Home ఆఫ్ బీట్ ముంగిట్లోకి ఇంటి పంట విత్తనాలు

ముంగిట్లోకి ఇంటి పంట విత్తనాలు

ఆరోగ్యంపై అవగాహన ఎక్కువయిందీ మధ్య. ఆర్గానిక్ అనే పేరు అన్నిచోట్లా వినిపిస్తోంది. సేంద్రియ ఆహారం కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడటంలేదు నగరవాసులు. ప్రస్తుత  కాంక్రీట్ జంగిల్‌లో మొక్కలు పెంచుకునేందుకు సరైన స్థలం ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా  క్రోటన్‌లాంటి మొక్కలు కొన్ని పెంచుకుంటున్నాం. ఆకుకూరలు, కూరగాయల మొక్కలు పెంచుకోవాలనే కోరిక ఉన్నా, మనవల్ల అవుతుందా.. అదంతా ఓ పెద్ద తతంగం అనుకునేవారు చాలామంది ఉంటారు. అలాంటివారికి మేం సాయంగా ఉంటాం అంటున్నారు హోమ్‌క్రాప్ నిర్వాహకులు..

lf

ప్రస్తుత అపార్ట్‌మెంట్ జీవనంలో ఇంట్లోనే మొక్కలను, పాదులను పెంచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక వేళ స్థలం ఉన్నా అదో పెద్దపనిలా అనుకుంటూ, మనవల్ల కాదనుకునేవారున్నారు. డాబాపై స్థలం ఉండి, మొక్కలపై ఆసక్తి ఉంటే చాలు మేమున్నాం మీకు అండగా అంటోంది హోమ్‌క్రాప్ స్టార్టప్ కంపెనీ. కొద్దిగా స్థలం ఉన్నవారు, టెర్రస్, బాల్కనీల్లో సేంద్రియ ఇంటిపంటల సేవలు అందిస్తోన్న హోమ్‌క్రాప్ కంపెనీని కేంద్రప్రభుత్వ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (నార్మ్) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన ఉన్నత విద్యావంతులు మన్వితారెడ్డి, షర్మిలా రెడ్డి స్థాపించారు. నగరవాసుల ఆరోగ్యం మా బాధ్యత అంటున్నారు.
హోం క్రాప్ శ్రీకారానికి కారణం
మార్కెట్‌లో మనం వాడే ప్రతి పదార్థంలో రసాయనాలు ఎక్కువ శా తంలో వాడుతున్నారు. ఆరోగ్యం పాడవుతుంది. ప్రపంచ దేశాలు చాలా వరకు నిషేధించిన పెస్టిసైడ్స్‌ని రైతులు ఇంకా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. నిజం చెప్పాలంటే అటువంటి రసాయనాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే అవగాహన రైతులకు లేదు. కొనుగోలు చేసేవారికి అవేంటో తెలసుకునే అవకాశమే లేదు. మార్కెట్‌కు వెళ్లామంటే కూరలన్నీ కొంచెం మెరుస్తూ, గుండ్రంగా అందంగా ఉంటే చాలనుకుంటు న్నాం. అలాగే కొనేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లోనే కావాల్సి న ఆకుకూరల్ని పండించుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించాం. ప్రస్తు తం ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగింది. అలవాట్లు, డైట్ మా ర్చుకుంటున్నారు. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికే మక్కువ చూపుతున్నారు. కానీ అవి ఎంతవరకు ఆర్గానిక్ వస్తువు లో తెలియదు. ఎందుకంటే మన కళ్ల ముందు పెరగవు కదా. అందుకనే మన ఇంటిపైన మనమే పెంచుకుని, మన పిల్లల్ని పెంచుకున్న విధంగా చూసుకుంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్లే అంటున్నారు నిర్వాహకులు.
ఇంట్లో ఎలా పెంచుకోవాలి
3స్వేర్ ఫీట్ స్థలం ఉన్నా కూడా ఆకుకూరలను పెంచుకోవచ్చని చెబుతున్నారు హోమ్‌క్రాప్ ప్రతినిధి అజయ్. హై ఇంపాక్ట్ పాలిస్టీన్ , గ్రో బ్యాక్స్ అనే కాంబినేషన్‌లో మా దగ్గర రెండు రకాల ఉత్పత్తులు దొరుకుతాయి. గ్రో బ్యాక్స్‌లో టమోటా, పచ్చిమిర్చి, వంకాయలాంటివి పెంచుతాం. బిల్డింగ్‌పై పెంచుతాం కదా మట్టి ఎక్కువగా ఉపయోగించడం వల్ల దానిపై బరువు పెరుగుతుంది కదా అని చాలా మంది ఆలోచిస్తారు. అందుకని మేం మట్టిలో కొబ్బరి పొట్టు కలుపుతాం. అందువల్ల బరువు తక్కువ అవుతుంది. నీళ్లు కూడా తక్కువ పడుతుందని చెబుతున్నారు. క్లయింట్ అవసరాన్ని బట్టి ఏ కిట్ కావాలన్నా అందిస్తుంటారు. సీజన్‌వారీగా ఆయా సీజన్‌కి ఎలాంటి పంటను పెంచుకోవచ్చునో ఆ లిస్ట్ ఒకటి క్లయింట్‌కు ఇస్తారు. దాన్ని బట్టి గ్రోబ్యాక్స్ గ్రోబెడ్ కాంబినేషన్‌లో డిజైన్ చేసి క్లయింట్‌కి ఇస్తారు. వాళ్లు ఒకే చెప్పిన తర్వాత సంస్థకు సంబంధించిన టీం పంటను ఏర్పాటుచేస్తారు. అంతేకాకుండా హోమ్‌క్రామ్‌ను సెట్ చేసి వదిలేయకుండా వాళ్లకు సపోర్ట్ చేస్తారు. మెయిన్‌టెయిన్‌నెస్స్ సపోర్ట్ ఉంటుంది. ప్రతి 15 రోజులకు కాంప్లిమెంటరీ విజిట్ చేస్తారు. మొదటి పంట వచ్చేవరకు సపోర్ట్ ఇస్తారు. క్లయింట్స్ వాట్సాప్‌లో చీడపీడల బారిన పడిన మొక్కల చిత్రాలను వాట్సప్‌లో పంపితే వాటికి సొల్యూషన్ ఇస్తుందీ సంస్థ. ఏ క్రాప్ సైకిల్ అయినా కానీ నాలుగు నెలలుంటుంది. ఒక్క దొండకాయ మాత్రం ప్రతి సీజన్‌లో కాస్తుంది. టమోటో, బెండకాయ, వంకాయలాంటివన్నీ గింజల దగ్గర నుంచి మొక్కలు మొలవడానికి 30 రోజులు పడుతుంది. 45 రోజుల్లో పూలు, 60 రోజుల్లో కాయలు కాయడం మొదలవుతుంది. ఆకుకూరలైతే 3,4 రోజుల్లో మొక్కలొస్తాయి. 15 రోజుల్లో మెంతికూరలాంటివి తీసేసుకోవచ్చు.కొత్తిమీర, పాలకూర, తోటకూర లాంటివన్నీ 20 నుంచి 30 రోజుల్లో చేతికొస్తాయని అంటున్నారు నిర్వాహకులు.
కొబ్బరి పొట్టుతోనే పంట
మట్టి వాడకుండా,కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్ట్, జీవన ఎరువుల మిశ్రమంతోనే మేడపైన ఇంటిపంటల సాగు ఎలా చేయాలో చెబుతున్నారు హోమ్‌క్రాప్ స్టార్టప్ కంపెనీ. 40 శాతం కొబ్బరి పొట్టు, 40 శాతం వర్మీ కంపెస్ట్, 10 శాతం జీవన ఎరువులను కలిపిన మిశ్రమంలో ఇంటిపంటలను సాగుచేయిస్తున్నారు. దీని వల్ల మేడపైన బరువుతోపాటు నీటి ఖర్చు తగ్గుతుంది. బెడ్స్, వర్టికల్ ప్లాంటర్స్, గ్రోబాగ్స్‌ను ఇంటి పంటల సాగుదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటికి 100 నుంచి 125 చదరపు అడుగుల్లో ఇంటి పంటలు సాగుచేసుకోవచ్చని చెబుతున్నారు నిర్వాహకులు. ఏయే మొక్కల పక్కన ఏయే మొక్కలు వేయాలి, వాటి బాగోగులు ఎలా చూసుకోవాలి. వంటి విషయాలను ఇంటిపంటలను కొత్తగా చేపట్టే వారికి తొలి దశలో సంస్థ సిబ్బంది నేర్పిస్తారు. మేలైన విత్తనాలు అందిస్తారు. ఆ తర్వాత వాట్సాప్, ఫోన్ ద్వారా సాయం సలహాలిస్తారు. రెండు మూడు వారాలకోసారి అవసరానికి తగినట్లు విత్తనాలు వేసుకుంటే ఏడాదంతా ఇంటిపంటలకు కొరత ఉండదని హోమ్‌క్రాప్ డైరెక్టర్ ఎల్లు షర్మిలా రెడ్డి చెబుతున్నారు.

ప్యాకేజీలు: కిట్స్ మాదగ్గర 5వేల 8, 10వేలల్లో వివిధ రకాల ప్యాకేజీలున్నాయి. ఈ పంట జీవితకాలం ఇంచుమించు 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుంది. అలా చూసుకుంటే వాళ్లు పెట్టిన పెట్టుబడి కూడా వాళ్లకు వచ్చినట్లే కదా. మేం ఎంత చేసినా క్లయింట్స్ కూడా ప్రతి రోజు ఓ అరగంట మొక్కల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. సొంత పంట తింటున్నామన్న ఆనందంతోపాటు ఆరోగ్యం తోడవుతుంది.

మల్లీశ్వరి వారణాసి