో చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్న వారిపట్ల ప్రభుత్వాల మెతకతనంలో మూకస్వామ్యం మూలాలున్న విషయం విస్మరించరానిది. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని వంటూ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోజాలదు. సామాజిక క్రియాశీలి, 80 ఏళ్ల స్వామి అగ్నివేశ్‌పై పాట్నా హోటల్‌లో బిజెపి యువ మోర్చా, ఎబివిపి గుంపు దాడి చేయటం పెచ్చరిల్లుతున్న అసహనానికి పరాకాష్ట. ఈ ధోరణిని మొగ్గలోనే తుంచకపోతే, సుప్రీంకోర్టు హెచ్చరించినట్లు అది బ్రహ్మరాక్షసి అవుతుంది.