Home కలం బాలకథా వికాసం

బాలకథా వికాసం

klm

బాలలు బ్రహ్మ స్వరూపులంటారు విజ్ఞులు. కల్లాకపటము తెలియని బాలల మనస్తత్వము మైనం ముద్దలాంటింది. దానికి పసిప్రాయములో అద్దిన సంస్కారాలు శాశ్వతంగా అతుక్కుంటాయి. బాలల భవిష్యత్తు బంగారుమయం కావాలంటే బాల్యవ్యవస్థలోనే వారికి చదువుతో పాటు సంస్కారం. క్రమశిక్షణ అలవడాలి. లోకం పోకడ అవగాహన కావాలి. అందుకోసం నీతి ప్రధానమైన కథలు వారికి చెబుతుండాలి. వారితో చదివించాలి. బాలకథలు చిన్నారుల ప్రగతి భవనానికి పునాదులవుతాయి. కథలంటే ఆబాలగోపాలానికి ఇష్టమే. కథ చెబుతామంటే పిల్లలు అల్లరి మానేస్తారు. కథ వినేటప్పుడు బాలల దృష్టి దానిమీదనే కేంద్రీకృతమవుతుంది. దానితో ఏకాగ్రత అభ్యాసమవుతుంది. నేడు ప్రపంచ భాషలన్నింటిలోనూ బాలల కథలు ప్రాధాన్యత వహించాయి. చిట్టిపొట్టి బాలల మానసిక స్థాయికి సరిపోయే కథలు మనోరంజనము కలిగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేస్తాయి.

భాష : బాలల కథలు సుదీర్ఘమైనవి కావు. అవి చిట్టిపొట్టి కథలు, పిల్లల్ని నిద్రబుచ్చేలా, వారి మానసిక స్థాయికి తగినట్టుగా ఉంటాయి. కథల్లో కఠిన పదాలు, ద్విత్వాక్షరాల ప్రయోగాలు తక్కువుంటాయి. చిన్న చిన్న వాక్యాలుగా పిల్లలు సులువుగా చదివి అర్థం చేసుకుంటారు. కథనం కూడా చిన్నారి బుర్రలో ఇమిడేలాగుంటుంది. సమాసాలు, పెద్ద అలంకారాలకు తావులేదు.పిల్లల కథలు వింటూ ఊకొడ్తారు కాబట్టి వాటిని ఊకుడు కథలన్నారు. కాశీమజిలీ కథలన్నీ ఊకుడు కథలే “పూర్వం మౌఖికమైనవే. వేదమంత్రాలులా ఒకతరం నుండి ఇంకో తరానికందేవి. సాంకేతిక, నాగరికత పెరిగిన తర్వాత అచ్చుయంత్రాలలో గ్రంథస్తమైనాయి. బాలల కథలన్నీ నీతి ప్రధానమైనవే.
భావం: బాలలకు పెద్దలకున్నంత అవగాహనా సామర్థముండదు. నవరసాల్లో అన్ని రసాల పోషణ బాలల కథల్లో ఉండదు. శృంగార, బీభత్స రసాల్లాంటివుండవు. శృంగార రసం అర్థం కాదు, బీభత్సరసం హడలగొడ్తుంది. హాస్యరసం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. అందుకే జంధ్యాల “నవ్వించడమొక యోగం, నవ్వడమొక భోగం, నవ్వకపోవడమొక రోగం” అన్నాడు. నవ్వు మానసికోల్లాసాన్నివ్వడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నవ్వితే నరాలకు ఎక్సర్‌సైజ్ అవుతుంది.
బీర్బర్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు అలాంటివే. అవి చారిత్రాత్మకమైనా ఊహాత్మకత రంగరించుకున్నవి. అందరినీ ఆకట్టుకుంటాయి. మర్యాద రామన్న కథలు, పురావస్తు చారిత్రక కథలు దేశ సంస్కృతిని, నీతిని ధర్మాచరణను బోధిస్తాయి. సాంఘిక కథలు సమకాలీన సమాజంలో జీవన విధానాన్ని నేర్పి ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. బాలలకథల్లో ఫ్లాషు బ్యాక్‌లు, అనుకోని మలుపులు అయోమయానికి గురిచేస్తాయి.
స్ఫూర్తి: బాలకథలు చిన్నారి లేత మనసులను రంజింపజేసి, స్ఫూర్తినింపేవిగా ఉంటాయి. రామాయణంలో బాలరాముని చేష్టలు, భాగవతంలో బాలకృష్ణ లీలలు సాహసకృత్యాలు బాలలకు మంచి స్ఫూర్తినిస్తాయి. లవకుశులు శ్రీరాముని అశ్వమే ధాశ్వమును ఆపి తండ్రితో యుద్ధం చెయ్యడము, తర్వాత శ్రీరాముడు తండ్రి అని తెలిసిన తర్వాత తండ్రి ఒడిలో ఒదిగిపోవడం బాలల మనోల్లాసము ఉత్సాహాన్నిస్తాయి. ఝాన్సీ లక్ష్మీబాయి, వీరసావర్కర్, అల్లూరి సీతారామరాజులు బాల్యంలోనే విదేశీ పాలన నెదిరించడం లాంటి కథలు చిన్నారి హృదయాలలో దేశభక్తిని నింపుతాయి. దేశరక్షణలో ముందుండాలనే స్ఫూర్తిని కల్గిస్తాయి. వారిని ఉత్తమ భారత పౌరులుగా, భావినేతలుగా తీర్చిదిద్దుతాయి. వీరశివాజీని తల్లి జిజియాబాయి పెంచిన తీరు, చిన్నప్పుడే శివాజికి చెప్పిన వీరగాథలు నేటి బాలల్లో ధైర్యసాహసాలు రగిలిస్తాయి. సింద్‌బాద్, గలీవర్ సాహసయాత్రలు ఉత్తేజాన్నిస్తాయి. భారత ప్రభుత్వం ఏటేటా సాహస బాలలకు పురస్కారాలిచ్చి ప్రోత్సహిస్తుంది. వారి సాహసకృత్యాలను కథలుగా మలిచి బాలలకందిస్తే స్ఫూర్తినిస్తాయి. తాము గూడా సాహసకృత్యాలు చేసి తోటి మానవులకు సహాయ పడాలనే ఆశయాన్ని మొలకెత్తిస్తాయి. బీర్బల్, మర్యాద రామన్న కథల్లో చాలా నీతులున్నాయి. ఈ రోజుల్లో కొత్త రోగాలకు కారణమవుతున్న గుట్కాలు, పాన్ మసాలా, సిగరెట్ తాగడం, మద్యం సేవించడం లాంటివి భయంకరమైనవని చెప్పే కథలు నేడు చాలానే వస్తున్నాయి. శ్రీదేవి మురళీధర్ రాసిన “ఆవిష్కరణ” (ఆల్కాహాలిక్ పిల్లల కథలు) ఇందుకు ఉదాహరణలు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం అలవడాలంటే క్రమశిక్షణ, కష్టపడి చదవటం, వినయ విధేయతలు ప్రోదిచేసే కథలు గూడా చాలా వచ్చాయి. వాటిని చిన్నారి బాలలంతా చదవాలి. అడవి జంతువులు , సముద్రజీవులు, కుక్క, కోడి మొదలైన వాటితో మానవ సంబంధాలు మొదలైన బాలకథలు చాలా ఉపయోగపడతాయి. అందుకే పంచతంత్రము కథల్లో జంతువులు, పక్షుల కథల ద్వారా విష్ణుశర్మ రాకుమారులకు విద్యాబుద్ధులు, సంస్కారము నేర్పాడు. పంచతంత్ర కథలను చిన్నయసూరి ఐదు భాగాలుగా తెలుగులో అనువదించాడు. అవి 1) మిత్రలాభం 2) మిత్రభేదం, 3) సంధి, 4) విగ్రహము, 5) అపరీక్షిత కారత్యము. ప్రతి కథలో జంతువులు, పక్షుల ద్వారా మానవాళికి నీతి, ధర్మం లోకాచార వ్యవహారాల గురించి వివరించాడు.
బొమ్మలు: మాటల ద్వారా వ్యక్తం కాని భావాలు బొమ్మల ద్వారా వ్యక్తమవుతాయి. బాలలకథల్లో సందర్భానుసారమైన బొమ్మల్ని చూసి బాలలు ఆనందిస్తారు. అందుకే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భాగవతము, మరెన్నో వెలువడ్డాయి. పంచతంత్రములాంటి బాలల కథలు టీవీ చానల్స్‌లో, సీరియల్స్‌లో ప్రసారమై బాలల్లో కొన్ని రంజింపజేశాయి. జంతువులు, పక్షుల కథల్లో వాటి బొమ్మలు మనసుల్లో చెరగని ముద్రలు వేస్తాయి. బాలల కోసం వెలువడుతున్న పత్రికలన్నీ సచిత్ర పత్రికలే. నాగిరెడ్డి చక్రపాణి సారథ్యంలో వెలువడిన, చందమామ, బాలమిత్ర పత్రిక నుండి నేడు రామోజీ ఫౌండేషన్ సారథ్యంలో వెలువడుతున్న బాలభారతం, పత్రిక వరకు ఆకర్షణీయమైన బొమ్మలతో ప్రజాదరణ పొందాయి. బాల సాహిత్యంలో డా.గంగిశెట్టి శివకుమార్, డా.వాసరవేణి పరశురాములు లాంటి ఔత్సాహికులు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసి పిహెచ్‌డి డాక్టరేట్ డిగ్రీలు పొందారు. అయినా ఎన్నో కోణాల్లో బాల సాహిత్యంలో మరెన్నో పరిశోధనలు జరగాలి. సైన్స్, ఫిక్షన్, శాస్త్ర విజ్ఞానం ఇతివృత్తాలుగా వెలువడుతున్న బాలల కథలు రేపటి పౌరులు మేథోశక్తికి మెరుగులు దిద్దుతున్నాయి. నేడు తెలుగులో బాలల పత్రికల్లో చాలానే వెలువడుతున్నాయి. బాలభారతం, బాలమిత్ర, చంద్రబాల, మొలక మొదలైన పత్రికలు వెలువడుతూ మరిన్ని కొత్త పత్రికలకు స్వాగతం పలుకుతున్నాయి.