Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

ఆధునిక పద్య ప్రబంధం ఉత్పల ‘శతరూప’

klm

తెలుగు సాహిత్య క్షేత్రంలో పరిచయం అవసరం లేని మహాకవి డా॥ ఉత్పల సత్యనారాయణాచార్య. ప్రాచీన సాహిత్యం మూలంగా అనేక కావ్య రత్నాలను తన కలం నుండి జాలువాల్చాడు. బతికినన్నాళ్ళూ కవిత్వమై జీవించాడాయన. అమూల్యమైన సాహిత్య సంపదను పంచి సాహిత్య రంగంలో చెరిగిపోని ముద్ర వేసుకొని కాలం చేశాడు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఉత్పల గజేంద్ర మో క్షం, భ్రమర గీతం, గోపీ గీతము, వేణు గీతము, కచ దేవయాని, రాస పూర్ణిమ మొదలగు 50 కృతుల వరకూ రచించగా “ ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు” కృతితో సాహితీ ప్రియుల మన్ననలు పొందటమే గాక 2003లో “శ్రీ కృష్ణ చంద్రోదయ” కావ్యమునకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
మహాకవి ఉత్పల 1980లో పెద్దలు బి.ఎన్.శాస్త్రి గారి అండతో ‘శతరూప’ అను పద్య కావ్యాన్ని ప్రచురించారు. శతరూప ముందుమాటలో డా॥ యం. కులశేఖర్‌రావు అన్నట్లు ఇది ఆధునిక పద్య ప్రబంధంగా తలపిస్తుంది.
ప్రబంధము అనగా ప్రకృష్టమైన బంధము అని అర్థం. సంస్కృతంలో పదాలకంటే అక్షరాలకే అర్థాలెక్కువగా ఉంటాయి. ఇక్కడ ‘ప్ర’ అనగా గొప్పదైన, శ్రేష్టమైన, ఉత్కృష్టమైన, ఉన్నతమైన అనే అర్థాలున్నవి. ప్రబంధం అను పదంలో బంధం అంటే కట్టబడింది. గట్టిగా, గొప్పగా బంధించబడింది (కట్టబడింది) ప్రబంధం. ఆనాడు రాసిన కావ్యాలు తాటాకులపై, తామ్రాలపై రాసేవారు వాటిని తరతరాలకు అందించాలనే ఉద్ధేశంతో భూమిలో పాతిపెట్టి జాగ్రత్త చేయుటకై ఇనుప సంకెళ్లతో బంధించేవారు అలా ప్రకృష్టమైందే ప్రబంధంగా పిలువబడుతున్నదనేది ఒక ఐతిహ్యం.
ఇదిలా వుండగా దండి, నన్నె చోడుడు ప్రబంధ లక్షణాలను ప్రత్యేకంగా పేర్కొనగా అప్పకవి వేట, ముని ఆశ్రమం వంటి అదనపు వర్ణనలూ చెప్పాడు. మొత్తంగా ఏకనాయకాశ్రయం కలిగి శృంగార రస ప్రధానంగా 18 వర్ణనలు (నగరం, శైలం, పర్వతం మొదలగునవి) గలది ప్రబంధంగా నేడు పరిగణిస్తున్నారు.
ప్రబంధాలతో స్వర్ణయుగంగా పేరుగాంచిన రాయలయుగం తర్వాత కొందరు కవులు ప్రబంధ రచనపై దృష్టిపెట్టి సఫలీకృతులయ్యే ప్రయత్నం చేశారు. ఆధునికయుగంలో ప్రబంధం రాసి ఘనతకెక్కిన వాళ్లలో ముఖ్యులు ఉత్పల సత్యనారాయణాచార్యులు.
ఉత్పల రాసిన ‘శతరూప’ ప్రబంధంలో ఐదు సర్గలు కలవు. ఇద్దరు వ్యక్తులతో శతరూపాలుగా ఈ సృష్టి ఎలా గావించబడిందో తెలిపే కావ్యమే శతరూప.
ఒక అడవిలో వేటగానిగా ఉన్న ఒక పురుషుడు అదే అడవిలో గల ఒక అందమైన స్త్రీతో ప్రేమలో పడతాడు. తర్వాత ఇద్దరి కలయికతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అటు పిమ్మట వేటగాడే రాజై వెలిగి అడవిని నగరంగా మార్చిన తీరే శతరూపలోని ఇతివృత్తం.
అక్కడక్కడా అద్భుతమైన వర్ణనలతో అనేకానేకాద్భుతమైన సంఘటనలతో శతరూప ముందుకు సాగింది. దాంపత్య జీవనంలో భార్యాభర్తల అన్యోన్య సంబంధం చిత్రించబడటంతో పాటు పాత్రోన్మీలానికి సంకేతాలుగా కావించిన వర్ణనలు బంగారానికి తావి అద్దినట్లుగా వున్నవి.
“దపిగా మింటి తెరువరి ధరణి జలము
పూర్తిగా తాగి బరువెక్కి పోయినాడు /లాగజాలక యతని గుఱ్ఱాలు మంద /గాములయ్యె పగళ్లు దీర్ఘమ్ములయ్యె ” అంటూ సూర్యు ని వర్ణనతో ప్రథమ సర్గను వినూత్నంగా ఆవిష్కరించాడు ఉత్పల. నాయికా నాయకుల వర్ణనలతో పాటు అడవి, సూర్యుని వర్ణనలు ప్రథమ సర్గలో కలవు.
అడవి యొక్క ప్రాశస్తాన్ని తెలుపుతూ, “నాగరిక లోక మాశించు భోగముల /
పిచ్చిగా త్యాగమెంతొ సల్పినది అడవి
“ఆర్ష ధర్మము భారత వర్ష మందు
ఆది నభిషేక మొనరించినట్టి దడవి” అన్నాడు.
ద్వితీయ సర్గలో నాయకుడు మృగంవైపు తన అమ్ములపొదిలోని బాణాన్ని తీస్తూ పరిగెత్తటం, పూలవనం మధ్య ఒంటికాలుపై కూర్చొని విల్లెక్కుపెట్టడం చూచిన ఆ స్త్రీ పులకించింది. పురుషుడి అందానికి ముగ్ధురాలైంది. మరోసారి
“ రాలిన కొండ గోగు పువులన్ చెవులం దిడి చెంపలన్ కుసుం / భాల నలంది యయ్యడని మల్లెలు, మయూర పింఛ రిం /ఛోళి దిరస్కరించు కచ శోభ వెలార్పుచు సాంధ్య రాగ, ముద్వేల మొనర్చి యీమె కనిపించిన దమ్మగవాని ముందరన్‌” / అన్నట్లుగా సాక్షాత్కరించిన స్త్రీ తలను చూసిన పురుషుడు ‘బెబ్బులులు పైన దూకిన బెదర నట్టి / ఉక్కుతునియ అయస్కాంత మురిసినట్లు’ అయ్యాడట! ఇందు ప్రేమతత్తం వివరించబడింది. స్త్రీని దీక్షణంగా చూసిన పురుషుడు / “నున్నని మొగంబు పరువంపునూగు ముక్కు చీల్చినట్టి మామిడికాయ జీళ్ళు కనులు ఎంత మృదులమ్మ లీయింతి కుంతలములు!
ఔర! ఆడుది ఎంతందమైన జీవి!” అనుకున్నాడు. ఇక్కడ కవి ఆడుదాన్ని వర్ణించిన తీరు ముచ్చటైనదే!
ఒక కఠినమైన మానవుడు తన చుట్టూ గల పరిసరాల వల్లనో, కొందరు వ్యక్తుల ప్రభావం చేతనో మృదుత్వంగా మారుతాడనటంలో ఇందులోని నాయకుడే నిదర్శనం. భీకరమూర్తియైన నాయకుడు ఒక స్త్రీ ప్రేమలో పడ్డాక ‘ఆత్మయందు నిట్టి ఆనంద బంధుర / స్పర్శ లేక క్షణము బతుకలేడు’ అన్నట్లుగా మారినాడు.
ఇక వాళ్ళిద్దరూ కలిసి అడవంతా విహరించసాగారు.
తృతీయసర్గలో ఉత్రేక్షలో కూడిన చంద్రుని వర్ణన, వెన్నెల నిండుతనం, తెల్లుపూలు చంద్రుడు స్వచ్ఛమైన నీటి అద్దంలో కల్సిన తీరూ వర్ణనాతీతంగా ఉంది. ఇలా,
“శారదరాత్రి మింటి పయి చంద్రుడు మంటిని ఱెల్లుపూలు చెన్నారగ నట్టు నిట్టు పులి నాలు బయల్పడ మెల్లమెల్ల జా
ల్వారు శరన్నదీ విమల వారి వధూ నవ సంగమ త్రపా
హారి సముజ్జితైక జఘ నాంశుకమో యనిపించె పల్చనై”
పురుషుడు పూర్తిగా ప్రేమలో మునిగి స్త్రీకి ప్రతిపాదన చేయగా స్త్రీ / ప్రతీకాత్మకంగా, “ ఏ వలను వేసి బంధించినావో గాని కదలనీయవు నన్ను నీ యెదుట నుండి
దాసి నైతిని నీదు బంధనము నందు
నాకు ముక్తి సుఖమ్ము ధన్యతయు నింక” అని పలికింది. / స్త్రీ ఆర్ధ్రతతో కూడిన హృదయాన్ని కళ్లకు కట్టి చూపాడు కవి ఉత్పల. ఇక ఇద్దరి మనసులు కలవగా,
“ నేను పూర్తిగ నింక నీ దాన నైతి
నేలకొమ్మంచు తన మెడ గ్రాలు దండ
తీసి యాతని మెడలోన వేసే నామె
నెమలిపురి కిరీట మత డాయమకు బెట్టె. ”
పచ్చని ప్రకృతి సమక్షంలో వారిద్దరి వివాహం చూడముచ్చటగా చేసి కథకు మంచి పుష్టిని కూర్చాడు కవి.
కొన్నాళ్ళకు అడవిలోని జంతువులనన్నీ వేటాడి అడవికి రాజై వెలిగాడు నాయకుడు. అదిప్పుడు అడివి కాదు ఉద్యానవనంగా వాళ్లిద్దరికీ స్థావరమైంది. అది చూసి ఆకాశంలో దేవదుందుభులు మొరసినాయి.
చతుర్థ సర్గలో ఆటవిక జీవనం, దాంపత్య జీవనం మహత్తరంగా చిత్రించబడినాయి.
“నా మనస్సు నీయందు లగ్నమగు కొలది
అతివ! నాకింత నీ వవగతము కావు
దినదినమ్మున కొక కొత్తదనము పొంది
నన్నపరిచితు జేయుచున్నావు నీవు ” అనగానే ఆమె ముఖం / ‘అక్షితారలు మెఱుగెక్కెన ధర చలిత / మధుర దరహాస రేఖ చెంపలకు ప్రాకె అంటూ భార్యాభర్తలు అన్యోన్య సంబంధం వర్ణించిన పద్యాలు మనోహరమైనవే!
అలా జీవనం కొనసాగిస్తున్న నాయికానాయకులు సొంతగూడును నిర్మించుకొని వస్తువులన్నీ సమకూర్చుకునే పనిలో ఉండగా ఒకనాడు సవత్సంబుగా (దూడతో) గోవు నెమరువేసుకుంటూ అక్కడికి చేరినది. ఆ గృహపతులా గోవును
“గోవు కొమ్ముల యందు దేవేంద్రుడున్నాడు
ఫాలదేశంబున బ్రహ్మ గలడు
అక్షిద్వయంబున నాదిత్యడున్నాడు
కుక్షియందున పావకుండు గలడు
శ్రవణ రంధ్రంబుల పవమాను డున్నాడు
మూపురంబున లింగమూర్తి గలడు
వాల భాగంబందు కాలుండు నున్నాడు
కాళ్ళయందున మరుద్గణము కలదు
పొదుగున సరస్వతి పురీషమున విభూతి
పంచితంబున కీర్తి భాసించునట్టి
సర్వ దేవతామయియైన సౌరభేయి
మనుపరుల కిచ్చెడిది జయమంగళములు” అనుకుంటూ
సపర్యాభాజనంబు గావించినారు. ఇక్కడ గోవును సర్వదేవతామయిమైన సౌరభేయి అనటంలో శతరూప కావ్యకర్తకు ప్రాచీన భారతీయ సంపద్రాయంపై గల ప్రగాఢమైన విశ్వాసం ప్రస్ఫుటిస్తుంది. ఇక నాయికా నాయకులు భోజనం చేయు సందర్భాన / “అన్నము సర్వౌషద సం
పన్నం బిది యారగించి పడయము తేజం
బన్నిటికంటెను శ్రేష్ఠం
బన్నమె జేష్ఠంబు కల పదార్థములందున్ ” అని రాసిన
కందంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటలు స్ఫురిస్తున్నాయి. అవసరం మేర వర్ణనలు చేస్తూనే కవి లోకజ్ఞతనూ చక్కగా ప్రదర్శించాడు.
చివరి సర్గలో పురుషుడు పరవశానికి లోనై బలిష్ఠ బాహువుల రెంటిని సాచి తదీయ దేహ వల్లరి తన పేరు రమ్మునకు లాగుకొన్నాడు. అప్పుడు లోకం హర్షించింది. దాంతో “వనపదములు మహాజనపదము లయ్యె
వాసములు నిండ్లు మేడలై వాడలయ్యె
అమ్మహాత్ములు నడచినయట్టి కాలి
బాటలవి పదంపడి మహా పథములయె” అంటూ కవి సెలవిచ్చాడు. మానవ పరిణామ క్రమమును, మనస్సులను తెలుపుతున్న ఈ పద్యాలలో కవిలో ఒక ఆంత్రోపాలజిస్ట్, సైకాలజిస్ట్ గోచరిస్తున్నాడనటంలో అత్యుక్తి లేదు.
క్రిస్టియన్స్ మత గ్రంథం బైబిల్ ప్రకారం సృష్టికి మూలం ఏదేముతోటలో నివసించిన ఆడమ్స్ మరియు ఈవ్. ఆ కథను జ్ఞప్తి చేస్తూ సాగిందీ ప్రబంధం. ఇద్దరు వ్యక్తులు శతరూపాలుగా ఆవిర్భవించిన రీతిని వ్యక్తపరుస్తూ నడిచిన ఈ ప్రబంధం ఉత్పల వారి వర్ణనా చాతుర్యానికి ప్రతిబింబం. ఈ శతరూపను పాఠకుడికి ఆద్యంతం విసుగు కలగకుండా చవులూరించే విధంగా పూరించారు ఉత్పల సత్యనారాయణాచార్యులు.

నుగునూతుల యాకయ్య,
8919913723

Comments

comments