Home ఆఫ్ బీట్ రాముడి పుట్టిన రోజు సీతమ్మ హడావుడి

రాముడి పుట్టిన రోజు సీతమ్మ హడావుడి

br

శ్రీరామనవమి అంటే రాముడి పుట్టిన రోజు. కాకతాళీయంగా అదే రోజున రాముడి కళ్యాణం కూడా జరిగింది. దాంతో రాముడికి పెళ్ళిరోజు, పుట్టినరోజూ ఒక్కటే అయ్యాయి. కానీ సీతమ్మ పరిస్థితి అదికాదు. సీత వైశాఖమాసం శుక్లపక్షం నవమినాడు పుట్టింది. ఈ రోజును సీతానవమిగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. ఉత్తరాదిన జరిగే ఈ పండగకు దక్షిణాదిన అంతగా ప్రాచుర్యంలేదు. రామయ్య వంటి కొడుకు పుట్టాలని..సీతమ్మ వంటి బిడ్డ కావాలని..అని జానపదులు పాట కూడా పాడతారు. కాని సీత జయంతిని జరుపుకోవడం అంతగా కనబడదు. అయినా శ్రీరామనవమి అనగానే పండితులు సీతారాముల కళ్యాణం, సీతాకళ్యాణం అంటూ మాట్లాడతారే తప్ప రాముని పుట్టినరోజు గురించి ఘనంగా మాట్లాడరు. అదేమంటే సీతారాములు అవిభాజ్యులు అంటారు. కనీసం రాముడి కళ్యాణం అని కూడా అనరు. రాముడికి అత్యంత ప్రాధాన్యమున్న రోజున సీతమ్మే ముందు నిలిచి ప్రజల ఆలోచనలను ఆకట్టుకుంటోంది. 

శ్రీరామనవమి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సీతారాముల కళ్యాణం. కానీ ఈ కళ్యాణం కన్నా ముందునుంచే ఈ నవమికి ప్రాధాన్యత ఉంది. ఏమిటా ప్రాధాన్యత? ఈ చైత్రశుద్ధనవమినాడు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడు. శ్రీమన్నారాయణుడు కోరికోరి ఈ ముహూర్తాన్ని ఎంచుకుని జన్మించాడు. ఇది శుభలగ్నమని ఈ సమయంలో అవతారం తీసుకోమని బ్రహ్మదేవుడు ముహూర్తం పెడితే నారాయణుడు అందుకు అంగీకరించి భూమిపై అవతరించాడు. ఆయన రాకతో సూర్యవంశం తరించింది. ఇక్ష్వాకుడు ఆదిగాగల వంశకర్తలు, మూలపురుషులు తమ జన్మతరించిందని, తమ పూజలు, పుణ్యకార్యాలు ఫలించాయని బ్రహ్మానంద పడిపోయారు. శ్రీరాముడి పుట్టినరోజున ఇష్టమృష్టాన్న భోజనాలతో, పంచభక్షపరమాన్నాలతో ఊరంతటికీ విందుచేసేవాడు దశరథ మహారాజు. ఆ రోజున లోకాలన్నీ పండగ చేసుకున్నాయి. సీతమ్మను పెళ్ళి చేసుకోకముందు వరకు శ్రీరామనవమి రాముడి పుట్టినరోజుగానే పరమ విశేషంగా ఉంది.
రాముడు విశ్వామిత్రుడి వెంట అడవికి వెళ్ళడం, తాటక, సుబాహు తదితర రాక్షసులను వధించడం చేశాక జనక మహారాజు ఆహ్వానంపై మిథిలానగరానికి వెళ్ళాడు. అది సీతమ్మ పుట్టిన ఊరు. సీతమ్మ అంటే సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అని జనకమహారాజు, ఆయన భార్య ధరణీదేవి కూడా నమ్మారు. అలాగే అపురూపంగా పెంచారు. పిల్లలే లేని వారికి సీతమ్మ అయోనిజగా దొరికింది. కన్న ప్రేమకన్నా పెంచిన ప్రేమ గొప్పదన్న సామెతను జనకమహారాజు నిజంచేశాడు. ఆమె తండ్రిచాటు బిడ్డగా పెరిగింది. అందుకే ఒక్క సీతాదేవే జానకి అని పిలిపించుకోగలిగింది. ఆ తర్వాత రోజులలో ఆయనకు ఊర్మిళాదేవి జన్మించింది. ఆమెను కూడా ఎంతో గారాబంగా పెంచినా జానకీ అనే ముద్దుపేరు ఆమెకు దక్కలేదు. నిజానికి కడుపుచించుకుంటే పుట్టిన బిడ్డకాబట్టి ఊర్మిళకు ఆ పేరు దక్కాల్సి ఉంది. కానీ ఆ స్థానాన్ని ఆమెకన్నా ముందుగా జనకుని జీవితంలోకి ప్రవేశించిన సీతమ్మ సంపాదించుకుంది. బిడ్డలే లేని రోజులలో దొరికిన సీతమ్మ అపురూపంగా అనిపించినా బిడ్డపుట్టిన తర్వాత కూడా ఆ ప్రేమను తగ్గనీయకుండా ప్రదర్శించిన జనకమహారాజు ఎంతో గొప్పవాడు.
జనకుడి ఇంట్లో శివుని విల్లు ఉంది. దక్షయజ్ఞం సమయంలో వింటితో చెలరేగి అరుద్రయాగానికి వచ్చిన వారిని దండించాడు. దేవతలు శివునికి లొంగిపోయి ప్రసన్నం చేసుకున్నాక ఆయన తన వింటిని దేవతలకు ఇచ్చి వెళ్ళిపోయాడు. వారు ఆ వింటిని జనకమహారాజుకు ఇచ్చి వెళ్ళారు. ఆయన ఆ వింటిని పూజామందిరంలో ఉంచి పూజించేవాడు. అది ఒక వాహనంపై ఉండేది. ఒకసారి తన ఆటబంతి కోసం సీత ఆవాహనాన్ని పక్కకు తోసేసింది. మహావీరులైనా కదిలించలేని ఆ వింటిని ఎక్కుపెట్టే వాడే సీతకు సరైన జోడు అని నిర్ణయించుకుని చాటింపు వేయించాడు జనకుడు. యోగ్యుడైన వీరుడు దొరికే వరకు ఈ ఆహ్వానం అమలులో ఉంది. కనుక ఎందరో రాజులు అదేపనిగా వచ్చినపుడో, అటుగా వచ్చినపుడో, తమకు తోచినపుడో వచ్చారు..విల్లుఎక్కుపెట్టే ప్రయత్నాలు చేశారు..విఫలమయ్యారు! తమ వల్ల కాక కొందరు డీలాపడితే, మానవమాత్రుడికి సాధ్యంకాని నియమంతో రాజలోకాన్ని అవమానపరుస్తున్నారని చాలామంది విరగబడ్డారు.. తిరగబడ్డారు..విరుచుకుపడ్డారు..కత్తులు దూశారు..కదం తొక్కారు..ఎడతెగని యుద్ధాలు చేశారు. వయసు మీద పడ్డా సీతను కాపాడేందుకు జనకుడు శక్తికి మించిన యుద్ధాలు చేశాడు..రాజమూకను తరిమి తరిమి కొట్టాడు. ఎంత మంది ఏకమై వచ్చినా వెనుదిరగకుండా.. వెనకడుగువేయకుండా..మడమతిప్పని పోరాటాలు చేశాడు. ఆయన ఆయుధాగారంలో ఆయుధాలన్నీ అయిపోయాయే తప్ప యుద్ధాలు మాత్రం ఆగలేదు. యజ్ఞాలుచేసి దేవతలను మెప్పించిన జనకుడు ఆయుధాలు సమకూర్చుకుని పోరాటాలు చేసి చేసి అలసిపోయాడు. వాలిపోతున్న వయసుతో ఇలా ఎంతకాలం పోరాటం చేయడం..? సీతమ్మను ఎలా రక్షించడం..అని బెంగపడ్డాడు. ఆ స్థితిలో రాముడు ఆయన అంతఃపురానికి వచ్చాడు. శివుని విల్లు విరిచి ఆయన బెంగ తీర్చాడు.
రాముని జననంలో ఆనందం, సకల దేవతావ్యూహం ఉంటే సీతమ్మ వివాహం వెనక ఒక కన్నీటి గాధ, భయం, ఆందోళన, మానసిక ఉద్రేకం ఉన్నాయి. అవన్నీ తీర్చిన రాముడు సీతకు దేవుడికన్నా ఎక్కువవాడయ్యాడు. పెళ్ళి చేసుకుని నిజంగానే ప్రాణనాథుడయ్యాడు. సామాన్య స్త్రీలంతా సామాన్య పురుషుల్ని వివాహం చేసుకుని ఆయనను దేవుడిగా భావిస్తే సీత నిజంగానే దేవున్ని వివాహం చేసుకుంది. ఈ పెళ్ళి కూడా ఆయన పుట్టిన రోజునాడే జరగడం మరో విశేషం.
చైత్రశుక్ల నవమి ఈ విధంగా రెండు ప్రధాన సంఘటనలకు వేదిక అయింది. ఆ రెండు సంఘటనలు రాముడివే! అయినా సరే నవమినాడు ఏమిటి ప్రత్యేకత అని అడిగితే రాముడి వివాహం అని ఎవ్వరూ చెప్పరు. జానపదులు మాత్రమే రాములోరి వివాహం అంటారు తప్ప సభ్యసమాజంలోని వారు మాత్రం సీతారాముల వివాహం అనో, సీతాకళ్యాణమనో మాత్రమే అంటారు. పండగంతా రాముడిదైనా కీర్తి పూర్తిగా సీతకు సొంతమైంది. ఈ విధంగా సీతమ్మ రాముని పుట్టినరోజునాడు ఆయన జీవితంలోకి ప్రవేశించి తన ప్రాముఖ్యతను పెంచేసుకుంది. దాంతో రాముడి పుట్టిన రోజు హడావుడి పక్కకుపోయి సీతా కళ్యాణం తెరమీదికి వచ్చింది. ఇలా రాముడి పుట్టినరోజునాడు సీతమ్మ హడావుడే కనబడుతోంది.