Home కలం శ్రీశ్రీ మహాప్రస్థాన సంబోధనలు

శ్రీశ్రీ మహాప్రస్థాన సంబోధనలు

srisri

నన్ను చిన్నతనంలో బాగా ప్రభావితం చేసిన పుస్తకం రంగనాయకమ్మగారి “బలిపీఠం” నవల. ఆ తర్వాత అంటే ఒకానొక ప్రాపంచిక దృక్పథానికి దగ్గరై కొంత అవగాహన ఏర్పడుతున్న దశలో ఒకిం త చైతన్య స్థాయి నాలో పెరిగిన స్థితిలో నా మనఃఫలకమ్మీద గొప్ప ముద్ర వేసిన గ్రంథం శ్రీశ్రీ “మహాప్రస్థానం” తదనంతరం “టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్‌” టఫ్ పీపుల్ డూ (రాబర్ట్ షెల్లర్) మొదలైన అనేక పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయి. ప్రస్తు త వ్యాస పరిమితి మహాప్రస్థానానికి లోబడి వుండాలి కనుక మీదు మిక్కిలి ఆ పొత్తంలోని సంబోధనలకే పరిమితమై వుండాలనుకున్నాను కాబట్టి అసలు విషయానికి వద్దాం.తెలుగు సాహిత్యంలో పెనుమార్పులకు మూలం శ్రీశ్రీ మహాప్రస్థానం. దానిది నిస్సందేహంగా నిరుపమాన స్థానం. మహా ప్రస్థానాన్ని ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు. అట్లా ఎన్ని పర్యాయాలు చదివినా ఎంతగా అర్థమైనట్లు అన్పించినా మళ్లీ అర్థంకాని దురవబోధమైన అంశాలు అందులో కోకొల్లలు. ఈ అనుభవం నా ఒక్కడిదే కాదు. చాలా మంది సాహితీ వేత్తలకు అర్థం కాని పదాలు, పదబంధాలు మహాప్రస్థానంలో అడుగడుగునా కన్పిస్తాయి. చిత్రంగా ఈ మారు మహాప్రస్థానాన్ని పరిశీలిస్తూ పఠిస్తున్నపుడు నా దృష్టికి శ్రీశ్రీ సంబోధనలు లెక్కకు మిక్కిలిగా వచ్చాయి.
మేలుకొల్పడం మెలకువలోనికి తీసుకురావడం జాగ్రదావస్థ కల్గించడం నిద్రలేపటం వీటి కోసమే ఆయన పిలుపును ఆశ్రయించాడు. అందుకే చూడండి…మహా ప్రస్థాన గీతం ప్రారంభం గమనించండి “మరో ప్రపంచం / మరో ప్రపంచం / మరో ప్రపంచం పిలిచింది/ పదండి ముందుకు /పదండి త్రోసుకు / పోదాం పోదాం పైపైకి” అని వుంటుంది. ఇందులో “పిలిచింది” అనే పదాన్ని మహాకవి చాలా సాలోచనగా వేశాడనిపిస్తున్నది. ఇక మరో ప్రపంచం పిలిచాక ముందుకు వెళ్లకుండా వుంటారా ప్రజ లు. ఆ పోయంలోనే మరో చోట “ఎముకలు కుళ్లిన / వయ స్సు మళ్లిన / సోమరులారా చావండి/ నెత్తురు మండే /శక్తులు నిండే / సైనికులారా రారండి/ హరోం హరోం హర / హర హర హర హర / హరోం హరా అని కదలండి” అని ముందుకు కదిలిస్తాడు. పై పంక్తులు సోమరులారా, సైనికులారా, హరోం హరా మొదలైనవన్నీ సంబోధనలే! అందుకే ఆ పదాంతాల్లో అన్ని ఆశ్చర్యార్థక చిహ్నాలు. సైనికులకు కూడా “హరోం హరా!” అని సంబోధిస్తూ కదలమని శ్రీశ్రీ ఆహ్వానిస్తున్నాడు.
“శైశవగీతి” మహాకవి రాసిన ఉత్తమ కవిత. పిల్లల మీద అవ్యాజ ప్రేమానురాగాలతో అల్లిన కైత యిది. దీని ఆది “పాపం పుణ్యం ప్రపంచ మార్గం /కష్టం సౌఖ్యం శ్లేషార్థాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ అయిదారేడుల పాపల్లారా”అని వుంటుంది. మొదట్లోనే పిల్లల్ని పూవుల్లారా! పాపల్లారా! అన్నాడు. పువ్వులు కోమలత్వానికీ, అందానికీ, నిర్మలత్వానికీ ప్రతీకలు. అందుకే అట్లా సంబోధిస్తూ “మెరుపు మెరిస్తే/ వాన కురిస్తే / ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే / కూనల్లారా” అని పలుకుతాడు. పిల్లల్ని మనం కూడా చిట్టితల్లీ, చిన్ని తల్లీ, చిక్క తల్లీ (కన్నడంలో చిక్క అంటే చిన్న ), గున్న తల్లీ, బంగారు కూనా ఇలా పిలుస్తుంటాం గారాబంగా. అందుకే శ్రీశ్రీ ఆ రకంగా ఆహ్వానించాడు. ఈ కవి ప్రత్యేకత ఏమిటంటే వీలున్నపుడల్లా కవిత్వంలో సంబోధనలు వేయడమే! పద్య ప్రారంభంలోనే కాకుండా మధ్యమధ్య కూడా వేస్తాడు. పద్యం ముగిసే దాకా చదువరున్ని తనతోపాటు తీసుకుని వెళ్లడానికి ఉపకరించే ఒక మెళకువ, ఒక వ్యూహం, ఒక తరంగదైర్ఘం ఈ సంబోధన, మనల్ని క్షణక్షణ జాగరితుల్ని చేసే అంశమిది. మళ్లీ చూడండి… “అచ్చటి కిచ్చటి కనుకోకుండా/ ఎచ్చటెచ్చటికో ఎరుగుతూ పోయే / ఈలలువేస్తూ ఎగురుతు పోయే / పిట్టల్లారా! పిల్లల్లారా” అంటాడు. ఇక్కడ పిల్లల్ని పిట్టల్ని చేస్తాడు. పిల్లలెప్పుడూ తుళ్లింతలూ, గెంతులూ, కేరింతలతో ఎగురుతుంటారు కనుక పిట్టలు అని పిలుస్తాడు. ఇంకా ముందుకు వెళ్లి పిల్లల్ని వర్ణిస్తూ, వాళ్ల స్థితిని చూపిస్తూ “ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే / పరమాత్మలు/ ఓ చిరుతల్లారా” అని పేర్కొంటాడు. ఇప్పుడు పిల్లలు ఏకంగా దేవుళ్లతో సమానమైనారు. ఆ తర్వాతే “పిల్లలూ దేవుడూ చల్లని వారే” అంటూ పాట ఒకటి సినిమా తోటలోకి వచ్చింది. ఈ శైశవగీతిని చివరికి “ఉడుతల్లారా/ బుడతల్లారా/ ఇది నా గీతం వింటారా?” అని ప్రశ్నిస్తాడు. ఉడుతలూ, బుడతలూ సంబోధనలైతే, చివరి పంక్తి ప్రశ్న. సంబోధనే ఎదుటి మనిషి ధ్యానాన్ని ధ్యాసను కవి వైపు తిప్పుతుందనుకుంటే, చివరి వేసిన ప్రశ్న పిల్లల్నీ చదువరుల్నీ మరింత దగ్గరకు తీసుకుంటుంది. అదీ మహాకవి శ్రీశ్రీ కవిత్వంలో కన్పించే టెక్నిక్. “ఉన్మాది” మహాప్రస్థానంలో మరో కవిత, “అలకలన్నీ అట్టకట్టిన/ బొమికలన్నీ ప్రోవుపట్టిన/కాగితంవలె పలచబారిన /వెర్రివాడా! కుర్రవాడా! శ్రీశ్రీకి దీనజనుల మీద, బాధితులపైన, పీడితులు, దుఃఖితులు, ఉపేక్షితుల (పిల్లలు, వృద్ధులు, ఉన్మాదులు మొదలైన వాళ్లు) పైన వల్లమాలిన ప్రేమ. కరుణ. సానుభూతి. దయ. ఆయన అపారకృపాహృదయుడు. అందుకనే ఎవరూ పట్టించుకోని “పిచ్చివాడి” గురించి కవిత రాశాడు. ప్రారంభ పంక్తుల్లో వెర్రివాడా, కుర్రవాడా తత్సంబంధిత సంబోధనలు. ఈ గీతంలో మరో మూడు సార్లు ఈ పిలుపులున్నాయి. “స్విన్‌బర్న్ కవికి” కవితలో ఆ మిథ్యావాదిని సంబోధిస్తూ రకరకాలుగా ఆహ్వానిస్తూ ఆ రకరకాల పిలుపుల్లో గొప్ప శిల్పాన్ని సాధించాడు శ్రీశ్రీ. భౌతికవాది, ఆయనకు ఈ ప్రపంచం సత్యం. భావవాదం చెప్పే దేమిటి అన్న నిత్యమూ సత్యమూ ఈ ప్రపంచం మిథ్యా అని. మరి ఈ లోకం మిథ్య అని చెప్పే వ్యక్తులు ఈ భూమ్మిద వున్న సకల సౌఖ్యాలూ ఎందుకనుభవిస్తున్నారు అని శ్రీశ్రీ సంశయం. సంశయం కాదు కోపం. “మాయంటావా? అంతా/ మిథ్యంటావా?/ నా ముద్దుల వేదాంతీ ఏమంటావు” అనే ముద్దుల వేదాంతీ పిలుపులో మొదటి ఏమంటా వుండదు. చాలా హాయిగా,సాఫీగా సాదాసీదాగా వేదాంతిని పిలుస్తాడు. ఆ తర్వాత “జమీందారు రోల్సు కారు / మాయంటావూ/ బా బూ! ఏమంటావు” అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నా, సంబోధన.. రెంటిలోనూ శ్రీశ్రీ కోపం ప్రదర్శితం కాలేదు. కావాలనే ఆ మిథ్యావాది? ఆటపట్టించాలనే వ్యూహాత్మకంగా “బాబూ!” అని గౌరవ సంబోధన వేశాడు. తదుపరి “మహారాజు” మనీపర్సు/ మాయంటావూ స్వామీ/ ఏమంటావు!” అనే స్వామిలో శ్లేషపూర్వక సంబోధన ఉంది. ఒక అర్థం గౌరవ పురస్సరమైనదీ, మరొకటి ఆటపట్టించేదీ. ఆ తర్వాత “మర ఫిరంగి విష వాయువు/ మాయంటావూ/ ఏం ఏంమంటావు” అని ప్రశ్నిస్తాడు. మొదట అంటే గీత ప్రారంభంలో ముద్దుల వేదాంతి, క్రమంగా బాబు, స్వామిలుగా మారి ఇప్పుడిక “ఏం” దాకా వచ్చింది. ఇప్పుడు, మిథ్యామిదిని “ఏం” అని పిలుస్తున్నాడు. రెట్టిస్తున్నాడు. ప్రశ్నతో తర్వాత దట్టిస్తున్నాడు. దడ పుట్టిస్తున్నాడు. ఇంకా ముందుకెళ్లి “తుపానులూ, భూకంపం/ తిరుగుబాట్లు సంగ్రామం/ సంగ్రామం సంగ్రామం/ మాయంటావూ? ఏయ్ ఏమంటావు?” అని పృచ్ఛిస్తాడు. ఆ పృచ్ఛకు ముందు “ఏయ్! అనే సంబోధన గమనార్హం. ఇక్కడ శ్రీశ్రీ కోపం తారాస్థాయికి చేరింది. మొదట్లోని ముద్దుల వేదాంతిని ఇప్పుడు “ఏయ్‌” అని గుర్రుమన్నాడు.“కవితా! ఓ కవితా!” అనే కవిత గురించి ఎన్నో పుటలు రాయవచ్చు. ఎక్కడా ఆపుటలు అన్నది లేకుండా పేజీల కొద్దీ రాయవచ్చు. అదో గొప్ప కవిత. నాకు తెలిసి కవిత్వానికి సంబంధించిన కవితలలో ప్రపంచంలోనే వచ్చిన అతిగొప్ప కైతయిది. అసలు ఈ కవిత ఈ శీర్షికనే సంబోధన కదా! “కవితా! ఓ కవితా!” అంటూ ప్రారంభిస్తాడు. ఒక నిశ్చల తపస్సమాధిలో, ఒక గొప్ప భావస్థితిలో, ఒక బాహిరస్పృహ లేని పరిస్థితిలో, ఒక మూడ్‌లో ఒక ట్రాన్సులో పూర్తిగా నిమగ్నమై భుగ్నమై భగ్నమై మనస్సు లగ్నమై రాసిన కవిత యిది. అందుకే ఈ కవిత విన్న విశ్వనాథ శ్రీశ్రీని కళ్లనీళ్ల పర్యంతమై ఆలింగనం చేసుకున్నాడు. రెండు మహాశిఖరాలు ఒక పరిష్వంగమై నిలిచిన కవిత. ఇక సంబోధనలు ఓ చోట “విన్నానమ్మా! విన్నానెన్నో విన్నాను” అంటాడు (ఒక లక్ష నక్షత్రాల మాటలు, ఒక కోటి జలపాతాల పాటలు, శతకోటి సముద్ర తరంగాలు మ్రోతలు… ఇత్యాదులు) ఈ “విన్నానమ్మా” అనడంలో “అమ్మా, తల్లీ, మాతా, జననీ” అన్న పిలుపు ఉంది. ఆ తర్వాత అలా అలా సాగుతూ హఠాత్తుగా “నన్ను కరిగించిన కవన ఘృణీ /రమణీ / ఓ కవితా ఓ కవితా” అంటాడు. ఇంకా ముందుకు వెళ్లి “నన్ను పునీతుని కావించిన కవితా” అని సంబోధిస్తాడు. సాహిత్య ప్రక్రియల్లో కవిత్వానికి ప్రత్యేకత ఉంది. అది భావావేశ ప్రధాన ప్రక్రియ. సూటిగా హృదయాన్ని తాకే క్రియ మనలో ఏదో జరుగుతుంది తప్పక రూప విక్రియ. అది మనల్ని పవిత్రుల్ని పునీతుల్ని చేస్తుంది. వినీతుల్ని చేస్తుంది. మన హృదయ మాలిన్యాన్ని క్షాళనం కావిస్తుంది. శ్రీశ్రీ సంబోధనలు ఆ తరువాత “లలిత లలిత కరుణా మహితా/ అనుపవితా/ అపరిమితా/ కవితా ఓ కవితా ”. ఇంక కవిత్వాన్ని దేంతో ఉపమించగల్గుతాం. దాన్ని దేనితో పరిమితం చేయగల్గుతాం. అది లలిత లలిత కరుణా మహి కదా! కవిత చివరికి “ఓహో! ఓ రసధుని మణిఖని/ జననీ ఓ కవితా/ కవితా కవితా ఓ కవితా” అని సంబోధించాడు. “ఓహో” అనడంలో ఎన్ని సంభ్రమాశ్చర్యాలు నిబిడీకృతమై ఉన్నాయో! జననీ అనడం నువ్వు నాకు జన్మ ప్రసాదిని అయిన తల్లి వంటి దానివని చెప్పడం. నిజంగానే శ్రీశ్రీ జన్మ ధన్యమైంది ఈ కవితలో.“మానవుడా” అనే సంబోధనతోనే ప్రారంభమైన శీర్షికలోనే మొదలైన కవితలో లెక్కలేనన్ని పిలుపులు. మానవుడు ఎంత మహోన్నతుడో, అంత దుర్మార్గుడు. ఈ రెండు కోణాల్నీ అత్యద్భుతంగా దర్శింప చేసిన ఘనత శ్రీశ్రీది. మానవునిలోని అన్ని పార్శాల్నీ దాదాపుగా వ్యక్తీకరించిన కైత యిది. అన్ని సంబోధనలే! అన్ని పిలుపులే! వియోగి, యోగి, భోగి, త్యాగి, ఊర్ధ దృష్టి, అశాంతుడు, మహా ప్రయాణికుడు, సంకుచిత స్వభావుడు, ఆదర్శజీవి, మహాత్ముడు, అవిభక్త కుటుంబి, ఏక రక్త బంధువు, సన్మార్గగామి, పిపాసి, తపస్వి, కవి, వేదాంతి, విజ్ఞాన ధనీ, భావదాత, బుద్ధమూర్తి, జీసస్, సంఘపశువు, (సోషల్ ఎనిమల్) శ్రమైక జీవి, కష్టజీవి, రక్తకణ సమష్టి కుటుంబి, రైతు, కూలి, మాలి, ఖైది, రౌడి, ఖూనీకోర్, బేబి… ఇట్లా మానవునికి ఇంకా ఎన్నె న్నో అవతారాలు (మాధవునికి పదే అవతారాలు) ఆ అవతారాల సంబోధనలు. “గర్జించు రష్యా” శ్రీశ్రీ రాసిన మరో కవిత. ఈ కవితా శీర్షిక సైతం సంబోధనే! ఇది శ్రీశ్రీ ప్రత్యేకత. “గర్జించు రష్యా/ గాండ్రించు రష్యా” అంటూ తీండ్రించిన సంబోధనలతో ఈ కవిత ఆసాంతం కొనసాగుతుంది. “జగన్నాథుని రథ చక్రాలు” ఈ మహా కవిది మరో మహామహా కవిత. మహాదయతో రచించిన కవిత. “పతితులార” మొట్ట మొదటి సంబోధన యిది కవితలో. ఎందుకు పతితులయ్యారో శ్రీశ్రీకి తెలుసు. మనకు తెలుసు. జనాన్ని పతనావస్థకు దిగజార్చింది ఉన్నవాళ్లు. ఇది వర్గ సమాజం. (అప్పటికి కుల స్పృహ లేదు శ్రీశ్రీలాంటి ఎందరిలోనో) హావ్సు హావునాట్సు మధ్య సంఘర్షణ తప్పనిసరి అన్నది అతని ప్రాపంచిక దృక్పథం. తరువాతి పిలుపు “భ్రష్టులార!” ఇది చిన్నబుచ్చడానికి ఉపయోగించలేదు. ఆ భ్రష్టత్వం ధనవంతుల వల్ల దాపురించింది ప్రజలకు. మూడో సంబోధన “బాధాసర్ప దష్టులార” బాధ అనే పాము కాటుతో తల్లడిల్లే వ్యక్తులారా అని చెబుతున్నాడు శ్రీశ్రీ. వీళ్లు “బ్రదుకు కాలి/ పనికి మాలి/ శని దేవత రథ చక్రపు / టిరుసులలో పడి నలిగిన దీనులూ/ హీనులూ ” అందుకే దీనులార హీనులార సంబోధనలు. ఇంకా “కూడులేని గూడులేని / పక్షులారా భిక్షులారా” అన్నాడు. ఏడవకండి అని ధైర్యం చెప్పాడు. “ఓ వ్యధా నివిష్టులార! ఓ కథావశిష్టులారా! “ఏడవకండేడవకండి” అన్నాడు. మరోచోట మధ్యలో “దగాపడిన తమ్ములార” అన్నాడు. ఆ పేరుతో తెలుగులో ఏకవచనంతో ఓ నవలె వచ్చినట్లు గుర్తు. ఇంకా ఒకటి రెండు సార్లు “రారండో రండో రండి” అన్న పిలుపు కొండంత ధైర్యాన్ని నింపుతాయి. దీనజనుల్లో. అట్లా జగన్నాథుని రథ చక్రాల్ని భూమార్గం పట్టించి భూకంపం సృష్టించడమే గాక ఈ లోకం మీదేనండి/ మీ రాజ్యం మీరేలండి” అని అనగల్గిన దయాహృదయుడు మహాకవి శ్రీశ్రీ.