Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కంటి చూపు సమస్యకు చెక్ పెట్టవచ్చు!

eye

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ఏటా లక్షల సంఖ్యలో కంటి చూపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదిస్తున్నారు. వీటిలో కొన్ని శాశ్వత అంధత్వానికి దారితీసేవి కూడా ఉంటున్నాయి. కొందరికి కళ్లద్దాలు, మందులతోనే సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొందరికి సర్జరీలతో నయం చేయడానికి అవకాశం ఉండవచ్చు. కొందరి విషయంలో అప్పటికే చేయి దాటి ఉండవచ్చు. కొన్ని సమస్యలు పైకి కనిపించవు. అయితే, కొంత కాలానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదే వైద్యులను సంప్రదించినట్టయితే పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించేందుకు వీలుంటుంది.

కాంప్రహెన్సివ్ డైలేటెడ్ ఐ ఎగ్జామ్: కంటి సమస్యలు ఈ పరీక్ష ద్వారా బయటపడతాయి. గ్లకోమా, డయాబెటిక్, వయసును బట్టి వచ్చే మాక్యులర్ డీజనరేషన్ ఏఎండీ సమస్యలు తెలుస్తాయి.
కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర : కొన్ని వ్యాధులు వారసత్వంగా సంక్రమిస్తుంటాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమాచారాన్ని వైద్యులకు తెలియజేయడం అవసరం.
అప్పటికే కుటుంబంలో ఎవరైనా కంటి వ్యాధులతో బాధపడుతుంటే అవి వారసత్వంగా మీకూ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అప్పటికే ఏదైనా కంటి సమస్య ఉన్నట్టు బయటపడితే అది వారసత్వంగా వచ్చిందా, కాదా? అన్నది తెలుస్తుంది. దాన్నిబట్టి వైద్యం చేసేందుకు వీలుంటుంది.
ఎలాంటి ఆహారం : ముదురు ఆకుపచ్చటి కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర మంచి చాయిస్. చేపలు కంటిచూపును కాపాడే మంచి బలమైన ఆహారమట. వీటిలో ఉండే ఓమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ కంటిని కాపాడతాయంటున్నారు నిపుణులు. చేపలు తినలేని వారు వాల్ నట్స్ తీసుకోవడం బెటర్. వీటిలోనూ ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారట్లు కళ్లకు మంచివి. అలా అని ఒక్క క్యారట్లే తినడం కూడా సరికాదు. పైన చెప్పుకున్నవి కూడా ఆహారంలో భాగం కావాలి. మొలకెత్తిన గింజలు కూడా మంచివి. కళ్లకు, మెదడుకు మధ్య అనుసంధానం చాలా కీలకమైనది. ప్రతీ కణం చక్కగా పనిచేసేందుకు వీలుగా ఎన్నో చానల్స్ నిర్మాణమై ఉంటాయి. కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేయడం వల్ల కంటి చూపు బాగుంటుంది. ఇందులో రెటీనా, స్కెలరా, పుపిల్, ఐరిస్, కార్నియా, లెన్స్, మాక్యులా, ఆక్వియెస్, విట్రయెస్ హ్యుమర్, ఆప్టిక్ డిస్క్, ఆప్టిక్ నెర్వ్ మొదలైనవి ఉంటాయి. వీటి మధ్య సమాచారం సరిగా జరిగేందుకు వీలుగా తగిన పోషకాలు అవసరపడతాయి. ల్యూటీన్, జెక్సాంతిన్, క్రిప్టోక్సాంతిన్, బెటా కెరోటిన్, జింక్, బయోఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఏ, సీ అనేవి రెటీనాలోని కణాలు సరిగా పనిచేసేందుకు చాలా చాలా అవసరం.
పొగతాగినా ముప్పే: చాలా మందికి తెలియని విషయం. పొగతాగడం వల్ల దీర్ఘకాలంలో కంటిచూపు దెబ్బతింటుందని. పొగతాగడం వల్ల మా క్యులర్ డీజనరేషన్ (ఏఎండీ) సమస్యకు దారితీస్తుంది. కేటరాక్ట్, ఆప్టిక్ నెర్వ్ దెబ్బతింటాయి. దీంతో అంతిమంగా అంధత్వం ఏర్పడుతుంది. అధిర రక్తపోటు సమస్య వల్ల కూడా కంటిలోని కణాలు దెబ్బతిని చూపుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. పర్యావరణ కాలుష్యం, స్టెరాయిడ్స్, యాంటీ డిప్రెసెంట్ మందులు, సంతాన నిరోధం కోసం నోటి ద్వారా తీసుకునే మాత్రలు కంటికి కావాల్సిన పోషకాలు అందకుండా చేస్తాయి. దీంతో చూపునకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.
శస్త్రచికిత్సలు : చూపు మందగించి కళ్లద్దాలు ధరించడం ఇబ్బందిగా అనిపిస్తే… వైద్యులను సంప్రదించినట్టయితే శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అలాగే కంటిలో శుక్లం సమస్యకు, గ్లకోమాకు కూడా శస్త్రచికిత్సలు ఉన్నాయి.
కంట్లో ఏవైనా పడితే : సబ్బు నీరు పొరపాటుగా కంటిలోకి వెళితే వెంటనే భగ్గుమని మండుతుంది. కంటిని నలపకుండా వెంటనే ధారగా కంటిలోకి ఫిల్టర్ వాటర్ ను స్ప్రే చేయండి. లేదా దోసిలితో తీసుకుని కంటిలోకి నీటిని చిమ్మండి. ఏదైనా క్లీనింగ్ లిక్విడ్ కంట్లో పడినా ఇలానే చేయండి. లేదా స్లైన్ వాటర్ తో అయినా కంటిని శుభ్రం చేసుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.
కళ్లకు విశ్రాంతి : కంప్యూటర్ల ముందు పనిచేస్తున్నారా…? అయితే, మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి తప్పనిసరి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడిపేవారు 20, 20, 20 సూత్రాన్ని పాటించాలి. ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కళ్లపై ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది.
చలువ అద్దాలు : కళ్లకు చలువ అద్దాలతో తగిన ఉపయోగం ఉంది. ఎండ సమయంలో వీటిని ధరించడం వల్ల సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
అయితే, కొనే ముందు అద్దాలు అల్ట్రా వయలెట్-ఏ, అల్ట్రా వయలెట్-బీ కిరణాలను నిరోధించేవా, కావా అన్నది చూడాలి. ఈ కిరణాలు కళ్లపై పడితే శుక్లం సమస్య ఎదురవుతుందని, ఏఎండీకి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. చలువ కళ్లద్దాలు ధరించడం వల్ల క్యాటరాక్ట్ సమస్య రాకుండా చూసుకోవచ్చట. ముఖ్యంగా చిన్నారులు, యుక్తవయసులోని వారికి కళ్లద్దాల ద్వారా రక్షణ కల్పించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి : ఎర్రబారి, కంట్లో నొప్పిగా ఉంటే ఆలస్యం చేయకుండా కంటి డాక్టర్ వద్దకు వెళ్లాలి.

– ఉన్నట్టుండి పాక్షికంగా, పూర్తిగా కంటి చూపు మందగిస్తే…

– ఎదురుగా ఉన్నవి రెండుగా కనిపిస్తే.

– కంటి పాప ముందు నల్లటి చుక్కలు కనిపిస్తే.

– ఏదో కంటిచూపునకు అడ్డంగా ఉన్నట్టు అనిపిస్తుంటే…

– కుడి ఎడమవైపుల ఉన్నవి కనిపించకుంటే… రాత్రి సమయాల్లో చూపు మందగించినట్టు అనిపిస్తే…

– రంగుల మధ్య తేడాను గుర్తు పట్టలేకుంటే. దగ్గర్లో ఉన్న వస్తువులు మసకబారినట్టు అనిపిస్తుంటే.

– కళ్ల వెంట నీరు కారుతుంటే… బాగా దురదగా అనిపిస్తుంటే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స పొందాలి.

-అధిక కాంతి వల్ల రాత్రి వేళల్లో ఇబ్బంది పడుతుంటే కంటి వైద్యుడి సూచన మేరకు యాంటీగ్లేర్ కోటింగ్ ఉన్న గ్లాసెస్ ను వాడుకోవాలి. చలువ కళ్లద్దాలు పెట్టుకున్నప్పటికీ సూర్యుడి వైపు చూడొద్దని నిపుణుల సూచన.

– కళ్ల నుంచి మానిటర్ కనీసం అడుగు దూరంలో ఉండాలి. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మీ వెనుక వైపున లైట్, విండో ఉండరాదు. ఎందుకంటే ఆ వెలుగు స్క్రీన్ పై పడి గ్లేరింగ్ ఉంటుంది. దీంతో కళ్లు శ్రమకు గురవుతాయి.

– బ్లూ రంగు కళ్లకు హానికరం. అందుకే గ్రాఫిక్ ప్రాపర్టీస్ లోకి వెళ్లి కలర్ సెట్టింగ్స్ లో ఈ మేరకు మార్పులు చేసుకోవాలి.

– కళ్లలో పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్ అయితే, ఆ లెన్స్ లో కళ్లలో అమర్చుకునే ముందు, తర్వాత తీసే సమయంలోనూ కళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం.

Comments

comments