Home తాజా వార్తలు భగ్గుమన్న మహిళా సంఘాలు

భగ్గుమన్న మహిళా సంఘాలు

cini

 చలనచిత్ర రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీపై నిరసన గళం

మన తెలంగాణ / హైదరాబాద్ : “అవకాశాల కోసం ఫోన్లు చేస్తే మమ్మల్ని బూతులు తిడతారు. న్యూడ్ ఫోటోలు అడుగుతారు. లైంగికంగా లొంగితేనే ఛాన్సులిస్తామంటారు. ఆఫర్ల ఆశపెట్టి మమ్మల్ని లైంగికంగా హింసిస్తున్నారు. కమిట్‌మెంట్ లేనిదే ఆఫర్లు ఇవ్వరు. చాటింగ్ పేరుతో వేధిస్తుంటారు. వీటన్నింటికీ సాక్షం కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ఎలాంటి మెడికల్ టెసులకైనా మేం సిద్ధం. అమ్మాయిలపైనే కాదు, ట్రాన్స్‌జెండర్లపైనా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి తెరవెనుక జరిగే దురాగతాలకు చెక్ పెట్టాల్సిందే. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి”& ఇదీ జూనియర్ ఆర్టిస్టు డిమాండ్. ‘తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ పేరుతో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మహిళా సంఘాల జేఏసీ, పలు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన బహిరంగ చర్చలో సినీ నటీమణులతోపాటు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాన్ని, లైంగికదోపిడీని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా నటీమణులు తమ గోడు వెళ్లబోసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ అంతమయ్యేవరకూ పోరాటాన్ని ఆపబోమని ప్రతిజ్ఞ చేశారు. హక్కులను సాధించుకునే క్రమంలో అందరం కలిసికట్టుగా పోరాడాలని తీర్మానించారు. హక్కుల కార్యకర్తలు సంధ్య, దేవి, విమల ఇతర ప్రముఖులతోపాటు సినీనటి శ్రీరెడ్డి, వర్ధమాన నటీమణులు, పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు ఈ చర్చలో పాల్గొన్నారు. వర్ధమాన సినీ నటి అపూర్వ మాట్లాడుతూ, సినిమా అనేది వైట్‌కాలర్ జాబ్‌గానీ బూతు కాదు. ఎంతకాలం ఈ అన్యాయాల్ని సహించాలి? ఎదిరించకపోతే బలయ్యేది మహిళలే అని అన్నారు. ఉద్యోగస్తులకు, వర్కింగ్ ఉమెన్‌కు ఉన్నట్లే పని ప్రదేశంలో తమకూ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పీవోడబ్యూ నాయకురాలు సంధ్య మాట్లాడుతూ, జస్టిస్ వర్మ కమిటీ తరహాలో సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్ని విషయాలపై సమగ్ర పరిశీలన, అధ్యయనం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాంటి కమిటీ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేక ‘సెల్’తో పాటు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ సౌకర్యం కూడా ఉండాలని అన్నారు. మహిళా ఉద్యమ పత్రిక ‘భూమిక’ ఎడిటర్ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ, అన్యాయానికి గురవుతున్న ఆర్టిస్టులకు చివరివరకూ మద్దతుగా నిలుస్తామని, సమస్యకు పరిష్కారం లభించేంతవరకూ పోరాడతామన్నారు. ‘తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డల హృదయ ఘోష ఎవరికీ వినిపించదా’ అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ రమా మేల్కొటే మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లైంగిక దాడి అనేది హాబీ అయిపోయిందని, చాలా సంఘటనలు వెలుగులోకి రాకుండా ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ, సినీ పరిశ్రమలోని దురాగతాలను బయటకు తెచ్చారు ఈ ఆర్టిస్టులందరూ తెరవెనుక జరిగే వాటికే కాదు, తెర మీద స్త్రీలను అసభ్యంగా చూపించే విధానానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలన్నారు. ఇకముందు ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఇలాంటి సమిష్టి ఉద్యమాలు ఉపయోగపడతాయన్నారు. మహిళలకు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని అన్నారు. సినీ పరిశ్రమలోని ‘ఉత్తమ పురుషుల’ ముసుగును తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా హక్కుల సామాజిక కార్యకర్త సజయ మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో కనిపిస్తున్న మౌనం భయంకరమైన కుట్రలా ఉందన్నారు. ‘మా’ అసోసియేషన్ తన గొయ్యిని తానే తవ్వుకుందని, నటి శ్రీరెడ్డి తన నిరసనను ఈ రకంగా చూపించబట్టే సమాజం, పరిశ్రమ ఉలిక్కిపడిందని, పరిశ్రమలో జరుగుతున్న ఘోరాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. నటి శ్రీరెడ్డి మాట్లాడుతూ, ఇండస్ట్రీలో మానం ఇవ్వకపోతే సినిమాలుండవనేది వాస్తవమన్నారు. నెల రోజుల నుంచి మాట్లాడుతున్నా ఒక్క సినిమా పెద్ద కూడా ఇప్పటివరకు బయటకు రాలేదని, పైగా నిరసనను తొక్కివేసే ప్రయత్నం చేశారన్నారు. అణచివేస్తుండడంవల్లనే ఈ రోజు ఇన్ని శక్తులు పుట్టుకొచ్చాయని, తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి అండగా నిలిచాయన్నారు.