Home ఎడిటోరియల్ యూనివర్శిటీలపై పెత్తనానికి బాట!

యూనివర్శిటీలపై పెత్తనానికి బాట!

Article about Modi china tour

ఉన్నత విద్యావ్యవస్థపై రెగ్యులేటరీ అథారిటీగా పనిచేస్తున్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)ను రద్దు చేసి, దాని స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్ (హెచ్‌ఇసిఐ)ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షంగా ఉంది. యుజిసికి ఉన్నట్లుగా యూనివర్శిటీలకు నిధుల మంజూ రు అధికారం ఈ కొత్త కమిషన్‌కు ఉండదు. ఆ అధికారం మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెళుతుంది. పర్యవసానం స్వయం ప్రతిపత్తితో పనిచేసే యూనివర్శిటీలు కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. విద్యా వ్యవస్థలో ఏ మార్పు విజయవంతం కావాలన్నా ఆ వ్యవస్థలో పని చేస్తున్న వారి మధ్య దాన్ని చర్చకు పెట్టి స్థూల ఏకాభిప్రాయం సాధించటం అవసరం. కాని సంస్కరణ పేరుతో స్థిరపడిన వ్యవస్థలకు పాతరవేయటం మార్పు కోసం మార్పు కాకూడదు. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యతను వక్కాణిసూ, దేశ సమతులనాభివృద్ధికి దోహదకారిగా, మార్గదర్శకంగా పనిచేస్తూ వచ్చిన భారత ప్రణాళిక కమిషన్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి దాని స్థానంలో నిర్దిష్టమైన అధికారాలులేని ‘నీతి ఆయోగ్’ను అస్థిత్వంలోకి తెచ్చింది. దానివల్ల వనగూరిన గుణాత్మక మార్పు పూజ్యం. యుజిసిని రద్దు చేసే బదులు చట్టంలో మార్పుల ద్వారా దాని అధికార పరిధిని మెరుగుపరచవచ్చు, విస్తరించవచ్చు. కాని యూనివర్శిటీలపై ప్రత్యక్ష పెత్తనం (నిధుల నియంత్రణ ద్వారా) కోరుకుంటున్న ప్రభుత్వం సంబంధీకులతో చర్చించకుండా కొత్త రెగ్యులేటరీ వ్యవస్థను తలపెట్టింది. ఆ ప్రతిపాదనపై సలహాలు మాత్రమే కోరింది. ప్రణాళిక కమిషన్, యుజిసి వంటివి జవహర్ లాల్ నెహ్రూ కాలంలో వ్యవస్థీకృతమైన సంస్థలు. నెహ్రూ భావజాలంపై దాడి చేయటమే తమ హిందూత్వ ఎజండాను ముందుకు గొనిపోయే మార్గంగా భావిస్తున్న బిజెపి ఆనాటి సంస్థలను రద్దు చేయటం ద్వారా ఆయన్ను మరుగుపరచాలనుకోవచ్చు. అయితే చెరిపితే చెరిగిపోయేది కాదు నెహ్రూ ముద్ర.
అదలా ఉంచితే, ఉన్నత విద్య స్థాయిలో ప్రమాణాల పెంపుదలకు, అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేందుకుగాను కాలానుగుణ్యమార్పులు అవసరమనటంలో భిన్నాభిప్రాయానికి తావులేదు. ఉన్నత విద్య అవసరాలు 1956లో యుజిసి ఏర్పాటు చేసిన నాటికి పూర్తి భిన్నమైనవి. యుజిసి కూడా విద్యా ప్రమాణాల అభివృద్ధికి విశేష కృషి చేసింది. ఉన్నత విద్యా ప్రమాణాలను అంచనా వేసి గుర్తింపు ఇచ్చేందుకుగాను 1994లో అది జాతీయ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్‌ఎఎసి) పేరుతో స్వయం ప్రతిపత్తి సంస్థను నెలకొల్పింది. 201617 నాటికి దేశంలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 40 శాతాన్ని, కాలేజీల్లో 20 శాతాన్ని ఆడిట్ చేసిన అనంతరం బ్యూరోక్రటిక్ కేంద్రీకరణ ఘోర వైఫల్యాన్ని వెలుగులోకి తెచ్చింది. యూనివర్శిటీల్లో ఉన్నత విద్యకు అక్రిడిటేషన్ నిమిత్తం యుజిసి ఆధ్వర్యంలో ప్రస్తుతం 15 అటానమస్ చట్టబద్ధ సంస్థలు పని చేస్తున్నాయి. అయినా, టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో మన దేశం స్థానం 201 250 గ్రూపు నుంచి 251300 గ్రూపుకు దిగజారింది. ఉన్నతస్థాయి 400లలో మన దేశానికి ఆరే ఉన్నాయి.
యుజిసి ఏర్పాటైనప్పుడు దేశంలో 20 యూనివర్శిటీలు, 500 కాలేజీలు, 2 లక్షల 10 వేల విద్యార్థులు ఉన్నారు. ఇవాళ 726 యూనివర్శిటీలు, 38,000 కాలేజీలు, 2 కోట్ల 80 లక్షల విద్యార్థులున్నారు. ఉన్నత విద్యకు అవకాశాలు పెద్ద ఎత్తున పెంచాలని నాలెడ్జి కమిషన్ సిఫారసు చేసింది. 2015 నాటికి 15 శాతం స్థూల ఎన్‌రోల్‌మెంట్ దామాషా సాధించాలంటే కనీసం 1500 యూనివర్శిటీలు అవసరం. 1980 దశకం నుంచి అటానమస్ కాలేజీలు అనుమతించబడినా, ఇటీవల కాలంలో అన్‌ఎయిడెడ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజీలు పెరిగినా, ఓపన్ యూనివర్శిటీ, దూర విద్య విస్తరించినా నాణ్యమైన విద్య, ఆధునాతన సమాజ నిర్మాణానికి అవసరమైన విద్య కొరవడటం ప్రధానలోపం. అందువల్ల విద్యా ప్రమాణాలు పెంచవలసిందే. ప్రమాణాలులేకపోయినా డబ్బు పిండుతున్న ప్రైవేటు విద్యకు ముక్కుతాడు వేయవలసిందే. అయితే దీన్ని సాధించటం ఎలా అన్నదే సమస్య. ప్రజలకు ప్రాథమిక అవసరమైన విద్య, వైద్యం బాధ్యతనుంచి ప్రభుత్వాలు తప్పుకున్న నయా ఉదారవాద విధానం నుంచి ఈ ప్రభుత్వం వెనక్కిరావటం లేదు. అయినా ఉన్నంతలో ఉన్నత విద్య ప్రమాణాలను పెంపు చేయాలన్న ఆలోచన మంచిదే. కాని సంబంధీకులందరితో చర్చించి నిర్ణయాలు చేస్తే ఆ మార్పు సమర్థవంతంగా పని చేస్తుంది.