Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పేదల గొంతుక గూడ అంజయ్య

anjaiah

దళిత కవి, పాటల రచయిత గూడ అంజయ్య 21-62016 కన్నుమూశారు. ఆ రోజే ప్రొ॥ జయశంకర్ గారి వర్ధంతి. ఇది యాదృచ్ఛికమే కావచ్చు. కాని ఒకరు తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష తో తన జీవితమంతా తపించిన వ్యక్తి, తెలంగాణ వస్తేతప్ప తాను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేసి, వచ్చిన తెలంగాణను చూడకుండానే కన్నుమూశారు. ఆ మహోన్నత వ్యక్తి జయశంకర్ అయితే, తొలి, మలిదశ ఉద్యమాలలో తెలంగాణకై గొం తెత్తి, తెలంగాణ గుండె చప్పుడై మోగిన గొంతుక గూడ అంజయ్య.
గూడ అంజయ్య దళిత కుటుంబంలో 1955 లో ఆదిలాబాద్ జిల్లా, లింగాపురం అనే గ్రామంలో లస్మవ్వ, లక్ష్మయ్య అనే దంపతులకు పుట్టారు. అతను బాల్యం నుంచే కులపీడనను ఎదుర్కొన్నాడు. తన ఊరిలో ప్రాథమిక విద్యను చదివి, అటు తర్వాత 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లక్సెట్టిపేటలో చదువుకున్నాడు. 1970లో చంచల్‌గూడ జూనియర్ కాలేజీలో బైపిసి చేశాడు. ఆ సమయంలోనే అతను నక్సలైట్ల ఉరిని చూశాడు. అప్పుడే అతనికి జార్జిరెడ్డి జం పాల చౌదరి పరిచయమయ్యారు. కొన్ని రోజులకు జార్జిరెడ్డి హత్య చూశాడు. ఆనాడే “గోర్కి ——- -అమ్మ”, “——అలెక్స్‌హేళి రూట్స్‌” నవలలు, దాశరథి——– –ఊరుమ్మడి బతుకులు, వట్టికోట పుస్తకాలు చదివారు. అంజయ్యకు పాటలపై ఇన్సిరేషన్ కలిగించిన వ్యక్తి చెరబండ రాజు. అతని స్ఫూర్తితో అంజయ్య రాసుకున్న, పాడుకున్న మొదటి పాట ‘ఊరిడిచి నే పోదునా ఉరిబెట్టుకొని సత్తునా…” ఆనాడు ఊరిలోని పెద్ద కులాలవారు కింది కులాలను వారు పుట్టిన కులం కారణంగా వివక్ష పాటించడం నేటికీ చూస్తున్నాము. అటువంటి వివక్ష అంటరానితనం గూడ అంజయ్య ఎదుర్కొన్నాడు కనుకనే తన పసి ప్రాయంలోనే అది బలమైన ముద్రను వేసిందనే చెప్పాలి. వెట్టి చాకిరి, దళితులపై వివక్ష కు వ్యతిరేకంగా అంటరాని కులాల గళాలు ఏకమైనినదించసాగాయి. అవి నక్సల్బరీ రోజులు. 1972 ఉద్యమ సమయంలో కళాకారుడై గజ్జెగట్టి చిందేసిండు. అతని కలం నుంచి, అతని గళం నుంచి పుట్టుకొచ్చిందే “ఊరుమనదిరా ఈ వాడ మనదిరా,…పల్లె మనదిరా… ప్రతి పనికి మనం రా…” అంటూ సాగిన పాట జానపదులను ఉర్రూతలూగించిందది. అంజన్న పాటపాడుతుంటే జనం శ్రుతి కలిపి వారు పాటందుకున్నరు. అంతటి ప్రతిభాశాలి అంజయ్య, ఆ పాటకు జనం జేజేలు పలికారు. అతన్ని తమ గుండెల్లో నిలుపుకున్నారు. అంజయ్య ఎమర్జెన్సీ కాలంలో రెండేండ్ల పాటు ముషిరాబాద్ జైలులో శిక్ష అనుభవించిండు. ఆ సమయంలో ఎర్రజెండా కనిపించినా, నక్సలైట్ కనిపించినా ఎన్‌కౌంటర్ చేస్తున్న రోజులు. శిక్ష నుండి బైటపడిన అనంతరం సొంత జిల్లా ఎల్లి ఫార్మసిస్టుగా జీవితం మొదలెట్టిండు. 79లో పెళ్లి, అనంతరం పిల్లలు సంసారం ఒక వైపు, మరోవైపు తెలంగాణపై మక్కువ, అప్పుడు అతనికి కనిపించిన దారి అంబేద్కర్. ఆ భావ జాలంతో సాగిపోసాగిండు. అలా తిరిగి సినిమా పాటల రచయితగా పట్నం వచ్చిండు. ఆయన కలం నుంచి జాలువారిన కొన్ని పాటలు
“అయ్యో నివా, నువ్వు అయ్యోనివా.. తెలంగానోనికి తోటి పాలోనివా..” “పుడితె ఒకటి సత్తె రెండు రాజిగ ఒరి రాజిగ” “అసిలేటి కార్తెలో ముసలెడ్లు కట్టుకొని మోకాటి బురదలో దుక్కులే దున్నితే…” ఇలా జనం కోసం, తెలంగాణ రాష్ట్ర కాంక్షతో రాసిన పాటలు ప్రజల నాల్కలపై నడయాడుతవి. 1980లో ఆసియా, ఆఫ్రికన్ దేశాల రచయితల సదస్సులో పాల్గొన్నాడు. అతని “ఊరు మనదిరా..” పాట పదహారు భాషలలోకి అనువాదమైంది. అంటే ఆ పాటలోని బిగువేందో తెల్సుద్ది.
గూడ అంజయ్య పాటలకు, అతని నవల, కథలకుగాను అవార్డులు, సత్కారాలు అందుకుండు. అందుకు తగిన అర్హుడే. అతను తొలినాళ్లలో విప్లవకవి, తదనంతరం తెలంగాణకై నినదించిన పాటలగొంతుక. ఐతే ఈ దేశంలోకాని, ప్రపంచంలోని ఏ దేశంలోకాని కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు పీడిత జనపక్షం గొంతు కై నినదిస్తారు. గూడ అంజయ్య ఆ కోవకే చెందుతారు. ఐతే ప్రజల పక్షం వహించే ఏ కవి, రచయితా, కళాకారుడు కూడా ఎక్కువ కాలం మనగలలేడు. అందుకు ప్రధాన కారణం వారి పేదరికం, వారిని ఆదరించని పాలక పక్షాలు, వారు పుట్టుకతో ధనవంతులు కాకపోవడం, లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం లేకపోవడం వీటికి తోడు వారిని వెంటాడే కుటుంబ ఆర్థిక సమస్యలు, రోగాలూ వీటివలన దళిత బహుజన, మైనారిటీ కవులు అకాల మరణం పొందుతున్నారు. ఆయా కవులు, బతికునప్పుడు ఆసరా కాలేకపోతున్నారు, మరణించినప్పుడు ఆకాశానికెత్తేస్తారు. స్వరాష్ట్రం సాధించుకున్నాం. ప్రభుత్వం ఎందరికో చేయూతనిస్తున్నది. ఐతే నిరుపేద కవుల కుటుంబాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

భూతం ముత్యాలు
9959546780

Comments

comments