Home ఎడిటోరియల్ ఎన్‌డిఎలో ఒంటరి అవుతున్న బిజెపి

ఎన్‌డిఎలో ఒంటరి అవుతున్న బిజెపి

BJP First Victory in Karnataka Assembly Elections 2018

పడవ మునిగేటట్లుంటే ఎలుకలన్నీ పారిపోతాయనే సామెత నిజమవుతోంది. 2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాదిమాత్రమే మిగిలి ఉంది. మరోవైపు జమిలి ఎన్నికల చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కకపోవడంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ పాటికే ఎన్డీయే మిత్రపక్షాలు ఒక అంచనాకు వచ్చినట్లున్నాయి. అందుకే ఎన్డీయే నుంచి పలు పార్టీలు వైదొలుగుతున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీ గా అవతరించినప్పటికీ బిజెపికి అధికారం అంద ని ద్రాక్షగానే మిగిలిపోయింది. కర్నాటక ప్ర యోగం దేశంలోని మిగతారాష్ట్రాలకూ విస్తరిస్తే దానికి గడ్డుపరిస్థితే. దీం తో కమలనాధులు సొంత అజెండాకు పదునుపెట్టే పనిలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌లో అదే చేశారు. అక్కడ పిడిపితో తెగదెంపులు చేసుకుని రాష్ట్రపతిపాలనను విధింపచేశారు. ఇది తన గేమ్ ప్లాన్ లో భాగమేనని రాజకీయ పండితుల విశ్లేషణ.
ఎన్డీయేతో కలిసున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి పనిచేసేదే లేదని శివసేన తెగేసిచెప్పింది. ఒకవేళ నిజంగానే బిజెపితో దోస్తీ చెడితే మాత్రం మహారాష్ట్రలో బిజెపి, శివసేనకు నష్టమే. అక్కడ కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి లబ్దిపొందుతాయి. అస్సామ్ లోనూ అక్కడి మిత్రపక్షమైన అస్సామ్ గణ పరిషత్ వైదొలిగితే బిజెపి కమలం వాడిపోవడం ఖాయం. త్రిపురలో ఇండిజనస్ పీపుల్స్ ఫ్రంట్ కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోరాడుతామని ప్రకటించింది. గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ భాగస్వామ్యంతో కమలం పార్టీ విజయదుందుభి మోగించింది. రెండున్నర దశాబ్దాల కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టింది.
కానీ లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై విభేదాలు రావడంతో ఒంటరిగా బరిలోకి దిగనుంది. బిజెపి కూడా త్రిపురలో తన మిత్రపక్షానికి సరైన ప్రాధాన్యతనివ్వడం లేదు. లోక్‌సభ సీట్ల విషయంలో తమను సంప్రదించకుండా తమ అభ్యర్థులకు కేటాయించడం అన్యాయమని ఐపిఎఫ్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లోనూ లోక్ సభ సీట్ల పంపకాల పరిస్థితి ఎటూతెగడం లేదు. అక్కడి భాగస్వామ్య పక్షాన్ని పట్టించుకోవడంలేదు. బీహార్ లో అక్కడి భాగస్వామ్యపార్టీ జనతాదల్ (యు) తో లోక్ సభ స్థానాల పంపకం విషయంలో విభేదాలు పొడసూపుతున్నాయి. ఇలాగే కొనసాగితే నితీష్ కుమార్ ఎన్డీయే నావనుంచి దిగిపోవడం ఖాయమవుతుంది.బిజెపితో కలిసి నాలుగేళ్ల సంసారంలో తమ, రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దగా ఒరిగిందేమీలేదని పలు ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే అంచనాకు వచ్చినట్లున్నాయి. అంతేకాదు ఎన్డీయేతో చేతులు కలిపిన పార్టీలకు నష్టమే చేకూరింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా తీరని అన్యా యం చేసిందని తెదెపా ఎన్డీయే నుంచి వైదొలగింది. హోదా తేకుండా నాలుగేళ్లు భాజపాతో చెలిమి చేయడం వల్ల్ల తెదెపా ప్రజల్లోనూ విశ్వాసం కోల్పోతున్నదన్న విషయాన్ని ముందుగానే పసిగట్టి హోదాకోసం పోరాడుతోంది. కేంద్రంపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు.
మహారాష్ట్రలో శివసేన, పంజాబ్ లో అకాళీదల్ బాదల్, యుపిలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీలన్నీ ముందుగానే పసిగట్టి ఎన్డీయేతో కలిసి ముందుకు వెళ్లేది లేదని తెగేసి చెప్పాయి. తృణమూల్ కాంగ్రెస్, బిజూజనతాదల్ ఎన్డీయేలో చేరకపోవడం వల్ల లాభపడ్డాయి.రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలుండవు. తాత్కాలిక ప్రయోజనాల కోసమే ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేకు మద్దతు తెలిపి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. కానీ దీనికి భిన్నంగా తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ లు బిజెపితో చేతులు కలపకుండా ఉండటం వల్ల బలంగా ఉన్నాయి. బిజెపి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేనుంచి వైదొలు గుతున్నాయి.

 ముహమ్మద్ ముజాహిద్