Home లైఫ్ స్టైల్ అదిగో భద్రాద్రి…!

అదిగో భద్రాద్రి…!

ramudu

‘రామ’యన బ్రహ్మమునకు మారుపేరు అన్నాడు త్యాగరాజు. అంటే ఆ రెండక్షరాలలో బ్రహ్మసంకేతం ఉందన్నమాట. ర+ అ+ మ = రామ అవుతుంది. ‘ర’ అంటే అగ్ని. ‘అ’ అనేది సూర్యుడు. ‘మ’ అనగా చంద్రుడు. ‘ర’కారం అగ్ని శక్తి అధిష్టాన దేవత ఈశ్వరుడు. అ అంటే హిరణ్యగర్భ ఆదిత్యుడు వాచ్యుడు అయిన బ్రహ్మ, ‘మ’ అంటే సోమర స విష్ణుతత్తం. ఇట్లా రామ శబ్దం త్రిమూర్తి శక్తాత్మకంగానూ, సూర్యచంద్రాగ్నిమయ తేజంగానూ అవుతుంది.
రాముడు పితృ ఆజ్ఞను పాటించినవాడు. సంస్కారవంతుడు. మహాగుణశోభితుడు. త్యాగమూర్తి అన్నిటికీమించి ఉన్నత మానవుడు. అందుకే రామున్ని స్మరించినా , అతని గుణాల్ని అనుసరించినా ఉత్తమ సంస్కారవంతులై మానవ జీవితం అనుభవిస్తారు. ఆ కథను లోకానికందించిన వాల్మీకి మహా లోకోపకారం చేశారు. రాముడు నడయాడిన ఈ నేల పవిత్రమైంది. అట్లా పవిత్రమై ఆంధ్రులు అయోధ్యాపురిగా భావించే భద్రాచలం నాటి నుంచి నేటికీ ప్రభా భాసితమై ఒప్పారు తున్నది. పవిత్రగోదావరి చెంతన భద్రగిరిపై వెలసిన ఆ సీతారామలక్ష్మణులకు క్రీ.శ. 17వ శతాబ్ది (1674) అప్పటి స్థానిక తహసీల్దారు కంచర్ల గోపన్న సుందర మందిరాన్ని నిర్మించాడు. అనంతర కాలంలో రామభక్తుడగుటచే అతడే భక్తరామదాసు అయినాడు. సీతారామలక్ష్మణులు వనవాసకాలంనాడు ఈ దండ కారణ్య ప్రాంతంలో సంచరించారు. అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న భద్రమహర్షికి శ్రీమహావిష్ణువు, శ్రీరామచంద్రుడి అవతారంగా దర్శనమిచ్చి అతడికి మోక్షప్రాప్తి కలిగిస్తాడు. భద్రుడి కోరిక మేరకు భద్రగిరిపై కొలువుదీరుతాడు. అందుకే రామచంద్రుడు శంఖచక్రాదులు ధరించి, వామాంకముపై సీతతో, ప్రక్కన లక్ష్మణస్వామితో కొలువులందుకొంటున్నాడు. ఆ ప్రత్యక్ష దైవానికి క్షేత్రపాలకులుగా శ్రీయోగానంద జ్వాలాలక్ష్మీ నరసింహస్వామి, అన్నపూర్ణాసమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఇక్కడే నెలకొని ఉన్నారు. ఈ కొండపై గణేశుని, నవగ్రహాల ఆలయాలుకూడా ఉన్నాయి. ప్రతిరోజూ రామదాసు తూము నరసింహ దాసు కీర్తనలతో ఉదయం గం. 4.30లకు ప్రభాతోత్సావం జరుగుతుంది. ఉదయం 7.గం. నుంచి రాత్రి 8.30 గం. ల వరకు స్వామివారికి అభిషేకాలు దర్శనాలు వగైరాలుంటాయి. ప్రతియేటా రెండుసార్లు సంప్రదాయక మహోత్సవాలు ఈ ఆలయంలో జరుగుతాయి. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామ నవమి చైత్ర శుద్ధనవమి పునర్వసు సుముహూర్తమున సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుంది. విశాలంగా వేసిన చలువ పందిళ్ల కింద ఆ రోజు ఉదయం 10గం. నుంచి మధ్యాహ్నం 12.30గం. ల వరకు అంగరంగవైభవంగా కళ్యాణవేడుక జరుగుతుంది. అశేష జనావళి అక్కడ చేరి తరిస్తారు. ఆ వేడుకను దివి నుంచి ముక్కోటి దేవతలు వీక్షిస్తారని భక్తుల నమ్మకం. ఆ పవిత్ర తలంబ్రాలు సీతారాములపై కురిపించే దృశ్యం చూడవలసిందేకాని వర్ణించరానిది. అపారమైన ఆభరణాలు ధరించిన ఆ అర్చామూర్తులు భక్తులను తరించుటకై దివి నుంచి భువికి దిగివచ్చినారేమో అనిపిస్తుంది. సకల వాయిద్యాలతో సంబరాలు జరుగుతాయి. పురోహితులు ఆగమశాస్త్ర ప్రకారం గా క్రతువును జరుపుతుంటారు. వంశపారంపర్యంగా వధువు పక్షాన, వరుని పక్షాన అర్చకులు కార్యక్రమాలు హోమాదులు నిర్వహిస్తారు. మాంగళ్యధారణ, పాణిగ్రహణంవంటి తంతులు జరుగుతాయి. సీతారాముల పట్టాభిషేకం, డోలోత్సవాలవంటివి ఉంటాయి.
ఉగాది (తెలుగు, కర్ణాటక రాష్ట్రాలకు) నూతన సంవత్సరం. అప్పటి నుంచి వరుసగా తొమ్మిదిరోజులు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ప్రతి గ్రామంలో, వీధిలో, కొందరు ఇండ్లల్లో కూడా జరుపుకుంటారు. సీతారాములు తమ ఇంటివారేనని భావనతో అర్చిస్తారు. క్రీ.పూ. 5010 సం.లో పుట్టాడని భావిస్తున్న ఆ శ్రీరాముడు ఇప్పటికీ నిత్యనూతనుడై, ఆ దంపతులు ప్రతి యేటా నవ వధూ వరులవడం చరిత్రలో మరెక్కడా కానరాని విషయమే కదా!
ఈ వేడుకల్లో సంప్రదాయబద్ధంగా కొన్ని నైవేద్యాలను దేవుడికి సమర్పించడం జరుగుతున్నది. వాటి వివరాలను తెలుసుకుందాం.. పానకం: అంటే శ్రీరామ చంద్రమూర్తికి అమితాసక్తిగా భావిస్తారు. ఆ తయారీ ఇట్లా ఉంటుంది. ఉదాహరణల పరిణామంగా చెప్పుకుంటే..రెండు కప్పుల నీరు, అరచెంచా అల్లంపొడి, రెండు మూడు కప్పుల తురిమిన బెల్లం, అరచెంచా దంచిన మిరియాలు, యాలకులు సేకరించి తయారుచేస్తారు. ఈ బెల్లం వల్ల ఖనిజాలు, విటమిన్లు దొరుకుతాయి. అల్లంచేత జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. కడుపుబ్బడం, వాతపిత్త రోగాలు నివారింపబడి పొట్ట శుభ్రపడుతుంది. అల్లం కాలిన గాయాల్ని కూడా ఉపశమింప జేయడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అట్లే అల్లం, మిరియాలు, తేనె లేదా బెల్లం (శర్కర) గొంతుపట్టడం, దగ్గు, జలుబు వంటి వ్యాధుల్ని కూడా నివారిస్తుంటాయి.
వడపప్పు: నానబెట్టిన పచ్చని పెసరపప్పు ఒక కప్పు, పొడిచేసిన రెండు కప్పుల కొబ్బరి తురుము, అవసరమైనంత దంచిన పచ్చిమిర్చి, కొంత నిమ్మరసం, వంటి పదార్థాలతో ఉడకబెట్టకుండా వడపప్పును సిద్ధం చేస్తారు.
చలిమిడి: వేడినీటిలో దంపుడు బియ్యాన్ని రెండు మూడు గంటల వరకు నానబెట్టి, గుడ్డ పరచి ఆరబెడతారు. ఆ బియ్యాన్ని పిండిచేసి చక్కెర లేదా బియ్యం సరిపడా నీటిలో కలుపుతారు. కొబ్బరి తురుము, ఏలకులు అవసరమున్నంత కలిపి ముద్దలుగా చేస్తారు. ఈ వంటకాలు సీతారాములకు ఇష్టమని ప్రసాదాలుగా తయారుచేసి పంచుతారు. వేసవి ఆరంభ దినాలలో ఈ పెసరపప్పు వగైరా వస్తువులన్నీ దేహానికి చ ల్లదనాన్ని ఇస్తాయని గుర్తించవచ్చు.
భద్రాచలంలో జరిగే మరో మహా ఉత్సవం వైకుంఠ ఏకాదశి. ఇది డిసెంబరు నెలాఖరులోనో, జనవరిమొదటి వారంలోనో ధనుర్మాసంలో వస్తుంది. తెలుగులో మార్గశిర మాస శుద్ధ ఏకాదశి అవుతుంది. అప్పుడు పది రోజులుగా , దశావతార మహోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఉత్సవంలో భక్తరామదాసు కీర్తనలు, భజనలు, నిత్యం జరుగుతుంటాయి. కొలిచినవారికి కొండంత అండ మన భద్రాద్రి రామయ్య అంటారు భక్తులు.

ఒక రాముడు ఇద్దరు కృష్ణులు

భద్రాచల రాముడికి ఇద్దరు కృష్ణులతో విడదీయరాని అనుబంధం ఉంది. ఒక కృష్ణుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు దగ్గర్లోని ఇరవెంది గ్రామంలో ఉంటే మరో కృష్ణుడు యాదాద్రి భువనగిరి జిల్లా మక్తామాధవరం (మహదేవపూర్)గ్రామంలో ఉన్నాడు. ఇరవెంది గ్రామంలోని కృష్ణమందిరం నిర్మాణం చూసి ఎంతగానో ఆనందించిన రామదాసు అదే తరహా ఆలయాన్ని రాముడికి కట్టించాడు. ఆ విధంగా రాముడికి కృష్ణుడికి బంధమేర్పడింది. ఇక మక్తామాధవరం కృష్ణమందిరం, భద్రాచలం రామమందిరం ఒకేసారి నిర్మించడానికి పూనుకున్నారు. కారణాంతరాల వల్ల రామమందిరం ప్రారంభించడానికి కొంచెం ఆలస్యమైంది. ఈ ఆలయం మాత్రం అనుకున్న సమయానికే ప్రారంభమైంది. రామాలయాన్ని రామదాసు కడితే ఈ కృష్ణాలయాన్ని ఆయన మేనమామ అక్కన్న కట్టించాడు. ఇలా ఈ రామ, కృష్ణులకు బంధం ఏర్పడింది.

రెండు పెళ్ళిళ్ళ రాముడు

రాముడు ఏక పత్నీవ్రతుడు. ఆయన ఒకేసారి సీతమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఇది మన అందరికీ తెలిసిందే! సీతారాముల వివాహ వార్షికోత్సవాన్ని మనం యేటా రామనవమినాడు చేసుకుంటూ ఉంటాం. మొదట్లో లేకపోయినా తర్వాత రాములవారికి కూడా నిత్యకళ్యాణం ఒక సేవగా వచ్చి చేరింది. రామనవమినాడు భద్రాద్రికి రాలేని వారి సదుపాయం కోసం ఈ నిత్యకళ్యాణం తీసుకువచ్చారు. భద్రాచలంలో రాముడి కళ్యాణం చైత్రశుద్ధనవమినాడు మిట్టమధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో చేస్తారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రామాలయంలో చైత్రశుద్ధ చతుర్దశినాడు రాత్రివేళ వెన్నెలలు కురిసేవేళ వివాహం చేస్తారు. ఇక రంగారెడ్డిజిల్లా హయత్ నగర్ మండలం కవాత్‌పల్లి గ్రామంలో కొలువుదీరిన రాముడు శ్రీరామనవమినాడు పగలు రాత్రి సమయాలలో రెండుసార్లు వివాహం చేసుకుని విచిత్రమైన సంప్రదాయాన్ని నెలకొల్పాడు. సూర్యవంశ తిలకుడైన రాముడి వివాహాన్నిభద్రాచలంలో సూర్యుడు మాత్రమే చూడగలడు. ఒంటిమిట్ట రామచంద్రుని కళ్యాణాన్ని చంద్రుడు మాత్రమే చూడగలడు. సూర్యవంశంలో పుట్టి రామచ్రందునిగా వెలుగొందుతున్న రాముని పెళ్ళిని ఒక్క కవాతుపల్లిలోనే సూర్యచంద్రు లిద్దరూ చూడగలరు.