Home లైఫ్ స్టైల్ తెలుగు భాష మాధుర్యాన్ని తెలిపే బాధ్యత అమ్మదే!

తెలుగు భాష మాధుర్యాన్ని తెలిపే బాధ్యత అమ్మదే!

life

ప్రపంచ తెలుగుమహాసభలు రెండోరోజు కార్యక్రమాలు రవీంద్రభారతి డా. యశోదారెడ్డి ప్రాంగణం బండారు అచ్చమాంబ వేదికలో బాలసాహిత్య సదస్సు విజయవంతంగా జరిగింది. ఉదయం 10 గం.కు మొదలైన కార్యక్రమాలు సాయంత్రం 5గం. వరకు సాగాయి. బాలసాహిత్యం సదస్సు కార్యక్రమానికి అధ్యక్షులుగా సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డా. పిల్లలమర్రి రాములు, గౌరవ అతిథిగా చొక్కాపు వెంకటరమణ హాజరయ్యారు. పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించేలా చేసేది అమ్మే అన్నారు. తెలుగు భాషను ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకునే అవకాశాలు లేకపోవడం వల్ల కొంత వ్యథకు లోనవుతున్న మాట వాస్తవం. 15 కోట్ల మంది మాట్లాడే తెలుగభాష అంతరించిపోదు అనేదానికి ఇక్కడున్న మనందరం సాక్షం అని కరతాళ ధ్వనుల మధ్య పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నవారైనా మన జాతిని, మన భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం గౌరవ అతిథి వెంకటరమణ మాట్లాడుతూ తెలుగుభాషకు సేవ చేయడానికి, శిఖరాగ్రాన నింపడానికి మహాసభలు దోహదపడుతున్నాయన్నారు. బాలసాహిత్య పరిషత్ ద్వారా బాలకవితా శిక్షణ శిబిరాలు, కథా శిక్షణ శిబిరాలను అనేక ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజుల్లో ఎల్‌కేజీ నుంచే పిల్లలకు ఒత్తిడి పెరిగిపోతుంది. చదువుకో.. చదువుకో.. అంటూ పిల్లల్ని వేధించడం మానుకోవాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. ఎన్‌బిటి (నేషనల్ బుక్ ట్రస్ట్) డైరెక్టర్ డా. పత్తిపాక మోహన్ బాలల గేయాలను గూర్చి మాట్లాడుతూ అఆఇఈలు లేనిదే మహాకావ్యాలు రాయలేరు. బాలసాహిత్యం లేకుండా ప్రౌఢ సాహిత్యం లేదని నమ్మేవారిలో నేనొకడిని. బాలలే బాలసాహిత్యం రాస్తున్న రాష్ట్రాలు రెండు తెలుగురాష్ట్రాలు మాత్రమే అని చెప్పడానికి గర్విస్తున్నాను అని అన్నారు. సీఎం కేసీఆర్ బాల్యమిత్రులు ఐతా చంద్రయ్య బాలల కథల గురించి మాట్లాడుతూ..పిల్లలు బాధ్యతగా రాణించాలంటే చిన్నప్పుడే సరైన క్రమశిక్షణ ఉండాలి. పిల్లల కథల్లో ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువూ మాట్లాడుతుందన్నారు. అనంతరం కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు గ్రహీత దాసరి వెంకటరమణ బాలల నవలల గురించి మాట్లాడుతూ..ఆ రోజుల్లో చందమామ గురించి ఎంతో మంది ఆతృతతో ఎదురుచూసేవాని అన్నారు. బాలల పత్రికల గురించి వేద కుమార్ మాట్లాడారు. దేశదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఈ మహాసభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ భాషను అన్ని ప్రాంతాలకు అందిద్దాం అన్నారు. అలాగే వేరేప్రాంతాల భాషనుకూడా మన పిల్లలకు పరిచయం చేద్దాం పేర్కొన్నారు. భవిష్యత్తులో బాలల కోసం ఎలాంటి సాహిత్యం రావాలో తెలిపారు. తెలంగాణ యాసలో ఇంకా మంచి మంచి కథలు రావాలని అభిలషించారు. ఐతా చంద్రయ్య రాసిన పల్లెనాతల్లి కథాసంపుటితో పాటు మరి కొంతమంది రచయితల బాలల సాహిత్య పుస్తకాలను అధ్యక్షులు పిల్లలమర్రి రాములు ఆవిష్కరించారు. వ్యాఖ్యాతగా డా. పోరెడ్డి రంగయ్య, సమావేశ కర్తగా దేవేంద్ర, సమన్వయ కర్తగా డా. గిరిజారాణి వ్యవహరించారు.
మధ్యాహ్నం 3 గం.లకు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమ అధ్యక్షులుగా డా. యమ్. చిత్తరంజన్ ప్రసంగించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు చిరకాలం జీవించాలంటే పిల్లల సాహిత్యం మరింత రావాలన్నారు. అనంతరం రెడ్డి రాఘవయ్య, సాధన నరసింహాచార్యులు ప్రసంగించారు. కుమారి లోహిత హరికథా కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.ఈ వేదికలోని కార్యక్రమాన్ని చూడటానికి మొత్తం జనాలు నిండిపోయారు. కుర్చీలన్నీ నిండిపోగా చాలా మంది నిలబడే కార్యక్రమాన్ని తిలకించారు.

వంటకాలు అదుర్స్

ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రతినిధుల కోసం తయారు చేయించిన వంటకాలు నోరూరిస్తున్నాయి. తెలుగు మహాసభలకు వచ్చిన ఇతర రాష్ట్రాలు, దేశాల వారు శనివారం ‘విందు’ భోజనాన్ని ఆస్వాదిస్తూ తెలుగు రుచి భళా అంటూ కితాబిచ్చారు. ఐదు రోజుల పాటు జరిగే  ఈ సభలకు పౌరసరఫరాల శాఖ భోజనాల ఏర్పాట్లు చేసింది. రెండో రోజు ప్రపంచ  తెలుగు మహాసభలు జరుగుతోన్న తెలుగు విశ్వవిద్యాలయం,  రవీంద్రభారతి, ఎల్‌బిస్టేడియం, లలితా కళాతోరణం వద్ద భోజన ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్ మరికొద్దిమంది అధికారులతో కలిసి పరిశీలించారు. పెళ్ళి భోజనం తరహాలో వండించడం సాహీతీ ప్రియులందరికి మంచి అనుభూతి ఇచ్చింది. వెజ్  బిర్యాని, పట్టువడియాల పులుసు, వంకాయ, బగారా, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, చింతకాయ పచ్చడి, పండు మిర్చి పచ్చడి, దొండకాయ ,పచ్చి పులుసు, టమాట రసం, చింతపండు పులిహోర, రైతా( పెరుగు చెట్నీ) ఇతర తెలంగాణ పిండి వంటకే కాకుండా  వివిధ రకాలనై పండ్ల ముక్కలతో పాటు భోజనం చివర అందించే తాంబూలం వరకు  వచ్చిన అతిథులను మైమరిపించే విధంగా చేస్తున్నాయి. భోజనాల సమయంలో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భోజనాలకు వచ్చిన అతిథులు క్రమశిక్షణ  పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారులు తీసుకున్న చర్యల పట్ల అక్కడకు వచ్చిన అతిథులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. భోజనశాలకు వెళ్ళగానే అక్కడ ఏమేం వంటలు వండారో తెలుసుకోడానికి ఒక పట్టికను ప్రదర్శనకు ఉంచారు. ఏరోజుకారోజు కొత్త మెనూ సిద్ధమవుతోంది.