Home ఎడిటోరియల్ పేదలకు ఆరోగ్య భద్రత ఎన్ని‘కలే’నా?

పేదలకు ఆరోగ్య భద్రత ఎన్ని‘కలే’నా?

sampadakeyam

గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవలు పూర్తిగా నిర్లక్షం చేయబడిన నేపథ్యంలో, తాజా బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం ప్రకటించిన ఒక భారీ ఆకర్షక పథకం ‘జాతీయ ఆరోగ్య భద్రత పథకం’(ఎన్‌హెచ్‌పిఎస్).10 కోట్ల కుటుంబాలకు (దాదాపు 50 కోట్లమంది) సాలీనా రు.5లక్షలవరకు ఆరోగ్యభీమా కల్పించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2018-19 బడ్జెట్‌లో ప్రకటించారు. అయితే బడ్జెట్‌లో నామమాత్రంగా రూ.2000 కోట్లు మాత్రమే కేటాయించటంతో దాన్ని అమలు పరిచే నిజాయితీపై ఎన్నో సందేహాలున్నాయి. మన దేశంలో తలసరి ఆదాయం రూ.1800. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు తమంతటతాముగా కొన్ని విభాగాల ప్రజలకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను మినహాయిస్తే అత్యధిక జనాభాకు ఆరోగ్యబీమా లేదు. అందువల్ల కొత్త జాతీయ పథకాన్ని (వ్యయంలో 40 శాతం రాష్ట్రాలు భరించాలి) చిత్తశుద్ధి పూర్వకంగా అమలులోకి తెస్తే అది నిస్సందేహంగా పరిమితంగానైనా మేలు చేస్తుంది. ఆరోగ్యసూచికలో అథమస్థానం నుంచి దేశం ఎన్నో మెట్లు ఎగబాకుతుంది, దేశం ప్రతిష్ట ఇనుమడిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అరకొరగా ఉన్న, సక్రమంగా సేవలు అందించలేని ప్రభుత్వాసుపత్రులే దిక్కు. ఆరోగ్య బీమా అనేది ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులతో ముడిపడిన అంశం. బీమా సౌకర్యం ఉంటే మాత్రం మారుమూల ప్రాంతాలనుంచి పేదలు నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు చేరుకోగలరా! సాధారణ జబ్బుల చికిత్సకైనా ప్రాథమిక స్థాయి ప్రభుత్వాసుపత్రులను పటిష్ట పరచటం, పనిచేయించటం తప్పనిసరి అవసరం. వాటిని నిర్లక్షం చేస్తూ ఆరోగ్యబీమా ప్రవేశపెట్టటం కార్పొరేట్ బీమా కంపెనీలకు లాభం చేకూర్చుతుంది, ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగుదల, విస్తరణకు డబ్బు ఉండదు. 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా నిమిత్తం ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియం కింద ఏటా రూ.10వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
కొత్తగా జన్మించిన శిశువులు బరువు తక్కువ దామాషాలు, వారికి టీకాలు, క్షయవ్యాధి చికిత్సలో సాఫల్యత రేటు, ప్రభుత్వాసుపత్రుల్లో పురుడుకు కుటుంబాలు చేస్తున్న ఖర్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలు ప్రాతిపదికగా రాష్ట్రాల ఆరోగ్య సూచీ లెక్కకట్టబడుతుంది. ప్రభుత్వ ఆరోగ్య సేవలు మెరుగ్గా ఉన్న కేరళ, గుజరాత్, హర్యానా, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సైతం గత రెండుమూడు సంవత్స రాల్లో ఆరోగ్యసూచీలో తిరోముఖంలో ఉన్నట్లు జాతీయ ఆరోగ్య నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం ఏటా సగటున తలసరి రూ.1108 ప్రజారోగ్యంపై వెచ్చిస్తున్నది. కాగా కేంద్రప్రభుత్వోద్యోగులపై తలసరి రూ.6300 ఖర్చు చేస్తున్నది. జాతీయ ఆరోగ్యమిషన్ పై 201415లో కేంద్రప్రభుత్వ వ్యయం రూ.20,199కోట్లు, అనగా 125కోట్లమంది జనాభాపై తలసరి వ్యయం రూ.162. మెజారిటీ ప్రజలకు వైద్యసేవలు అందటం లేదని తేటతెల్లమవుతున్నది. డెంగ్యూ, మలేరియా, టిబి వంటి అంటు వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి. మరోవైపున గుండె, శ్వాస, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు పెచ్చుపెరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో పేదలకు, ఆర్థిక బలహీన వర్గాలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. కాగా సువిశాల గ్రామీణ భారతంలో పరిస్థితి చాలా గడ్డుగా ఉందనేది నిర్వివాదాంశం. మనదేశంలో ప్రభుత్వ వైద్యం ఎంతగా నిర్లక్షానికి గురైందో ప్రపంచబ్యాంక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014లో ఆరోగ్యరంగంపై భారత్ వ్యయం జిడిపిలో 1.4శాతం. కాగా చైనాలో 3.1శాతం, శ్రీలంకలో 3 శాతం, ఇథియోపియాలో 2.9శాతం! కాబట్టి వైద్యరంగంపై ప్రభుత్వ వ్యయం జిడిపిలో కనీసం 3 శాతానికి పెంచినపుడే ప్రభుత్వవైద్యంలో గుణాత్మక మెరుగుదల సాధ్యం. ఈ అంశాన్ని దాటవేస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్యబీమాను ముందుకు తెచ్చింది. ఇది ఎలా అమలు జరుగు తుందో ఆసక్తిదాయకం. ఎన్నికల ఎరగా ఈ పథకాన్ని ప్రకటించారా, లేక చిత్తశుద్ధితో అమలు చేస్తారా వేచిచూడాల్సిందే!