Home ఆఫ్ బీట్ తెలంగాణ జనజీవన చిత్రకారుడు

తెలంగాణ జనజీవన చిత్రకారుడు

dasarati-rangacharya

‘తెలంగాణ’ అనగానే గుర్తొచ్చె అతికొద్ది మందిలో దాశరథి రంగాచార్య ఒకరు. నాటి రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొ న్న వ్యక్తిగా, తెలంగాణ జనజీవితాలను నవలీకరించిన రచయితగా, వేదాలను ప్రజల భాషలో అందించిన అక్షర వాచస్పతిగా ఆయన సుపరిచితం.రంగాచార్య ఆనా టి తెలంగాణాలో దొరల, అధికారుల ఆగడాలను, ప్రజల కడగండ్లను కళ్లారచూశారు. ఆ దయనీయ సంఘటనలు రంగాచార్య హృదయంపై బలీయమైన ముద్రను వేశాయి. వాటిని చూసి వదిలేయకుండా ముందు తరాల కు అందించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు. అందుకే ఆ ప్రజల జీవితాలను అద్దం లో చూపినట్టు రాయగలిగారు.
పూర్వపు తెలంగాణాలో గ్రామాల నిర్మాణం ఎలా ఉండేది? ప్రజల జీవన విధానం ఎలా ఉండేది? జాగీర్లు అంటే ఏంటి? నాటి ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి? వెట్టిచాకిరి ఎన్ని రూపాల్లో ఉండేది? గడీల్లో ఆడబాపల బతుకులు ఎలా ఉండేవి? కుక్కిన పేనుల్లా ఉండే జనం ఎలా చైతన్యం పొందారు? సాయుధ పోరాటంలో సంగం పాత్ర ఏంటి? ప్రపంచ ప్రసిద్ధమైన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం ఎలా సాగింది?స్వాతం త్య్రం తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి?… నేటి తరం తెలుసుకోవాల్సిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు దాశరథి రంగాచార్య నవలలే సమాధానం. సమాధానం మాత్రమే కాదు, ఆనాటి మొత్తం తెలంగాణ సమాజాన్ని, చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంసృ్కతిక చరిత్రను కళ్లెదుట సాక్షాత్కారింపజేస్తాయి.
దాశరథి రంగాచార్య మొత్తం తొమ్మిది నవలలు రాశారు. అవి, చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు, రానున్నది ఏది నిజం?, పావని, మానవత, శరతల్పం, అమృంతగమయ. వీటిలో తొలి మూడు నవలలు తెలంగాణ జనజీవితాలను చిత్రించిన పిరియాడికల్ నవలలుగా గుర్తింపు పొందాయి. ఈ మూడింటితోపాటు నగరం ఇతివృత్తంగా సాగిన ‘మాయజలతారు’ నవలను కూడా చేర్చుకోవాలి. ఈ నాలుగు నవలలు తెలంగాణ జన జీవితాలను సమగ్రంగా చిత్రించాయి. తెలంగాణ సమాజం ప్రాచీన సంసృ్కతికి ఆలవాలమైన దశ నుంచి…వెట్టిచాకిరి వంటి మధ్యయుగాల నాటి ఫ్యూడల్ భూస్వామ్య విధానాల్లో నలిగిన స్థితిని..ఆ అణచివేత నుం చి చైతన్యం పొంది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్మించి నిజాంను గద్దె దించే స్థాయికి ఎదిగిన తీరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. మిగిలిన నవలల్లోనూ మానవతకు పెద్దపీట వేస్తూ ఆదర్శవంతమైన సమాజాన్ని ఆకాంక్షించారు రంగాచార్య. ఈ నెల 8న దాశరథి రంగాచార్య వర్థంతి. ఈ సందర్భంగా రంగాచార్యను స్మరించుకుంటూ.. తెలంగాణ జనజీవితాలకు అద్ధంపట్టిన ఆయన నవలల ఇతివృత్తాల సంక్షిప్త పరిచయం.
చిల్లరదేవుళ్ళు: రంగాచార్య తొలి నవల చిల్లరదేవుళ్ళు. తెలంగాణ మాండలికంలో వెలువడిన ఈ నవల సంచలనం సృష్టించింది. రేడియో నాటకంగా, సినిమాగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని సొంతంచేసుకంది. 1938కి పూర్వపు తెలంగాణా ప్రజల జీవితమే “చిల్లరదేవుళ్లు” కథా వస్తువు. అందుకే రంగాచార్య కొందరు వ్యక్తుల జీవితాలను కాక, ఆనాటి సమాజానికి ప్రతిబింబమైన సంపూర్ణ గ్రామ జీవితాన్ని కథా వస్తువుగా స్వీకరించాడు. నాటి గ్రామ వ్యవస్థ తీరుతెన్నుల ను ప్రదర్శిస్తూనే, అమానుషమైన దొరలు, అధికారుల దోపిడి, దుర్మార్గాలు, వెట్టి, బేగరిలాంటి కట్టుబాట్లు, మతమార్పిడి, బాపల దుర్భర జీవితాలను వర్ణించారు. బతుక మ్మ, దసరా ఉత్సవాలు నవలలో చోటుచేసుకున్నా యి.
మోదుగుపూలు: “చిల్లర దేవుళ్లు” నవలలో 1938కి పూర్వపు తెలంగాణా ప్రజా జీవితం చిత్రించబడితే, “మోదుగుపూలు”లో 1938 నుంచి 1948 వరకు, అంటే హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య జరిగే దాక తెలంగాణా ప్రజా జీవితం, ప్రజా పోరాటానికి ప్రజలు సిద్ధమైన తీరు చిత్రించబడింది. “చిల్లర దేవుళ్లు”లో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్న రంగాచార్య, “మోదుగుపూలు”లో ఒక జాగీర్‌ను కథా వస్తువుగా తీసుకున్నారు. దీని పరిధి విసృ్తతం. కొన్ని గ్రామాలు, కోయ గూడాలతో, నిజాం సంస్థానంలో మరో సంస్థానంలా ఉంటుంది జాగీర్. జాగీర్దార్ ఎక్కడో పట్నంలో ఉంటాడు. అతడికి పరిపాలన, ప్రజల క్షేమం పట్టదు. పాలన అంతా తాసిల్దార్ చేతిలో ఉంటుంది. అతనే జాగీర్‌కు “సర్వతంత్ర స్వతంత్రుడైన” ప్రభువు. అక్కడ ఒక శాసనమంటూ ఏమీ ఉండదు. “దండించడమే” శాసనం. అలాంటి జాగీర్‌లో కథానాయకుడు రఘు చైతన్యం కలిగిస్తాడు. మంగలివారిచేత సమ్మె చేయిస్తాడు. వడ్డెర్లలో చైతన్యం కలిగించిబంగ్లాకు వెట్టికి రాళ్లుకొట్టే దశ నుంచి కూలి తీసుకునే స్థాయికి చేరుస్తాడు. వార్తా పత్రిక చదవడమే నిషిద్ధమైన జాగీర్‌లోకి వార్తా పత్రిక తెస్తారు. తేవడమే కాదు, ఊరి ప్రజలందరిచేత చదివిస్తాడు. నాగరిక సమాజానికి దూరం గా కోయల ఆచార వ్యవహారాలు సహజ సుందరంగా చిత్రించారు రచయిత. చారిత్రక అంశాలతోసహా పీర్ల పండగ వృత్తాంతాన్ని, జరుపుకునే విధానం వివరంగా వర్ణించబడింది. జాగీర్దార్ల జల్సాలు, తాసిల్దార్, గిర్దావరు, అమీన్,సాహుకారుల దోపీడి, పీడన, అరాచకత్వం ఎలా ఉంటుందో నవలలో చిత్రించబడింది.
జనపదం: మూడో నవల “జనపదం”. ఈ నవల ఇతివృత్తం చాలా విశాలమైనది. 1948 తర్వాత తెలంగాణా ప్రజల్లో వచ్చినమార్పు, మారిన గ్రామ స్వరూపాలు, స్వాతంత్య్రం తరువాత కూడా మారని బడుగుల జీవితాలు, దొరల దోపిడీ, కలుషితమైన రాజకీయాలు, ఎన్నికల ప్రహసనాలు, తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరులు నిస్సహాయులుగా మారడం, ఆ నిస్సహాయతలోంచి కొత్త తరం ఆవిర్భవించడాన్ని నవలలో చిత్రించారు రంగాచార్య. మిగతా నవలల్లాగే ఇందులోనూ భూ సమస్య ప్రధానంగానే కనిపిస్తుంది. సుదీర్ఘమైన ఇతివృత్తంతోపాటు నవలలో నిజాం నవాబుపై బాంబులు వేయడం, భూదానోద్యమం, ముల్కీ ఉద్యమంలాంటి చారిత్రక సం ఘటనలు, బారసాల, ఉగా ది పండగ, కాముని పున్నమి వృత్తాంతాల ద్వారా తెలంగాణా ప్రజల చారిత్రక, సాంఘిక చరిత్రను ఈ నవలలో చిత్రించారు రంగాచార్య.
మాయ జలతారు: ‘మాయ జలతారు’ నవల కథా వేదిక నగ రం. నగర సమస్యల నేపథ్యంలో సాగుతుంది నవల. స్వాతం త్య్రం తర్వాత నగరాలకు వలసలు పెరిగాయి. క్రమంగా నగరాల్లో వ్యాపార సంసృ్కతి పెరిగి పేదవారి జీవితం ఎంత దయనీయంగా మారిందో కళ్లకుకట్టారు రంగాచార్య. ఈ నవలలో సంపన్నుల జీవితాలు కూడా సమాంతరంగా చిత్రించబడ్డాయి. నగరంలో అట్టహాసంగా నిర్వహించే మహంకాళీ జాతర, బోనాలు, రంగం వృత్తాంతాలు కూడా నవలలో చోటుచేసుకున్నా యి. నవలలో చిత్రితమైన సమస్యలు నేటికి కనిపిస్తూనే ఉన్నాయి.
రానున్నది ఏది నిజం?: సామ్యవాద వ్యవస్థలో, మనిషి వ్యవస్థ కోసం, వ్యవస్థ మనిషి కోసం పనిచేస్తాయి. విద్య, వైద్యం ఉచితం.నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం ఉండవు. ఇలాంటి సమాజం భారత దేశంలో వస్తే ఎలా ఉంటుందో “రానున్నది ఏది నిజం?” నవలలో చిత్రించారు.
పావని: స్వాతంత్య్రం వచ్చిన 30 ఏళ్ల తర్వాత కూడా, స్వరాజ్య కాంతులు ప్రసరించని గ్రామాలు, అభివృద్ధి జాడ అంటని గ్రామాలు, మధ్య యుగాలనాటి భూస్వా మ్య వ్యవస్థకు చిహ్నమైన పాలన, వెట్టిచాకిరికి నిలయంగా మారిన గ్రామాల దుస్థితిని, ప్రజల వెతలు, అమానుషమైన అంటరాని తనాన్ని “పావని” నవలలో చిత్రించారు రంగాచార్య.
మానవత: మత నేపథ్యంలో సాగిన నవల “మానవత”. రంగాచార్య నవలలన్నింటిలో “మనిషి, మానవత” అంతస్సూత్రంలా ఉంటాయి. జన్మత: వ్యక్తి మంచివాడేనని, సమాజమే అతన్ని చెడ్డవానిగా మారుస్తుందని, అందుకే సమాజాన్ని మార్చాలనే మాటలు, మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. అయితే, డబ్బు పరంగానే కాకుండా, మత ఛాం దసవాదులు, మానవతను మతం ముసుగులో ఎలా బంధిస్తారో, అలాంటివారిలో సైతం ప్రాణంపైకి వచ్చినప్పుడు మతాలను పక్కనపెట్టి మానవత ఎలా పెల్లుబుకుతుందో నవలలో చిత్రించారు రచయిత. అంతిమ విజయం “మానవత”దే అన్న సత్యాన్ని ఇందులో నిరూపించారు.
శరతల్పం: ఈ నవలలో కోరికలు మృత్యువును గెలుస్తాయని నిరూపించారు రంగాచార్య. గ్రామీణ వ్యవస్థలో కుల కట్టుబాట్లు, అంటరానితనం ఎంత పాశవికంగా ఉంటాయో కూడా నవలలో వర్ణించారు. మలినం లేని స్నేహానికి కులాలు అడ్డంకి కావని నారాయణస్వామి, గురువయ్య పాత్రలద్వారా నిరూపించారు.
అమృతంగమయ: గ్రామ స్థాపన మొదలు, దాని క్రమ వికాసం, పారిశ్రామికీకరణ, పాశ్చాత్యీకరణ సమాజంలో తెచ్చిన మార్పులు, పడిపోతున్న మానవ విలువలు కన్నులకు కట్టినట్లు చిత్రించింది ‘అమృతంగమయ’. మరణం వైపు పయనిస్తున్న మానవజాతిని అమృతంవైపు ఒక ఉన్నతమైన సమాజ స్థాపన దిశగా పయనింపజేస్తుంది. నవలలో కథ చెప్పడం కన్నా సంఘటనలు చెప్పడమే రంగాచార్య ప్రధాన ఉద్దేశం. అందుకే నవలలో ప్రధాన కథకన్నా, సంఘటనల చిత్రీకరణే అధికంగా కనిపిస్తుంది. భారతీయ వేద సంసృ్కతి, సంప్రదాయం, విలువలు, రాజకీయాలు ఇలా అనేక అంశాలను సందర్భోచితంగా పేర్కొన్నారు.భారతీయ సంసృ్కతి గొప్పదనం, భారతీయ ధర్మా న్ని ఆంగ్లేయులు పతనంచేసిన తీరును నవల అంతట సాక్షాత్కరింపజేశారు. దాశరథి రంగాచార్య రచనా శిల్పం అనన్య సామాన్యం. శైలి రక్తికట్టిస్తుంది. పుస్తకం ముగిసే దాక మూయనివ్వదు. ఇది ఆయనకు సహజంగా అబ్బిందికాదు. నవలలు రాయాలని నిర్ణయించుకున్నాక, ఇం గ్లీషు, హిందీల్లో ఎన్నో పుస్తకాలు అధ్యయనంచేశారు. చాలా నవలలు చదివారు. అలా ప్రయత్నపూర్వకంగా తన కంటూ ప్రత్యేకమైన శైలిని అలవర్చుకోగలిగారు. రంగాచార్య నవలలు చదువుతున్నప్పుడు పాఠకుడు ఆ సంఘటనల్లో లీనమైపోతాడు. పాఠకుల కళ్లెదుట తెలంగాణాను చిత్రికపట్టి వారి హృదయాలపై బలమైన ముద్రను వేస్తాయనడంలో సందేహంలేదు. అంత ఆత్మీయంగా ఉంటుంది రంగాచార్య రచనా శైలి.
(ఈనెల 8న దాశరథి రంగాచార్య వర్ధంతి)

డా॥వి.జయప్రకాష్
9550002354