Home కలం సాంస్కృతిక దీపధారి సురవరం

సాంస్కృతిక దీపధారి సురవరం

Suravaram-Pratapa-Reddy

నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించిన స్వాతంత్య్రయోధుడుగా, చరిత్ర లోతులను ముట్టిన పరిశోధకాగ్రణిగా, ప్రథమాంధ్ర సాంఘిక చరిత్ర నిర్మాతగా, పత్రికా సంపాదకుడుగా , సృజనాత్మకశీలియైన రచయితగా తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్య వైతాళికుడుగా చిరయశస్సు నార్జించిన మహా పురుషుడు సురవరం ప్రతాపరెడ్డి, పాలమూరు జిల్లా ఆలంపూర్ తాలుకాలోని ఇటికాల పాడు వాస్తవ్యుడైన సురవరం కర్నూలులో హై స్కూలు విద్య, హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ పూర్తి చేసి తివేండ్రంలో ‘లా’ డిగ్రీ పొందారు. 1896 మే 28 తేదీన జన్మించిన ప్రతాపరెడ్డి ఒక వ్యక్తి గా కాక బృహత్ సంస్థగా ఎదిగాడు. ఆయన కవి, కథకుడు, నాటకకర్త, పత్రికా రచయిత, సంస్థా నిర్వాహకుడు గా బహుముఖ ప్రతిభను ప్రదర్శించిన ప్రజ్ఞాశాలి. తెలుగు, ఉర్ధూ, హిందీ , ఫారసీ, సంస్కృతం, ఆంగ్లభాషల్లో నిష్ణాతుడు. మొదట్లో న్యాయవాద వృత్తిలో కొన సాగినా అది ఆయన ప్రవృత్తికి సరిపడ లేదు. రెడ్డి హాస్టలులో లైబ్రేరియన్‌గా పనిచేస్తూ రాజాబహద్దర్ వెంకట్రామారెడ్డి సహకారంతో 1926 మే నెల 10 తేదీన గోలకొండ పత్రికను స్థాపించాడు. తెలంగాణా రాజకీయ, సాంఘిక , సారస్వత చైతన్యోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన గోలకొండ పత్రిక సురవరం కీర్తి పతాకంగా వెలుగొందింది. ఆంధ్రభాషాసేవ, నిజాం రాష్ట్రాంధ్రుల సత్వరాభివృద్ధి ఆశయాలుగా ప్రకటించిన సురవరం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించటానికి కలాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగాడు. తుపాకీ గుళ్ల వంటి సంపాదకీయాలతో పాటు వ్యాసాలు, సమీక్షలు, చర్చలు, లేఖలు మొదలైన వివిధాంశాలకు సంబంధించిన రచనలు మారు పేర్లతో స్వయంగా రాసేవారు. “నిజాం రాష్ట్రంలో ఆంధ్రకవులు పూజ్యము” అన్న అప నిందను ఖండిస్తూ తెలంగాణ సాహితీ ప్రాభవాన్ని చాటటానికి ఆయన ప్రచురించిన ‘గోలకొండ కవుల సంచిక’ (1934) ప్రతాపరెడ్డి కీర్తి స్తంభంగా నిలచింది. పది జిల్లాలకు చెందిన 354 మంది కవుల 1418 పద్యాలు, శ్లోకాలు సేకరించి సంకలనం చేసిన ఈ సంచిక ఆధునికయుగంలో వెలువడిన ప్రప్రథమ కవితా సంకలనంగా గణింపదగింది. ముద్దుకృష్ణ కవితా సంకలనం ‘వైతాళికులు’ కంటే ఒక సంవత్సరం ముందే ఇది ముద్రితమైన విషయం గమనార్హం. 1926 నుంచి 1947 వరకు 21 సంవత్సరాలు ద్వైవార పత్రికగా (బుధ, శని వారాలు) వెలువడిన గోలకొండ సురవరం సంపాద కత్వంలో కొనసాగింది. 1947 ఆగస్టులో పత్రిక యాజమాన్యం మారటంలో ఆయన పత్రిక నుండి తప్పుకొన్నారు. తర్వాత అది 1966 వరకూ దిన పత్రికగా 20 సంవత్సరాలు నడిచింది. 1926– 36 మధ్య సురవరం రాసిన సంపాదకీయాలు 1989లో పుస్తకరూపంలో వచ్చాయి. పత్రికా ప్రచురణపై ఆసక్తి తగ్గని సురవరం 1951లో ప్రజావాణి’ పత్రికను నిర్వహించారు. వారానికి మూడు రోజులు వెలువడుతుండిన ఈ పత్రిక ఆర్థిక ఇబ్బందులతో 1953 లో ఆగిపోయింది. పద్యాలు, ఖండకావ్యాలు, కథలు, నాటకాలు మున్నగు ప్రక్రియా వైవిధ్యంతో కూడిన ప్రతాపరెడ్డి సాహిత్య రచనలు ఆయన సృజనాత్మక భావుకతకు గీటురాళ్లు. సీసం, గీతపద్యం ఛందస్సుల్లో విరచితమైన ఆయన కవితల్లో కథాత్మకాలు, స్మృతులు, అధిక్షేపాలు, నీతులు మొదలైన వస్తు వైవిధ్యం ఉంది. ఆయన కలం నుంచి వెలువడిన సుమారు 50 శీర్షికల్లోని పద్యాలలో నాలుగైదు దీర్ఘ ఖండికలున్నాయి. 1920లో ప్రచురితమైన ‘మహమూద్ ఘజ్నవీ’ గీతమాలికలోని ఇతివృత్తం జాషువా కవి ‘ఫిరదౌసి’ కావ్యానికి మార్గదర్శకమని చెప్పవచ్చు. సమకాలీన సాంఘిక వ్యవస్థకూ, గ్రామీణ జన జీవితానికీ దర్పణం పట్టిన ఆయన కథలు “మొఘలాయీ కథలు’ పేరుతో 1940లో అణాగ్రంథమాల పక్షాన రెండు భాగాలుగా వెలువడ్డాయి. ‘నిరీక్షణ’ కథ కన్యాకుమారి చరిత్ర నేపథ్యంలో ముగ్ధ ప్రేమకు దృష్టాంతం కాగా, ‘సంఘాల పంతులు’ కథ తెలంగాణ ప్రజల పోరాట నేపథ్యాన్ని చిత్రిస్తుంది. ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్’ వంటి కథల్లో లంచగొండితనం మున్నగు అక్రమాలు హాస్య ధోరణుల్లో వర్ణితమైనాయి. తెలంగాణ పలుకుబళ్లు, ఉర్దూ మిళితమైన వాడుక పదాలు, మాండలికాలు ఆయన కథనశైలికి ప్రత్యేకతను ఆపాదించాయి. ఉచ్చల విషాదము, భక్త తుకారాం నాటకాలు ఆ ప్రక్రియలో విశిష్టమైనవిగా గుర్తింపు పొందినాయి. పాండురంగ భక్తుడు తుకారాం జీవితాన్ని నాటక రూపంలో మలిచిన తొలి రచయిత సురవరం వారే. ఆయన కలం నుండి వెలువడిన సృజనాత్మకత రచనలన్నీ ఒక ఎత్తయితే, పరిశోధనాత్మక గ్రంథాలు మరొక ఎత్తు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, వ్యాసాలు ఆయన పరిశోధనా శేముషికి నిలువెత్తు నిదర్శనాలు. తెలుగులో విరచితమైన మొట్టమొదటి సాంఘిక చరిత్రగా ప్రశస్తి గడించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ (1949) కేంద్ర సాహిత్య ఆకాడమి నుండి తెలుగు భాషలో మొట్టమొదటి బహుమతిని అందుకున్నది. కాని ఆయన మరణానంతరం 1954లో ఆయన అర్ధాంగి దీన్ని స్వీకరించారు. “స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఆంధ్ర సాహిత్యములో వెలువడిన అనర్ఘ గ్రంథాలు కొన్నింటిలో ఈ గ్రంథము అగ్రగణ్యము” అని ప్రముఖ విమర్శకులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు లేఖ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
రాజకీయరంగంపై ఆసక్తి లేకపోయినా మిత్రుల ప్రోద్బలంతో ప్రతాపరెడ్డి 1952లో జరిగిన ఎన్నికల్లో పాలమూరు జిల్లా వనపర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుపొందారు. కుటిల రాజనీతితో ఇమడలేక మంత్రి కాలేకపోయారు. కుటుంబ పరిస్థితులు కూడా బాగుండకపోవటంతో 57వ ఏట, 1953 ఆగస్టు 25న గుండెపోటు వచ్చి సమయానికి వైద్యం అందక కన్నుమూశారు.
(మే 28 సురవరం జయంత్యుత్సవ సందర్భంగా)