Home మన ఆరోగ్యం గ్యాస్ ట్రబుల్‌ని ఇలా తగ్గించుకోవచ్చు!

గ్యాస్ ట్రబుల్‌ని ఇలా తగ్గించుకోవచ్చు!

lf

ఆహారపదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు తయారైన అధిక గాలి పూర్తిగా బయటకు పోకుండా కడుపులోను, పేగుల్లో నిండిపోయినప్పుడు కడుపు ఉబ్బిపోయి అపానవాయువులతో నలుగురిలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతీసి, సుఖంగా జీవించటానికి ఇబ్బందులు కలిగిస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ముఖ్యంగా పని ఒత్తిడితో పాటు ఆహార నియమాలు పాటించకపోవడం, శారీరక శ్రమ పెద్దగా లేని వారిలో ఎక్కువగా కనిపించవచ్చు. మెదడులో ఉన్నట్లే జీర్ణవ్యవస్థలో కూడా అంతే సంఖ్యలో నరాలు ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటివి మెదడుతో బాటు జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. దీనివలన గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీన్నే గ్యాస్ ట్రబుల్ అంటున్నారు. ఆయుర్వేదంలో “అధ్మాన” అని పిలుస్తారు.

కడుపులో తయారైన గాలి తేన్పుల ద్వారా గాని, పురీషనాళం ద్వారా గానీ పోకుండా పైకి ఎగబాకినపుడు గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువై నాడి వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. గుండె దడగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పిని గుండెనొప్పిగా కూడా అపోహ పడటం జరుగుతుంది. ఈ రకంగా కడుపులో గాని, పేగుల్లో గాని అధిక గాలి ఏర్పడటానికి కారణం సరైన వేళకు ఆహారం తీసుకోకపోవడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల మిగిలిపోయిన వ్యర్థ ఆహార పదార్థాలు పేగుల్లో నిల్వ ఉండిపోయి మురిగిపోవడం జరుగుతుంది. ఈ రకంగా మురిగి పోయిన పదార్థాలనుండి బయలు దేరిన విషవాయువులే కడుపులోను, పేగు ల్లోను గాలిగా నిండిపోయి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది.
గ్యాస్ ట్రబుల్‌కి మొట్టమొదటి కారణం మలబద్ధకమేనని చెప్పాలి. కాబట్టి మల బద్ధకం లేకుండా ముందు జాగ్రత్తలు తీసు కోవాలి. భోజనం చేసిన వెంటనే ఏ విధమైన బరువు పనులు చేయకూడదు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. భోజన సమయంలో మానసిక విచారం, మానసిక వత్తిడి, వ్యతిరేక ఆలోచనలు పనికి రావు. వేపుడు కూరలు, పప్పు పదార్థాలు, అన్ని రకాల చిక్కుళ్ళు తినకూడదు. పాలు బదులు, మజ్జిగ, పెరుగు వాడుతుండాలి. మద్యం సేవించడం కూడా దీనికి ప్రధాన కారణం. ఇంకా ఏదైనా నొప్పితగ్గటానికి ఉపయోగించే మందులు ఎక్కువగా తీసు కోవడం కూడా ‘గ్యాస్ట్రిక్’ ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవాలి. ఇంకా టీ, కాఫీ లాంటివి ఎక్కు వగా తీసుకోరాదు. భోజన సమయంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఇది సాధారణం గా కడుపు పైభాగంలో వస్తుంది. ఛాతీ నొప్పి మాదిరిగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, తేన్పులు రావడం, ఏదైనా కొంచెం తీసుకున్నా కడుపు నిండినట్లుగా అనిపించడం. వికారం, రక్తంతో కూడిన వాంతులు అవటం, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. తిన్న వెంటనే కాకుండా రెండు గంటల తర్వాత నిద్రించడం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంతవరకు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇదవరకు భోజనం అయిన తరువాత బెల్లం ముక్కను నోట్లో వేసుకునే వారు. బెల్లం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది.
కొన్ని సులభ నివారణ మార్గాలు:
* ఎండు ద్రాక్షపళ్ళను రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పండ్లను బాగా పిసికి వడగట్టి తాగు తుంటే సులభంగా విరేచనమై కడుపులో చెడుగాలి నిలవ ఉండకుండా ఉంటుంది.
* అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగి తే కడుపు ఉబ్బరం తగ్గు తుంది.
* ధనియాలు, శొంఠి సమభాగాలు కలిపి కషాయం పెట్టి కప్పు కషాయం ఉదయాన్నే తాగితే అజీర్ణం, మల బద్ధకం తగ్గి గ్యాస్‌ట్రబుల్ కూడా తగ్గిపోతుంది.
* సోంపు, జీలకర్ర, వాయు సమభాగాలు చూర్ణం చేసి కలిపి టీ స్పూన్ రోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో కలుపుకుని తాగితే కడుపులో చెడుగాలి పోయి అజీర్తి లేకుండా ఉంటుంది.
* శొంఠి చూర్ణం, పాత బెల్లంతో సమంగా కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తిని వేడి నీరు తాగితే సులభంగా విరేచనమై కడుపులో చెడుగాలి పోతుంది. దీనివల్ల మూలవ్యాధి, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
* ప్రతి రోజు ఉదయాన్నే ‘అరటి ఊచ’ రసాన్ని ఒక కప్పుడు తాగుతుంటే 15-20 రోజుల్లో గ్యాస్ సమస్య తగ్గుతుంది.
* సునాముఖి ఆకుపౌడరు, కరక్కాయ పౌడరు సమభాగాలుగా కలిపి రోజూ ఒక గ్రాము మూడు పూటలా వాడితే సులభంగా విరేచనమై చెడుగాలి తగ్గిపోతుంది.
* పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. చల్లారిన తరువాత ఆ నీటిని ఒడబోసి తాగాలి. ఇలా వారం పది రోజులు చేస్తే కొంతవరకైనా గ్యాస్ సమస్య తగ్గుతుంది.