వెరుపు, అలుపు ఎరుగని పోరాట యోధుడు. త్యాగం తప్ప స్వార్థం తెలియని ధీరుడు. అణగారిన వర్గాల హక్కుల పతాక. ఏడు దశాబ్దాల ధిక్కార స్వరం కేశవరావు జాదవ్ సార్ మొన్న శనివారం అస్తమించిండు. గత మూడు దశాబ్దాలుగా సార్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి నడిచే అవకాశం రావడం నిజంగా అదృష్టమే! విద్యార్థి ఉద్యమాల నుంచి నేటి స్వరాష్ర్టం వరకు సార్ చేసిన దిశా నిర్దేశం, రాసిన రాతలు, చెప్పిన మాటలు అన్నీ మా తరం వారికి చోదక శక్తులు. కొత్త తొవ్వలు. 1952 ముల్కీ ఉద్యమం నుంచి పోరాటం మొదలై, ఉపాధ్యాయ ఉద్యమాలతో మమేకమయిండు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రతాప కిషోర్, రఘువీర్‌రావు, మదన్మోహన్, పద్మనాభంలతో కలిసి ముందున్నాడు. ఎమర్జెన్సీలో హైదరాబాద్‌లో మొట్టమొదటి అరెస్టు జాదవ్సాబ్దే! రమీజాబీ ఉదంతానికి నిరసనగా ఉద్యమాలు చేసిండు. హక్కుల కోసం కొట్లాడిండు. 1968 నుంచి చనిపోయే నాటి వరకూ తెలంగాణ ఉద్యమంతో మమేకమయిండు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరగాల్సిన పనుల గురించి మాట్లాడిండు. కొంత అసంతృప్తిని వ్యక్తం చేసిండు. ఎంతటి వాడైనా సరే అజ్ఞానంగా మాట్లాడితే ఆగ్రహంగా ‘ఓ బేవకూఫ్’హై ఉసే నై మాలూవ్ు’ అని తనదైన హైదరాబాదీ శైలిలో ఉర్దూ, హిందీ, తెలుగు మిళితమైన భాషలో స్పందించేవాడు. హక్కుల ఉద్యమకారుడిగా, పత్రికా రచయితగా, సంపాదకుడిగా, చరిత్రకారుడిగా, కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ‘లోహియా విచార్ మంచ్’ స్థాపకుడిగా, ‘సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి’ స్థాపకుడిగా, సోషలిస్టు ఉద్యమ నాయకుడిగా తనదైన శైలిలో ప్రజలను కూడగట్టిండు. మేధావులను ఏకం చేసిండు. విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిండు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో కలిసి తెలంగాణ ఉద్యమంతో మమేకమయిండు. తన ఇంగ్లీష్ రచన ఎంత షార్ప్‌గా ఉండేదో ఆయన మాట తీరు కూడా అంతే పదునుగా ఉండేది. ఎంతటి వారినైనా సరే తప్పుచేస్తే చాలు ఎలాంటి శషబిషలు లేకుండా నిలదీసెటోడు. అట్లానే ప్రజల సమస్యలను చూసి కంటతడి పెట్టేవాడు.
నిజాం కళాశాల విద్యార్థిగా ఉంటూ 1952లో ముల్కీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. స్థానికులకు గాకుండా స్థానికేతరులకు ముఖ్యంగా మద్రాసు రాష్ర్టం నుంచి వచ్చే వారికి ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పిస్తూ ఉండడం చూసి సహించలేక పోరాటం చేసినాడు. హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ స్థాపించినాడు. అప్పటి బూర్గుల రామకృష్ణారావు కాన్వాయ్‌ని కోటిలోని ఫిరోజ్‌షా పార్క్ వద్ద అడ్డుకున్న బృందంలో జాదవ్సార్ ఉన్నాడు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిటీ కాలేజి నుంచి తీసిన ఊరేగింపులో పాల్గొన్నాడు. ఈ ఊరేగింపుపై అఫ్జల్‌గంజ్ వద్ద కాల్పులు జరిపిండ్రు. ఈ సంఘటనలో కొంతమంది విద్యార్థులు చనిపోయిండ్రు. ఇట్లా ఆది నుంచి విద్యార్థి ఉద్యమాలతో మమేకమయిండు కాబట్టే ఆయన తర్వాతి కాలంలో కూడా వారితో మమేకమయిండు. ఉర్దూ మీడియం, తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కునేందుకు వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహింపజేయడంలో కృతకత్యుడయ్యిండు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మే (ఇంగ్లీషు) చదువుతున్న కాలంలో తన గురువు దొరైస్వామి చాంబర్లోకి విద్యార్థులు వెళ్ళి ఆయన్ని నిలదీసి, వస్తువులన్నింటిని చెల్లా చెదురు చేసిండ్రు. దీంతో ఈ దాడి వెనుక కేశవరావు జాదవ్ ఉన్నాడనే అపోహతో దొరైస్వామి తాను హెడ్ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నన్ని రోజులూ ఆయనకు ఉద్యోగం రాకుండా చేసినాడు. దొరైస్వామి రిటైరైన తర్వాత అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరిన జాదవ్ సార్ కొన్ని రోజులు సిద్దిపేటలో, ఆ తర్వాత వరంగల్‌లో పనిచేసిండు. అటు తర్వాత ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజిలో బోధించినాడు. తన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని తెలంగాణ గ్రామీణ సమాజానికి ఉపయోగపడేలా కృషి చేసిండు. ఉచ్ఛారణపై దృష్టి కేంద్రీకరించే యూరోపియన్ అధ్యాపకులను కాదని, వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో ఉచ్ఛారణ ఉంటుందనీ దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిండు. తెంగాణ విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కలిగించిండు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న కాలంలోనే హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమయింది. ఈ ఉద్యమంలో తన సహాధ్యాయి మదన్‌మోహన్‌తో కలిసి పనిచేసిండు. ఆ తర్వాత జర్నలిస్టులు ప్రతాపకిషోర్, రఘువీర్‌రావు, ఇవిఎస్ పద్మనాభంలతో కలిసి సభలు సమావేశాలు నిర్వహించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కరపత్రాలు వెలువరించినారు. విద్యార్థులకు దిశా నిర్దేశం చేసినారు. ఆ తర్వాత ఉద్యమం రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయి ప్రజల ఆశలకు గండి పడడంతో చెన్నారెడ్డి లాంటి నాయకులతో జాదవ్సాబ్ విభేదించిండు. పోటీగా ‘సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి’ అనే పార్టీని స్థాపించిన వారిలో జాదవ్సాబ్ కూడా ఒకరు. ఈ పార్టీ తరపున గద్వాల నుంచి సమరసింహారెడ్డి, వరంగల్ జిల్లా నుంచి టి. పురుషోత్తమరావు, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి ఈశ్వరీబాయిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయినారు. తెలంగాణ అంతటా తిరిగి ధిక్కార స్వరాన్ని వినిపించినాడు. మొదటి నుంచి లోహియావాదిగా ఉన్న జాదవ్ సార్ 1967లో రావ్‌ుమనోహర్ లోహియా చనిపోయిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ‘లోహియా విచార్ మంచ్’ని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో దాని తరపున వివిధ కార్యక్రమాలను చేపట్టినారు. అలాగే హైదరాబాద్‌లో బద్రివిశాల్ పిట్టీ సహాయ సహకారాలతో పుస్తకాలను, హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అచ్చేసినారు. జయప్రకాశ్ నారాయణ సోషలిస్టు, ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కాలంలో హైదరాబాద్‌లో ముందుండి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది జాదవ్సాబ్. 1974లో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జయప్రకాశ్ నారాయణ సభను ఏర్పాటు చేసిండు. ఆ సభ దక్షిణాదిలో ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమానికి చేయూత నిచ్చింది. దేశంలో ఎమర్జెన్సీని 1975 జూన్ 25న విధించినారు. అయితే 24వ తేది రాత్రి 11 గంటలకే జాదవ్సార్ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎమర్జెన్సీలో తొలి అరెస్టు జాదవ్సార్దే! ఇదే సమయంలో ఎం.టి.ఖాన్, శీతల్‌సింగ్ లష్కరీ, అజాద్ ఖుర్షీద్, నాయిని నర్సింహారెడ్డిలను కూడా ప్రభుత్వం అరెస్టు చేసింది. మరో వైపు తర్వాతి కాలంలో లెఫ్టిస్టులు చెరబండరాజు, వెంకటరమణిలతో పాటు ఆర్ఎస్సెస్ భావజాలం ఉన్నవారిని కూడా ప్రభుత్వ అదుపులోకి తీసుకొని చంచల్గూడా జైలుకు తరలించింది. జైలులో సైతం ఆర్ఎస్సెస్ఆర్ఎస్యూ మధ్యన నిరంతరం గొడవ జరిగేది. ఎప్పుడు గొడవ జరిగినా ఘర్షణ వాతావరణాన్ని చల్లబరిచేది మాత్రం జాదవ్సారే! ఇందుకు గాను జైల్లో నక్సలైట్ల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనా పీడితుల గొంతుకై నినదించడం జాదవ్సార్కు అత్యంత ఇష్టమైన పని. రమేజాబీకి న్యాయం జరగాలని ఉద్యమించిన వారిలో జాదవ్సార్ ముందున్నాడు.
మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1987 88 ఆ ప్రాంతంలో ప్రారంభమైనప్పుడు బిపిఆర్ విఠల్, శ్రీధర్ రెడ్డి, తెలంగాణ ప్రభాకర్, కాళోజి నారాయణరావులతో కలిసి నడిచిండు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో మొదటి పత్రిక ‘మా తెలంగాణ’. ఈ పత్రికను తెలంగాణ ప్రభాకర్ తీసుకొచ్చిండు. దీని సంపాదక వర్గంలో కాళోజి తదితరులతో పాటు జాదవ్ సార్ కూడా ఉన్నాడు. ఇదే సమయంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఏర్పాటు కావడంతో దాని తరఫున కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఆచార్యులు మధుసూధన్‌రెడ్డి, గడ్డం లక్ష్మణ్, హరనాథ్ తదితరులు తరచూ ఖైరతాబాద్‌లో సమావేశమయ్యేవారు. విద్యార్థులుగా కిషోర్‌రెడ్డి, అనిల్ కుమార్, నేను, ఇంకొంతమంది కూడా అప్పుడప్పుడూ అక్కడికి వెళ్ళేవారము. అట్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా 1990లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. విద్యార్థులకు అండగా జాదవ్సార్ ఉండేవారు. ‘ఒలింపస్’ అనే పత్రికను తెలంగాణ ఉద్యమానికి, విద్యార్థుల కార్యక్రమాలకు బాసటగా నిలుస్తూ వెలువరించినాడు. అలాగే ఆ తర్వాతి కాలంలో అంటే 2007లో ‘టువార్డ్స్ ఎ బెట్టర్ మాన్‌కైండ్’ అనే పత్రికను కూడా ఆయన వెలువరించినాడు. ‘ఆన్ ద పొలిటిక్స్ ఆఫ్ ఇల్యూజన్’ పేరిట జాదవ్ సార్ ఆంగ్ల వ్యాసాలు పుస్తక రూపంలో వచ్చాయి. అలాగే ‘రూట్లెస్’ పేరిట తన కవిత్వాన్ని వెలువరించినాడు. తెలంగాణ ఉద్యమం రాజకీయ రూపం దాల్చిన తర్వాత కూడా ప్రజల పక్షాన నిలిచినాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి ఎన్నికలను ఒక వాహికగా ఉపయోగించుకునేవాడు. సోషలిస్టు నాయకుడు ఫెర్నాండెజ్‌ని పిలిపించి సభలు, సదస్సులు నిర్వహించినాడు. చాలా సార్లు మహరాజ్‌గంజ్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆ తర్వాత ఎంపీగా కూడా పోటీ చేసిండు. ఎప్పుడు ఎక్కడ పోటీ చేసినా తెలంగాణ ప్రజల స్థితిగతులను చర్చకు పెట్టేందుకు ఆ అవకాశాన్ని వినియోగించుకునేవాడు. పీడితుల పక్షాన ధిక్కార స్వరాన్ని వినిపించేవాడు. నిజానికి జాదవ్సార్పై చిన్నతనం నుంచీ ఆర్యసమాజ్ ప్రభావం అధికంగా ఉండింది. అందుకే ఎన్నడూ వాళ్ళింట్లోనూ, ఆయనా ఎన్నడూ కులం, మతం గురించి పట్టించుకోలేదు. నిజమైన హైదరాబాద్ గంగాజమున తెహజీబ్‌కు ఆయన అక్షర రూపం. 1933 జనవరి 27న హైదరాబాద్‌లోని హుసేనిఆలంలో శంకర్రావు, అమృతబాయి దంపతులకు జన్మించిన కేశవరావు జాదవ్ తన తండ్రి నుంచి రాతను వారసత్వంగా పుచ్చుకున్నాడు. శంకర్రావు ‘ఫన్కార్’ అనే పత్రికలో ఉర్దూలో అనేక అభ్యుదయ రచనలు వెలువరించేవారు. జీవితమంతా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆధిపత్యాలను ధిక్కరిస్తూ, అణగారిన వర్గాల తరపున పోరాటం చేసిన యోధుడు కేశవరావు మృతి తెలంగాణ చైతన్యానికి తీరని లోటు.
సంగిశెట్టి శ్రీనివాస్
7013060954