Home ఆఫ్ బీట్ అద్భుతాల ఏజెన్సీ… చార్టర్డ్ అకౌంటెన్సీ

అద్భుతాల ఏజెన్సీ… చార్టర్డ్ అకౌంటెన్సీ

LF

దేశంలో ఎన్నో ఉద్యోగాలున్నాయి. కానీ ఒక సిఎకో, ఐసిడబ్లూయేకో ఉండే డిమాండ్, క్రేజ్ మరో ఉద్యోగానికి లేవంటే అతిశయోక్తికాదు. నిజానికి సిఎ ఉద్యోగం కాదు. ప్రొఫెషన్. ఫ్రీలాన్స్‌గా చేసుకుని పెద్దగా సొమ్ము చేసుకోడానికి అవకాశం ఉన్న చదువు. సమాజంలో పెద్ద గుర్తింపు, గౌరవం అపారంగా ఉన్న పొజిషన్. సిఎ చేశాడంటే పెద్ద చదువులున్న మేధావులే భేష్ అంటారు. సిఎ పాసయ్యాడంటే గొప్ప లక్ష్యాన్ని సాధించిన వాళ్ళను చూసినట్టు చూస్తారు. మంచి ప్రతిభ ఉన్నదంటూ కీర్తిస్తారు. అంతవరకు ఆషామాషీగా చూసిన వాళ్ళు కూడా సిఎ చేశారంటే ఒక పద్ధతిగా బిహేవ్ చేస్తారు. వీళ్ళ అవసరం చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్ళ నుంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌ల వరకు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలని ఉరకలేసే వారికి కూడా వీరి అవసరం ఉంటుంది. వర్తక, వ్యాపార, వాణిజ్యాలు పెరిగిపోయాక వీరి అవసరాలు మరీ పెరిగిపోయాయి. ఈ చదువు చదువుకున్న వారెందరున్నా అక్కున చేర్చుకోడాకి సమాజం సిద్ధంగా ఉంది. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండే పరిస్థితి వీరికి లేదు. అంత బిజీగా ఉంటారు.
ఈ చదువూ వ్యాపార లావాదేవీలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు చూసేదే అయినా వీరు అధ్యయనం చేసే తీరు వేరు. అందుకే వీరు ట్రెడిషనల్ అకౌంటెట్లకన్నా, బిజినెస్ ట్రయినింగ్ పొందినవారి కన్నా భిన్నంగా ఉంటారు. సిఎ చదివిన వారికి ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచమంతా మార్కెట్టే! అన్ని చోట్లా వీరికి ఎర్ర తివాచీ పరిచి స్వాగతం చెప్పే పరిస్థితే ఉంది. నాలెడ్జీ, నైపుణ్యం కలగలిపిన వృత్తి ఇది. బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు హైఫై సమాజంలో ఎంత గౌరవం ఉందో సిఎకు కూడా అంతే గౌరవాదరణలున్నాయి. ఉన్నత వర్గాలే వీరికి దాసోహమంటాయి.
ఈనాడు మనం చూస్తున్న సిఎలను తయారుచేసే ప్రొఫెషనల్ ఎకౌంటింగ్ బాడీ మొదటిసారి స్కాట్లాండ్ లో 1854లో ఏర్పాటైంది. ఎడిన్‌బరో సొసైటీ ఆఫ్ అకౌంటెంట్స్, గ్లాస్‌గో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అకౌంటెంట్స్ అండ్ యాక్టురీస్ ఇవన్నీ కూడా 1854లోనే ఏర్పడ్డాయి. అబెర్డీన్ సొసైటీ ఆఫ్ ఎకౌంటెంట్స్ అనే సంస్థ మాత్రం 1867లో ఏర్పడింది. వీటన్నిటికీ రాయల్ చార్టర్ ఉంది. అమెరికా ఇచ్చే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ డిజిగ్నేషన్ దాదాపుగా దీంతో సమానమైంది అని చెప్పవచ్చు. అమెరికా మినహా ప్రపంచంలో ఎక్కడ సిఎ ఉన్నా వారు ఈ ఇనిస్టిట్యూట్ ఆమోదముద్రతో బైటికి వచ్చినవారే! ఒక్క యుకెలోనే 21వేలమంది సిఎలు ఈ సంస్థ ఇచ్చిన పట్టాతో పనిచేస్తున్నారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక్కడి పట్టా పుచ్చుకున్న వారు వందకు పైగా దేశాలలో సర్వీసు చేస్తున్నారు. ఒక్కసారి సిఎ అయిన వారిని ఈ సంస్థ తన గ్లోబల్ నెట్‌వర్క్‌లో పెట్టేస్తుంది. ఆ నెట్‌వర్క్‌లో చేరారంటే ఎక్కడెక్కడి సిఎలతో సంబంధ బాంధవ్యాలు వాటంతట అవే వస్తాయి. కనుక సిఎ చదివిన వారి పబ్లిక్ రిలేషన్స్ సహజంగానే విస్తరిస్తాయి.
సిఎ అనే పేరు కామన్‌గానే ఉన్నా వీరిలోనూ రకరకాల సేవలందించేందుకు విభాగాల వారీగా ఉన్నా రు. కమర్షియల్ టాక్సేషన్, ఇండివిడ్యువల్ టాక్సేషన్, ఆడిట్ అండ్ అష్యూరెన్స్, ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అడ్వయిజరీ, రిజిస్ట్రేషన్ అండ్ కన్సల్టెన్సీ, సిగ్నేచర్ సర్టిఫికెట్ ప్రొవైడర్స్, స్టాట్యూటరీ ఆడిటింగ్, అవుట్‌సోర్డ్ అకౌంటింగ్ సర్వీసెస్, బ్యాంక్ ఆడిటింగ్, మేనేజ్‌మెంట్ ఆడిటింగ్, ఫైనాన్షియల్ స్టేట్‌మెట్ ఆడిటింగ్, కాస్ట్ ఆడిటింగ్ ఇలా అనేక రకాలుగా వీరు సేవలందిస్తుంటారు. ఇవన్నీ ఫుల్ డిమాండ్ ఉన్న సేవలే! సిఎ చేసిన వారికి రిటైర్మెంట్ అనేదే ఉండదు. సీనియార్టీ పెరిగేకొద్దీ డిమాండ్ అంతకంతకు పెరుగుతుం ది.
మన దేశంలో సిఎ కోర్సుల నిర్వహణకు సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) చూస్తుంది. ఈ సంస్థ ను 1949 చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ కింద ఏర్పాటుచేశారు. ఈ సంస్థలో చదువుకున్న వారు సిఎ అని పేరు చివరన తగలించుకోడానికి అర్హులు. ఫుల్‌టైమ్ ప్రాక్టీస్ చేసేవారు, అయిదేళ్ళుగా సిఎగా ప్రాక్టీస్‌చేసే వారు ఎఫ్‌సిఎ అని పేరు చివరన తగిలించుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం 2,70,000మంది రిజిస్టర్ సభ్యులున్నారు.
త్వరగా ఈ కోర్సులోకి రావాలనుకునే వారు ఎంట్రీ లెవెల్ కోర్సుగా సిఎ ఫౌండేషన్ చేయాలి. ఈ కోర్స్‌లో చేరగోరే వారికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియెట్ చదవినవారు, డిగ్రీ చేసినవారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. ఇది పూర్తయితే మూడేళ్ళపాటు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి ఆ తర్వాత సిఎ ఇంటర్ మీడియెట్ రాయడానికి రావాలి. అది పూర్తయితే ఫైనల్ రాయడానికి అర్హులవుతారు. సిఎ ప్రాథమిక కోర్సు పూర్తి చేసినవారికి ఐటిలో 100గంటల ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. సాఫ్ట్‌స్కిల్స్‌లో ఓరియెంటేషన్ కూడా పొంది ఉండాలి.
ఇది ఓపెన్ కోర్సు. ఫలానా డిగ్రీవాళ్ళే రావాలని లేదు. మీకు అందుబాటు లో ఉండే ఐసిఎఎస్ గుర్తింపు పొందిన అధికారిని సంప్రదిస్తే ఈ కోర్సులో ఎలా చేరాలో, మంచి ట్రైనింగ్ ఎక్కడ దొరుకుతుందో చెబుతారు. అలాంటి సదుపాయంలేని ఊళ్ళో ఉన్న వారు icas.com సైట్‌లోకి వెళ్ళే అన్ని వివరాలూ లభిస్తాయి. హైదరాబాద్‌లో దాదాపు100 చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థలున్నాయి. వీటిలో ఫుల్‌టైమ్ జాబ్‌లు, ఇంటర్న్‌షిప్‌లు కూడా ఉంటాయి. సిఎ చేసి బాగా ఎదిగిన సంజీవ్ మెహ్తా (హెచ్‌యుఎల్‌సిఇఒ) యేడాదికి 14.7కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు. హెచ్‌డిఎఫ్‌సి సిఇవొ ఆదిత్యపూరీ 10కోట్లు సంపాదిస్తున్నాడు. అదానీ గ్రూప్ సిఎఫ్‌వొ అమీత్ దేశాయి 8.4కోట్లు ఆర్జిస్తున్నాడు. రాణించగల సత్తా ఉంటే ఆర్థిక ప్రోత్సాహానికి ఈ లైన్‌లో కొదవలేదని వీరు నిరూపిస్తున్నారు. ట్రై చేయండి.. బంగారంలాంటి భవిష్యత్తు సొంతం చేసుకోండి.