Home ఎడిటోరియల్ వడ్డీ రేటు పెరుగుదల

వడ్డీ రేటు పెరుగుదల

Article about Modi china tour

ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళన, రెండోవైపున ఆర్థిక వ్యవస్థ మందకొడితనం నుంచి పుంజుకుంటున్న అంచనాల మధ్య రిజర్వు బ్యాంక్ రెపో రేటును (బ్యాంకులకు ఆర్‌బిఐ ఇచ్చే రుణంపై వడ్డీరేటు) 0.25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఆ రేటు 6 నుంచి 6.25 శాతానికి పెరిగింది. పర్యవసానంగా బ్యాంకులు తామిచ్చిన, ఇవ్వబోయే రుణాలపై వడ్డీరేటు పెంచుతాయి. రెపో రేటు పెంపుదలను ముందే ఊహించినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు గత వారంలోనే వడ్డీరేట్లు స్వల్పంగా పెంచాయి. గత నాలుగు సంవత్సరాల్లో వడ్డీ రేటు పెంచటం ఇదే ప్రథమం. 2014 జనవరి 28న 8 శాతానికి చేరిన వడ్డీరేటును ఆ తదుపరి సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఆరుసార్లు 200 బేసిస్ పాయింట్లు (అనగా 2 శాతం) తగ్గించటం వల్ల అది 6 శాతం వద్ద కొంత కాలంగా స్థిరంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ మందకొడితనం నుంచి కోలుకునేందుకు ప్రోత్సాహకంగా వడ్డీరేటు తగ్గించాలని ఇటు ప్రభుత్వం నుంచి అటు పారిశ్రామిక వర్గాల నుంచి గోప్యంగా, బహిరంగంగా ఒత్తిళ్లు కొనసాగినప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచటమే తమ ప్రధాన కర్తవ్యంగా రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లు మరింత తగ్గించేందుకు సిద్ధపడలేదు. అయితే ఇప్పుడు ఎందుకు పెంచింది? ద్రవ్యోల్బణ అంచనాలోగాని, జిడిపి వృద్ధి రేటు అంచనాలోగాని చెప్పుకోదగ్గ మార్పును ఊహించని మానిటరీ పాలసీ కమిటీ, వడ్డీ రేటు పెంచటంలో ఔచిత్యం కనిపించదు. ద్రవ్యోల్బణం వస్తువుల ధరలు పెరిగే అవకాశాన్ని త్రోసిపుచ్చలేమంటూనే రుణ గ్రహీతలపై అదనపు భారం మోపటం సరైంది కాదు. అయితే ‘ఉత్పత్తిలో వ్యత్యాసం దాదాపుగా తొలగిపోయింది. పరిశ్రమలు సంస్థాపిత సామర్థాన్ని వినియోగించటం మెరుగుపడింది, రుణాలు తీసుకోవటం పెరిగింది, పెట్టుబడి కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి, వినిమయం బలంగా ఉంది’ అనే అంచనాతో వడ్డీ రేటు పెంపుదల నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, ముడి సరకుల ధరలు పెరుగుదల, డాలర్‌తో రూపాయి బలహీనపడటం వంటి పరిణామాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతాయని భావిస్తూ, భవిష్యత్‌కు సంబంధించి తటస్థ వైఖరితో అనగా పరిస్థితిని బట్టి నిర్ణయాలకు సిద్ధంగా ఉంటామని గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. అంతేగాక ఉద్యోగులకు కరువు భత్యం పెంపుదల, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర పెంపుదల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెంచుతాయన్న పటేల్, వర్షాలు దేశమంతటా తగినంత కురిసే అవకాశం ధాన్యం ఉత్పత్తిని పెంచుతుందని, అందువల్ల వినిమయ ధరల సూచీపై ఒత్తిడి ఉండకపోవచ్చని భావించారు. రైతు రుణ మాఫీలు రాష్ట్ర బడ్జెట్ల నుంచి చేస్తున్నందున బ్యాంక్ ఎన్‌పిఎలపై వాటి ప్రభావం లేదన్నారు. కాగా, ఈ ఏడాది జిడిపి వృద్ధిరేటు అంచనాను 7.4 శాతంగా యథాతథంగా ఉంచారు.
బడా పారిశ్రామిక సంస్థలు లక్షల కోట్ల రూపాయలు మొండిబాకీ పెట్టిన దెబ్బ నుండి కోలుకునే ప్రయత్నంలో బ్యాంకులు ఎన్‌పిఎలకు లాభాలను సర్దుబాటు చేస్తూ సతమతమవుతున్నాయి. కాగా గత సంవత్సరం మరో రూ. 5 లక్షల కోట్లు ఎన్‌పిఎల కిందకు వచ్చాయన్న సమాచారం ఆందోళనకరం. అందువల్ల వడ్డీ రేటు పెంచినా బ్యాంకులు భారీ రుణగ్రహీతల నుంచి రాబట్టుకోగలిగింది లేదు. అందువల్ల గృహ, వాహన రుణాలు, అత్యవసరానికి వ్యక్తిగత రుణాలు తీసుకునే మధ్య తరగతి వేతన జీవుల నుంచి సాధ్యమైనంత అదనంగా రాబట్టుకునేందుకు బ్యాంకులు ఈ వడ్డీరేటు పెంపును ఉపయోగిస్తాయి. ఆర్‌బిఐ రెండవ ద్వైమాసిక ఆర్థిక సమీక్షలో ప్రారంభమైన వడ్డీరేటు పెంపుదల మున్ముందు కొనసాగుతుందని భావించబడుతున్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటం, అమెరికా వడ్డీరేటు పెంపుదలతో మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి మరలటం పెరగటం, రూపాయి మారక విలువను నిలబెట్టవలసిన అవసరం దృష్టా పెట్టుబడుల అనుకూల చర్యగా వడ్డీరేటు పెంచారు. ఆ లక్షం ఏ మేరకు సఫలమవుతుందోగాని దేశంలోని మధ్య తరగతుల నెత్తికి అదనపు భారం చేరింది. దీనికి తోడు దెబ్బమీద దెబ్బగా వస్తువులు, సేవల ఖరీదు స్వల్పంగా పెరుగుతుందని కూడా ఆర్‌బిఐ చెప్పింది. మున్ముందు వడ్డీరేటు పెరుగుదలకు సిద్ధంగా ఉండాలని ఆర్‌బిఐ సంకేతమిచ్చింది.