Home ఆఫ్ బీట్ సృజనరంగమే ఆయన లోపలిమనిషి

సృజనరంగమే ఆయన లోపలిమనిషి

P.V.N

పి.వి.నరసింహ రావు భాషల్ని ప్రేమించాడు, సాహిత్యాన్ని ప్రేమించాడు. విశ్వనాథ నుంచి కాళోజీ దాకా ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునికత దాకా సాహిత్యంలోని లోతు పాతుల్ని అధ్యయనం చేసే పని కొనసాగించాడు. తాను కథల్ని రాశాడు, అనువాదాలు చేశాడు. లోపలి మనిషి బయటి మనిషి లాగా ఇద్దరు మనుషుల్ని తనలో దాచుకుని మౌనంగానూ గుంభనంగానూ గడిపాడు.
రాజకీయాల్లో ఆపర చాణుక్యుడని, భారత దేశానికి ఆర్ధిక సంస్కరణలు తెచ్చి ప్రపంచీకరణకు పాదులు వేసిన వాడుగానూ పేరు గడించిన పి.వి.నరసింహ రావు రాష్ట్రమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాన మంత్రి గానూ అనేక పదవులు నిర్వహించి అరకొర మెజారిటీతో అయిదేళ్ళ పాలనను కొనసాగించినప్పటికీ ఆయన లోపలి మనిషి మాత్రం చివరంటా సాహిత్య సృజన రంగాల వైపునకే మొగ్గు చూపింది. తన లోపలి మనిషి ఆవిష్కరిస్తూ రాసిన‘లోపలి మనిషి’రెండవ భాగం పూర్తిచేయకుండానే వెళ్ళిపోయాడు. ఆయనగురించి ఈ లోకానికి తెలిసినదానికంటే తెలియందే ఎక్కువ. ఆయన రాసిన దానికంటే రాయనిదే ఎక్కువ అనుకుంటాను. ఆయన రాసిన విషయాలు చదివితే నిజంగా ఆయన రాయాల్సిన అంశాలెన్నో వున్నాయని తోస్తుంది. అందుకే పి.వి.నరసింహా రావు లోపలి మనిషి వేరే, ఆ మనిషిని తెలుసుకునే ప్రయత్నం ఇంకా జరగాల్సే వుంది.
సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన పి.వి.కి చిన్నప్పుడే సాహితీ స్పర్శ తగిలింది. గార్లపాటి రాఘవ రెడ్డి గారి శిష్యరికంలో హైస్కూల్ చదువుల నాడే పద్య కవిత్వంపై పరిచయం కలిగి, మక్కువ పెరిగింది తర్వాత పాములపర్తి సదాశివ రావు, కాళోజి, బూర్గుల, దేవులపల్లి రామానుజ రావుల సాంగత్యంలో సాహిత్యం పై మక్కువ మరింతగా పెరిగింది. పివి కూతురు సురభి గారి మాటల్లో చెప్పాలంటే అయన మంచి గాయకులూ, ఫోటోగ్రఫీ అంటే సరదా వున్న వాడు.
బహుశా పివి రాజకీయాల్లోకి రాకుండా వుండి వుంటే ఆయనకున్న విద్వత్తుకి అంతర్జాతీయ గుర్తింపును అందుకునే వాడు. నోబెల్ దాకా వెళ్ళినా వెళ్ళేవాడు.
పివి కేవలం భాషలు నేర్చుకోవడమే కాదు చరిత్రని, తత్వశాస్త్రాన్ని, భారతీయ ప్రాచీన వైదిక ఆధ్యాత్మిక అంశాల్ని అధ్యయనం చేశాడు. ఆయనే ఒక చోట అంటాడు ‘జాతీయ పునరుజ్జీవన ప్రక్రియను సక్రియ సృజన శక్తిగా సాధించుకున్నప్పుడే మన ఆధునిక విజ్ఞాన శాస్త్ర వికాసాన్ని ప్రగతిని ప్రాచీన సంస్కృతితో సమన్వయ పరుస్తూ ముందుకు సాగ గలుగుతాము. స్వాతంత్య్రాన్ని స్వావలంబనను సహకారాన్ని బలపరుచుకొనగలుగుతాము. పివి ఎన్నో వృత్తాలు, ద్విపదలు, గీతాలూ రాశారు. జమీందారుల హైందవ ధ్వంసకా….. అంటూ గేయమూ రాశారు. ఎదవనాగన్న పేరుతో కథనూ, కొన్ని భావ గీతాల్ని, షేక్స్ పియర్ నాటకాలకు తెలుగులో కథా సంగ్రహాలూ రాశారు.
పివి రాసిన తెలుగు , ఇంగ్లీష్ కథలు సాహితీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. వాత్సవ వాద దృక్పధంతో సాగిన ఆ రచనలు విశేష ప్రశంసలు అందుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పివి రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ తెలుగు సాహిత్యంలో విశిష్ట మయింది. ఆయన రాసిన మరో కథ ‘మంత్రి గారు’ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు పివి 1943 బెంగాల్ కరువు నేపధ్యం లో రాసిన ఇంగ్లీష్ కథ , స్వాతంత్య్రానంతర కాలంలో పెల్లుబికిన హింసను వ్యతిరేకిస్తూ ఆయన రాసిన ‘బ్లూ సిల్క్ సారీ’ కూడా మంచి కథగా నిలిచింది. ఇంకా పివి ‘మంగయ్య అదృష్టం’ నవలికను అనేక పీఠికలు, సమీక్షలూ రాశారు. సృజన రంగంలో రచనలు చేసినప్పటికీ ఆయన సాహితీ రంగంలో ప్రధానంగా రాసినవి అనువాదాలు. బహుభాషా కోవిదుడయినా పివికి తెలుగుతో సమానంగా హిందీ, మరాఠీ భాషా ప్రావీణ్యం వుండేది. అందుకే ఆయన ఆ భాషల్లోకి ఆలవోకగా అనువాదాలు చేశాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ నవల ‘వేయిపడగలు’ ను ఆయన హిందీ లోకి ‘సహస్రఫణ్’ పేరిట అనువాదం చేశారు. తెలుగులో మూల రచన కున్న పేరు ప్రఖ్యాతులు సహస్రఫణ్ కు హిందీలో లభించాయి. దానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ‘ నేను ప్రగతి వాదిగానే వేయిపడగలు ఉత్తమ గ్రంథమని అర్థం చేసుకున్నాను, విశ్వనాథ ఇతర రచనలను కూడా అనువదించాలని భావించి నప్పటికీ ఆయన చేయలేక పోయారు.
ఇంకా మరాఠీ రచయిత హరి నారాయణ ఆప్టే రాసిన ‘పాన్ లక్షాత్ కొంమేతో’ నవల ను ‘అబల’ పేరుతో పివి అనువదించారు. జ్ఞాన్ పీఠ అవార్డు గ్రహీత వి ఎస్ ఖండేకర్ హిందీ నవల ‘యయాతి’ ని కూడా పివి అనువదించారు. శ్రీమతి లలితా శాస్త్రి రాసిన ‘మేరుపడి మేదేదేవ్’ ఆత్మకథను కూడా తెలుగులోకి అనువదించారు పి.వి. ఇంకా ఆయన చేసిన సాహిత్య ప్రసంగాలూ వివిధ సందర్భాల్లో రాసిన పుస్తక సమీక్షలూ, రాసిన పీఠికలూ మంచి సాహిత్య విలువలతో వున్నాయి. జ్ఞాన పీఠ అవార్డును అందుకున్న అనేక రచనలకు ఆయన ముందుమాటలు రాశారు.
పత్రికా రచయితగా కూడా పివి తన ముద్రను చాటుకున్నాడు. 1945 నుండి 1952 దాకా వరంగల్ నుండి వెలువడిన కాకతీయ పత్రికలో పివిది ప్రధాన పాత్ర. పాముల పర్తి సదాశివ రావు సంపాదకుడిగా వెలువడిన ఈ పత్రికలో సదాశివరావుతో కలిసి జయ విజయ పేరుతో అనేక వ్యాసాలూ రాశారు. 1969 లో విశ్వనాథ సాహిత్య సురభి, 1973లో కొత్త రాజి రెడ్డి రాసిన ఇందిరా విజయం బుర్రకథను, వానమామలై జగన్నాదాచార్యులు రాసిన ‘రైతు రామాయణం’ కావ్యాన్ని పివి అంకితం తీసుకున్నారు.
1996 ప్రధాని పదవినుంచి వైదొలగిన తర్వాత పివి తన ఆత్మ చారిత్రాత్మక కథాత్మక రచన ‘ది ఇన్ సైడర్’ రాశారు. భారత రాజకీయాల లోపలి ఆత్మను ఆ నవల ఆవిష్కరించింది. తన అనుభవాలను వాస్తవాలతో రంగరించి రాసిన ఈ నవలలో కొంత ఊహ, కొంత కథనం కలగలిసి పోయి సాఫీగా సాగుతుంది. భారత దేశ రాజకీయాల్ని కథా కథనాత్మక సరళిలో గొప్పగా సాగుతుంది. సున్నిత హాస్యంతో సులభ శైలిలో సాగి బాగా చదివిస్తుంది. 50 ఏళ్ల రాజకీయ సారాంశాన్ని పా ఠకుడి ముందుంచుతుంది. సున్నిత హాస్యంతో సులభ శైలిలో సాగే ఈ రచన నవల గానూ చారిత్రిక రచన గానూ వుంటుంది. ఇందులోని ముఖ్యపాత్ర ఆనంద్ అనుభవాల్లో అధిక శాతం పివి తన జీవిత అనుభవాల్లోంచి తీసుకున్నవే. భారత రాజకీయాల్ని అమితంగా ప్రభావితం చేసిన అత్యంత ముఖ్యమయిన సందర్భాల్లో కీలక నిర్ణాయక వర్గంలో సభ్యుడిగా వున్న పివి ఆయా కాలాల్లోని పాలక వర్గపు లోతు పాతుల్ని ఇన్ సైడర్ లో చిత్రించాడు. దాన్ని కె.భాస్కరం తెలుగులోకి ‘లోపలి మనిషి’ పేరా అనువదించారు. తెలుగు ఇంగ్లీష్ రెండూ చదువరుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇన్ సైడర్ రెండవ భాగాన్ని పూనుకున్న పివి కొంత భాగాన్ని రాసి మరిన్ని పేజీలు రాయాల్సి ఉండింది కాని ఇంతలో ఆయన ఆరోగ్యం దెబ్బ తిని ఆయన వెళ్ళిపోయారు.పి వి నరసింహ రావు సాహిత్య ప్రపంచంలో తన కొక స్థానాన్ని నిలుపుకొని, మరొక శూన్యాన్ని మిగిల్చి వెళ్లి పోయారు.

వారాల ఆనంద్
9440501281