Home ఎడిటోరియల్ గళమాంత్రికుడు

గళమాంత్రికుడు

nerella

కళలకు కాణాచి అయిన ఓరుగల్లులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధ్వన్యనుకరణ సామ్రాట్, కళా ప్రపూర్ణ డాక్టర్ నేరెళ్ల వంటి హిమగిరి శిఖర మహోన్నత వ్యక్తి జన్మించడం బంగారానికి తావి అబ్బినట్లయింది. మిమిక్రీ మోనోయాక్షన్‌లో ఆయనకు ఆయన సాటి. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఇచ్చిన అసంఖ్యాక ప్రదర్శనలు ఆయనలోని అసమాన ప్రతిభను చాటి చెప్పాయి.వరంగల్ వాస్తవ్యులు నేరెళ్ల శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబర్ 28న జన్మించారు వేణుమాధవ్. ఆయన నాట్యకళ అభ్యాసానికి 1947 లో విద్యార్థి దశలోనే శ్రీకారం చుట్టారు. ఉస్మానియా యూనివర్శిటీలో బి.ఎ., బి.కాం., బి.ఇడి పూర్తి చేశారు. కొన్నేళ్లు ఉపాధ్యాయునిగా పని చేశారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ భాషల్లో బాగా పరిచయం ఉన్న వారు. భక్త పోతన చిత్రం చూసి నాగయ్య గారిని, స్వర్గసీమ చిత్రం చూసి భానుమతి గారిని అనుకోకుండా అనుకరించారు. నాటి నుండి ఆ కళను అత్యున్నత కళారూపంగా రూపొందించారు వేణుమాధవ్. తెలుగు నాటకాల్లో ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, సారంగధరుడు, చిత్రాంగి, గిరీశం, మధురవాణి, శివాజీ, రోషనార మొదలైన వివిధ పాత్రల సంభాషణలు అతి సహజంగా ఆయన ఏక కాలంలో అభినయించారు. అనుకరించి నవ్వించడం ఆయన ప్రత్యేకత. భిన్న మనస్తత్వాలను యధాతథంగా ప్రదర్శిస్తారాయన. ధ్వన్యనుకరణలో వేణు మాధవ్ విశేషమైన కృషి చేశారు. గాంధీ, నెహ్రూ, రాధాకృష్ణన్, బోస్, కెనడీ, లాల్‌బహదూర్ శాస్త్రి మొదలైన వారి ఉపన్యాసాలు యధాతథంగా వారి కంఠస్వరాలతో సహజంగా వినిపిస్తారు. హిందీ నటులైన పృథ్వీరాజ్, రాజ్‌కపూర్, బలరాజ్ సహానీ, అశోక్ కుమార్, ఆంగ్ల నటులైన లారెన్స్, అలీవర్‌లను స్ఫురణకు తెప్పించారు.
తెలుగు నటుల్లో నాగయ్య,నాగేశ్వర రావు, రామారావు, రంగారావు, రేలంగి, పద్మనాభం, గుమ్మడి, భానుమతి, సుబ్బలక్ష్మి, విశ్వనాథ, జాషువా, దాశరథి, నారాయణరెడ్డి, దివాకర్ల, రామరాజు మొదలైన రచయితలను సహజ కంఠస్వరాలతో ముఖ భంగిమలతో చక్కగా వినిపించడం ఆయన ప్రత్యేకత. అలాగే దూరం నుండి వినిపిస్తున్న గుఱ్ఱపు డెక్కల చప్పుడు, క్లేరినేట్, ఫిడేల్ మొదలైన వాయిద్యాల ధ్వనులను నేపథ్య సంగీతంలో మిళితం చేస్తూ ఆయా ఘట్టాలు అభినయించడం ఆయనకే చెల్లింది. డాక్టర్ వేణుమాధవ్‌కు స్వాగతం పలికి సత్కరించని ప్రధానమైన నగరం, పట్టణం భారతదేశంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఆస్ట్రేలియా, లెబనాన్, మలేసియా, ఫిజి, దక్షిణాఫ్రికా, మారిషస్ మొదలైన విదేశాలలో జరిగిన ఆయన అద్భుతమైన ప్రదర్శనల్లో ప్రేక్షకులు కిక్కిరిసి హాజరు కావడం ఆయన ప్రతిభకు తార్కాణం.డాక్టర్ వేణు మాధవ్ కళాత్మక వ్యక్తిత్వానికి నిగర్వం ఒక భూషణం. డాక్టర్ ముల్కరాజ్ ఆనంద్ వంటి జగద్విఖ్యాత రచయిత ఆయనను “చుపేరుస్థుం” అని ప్రేమతో పిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. డాక్టర్ హరిశ్చంద్ర చటోపాధ్యాయ వంటి మేధావి వేణుమాధవ్‌ను ఉద్దేశించి ప్రపంచానికి నవ్వుల జల్లులు కురిపించే కళాకారుడని శ్లాఘించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ప్రతిభను తిలకించి అద్భుతమైదని ప్రశంసించారు. ఇలాంటి అరుదైన, కష్టమైన కళను మీరు ఉపాసించి సాధించడం గొప్ప విషయమని భగవంతుడు మిమ్ము ఆశీర్వదించాలని అభిలషించారు. అనేక సంస్థలు అసోసియేషన్లు వేణుమాధవ్‌ను సన్మానించాయి. “ధ్వన్యనుకరణ సామ్రాట్‌” గా “ధ్వన్యనుకరణ చక్రవర్తి”గా, “కళా సరస్వతి”గా “మిమిక్రీ సామ్రాట్‌” గా, “కళాప్రవీణుడు”గా, స్వరాకారరాజా” గా పలు బిరుదులతో ఆయనను సత్కరించారు. వీరిని “రాజ్యలక్ష్మి” అవార్డు వరించింది. రాష్ట్ర ప్రభుత్వం 1972- 1978 సంవత్సరాలలో ఆయనను శాసనమండలి సభ్యునిగాను, 197677లో చలన చిత్ర అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గాను నియమించి సత్కరించింది. విద్యాసంబంధ సమీక్షా కమిటీ సభ్యునిగా, ప్రపంచ తెలుగు మహాసభ చలన చిత్రోత్సవాల కార్యదర్శులలో ఒకరుగా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి గ్రంథాలయ కమిటీ సభ్యులుగా వేణుమాధవ్ గౌరవ పదవులను నిర్వహించి, ఆ పదవులకే వన్నె తీసుకొచ్చారు. సంగీత నాటక అకాడమీ, రవీంద్ర భారతి కమిటీ సభ్యులుగా సేవలందించారు.
కాకతీయ విశ్వ విద్యాలయ సెనేట్ సభ్యునిగా యూనివర్శిటీ అభివృద్ధికి సేవలందించారు. వరంగల్ రోటరీ క్లబ్ వేణుమాధవ్‌కు గౌరవ సభ్యత్వం ఇచ్చి ఘనంగా సత్కరించింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా ఆయనకు “కళా ప్రపూర్ణ బిరుదు”తో పాటు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించింది. జెఎన్‌టియు 1977లో “గౌరవ డాక్టరేట్‌” ఇచ్చి ఆయనను సత్కరించింది. 1978 లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు, కౌన్సిల్‌లోని పెద్దలంతా కలిసి డాక్టర్ వేణు మాధవ్ 30 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కొనసాగించిన కళాసేవను గుర్తించి ఘనంగా సత్కరించి అభినందించారు. ఓరుగల్లు పౌరులు వేణు మాధవ్ 50వ జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి ఆయన ప్రతిభను సత్కరించారు. కళారంగంలో వీరు అత్యున్నత శిఖరాలకు ఎదగడంలో ఆయన సతీమణి శ్రీమతి శోభా వేణు మాధవ్ ప్రోత్సాహాలు తోడ్పడ్డాయి.