Home ఆఫ్ బీట్ మహానగరానికి మహంకాళి అమ్మ తోడు

మహానగరానికి మహంకాళి అమ్మ తోడు

bonalu

తెలంగాణలో వైభవంగా జరుపుకునే వేడుకల్లో ముఖ్యమైనది బోనాలు పండుగ. అనాదిగా వస్తోన్న సంప్రదాయ పండుగ ఇది. ప్రకృతితో పంటపోలాలతో ముడి పడి ఉన్న పండుగ. తమను తమ పిల్లలను…పంటలను, పశువులను, చెరువులను కాపాడుకునేందుకు మహిళలు ఈ పండుగను ప్రతియేటా ఘనంగా చేసుకుంటారు. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండుగా బోనాలు. ఆషాఢం వచ్చిందంటే చాలు తెలంగాణ అంతటా ఒకటే సందడి. ముఖ్యంగా ఈ రోజుల్లో భాగ్యనగరం బోనమెత్తుతోంది. శివశక్తుల చిందులు, పోతురాజుల వీరంగం…అమ్మవారు చెప్పే భవిష్యవాణి(రంగం) దాదాపు నెల రోజుల పాటు సాగే అపురూప సంబురాలు నేటితో షురూ కానున్నాయి. అవి ఉట్టి జాతరలే కాదు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దాలు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దాలుగా బావించే బోనాలకు, జాతర ఉత్సవాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. బోనాల పండుగకు హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాన్ని నగరంలో ఘనంగా జరుపుకుంటారు. గ్రామదేవతల ఆలయాలు బోనాల కళను సంతరించుకుంటాయి. బోనం అంటే భోజనం. సకల జీవులకూ అన్న ప్రదాత అయిన ఆ అమ్మవారికి కృతజ్ఞతతో తమను చల్లగా చూడాలని భావించి బోనం సమర్పణ చేస్తారు మహిళలు. తల స్నానం చేసి నూతన వస్త్రాలతో ఒక కుండను పసుపును పూసి దానికి వేపాకు కొమ్మలతో అలంకరించి మొక్కులు చెల్లిస్తారు.
భవిష్యత్‌ను చూపే భవిష్యవాణి…
బోనాల చివరి రోజున రంగం అంటే భవిష్యవాణి కార్యక్రమం ఉంటోంది. ఈ వేడుకను భక్తులు అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. భవిష్యత్తు గూర్చి చెప్పడం ఇందులో విశేషం. అమ్మ పలికే పలుకులు నిజమవుతాయని భక్తుల నమ్మకం. బోనాల పండుగ ప్రతి ఆదివారం జరుగుతుంది. బోనాలు ముగిసిన మరుసటి రోజు (సోమవారం) ఉదయం రంగం వేడుక జరుగుతుంది. అమ్మవారి ముఖ మండపంలోని ఆలయం వ్దద అమ్మవారికి ఎదురుగా ఒక అవివాహిత స్త్రీ పచ్చి కుండపై నిలబడుతుంది. ఈమె అమ్మవారి వంకే చూస్తూ…అమ్మవారి కళను తనపై ఆవహింప చేసుకొని భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విషయాలను తన నోటి ద్వారా వెల్లడిస్తుంది. ఈమె నోటి నుండి వెలువడే భవిష్యవాణిని భక్తులు వినడానికి వీలుగా ప్రత్యేక మైకులను దేవాలయం చుట్టూ ఏర్పాటు చేస్తారు. ఈ వేడుకకు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం వేదిక కానుంది. రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ(మాతంగి) ఒక కత్తికి మాంగల్యధారణ చేసి జీవితాంతం అవివాహితగా ఉండిపోతుంది. బోనాల జాతర జరిగే ప్రతి ఆలయానికి ఒక మాతంగి ఉండవచ్చు. లేదా ఒకే మాతంగి కొన్ని ఆలయాల బోనాల ఉత్సవ వేడుకలలో పాల్గొని రంగం చెప్పవచ్చు.
ఉజ్జయినీలో ఉద్వేగ భరితం…
ఆషాఢమాసం అమావాస్య తరువాత వచ్చే ఆదివారం ఉజ్జయినీ మహంకాళి వేడుకలు ఆరంభమవుతాయి. గర్భాలయంలోని అమ్మ వారి ఆభరణాలు, ముఖాకృతిని అందంగా అలంకరించిన ఘటంతో తీసుకొని రాణిగంజ్‌లోని కర్భలా మైదానానికి ఎదుర్కోలుకు వెళతారు. 15న వేడుక మొదలవుతోంది. ఆ తరువాత సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఘటంతో ఎదుర్కోలు వేడుకలు నిర్వహిస్తారు. తన ఉత్సవాలకు రావలసిందిగా తన తోటి పద్దెనిమిది మంది అక్కచెల్లెళ్లను అమ్మవారు ఆహ్వానించడంతో ఘటోత్సవం మొదలవుతోంది. ఆ తరువాత ఈ నెల 29న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో బోనాలు, 30న రంగం నిర్వహిస్తారు. అత్యంత ఉద్వేగ, ఆధ్యాత్మిక వేదికను అలంకరిస్తారు. పచ్చికుండను కొద్దిగా భూమిలోకి పాతి దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేసి పసుపు, కుంకుమతో అలంకరించిన తరువాత మాతంగి వచ్చి భవిష్యవాణిని దాదాపు 15 నిమిషాల పాటు వినిపిస్తుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా కోట్లాది మంది భక్తులు అమ్మ చెప్పే పలుకులను విని తరిస్తారు.
ఏర్పుల జోగమ్మతో మొదలు…
రంగం చెప్పే భాగ్యం తమకు కలిగిందని ఏర్పుల వంశం వారు చెప్పుకుంటారు. మొట్టమొదట ఏర్పుల జోగమ్మతో ఇది మొలైంది. ఆ తరువాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోశమ్మ, ఏర్పుల బాగమ్మ ఇందులో భాగస్వాములై వస్తున్నారు. 1997 నుంచి ఇప్పటి వరకు స్వర్ణలత ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 1996 వరకు ఏర్పుల మాతంగి స్వరూపారాణి రంగం చెప్పేది.

తరతరాలుగా ఒకే కుటుంబం…
కీలక ఘట్టంగా చెప్పుకునే రంగం కార్యక్రమానికి పచ్చి కుండను తరతరాలుగా ఒకే కుటుంబం అందజేస్తున్నది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మారేడు పల్లి ఓ ప్రత్యేకత చాటుకుంటుంది. ఘటం అలంకరణ నుంచి ఉత్సవాల ముగింపు, అమ్మవారిని సాగనంపే వరకు మారేడుపల్లికి చెందిన కుమ్మరి రత్నయ్య కుటుంబ సభ్యులు వంశపార్యపరంగా అమ్మవారికి సేవలు అందిస్తూ వస్తున్నారు. అమ్మవారికి మొదటి సేవ కుమ్మరి కులస్తులు చేయాల్సి ఉంటుంది. గత 160 ఏళ్ల క్రితం ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి మహంకాళి దేవాలయంలో ప్రతిష్టించినప్పుడు కుమ్మరి కులస్తులు పూజ నిర్వహించాల్సి ఉండగా ఆ కులానికి పెద్దమనిషిగా ఉన్న సికింద్రాబాద్‌కు చెందిన కుమ్మరి రత్నయ్యకు అవకాశం లభించింది. తరతరాలుగా ఇదే అనవాయితీని రత్న య్య కుటుంబ సభ్యులే నిర్వహిస్తూ వస్తున్నారు. పచ్చికుండకు ప్రత్యేక పూజలు చేసి ఈ నెల 30న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో రంగం కార్యాక్రమానికి తీసుకొస్తారు. ఆ కుండపై నిలబడి భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత చెప్తుంది. అమ్మవారి సేవల్లో దాదాపు 27 కులాలవారు పాల్గొంటూ వస్తున్న ఆనవాయితీగా చెప్పుకుంటారు.
ప్రారంభం ఇక్కడే…ముగింపు ఇక్కడే…
బోనాలు మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారి దేవాలయంలో మొదలవుతాయి. దీంతోపాటు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయం, మీర్ ఆలంమండి మహంకాళి దేవాలయం, హరిబౌలి -అక్కన్న మాదన్న దేవాలయం, శాలిబండలలో బోనాలు ఉత్సవాలు ప్రారంభమై ఆతరువాత సికింద్రాబాద్- ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. ఎంతో భారీగా జరిగే బోనాల ఉత్సవాలకు జంట నగరవాసులే కాకుండా తెలంగాణతో పాటూ ఇతర రాష్ట్రాల ప్రజలు లక్షలాది మంది ఉత్సవాల్లో పాల్గొంటారు. గోల్కొండకోటలో జూలై 15న, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జూలై 29, రంగం వేడుక 30న, ఓల్డ్‌సిటీలో ఆగస్టు 5, 6తేదీల్లో ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో ఆగస్టు12న జరిగే ఆఖరి పూజతో ఉత్సవాలు ముగుస్తాయి.
గోల్కొండ నుంచే ఉత్సవాలు ప్రారంభమై చివరి పూజతో ఇక్కడే ముగుస్తాయి. చివరి పూజ అంటే ఆషాఢమాసంలో తొమ్మిది పూజల ఉత్సవాలకు సంబంధించిన తొమ్మిదవ పూజ నిర్వహించటంతో ఉత్సవాలు ముగిసినట్టు. జగదాంబ మహంకాళి దేవాలయాన్ని గోల్కొండ కోటపై కాకతీయ రాజులు నిర్మించారు. క్రీ.శ.1143లో ఒక గొల్ల అతను ఈ కొండపై కోటను నిర్మించాలని సలహా ఇచ్చినాడు. అతని సలహా ప్రకారం అక్కడ మట్టి కోట కట్టి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి మొదట పూజలు చేయాలని ఆ కాలంలోనే నిర్ణియించినారు. కాకతీయుల తరువాత కుతుబ్‌షాహీ వంశరాజుల ఆధీనంలోకి వెళ్లింది. క్రీ.శ.1518 నుంచి 1687 వరకు ఏడుగురు పరిపాలించారు. అబ్దుల్ హసన్ తానీషా పరిపాలనలో హిందువుల మంత్రులు అక్కన్న మాదన్న కాలంలో జగదాంబ మహంకాళీ దేవాలయాలు దృఢంగా కట్టబడ్డాయి.
పోతురాజుల వీరంగం…

lf
బోనాల పండుగ రోజున జంట నగరాలలోని ప్రతి బస్తీ నుండి పోతురాజులు అమ్మ ఆలయానికి వీరంగం చేస్తూ తరలి వెళ్తారు. శరీరమంతా పసుపు పూసుకొని లంగోటి(వస్త్రము) కాటుక, కుంకుమ దిద్దుకొని నోటిలో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకొని నడుం చుట్టూ వేపమండలు కట్టుకొని, పసుపు తాడుతో చేయబడిన కొరడను ఝుళిపించుకుంటూ తప్పెట్లు వాయిధ్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ పోతురాజు వస్తాడు. ఈ ఆనందోత్సహాల మధ్య కదలివెళ్లడం బోనాల పండుగలో ఓ ప్రత్యేక ఆకర్షణ. అమ్మవారికి సోదరుడైన పోతురాజు గ్రామాన్ని సంరక్షిస్తూ తమకు అండగా ఉంటాడని ప్రజల నమ్మకం. బోనాల పండుగ రోజున వేలాది మంది పోతురాజులు భక్తిపారవశ్యముతో జాతరలో పాల్గొని లక్షలాది మంది భక్తులను తమ అభినయాలతో, నృత్యాలతో రంజింపచేయడం ఒక అపూర్వ సన్నివేశం. పోతురాజులతో కలసి నృత్యాలు చేస్తూ, చిందులు వేస్తూ తెలంగాణ యాసలో పాటలు పాడుకుంటూ, తన్మయత్వంతో కదలివెళ్లే ప్రజలు ఆనందం ఆస్వాదించాలేగాని వర్ణించడం కష్టం. ప్రతి గురువారం, ఆదివారం జరిగే ఉత్సవాల సమయాలలో ఇంటి ద్వారాలకు, వీధులకు వేప మండలతో అలంకరణ చేస్తారు.
ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు…
బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ తమ ఇండ్లలో తయారు చేసుకొని బండిలో పెట్టుకొని వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి మిగిలినది ఇంటికి తీసుకొని వెళ్లి కుటుంబ సభ్యులందరూ మహాప్రసాదంగా పంచుకొని స్వీకరిస్తారు. ఈ విధంగా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు తెచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ప్రసాదాలు తెచ్చే ఈ బండ్లను ‘ఫలహారపు బండ్లు’ అని పిలవడం ఆనవాయితీ.
గావుపట్టడం…
రంగం కార్యక్రమం ముగిసిన తరువాత ఆలయానికి వంశపారంపర్యంగా వస్తున్న పోతురాజులు ఉదయం 9 గంటల ప్రాంతంలో విలయతాండవం చేస్తూ ఉద్వేగంతో ఊగిపోతూ ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలు ప్రదర్శిస్తారు. మేళతాళాల మధ్య లయబద్ధంగా నాట్యం చేస్తున్నపుడు అమ్మవారు వారిపై ఆవహిస్తుంది. ఆ సందర్భంలో సోరకాయ, గుమ్మడి కాయలను బలిస్తారు. ఈ కాయలను పోతురాజు నోటితో కొరకటమే గావు పట్టడం. అంతకు పూర్వం జంతు బలులు ఉండేవి. ఇప్పుడు వాటిని నిషేధించారు. ఈ కార్యక్రమాన్ని వేలాదిమంది భక్తులు చూసి తరిస్తారు.
సాగనంపు…
గావు పట్టడం పూర్తి అయ్యాక ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి మంగళవాయిద్యలతో పురవీధులగుండా ఊరేగించుకుంటూ తీసుకొని వెళ్లి సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు. ఈ ఉత్సవాల ఆరంభం, పరిణామ క్రమం, ముగింపు పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అవగాహన అవుతుంది. జగన్మాతకు ప్రతినిధి అయిన గ్రామదేవత ఎక్కడ నుండి వచ్చిందో మరలా అక్కడికే జాతర వేడుక అనంతరం పంపబడుతుంది. అంటే “సృష్టి”… అమ్మవారు పుట్టుకలోను, “స్థితి”…అమ్మవారి జాతర వేడుకలలోను, సృష్టి యొక్క “లయం” అమ్మవారిని సాగనంపడంలో మనం గమనించవచ్చు. ఇది ఒక అపూర్వమైన, సమగ్రమైన సామూహికమైన జగన్మాత ఆరాధనగా పూర్వీకులు ఏర్పరిచారు.
సాక సమర్పణ…
సాక అంటే శాఖ అని అర్ధం. శాఖ అంటే చెట్టుకొమ్మ, వేప చెట్టు నుండి కోసిన వేప మండలను పసుపు నీటి సాకలో ఉంచి అమ్మవారికి సమర్పించడాన్ని సాకివ్వడం లేక శాఖా సమర్పణంగా పిలుస్తారు. వేపాకు ఉంచిన పసుపు నీరు చల్లగా ఉన్నట్లే.. సాక సమర్పిస్తే ఆ తల్లి తమను కూడా చల్లగా చూస్తుందనే నమ్మకంతో భక్తులు సాకను సమర్పిస్తారు.
బంగారు బోనం సమర్పణ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను ఘనంగా చేపడుతోంది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి రూ.15 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 29న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి 3.80 కిలోల బంగారు బోనాన్ని సీఎం సమర్పిస్తున్నారు. దీని కోసం అమ్మవారికి భక్తులు చెల్లించిన ఉమ్మడి బంగారు ఆభరణాలను కరిగించి ప్రత్యేక బోనం పాత్ర, కలశాలను తయారు చేసి సమర్పిస్తారు. అలాగే 250 కిలోల వెండితో అమ్మవారి గర్భగుడి ముఖద్వారానికి వెండి తాపడంతో అలంకరించనున్నారు.
రమేష్ మోతె/హైదరాబాద్/ సిటీబ్యూరో