Home ఎడిటోరియల్ పాకాన పాక్ రాజకీయాలు

పాకాన పాక్ రాజకీయాలు

edit

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పదేళ్ళు, అతని కూతురు మర్యంకు ఏడేళ్ళు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నవాజ్ పార్టీ పాకిస్తాన్ ముస్లింలీగ్‌కు ఇది పెద్ద దెబ్బ. పాకిస్తాన్ లో జులై 25న ఎన్నికలు జరగవలసి ఉంది. నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ లోని ఖరీదైన ప్రాంతంలో నాలుగు అపార్టుమెంట్లు కొనుగోలు చేసిన వ్యవహారం చివరకు మాజీ ప్రధానిని జైలుపాలు చేసింది. ఈ తీర్పుతో 68 సంవత్సరాల నవాజ్ షరీఫ్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే. పాకిస్తాన్ లో ఇప్పటి వరకు మూడు సార్లు నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో ఉండలేదు. నవాజ్ షరీఫ్ రాజకీయ వారసురాలిగా అందరూ భావించిన ఆయన కుమార్తె మర్యంను కూడా కోర్టు శిక్షించింది. ఆమె భర్త సఫ్దర్ కు కూడా ఏడాది జైలు శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు కూడా విధించారు. నవాజ్ షరీఫ్ కు దాదాపు 73 కోట్ల రూపాయల జరిమానా, ఆయన కుమార్తె మర్యంకు దాదాపు 14 కోట్ల రూపాయల జరిమానా విధించారు. నవాజ్ షరీఫ్ సోదరుడు ఈ తీర్పును విమర్శిస్తూ ప్రజలు జులై 25న తీర్పు చెబుతారన్నాడు.
పాకిస్తాన్‌లో న్యాయవ్యవస్థ చాలా చురుకుగా వ్యవహరిస్తుందన్న భావం కలిగేలా ఇటీవలి పరిణామాలున్నాయి. కాని కొందరి అభిప్రాయం ప్రకారం న్యాయవ్యవస్థ, మిలిటరీ కలిసి కుట్ర పన్నుతున్నాయని కూడా అనిపిస్తుంది. నవాజ్ షరీఫ్ ఇప్పుడు లండనులో ఉన్నాడు కాబట్టి వెంటనే అరెస్టు జరక్కపోవచ్చు. ఆయన భార్యకు అక్కడ క్యాన్సర్ చికిత్స జరుగుతోంది. నవాజ్ షరీఫ్ పార్టీ రాజకీయంగా దెబ్బతింటే ఆ స్థానాన్ని బహుశా మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆక్రమించే సూచనలు కూడా కనబడుతున్నాయి. అవినీతి ఆరోపణలతోనే నవాజ్ షరీఫ్ పదవికి అర్హుడు కాదంటూ సుప్రీంకోర్టు 2017లో ఆయన్ను గద్దె దింపింది. ఆ తర్వాత ఆయన పార్టీలో కూడా ఎలాంటి పదవి స్వీకరించడానికి అర్హత లేదని మరో తీర్పు వచ్చింది. దీనికి కారణమేమంటే, ఆయన కుమారుడికి చెందిన ఒక కంపెనీలో నెలకు 1,87,000 రూపాయల జీతం తీసుకుంటున్న విషయం ఆయన ప్రకటించలేదన్నది. ఇది చాలా చిన్న కారణం. పైగా నవాజ్ షరీఫ్ ఎన్నడూ తాను ఆ జీతాన్ని బ్యాంకు నుంచి డ్రా చేయలేదని కూడా తెలియజేశాడు. అయినా ఆయనపై వేటు పడింది.
నవాజ్ షరీఫ్ 2013లో మూడవసారి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధాని పదవి స్వీకరించిన కొంతకాలానికే ఆయనకు మిలిటరీ పెద్దలకు మధ్య స్పర్థలు పొడసూపాయి. ముఖ్యంగా విదేశాంగవిధానం విషయంలో మిలిటరీని ఆయన సవాలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాడు. పాకిస్తాన్ మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషర్రఫ్ పై కేసు వేసి విచారణ జరిపించాలని నిర్ణయించాడు.
ఇప్పుడు మిలిటరీ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయి న్యాయమూర్తులతో కలిసి తనకు వ్యతిరేకంగా కుట్రపన్నిందని నవాజ్ షరీఫ్ ఆరోపణ. అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా రాజకీయ వాతావరణం ఏర్పడేలా మిలిటరీ ప్రయత్నిస్తుందని కూడా ఆయన అంటున్నాడు. ఇటీవల ఒపీనియన్ పోల్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ ముందంజలో ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ ఖండిస్తూ, పాకిస్తాన్ లో ఒక అత్యున్నత స్థాయి వ్యక్తికి అవినీతి ఆరోపణలకు శిక్ష పడడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. నవాజ్ షరీఫ్ ఎన్నికల ప్రచారంలో లేకపోవడం ఇమ్రాన్ ఖాన్ కు ఖచ్చితంగా లాభిస్తుంది. ఇప్పుడు నవాజ్ షరీఫ్ వద్ద రెండే రెండు మార్గాలున్నాయి. పాకిస్తాన్ తిరిగి వచ్చి అరెస్టుకు సిద్ధపడడం, లేదా లండనులోనే ప్రవాసిగా ఉండిపోవడం. లండనులోనే ఉండిపోతే రాజకీయంగా భవిష్యత్తు లేనట్లే.
ఇంతకు ముందు కూడా నవాజ్ షరీఫ్ 1999లో మిలిటరీ కుట్ర జరిగినప్పుడు సౌదీ అరేబియాలో తలదాచుకున్నాడు. ఇప్పుడాయనకు బెయిలు దొరికే అవకాశాలు కూడా కనబడడం లేదు. ఎన్నికలు ముగిసే ముందు బెయిలు రాదని చాలా మంది అంటున్నారు.
1993లో మొదటిసారి ప్రధాని అయిన మూడేళ్ళకే మిలిటరీ కుట్రతో నవాజ్ షరీఫ్ పదవి పోయింది. 1997లో రెండవసారి ప్రధాని అయినప్పటికీ 1999లో పర్వేజ్ ముషర్రఫ్ ఆయన్ను గద్దె దించేశాడు. అసలు పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రధాని ఎవ్వరు కూడా పూర్తికాలం పదవిలో ఉండలేదు. 2013లో నవాజ్ షరీఫ్ మూడవసారి ఎన్నికైనప్పుడు బహుశా ఆయన పూర్తికాలం పదవిలో ఉంటారని చాలా మంది భావించారు. కాని 2017లో పదవి నుంచి అవినీతి ఆరోపణల కారణంగా తప్పుకోవలసి వచ్చింది. ఇదంతా న్యాయవ్యవస్థ చురుకుగా పనిచేయడమే అని కొందరంటున్నప్పటికీ చాలా మంది ఇదంతా సైనిక కుట్ర మాత్రమే అంటున్నారు.
పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సాకిబ్ నిసార్ వచ్చినప్పటి నుంచి న్యాయ వ్యవస్థ చురుకుదనం శృతిమించిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రెండు డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే ప్రజలు విరాళాలివ్వాలని ప్రధాన న్యాయమూర్తి పిలుపు ఇవ్వడం ఈ క్రమంలో తాజా ప్రకటన. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యాముల నిర్మాణం ఆగరాదని, వెంటనే నిర్మాణం ప్రారంభించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ డ్యాముల నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి సాకిబ్ నిసార్ పదిలక్షల రూపాయలు విరాళం ఇచ్చి ప్రజలను కూడా ఇవ్వమన్నారు.
ప్రయివేటు స్కూళ్ళు సాధారణంగా వేసవి సెలవుల్లో కూడా పిల్లల నుంచి ఫీజులు తీసుకుంటాయి. వాటిపై నిషేధం విధించారు. అసలు పిల్లలకు విద్యాభ్యాసం అన్నది ప్రభుత్వ బాధ్యత అని, ప్రయివేటు స్కూళ్లను కూడా ప్రభుత్వమే తీసుకుని నడిపించాలని కోర్టు పేర్కొంది. ప్రయివేటైజేషన్ పాకిస్తాన్ లో తిరగబడినట్లుంది. అన్నింటికన్నా విచిత్రమైన తీర్పు పాకిస్తాన్ మాజీ పాలకుడు పర్వేజ్ ముషర్రఫ్ కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడమే కాదు, ఆయన్ను అరెస్టు చేయరాదంటూ ఆదేశాలివ్వడం. నిజానికి పర్వేజ్ ముషర్రఫ్ 1997లో అధికారానికి వచ్చినప్పుడు నవాజ్ షరీఫ్ ను మిలిటరీ కుట్రతో గద్దె దించాడు. ఆ తర్వాత ఎమర్జన్సీ విధించాడు. ఎమర్జన్సీకి వ్యతిరేకంగా మాట్లాడిన అనేకమంది న్యాయమూర్తులను జైల్లో పెట్టాడు. అలాంటి వ్యక్తికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన న్యాయవ్యవస్థ, నవాజ్ షరీఫ్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ప్రధాన న్యాయమూర్తి సాకిబ్ నిసార్ 2019లో రిటైర్ అవుతారు. ప్రజల్లో తన పేరుప్రతిష్ఠలు పెంచుకునేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కొందరి అభిప్రాయం. గతంలో ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ ముహమ్మద్ చౌధురి కూడా ఇలాగే వ్యవహరించారు, కాని ఆయన్ను ముషర్రఫ్ పదవి నుంచి తప్పించి జైల్లో వేశాడు. పాకిస్తాన్ లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. కాని ప్రతిమలుపులోనూ అక్కడి మిలిటరీ పాత్ర ప్రముఖంగా కనిపిస్తోంది. మిలిటరీ పాత్ర ఉన్నంత కాలం పాకిస్థాన్ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యాన్ని పొందడం సాధ్యం కాదు.

* రుక్మిణీ మాధవ్