Home కలం జాషువా కోరిన సామాజిక సమరసత

జాషువా కోరిన సామాజిక సమరసత

gj

సర్వమానవ శ్రేయస్సు కోసం మానవులలో నైతిక విలువలను పెంచుటకు వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినవి కులమతాలు. ఇవి మానవత్వాన్ని పెంచాలి. మంచిని బోధించాలి కొందరు మత ఛాందసవాదులు స్వార్థపూరిత బుద్ధ్దితో వర్ణ వ్యవస్థను ఆ తరువాత తక్కువ ఎక్కువ భావాలతో మానవులంతా ఒకటే అనే భావం మరిచారు. ఈ సమయంలో “అక్షరాన్ని ఆయుధంగా చేసి కవితను ఖడ్గంలా ఝళిపించి సాహిత్యాన్ని సామాన్యుని ముంగిట అసామాన్యుడిగా చేశారు జాషువా. దళితులను అంటరాని వారిగా చేసి దోపిడీ చేసే హైందవ బ్రాహ్మణ పండితులను పండిత భాషలోనే సమాధానం చెప్పారు గుఱ్ఱం జాషువా.
“గౌరవం కులానికా? కలానికా?” అని ప్రశ్నించాడు.
జీవితానుభవాల రాపిడినుండి ప్రతిభ గుబాళించిన కవిత జాషువాది. “కులమత విద్వేషంబుల్ తలసూపని కళారాజ్యం” కోసం కలలు కన్న ఆశావాది సమతావాది గుఱ్ఱం జాషువా. కవి దిగ్గజంగా పేరొందిన జాషువా కవితల్లో స్పృశించని కథావస్తువే లేదు. ప్రజా భాషలో రచించిన ఆయన కవితల్లో సామాజికత కన్పిస్తుంది.పేదరికం సహనాన్ని నేర్పితే కులతత్వం వల్ల ఎదిరించే లక్షణం అలవడింది అని చెప్తూ జాషువా ఇలా అన్నారు.
“కుల మతాలు గీచుకున్న గీతల చొచ్చి/ పంజరాన కట్టుపడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు/ తిరుగులేదు విశ్వనరుడ నేను.
జాషువా మానవతావాది. అందరి హితాన్ని అందరి సుఖాన్ని కోరేది మానవతా వాదం. అది కులమత వర్గ భాషా సంకుచిత ధోరణుల కంటే అతీతమైంది. ఇది సమాజంలో చూడాలనుకున్నారు
“మత పిచ్చిగాని వర్ణో/ న్నతిగాని స్వార్థ చింతనమని, నా/
కృతులందుండదు శబ్దా/ కృతి బ్రహ్మానంద అద్మ నృత మ్మొనర్చున్‌”
అంటూ వివక్ష లేని సమాజాన్ని కోరుకున్నారు. తన రచనలో ఇలాంటి భావాలు లేవని బ్రహ్మానంద లక్ష్మిని కల్గించునని ఇలా చెప్పారు.
“సమతలేని రిత్త చదువేల? పదవేల/
మతము లేల నూరు వ్రతము లేల?” అనే తన మాటలలో జాషువా కోరిన సమానత్వాన్ని బలపరుస్తున్నాయి.
గబ్బిలాన్ని అపశకునం అని భావించే సమాజంలో కాదేది కవితకనర్హం అన్న శ్రీ శ్రీ మాటలను ఆదర్శంగా తీసుకొని “గబ్బిలాన్ని ప్రధాన పాత్రగా ఖండ కావ్యాన్ని రాసారు. ఈ ఖండ కావ్యంలో వర్ణ వ్యవస్థపై నిరసన “వర్ణ సంఘర్షణ” దర్శింప చేసారు. గబ్బిలం కావ్యంలో శ్రామికుల కష్టాలను వారున్న దయా విహీనస్థితిని చిత్రించారు.
“వాని రెక్కల కష్టంబులేని నాడు/ సస్యరమ పండి పులకింప సంశయించు/ వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టువానికి భుక్తి లేదు.” కష్టించి పంటను పండించి రైతులు ఆకలితో పస్తుండే పరిస్థితిని అంటరాని తనాన్ని నిరసిస్తూ తన రచనతో మానవతా వాదాన్ని, జాతీయాభిమానం సమకాలీన సమాజ జీవన సమస్యలను వాస్తవ దృక్పథంతో రచన చేసారు. సంప్రదాయ స్పర్శ ఆధునిక భావధోరణి మనోహరంగా మేళవించారు. భావాభ్యుదయాలను ఏకం చేసి సంప్రదాయ పద్యాలలో సామాజిక విషయాలను చిత్రించారు. అభ్యుదయ దృక్పథాన్ని అన్నార్తుల ఆక్రందనలను తెలియజేసే విధంగా తన రచనలో ధనవంతులు తమ సరదాల కోసం ఖర్చు చేస్తారు. కాని ఆకలితో -ఉన్న పేదల శూన్యమైన పాత్రలలో ఒక్క మెతుకు విదల్పరు ఈ భరత భూమిలో అని అంటారు జాషువా. గబ్బిలంలో ఆకాశవాణి మీద రాసిన పద్యాల్లో కూడా జాషువా ఇలా రాసారు.
“రేయింబవలు భారతీయ సంస్క ృతి పేర/ గండ శిలలు చూసి కథలు చెప్పి /కటిక పేదవాని కడుపులో గల చిచ్చు / గడప గలవే నీవు గగన వాణి” అని అట్టడుగు వర్గాల ప్రజల దీన స్థితిని సమాజంలోని ఇతర వర్గాల వారి హృదయాలను కరిగించి వారిలో మార్పుకు అందుకు అనువైన వాతావరణం కల్పించాడు. అదే ఆశతో కావ్య రచన చేసాడు.
“ధర్మమునకు పిరికితన మెన్నడును లేదు.
సత్యవాక్యమునకు చావు లేదు” అని గబ్బిలం కావ్యంలో
తన మనోగతాన్ని దృఢ నిశ్చయం తెలియజేసారు జాషువా. కావ్యాంతంలో “భోగులారగించు భుక్తి కన్నుల జూచి/ పరమ పేదలు దు:ఖపడని చోటు” అంటూ చూసి వచ్చావా నీవు అని గబ్బిలాన్ని అడిగించిన ఆశావాది జాషువా. తెలుగు తేజంలో ఆంధ్రదేశంలోని వివిధ పుణ్య క్షేత్రాలను పుణ్య తీర్థాలను వాటి మహాత్మాలు అద్భుతంగా వర్ణించారు. దీనిలో తెలుగు వాఙ్మయ లక్ష్మిని వర్ణించిన తీరు జాషువాకి గల ఆంధ్రాభిమానాన్ని చాటుతుంది. సాహిత్యం పై తనకున్న మక్కువను దీనిలో వ్యక్తం చేసారు. శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి విజయ నగర వైభవం అనంతర కాలంలో తంజావూరు పాలకులు కవులను పెంచి పోషించిన విధానం అద్భుతం. ఆంధ్రులు కావ్య రంగంలో కదనరంగంలో సాటి లేని వారని చాటి చెప్పారు. అన్నమయ్య, క్షేత్రయ్య, ముద్దుపళని, నన్నయ్య, తిక్కన, శ్రీనాథాది కవులు ఆంధ్రవాజ్మయ లక్ష్మిని సేవించిన విధం వర్ణించి చెప్పారు.
“మాతృ భాషలకనర్హ మర్యాదలొనరించు/ సర్వకళాశాల సాగు చోట/ ప్రజల నాహరించు బహుమత దేవతా/ దైనందిన గ్లాని లేని చోట/ నవనీత నిభమైన కవుల కమ్మని వాక్కు/ వెఱపులే కావిర్భవించు చోట సంతానమునకు వైషమ్యంబు నేర్పని తల్లిదండ్రులు విరాజిల్లు చోటు అనే తన పద్యంలో జాషువా మాతృభాషలకు గౌరవాన్ని సర్వభాష సమన్వయాన్ని వివక్ష లేని విద్యను వైషమ్యాలు నేర్పని తల్లితండ్రులు -ఉన్న సమాజాన్ని చూడాలన్న ఆశను వ్యక్తపరచారు. మనుషులలో వివక్షతను తొలగించుటకు మానవత్వాన్ని విశ్వ వ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. మానవులంతా సమానులనే భావాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నించారు. విశ్వనరుడిగా పేరొందిన వారు గుఱ్ఱం జాషువా గారు.