Home ఎడిటోరియల్ విషాద మరణాలు

విషాద మరణాలు

Article about Modi china tour

ఉదయాన్నే వార్తపత్రిక తెరవగానే లేదా టివిలో ఏదోక వార్తా ఛానల్ పెట్టగానే ఒళ్లు గగుర్పొడిచే విషాద మరణ వార్తలు లేని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు. నిలిచిఉన్న లారీని అతివేగంతో గుద్దుకున్న కారు కుటుంబ సభ్యుల మృతి, బైక్‌ను వెనుక నుంచి గుద్దిన బస్సు భార్యా, భర్త మృతి. బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టి నుజ్జునుజ్జు అయినకారు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోరకలి పలువురు మృతి. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుద్దిన ఆటో వ్యక్తి మృతి. ఓవర్‌లోడ్‌తో స్కూలు పిల్లలను తీసుకెళుతున్న ఆటో బోల్తా అభం శుభం తెలియని పిల్లలు పలువురు మృతి, తల్లిదండ్రుల ఆక్రందన. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు పాదచారుల మృతి. అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న ఖరీదైన కారు కానరాని లోకాలకు కారులోని యువకులు ఇలాంటి వార్తలు హృదయాన్ని ద్రవింప చేస్తాయి. ఇటువంటి రోడ్ ప్రమాదాలవల్ల అకాల మృత్యుఘాతాలతో అనునిత్యం కొన్ని కుటుంబాలు ఆప్తులను కోల్పోతున్నాయి.
ఆదివారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఘోర ప్రమాదాలు క్షణంపాటులో 24 ప్రాణాలు బలి గొన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామం నుంచి సమీపంలోని లక్ష్మీపురం గ్రామం పొలాల్లో పత్తి విత్తనాలు నాటేందుకు 25 మంది కూలీలు ట్రాక్టర్‌లో వెళుతుండగా అది అదుపు తప్పటంతో ట్రాలీ మూసీ కాల్వలో తిరగబడటంతో 13 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడొకరు జలసమాధి అయిన ఘోరకలి హృదయ విదారకం. మరో 10 మంది గాయపడ్డారు. వెంకట రమణ అనే వ్యక్తి తమ పొలంలో విత్తనం నాటటానికి కొద్ది రోజులుగా ఇలాగే కూలీలను ట్రాక్టర్‌లో తీసుకెళుతున్నాడని, ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎప్పటిలాగే ట్రాక్టరెక్కిన కూలీలు అనుకోని విపత్తుకు గురైనారని ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి సమాచారం. డ్రైవర్ ఒక చేత్తో సిగరెట్ పీల్చుతూ, ఒంటిచేత్తో స్టీరింగ్ పట్టుకున్నాడని, ముందు నుంచి వాహనం రావటంతో ట్రాక్టర్‌ను కంట్రోలు చేయలేకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పబడుతున్నది. ఇది డ్రైవర్ నిర్లక్షానికి అమాయక కూలీలు చెల్లించిన భారీ మూల్యం. ‘ట్రాక్టర్ వాణిజ్య వాహనం కాదు. ట్రాలీకి రెండు చక్రాలే ఉన్నాయి. అది ప్రయాణీకుల కొరకు తయారించింది కాదు. అందువల్ల ప్రమాద అవకాశం హెచ్చు’ అన్నారు డిటిఒ సురేందర్ రెడ్డి.
ఇటువంటి ట్రాక్టర్ ప్రయాణాలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణం. పెళ్లి, పేరంటాలు, తిరునాళ్లు, సంతలువంటి ఉత్సవాలకు ప్రజలు ఇలాగే ట్రాక్టర్లలో ప్రయాణిస్తుంటారు. ఆపద సంభవించినపుడు లబోదిబోమనటం తప్ప ప్రజలు నిస్సహాయులు. అక్కడ నియంత్రించేవారుండరు. వేములకొండ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున, స్థానిక ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
రాష్ట్రంలో గత మూడునెలల్లో ఇది రెండవ ట్రాక్టర్ బోల్తా ప్రమాదం. ఏప్రిల్‌లో వడ్డిపట్ల గ్రామం వద్ద వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పడిన ప్రమాదంలో 9 మంది మహిళలు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమరాజుపల్లె సమీపంలో ఆటో డ్రైవర్ రాంగ్ రూట్ డ్రైవింగ్‌వల్ల ఆర్‌టిసి బస్సు ఢీకొనటంతో 9 మంది ప్రయాణీకులు ఆకస్మిక మరణం పాలయ్యారు. కంటి పసరు వైద్యం కోసం మహానంది వెళుతున్న ఆ ఆటోలో డ్రైవర్ సహా 14 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్ ప్రయాణ దూరం తగ్గించేందుకు రాంగ్‌రూట్‌లో ప్రయాణం ఎంచుకుని ప్రమాదానికి కారకుడైనాడు. ఆటోలు ఓవర్ లోడింగ్‌తో వెళ్లటం సర్వసాధారణమైంది.
కేంద్ర ఉపరితల రవాణశాఖ లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2016లో 2227 ట్రాక్టర్ ప్రమాదాలు జరిగి 1080 మంది చనిపోయారు. తెలంగాణలో 926 ప్రమాదాల్లో 470 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా 15,556 ట్రాక్టర్ ప్రమాదాల్లో 6740 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్లపై ప్రయాణించకుండా ప్రజలను రెవిన్యూ, పోలీసు సిబ్బంది చైతన్య పరచటం ఒక మార్గం. గ్రామ సర్పంచ్‌లు, పెద్దలు నడుంకడితే ట్రాక్టర్లపై ప్రయాణీకుల రవాణాను నిరోధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.