Home కలం ధిక్కార కవి ఊటుకూరు రంగారావు

ధిక్కార కవి ఊటుకూరు రంగారావు

klm

“నేనొక కవిని/ నేనొక రవిని
కొందరి కమృతం నా కవిత
కొందరికి హాలాహలం నా వెలుగు….”
“నా కవితా సుధా ధారల్తో
ఈ దరిద్ర ప్రపంచాన్ని
స్వర్గంగా మార్చేస్తా/ నాకెవ్వరి భయం లేదు
నాకొకరి దయ పనికి రాదు
తప్పక పాడేస్తానొక
నిప్పుల తుపాను గీతమై”
ఊటుకూరు రంగారావు ఈ కవిత 1950లో ‘నవ్యాంధ్ర’ అనే పత్రికలో అచ్చయింది. అంటే అప్పటికి ఊటుకూరు రంగారావుకు 21 ఏండ్లే. ఈ కవిత ఒక విధంగా ఆయన ఆత్మ. నిప్పుల తుపాను గీతమై తెలుగు నేల మీద వర్షించిండు. తన కవిత్వాన్ని రైతులు, శ్రామికులు, నిరాశ్రయులు, నిరుపేదలు, నిర్జీవులు సైతం వింటారు. ఈ దరిద్ర ప్రపంచాన్ని తన కవితా ధారలతో స్వర్గంగా మార్చేస్తాను అనే హామీని, విశ్వాసాన్ని ప్రకటించాడు. 1949వ సంవత్సరం నుంచి రచనలు చేస్తున్న ఈయన గురించి తెలంగాణ/ తెలుగు సమాజానికి తెలిసింది చాలా తక్కువ. అయితే ఖమ్మం జిల్లాలోని కొంతమంది పాత తరానికి ఈయన గుర్తుండి ఉంటాడు. నిజానికి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 55 ఏండ్లకు ఆయన యాదికున్నాడా? అని అడగలేము కాని ఆయన రచనలు, అవి చూపించిన ప్రభావం అంచనా వేయడానికి వీలవుతుంది. శాంతి విప్లవం, సమతావాదం ఆయన మార్గం. అయితే హక్కులు మింగే వాళ్లను ముక్కలుగా కొట్టేస్తాను అని కూడా అనగలిగాడు. ఇలాంటి అద్భుతమైన కవిత్వాన్ని ఎంతగానో సృజించిన రంగారావు తాను బతికున్న కాలంలో అచ్చేసుకున్న ‘శరధా ర’ను, ఇవే గాకుండా ఆయన రాసిన అనేక విడి కవితలున్నాయి. తర్జుమా చేసిన కథలు, కవిత్వం, అముద్రిత నవల ‘మలిగిన దీపం’ అచ్చు కావాల్సి ఉన్నది. త్వరలో ఆయన తెలుగులో రాసిన డజన్‌కుపైగా కథలు వెలువరించనున్నాము.
ఊటుకూరు రంగారావు గురించి తెలంగా ణ కథలపై పరిశోధన చేస్తున్న క్రమంలో తెలిసి వచ్చింది. ఉర్దూలో హీరాలాల్ మోరియా, కవిరాజ మూర్తి రాసిన అనేక కథలను ఈయన తెలుగులోకి తెచ్చినాడు. వారి కవి త్వాన్ని తెలుగువారికి తెలియ జేసిండు.కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, నవలాకారుడిగా, సంగీతం తెలిసిన పాటగాడిగా, బహిరంగ సభల్లో ఉపన్యాసకుడిగా, హక్కుల కార్యకర్తగా, కాంగ్రెస్ అభిమానిగా, సంస్థల నిర్వాహకుడిగా, లైబ్రేరి యన్‌గా, తెలంగాణ రచయితల సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఇట్లా బహుముఖ ప్రతిభను ప్రదర్శించిన ఊటుకూరు రంగారావు తెలం గాణవాడైనందుకు ఈ నేల గర్వించాలి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషల్లో నైపుణ్యం ఉన్న రంగారావు ఉర్దూ మాధ్యమంగా మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువు అక్కడితో ఆగిపోయింది. చదువు ఆగిపోయింది అనే కన్నా తన 16వ యేట నుండి అటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు జమలాపురం కేశవరావు, హీరాలాల్ మోరియా తదితరుల ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొనేవాడు. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా దాని ప్రార్థనా గీతం రంగారావే పాడేవాడు. ఉపన్యాసకుల కన్నా ఆయనే ఆనాడు ఎక్కువ పాపులర్. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యానికి భావజాల మైకం చాలా అన్యాయం చేసింది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వారు వారితో విభేదించే వారిని విస్మరించారు. అలాగే ఆర్యసమాజ్ భావజాలంతో ఉన్నవారు కమ్యూనిస్టులను చీల్చి చెండాడ డం ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అతీతంగా ప్రజల పక్షాన నిలబడి, భావజాలాలకు అతీతంగా ఏది మంచి, ఏది చెడో విచక్షణతో, వ్ఞితతో వ్యవహరించిన వారికి గౌరవం దక్కలేదు. ఇప్పటికీ ఆస్థితి కొన సాగుతోంది. తమ భావజాలం వారు ఏది చేసినా, చెప్పినా, రాసినా దాన్ని గుడ్డిగా నమ్మి ఆచరించడమే ఆనవాయితిగా వస్తోంది. ప్రశ్నించడం, తర్కించడం, బేరీజు వేసుకోవడం తమ పని కాదని ‘ఇజా’ల మతు లో ఉన్నవాళ్ళు భావిస్తున్నారు. తెలుగు సాహిత్యాన్ని ఈ ‘ఇజా’లు కమ్మే యడంతో ‘ప్రజాయిజం’తో ఉన్నటువంటి ఊటుకూరి రంగారావు వెలుగులోకి రాలేదు. ఇట్లా ఆయన రచనలు వెలుగులోకి రాక పోవడం మూలంగా, విమర్శ, విశ్లేషణ, పరిశోధన అనేది ఆయన రచనలపైన జరగలేదు. నిజానికి ‘యిజా’లకు అతీతంగా ఒక ‘సెంట్రిస్ట్’గా కాంగ్రెస్ వాదిగా ఖమ్మం జిల్లాలో దాశరథి, హీరాలాల్ మోరియా, తాళ్ళూరి రామానుజస్వామి, చందా రామకవి, కొలిపాక మదుసూధనరావు, కవి రాజమూర్తిల మాదిరిగా ఎంతో విలువైన సాహిత్యాన్ని కేవలం పదేళ్ళ కాలంలో సృజించిండు. రజాకార్ల దురాగతాలను గూర్చి రాసినాడు. నిజానికి వాటిని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా అనుభవించారు. రంగారావు సోదరుడు ఒకరు కాల్పుల్లో గాయపడ్డాడు కూడా! కాంగ్రెస్ వాదిగా ఆయనకు కొండంత అండగా ఉన్నటువంటి జమలాపురం కేశవ రావు ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత అర్ధాంతరంగా చనిపోవడం అశనిపాతమైంది. ఆయనకు నివాళిగా కవితలు రాసినాడు. రంగారావు కాంగ్రెస్ వాది అయినప్పటికీ స్వాతం త్య్రానంతరం వారిలో వచ్చిన మార్పు ను తన కవిత్వంలో తూర్పారా బట్టిం డు. “ఏదో జిత్తుల మాయ నాటకము లెన్నెన్నో ప్రయోగించి, నూ/త్నాదర్శం బిదియంచు జెప్పి, ప్రజలన్ నమ్మించి, పీఠాలు సం/పాదించంగను జూచు చున్న పదవీ వ్యామోహ లుబ్ధా త్ములన్ /బాధించున్ శరధార శూల సమమ్మై, ప్రచ్ఛనమై, మృత్యువై” “నాకు చీకట్లు లేవు చీకాకు లేదు/నా కొక నిరంకుశ ప్రభువాజ్ఞ లేదు/యే నొకరి జాలిపై బ్రతుకీడ్వలేను/ నేను భారత శక్తి జీర్ణించుకొంటి” అని ఇండియాలో హైదరాబాద్ విలీనానంతరం రాసి నాడు. మార్పు తథ్యం.అది మంచి వైపు ఉంటుందని విశ్వాసం ప్రకటిం చినాడు. అందులో “ఓనిరు పేదలారా! విజయోద యమాన సులౌ చు సాగిరం/డో నిరుపాధి జీవితము లూడ్చెడి యీ ధనరాజ్య సీమలన్/ ఈ నరక ప్రవాసముల నీ సరిహద్దుల దాటి స్వేచ్ఛ, ప్రా/గ్భాను సమానులై దిశల బ్రాకగ రండిక లెండు వేగమే” అని ఉద్బోధించాడు. అంతే గాకుండా ఎవ్వరేమనుకున్నా తన కవి త్వాన్ని ప్రజల కోసమే రాస్తానని జెప్పిండు. ఎదురేదిలేదిక నా కలానికి ఏరేమ న్ననున్ గూడ నాయెదలోనుండు మహాగ్ని జ్వాలలకు చన్నీరే కవిత్వంబింకన్ పదునెక్కింతు పవిత్రలేఖినికి దర్పంబొప్ప లంఘించి, కూల్చెద దౌర్భాగ్య ప్రపంచ గోళమును దోర్లీలా ప్రభావోన్నతిన్ ఇలాంటి ప్రజాభ్యుద యమైన కవిత్వాన్ని రాసిన రంగారావు కాంగ్రెస్ వాది కావడమే ఆయనకు శాపమయింది. ఎందుకంటే ఆయన గురించి పట్టించుకునే వారు, కాంగ్రెస్‌లో సాహిత్యాన్ని ఒక భాగంగా జేసి ప్రోత్సహించే మెకానిజం లేక పోవడంతో ఆయనకు గుర్తింపు దక్కలేదు. పోనీ గుర్తింపు దక్కకున్నా తినడానికి ఒక్కొక్కసారి తిండి కూడా కరువుగా ఉండింది. వీటన్నింటిని అధిగమించి ఆయన కవిత్వం రాసిండు. అదీ నాయకుల మెరమెచ్చుల కోసం కాదు. తాను నమ్మింది ప్రచారం చేయడం కోసం, తనకు తెలిసింది చెప్పడం కోసం, తాను ఆచరించింది ప్రచారం చేయడం కోసం రాసిండు. కేవలం 33 ఏండ్లు మాత్రమే జీవించిన ఈయన ఎప్పటికీ గుర్తుండి పోయే సాహిత్యాన్ని సృజించిండు. రాష్ర్ట సాధన ఉద్యమ సమయంలో ఆంధ్రప్రాంత విమర్శకులు, చరిత్ర కారుల మూలంగా తెలంగాణ ప్రతిభకు గుర్తింపు లేకుండా పోయిందని చెప్పి నాము. ఇప్పుడు ఆమాట చెప్పడానికి వీలులేదు. ఎవరో ఒకరు పూనుకొని తెలంగాణ వాళ్ళే ఆ పని చేయాలి. అందుకే కారణాల గవేషణ గాకుండా, నిర్మాణాత్మకంగా, నిర్దుష్టంగా విస్మరణకు గురైన సాహితీ వేత్తలను, సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకం. గత 20 ఏండ్లుగా ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాను. ఆయన కథలు అద్భుతమైనవి. అవి రావాల్సిన అవసరమున్నది. అందు లో ఒక అడుగుగా ఈ అక్షరమాల. ఊటుకూరు రంగారావు జీవితం గురించి గూడా కొంచెం పరిచయం కావాలి. ఆయన 1929 డిసెంబర్ ఎనిమిదిన మధిర తాలూకా సత్యనారాయణపురంలో జన్మించినాడు. ఇంట్లో తల్లి, తండ్రి, సోదరులు, సోదరీ అందరూ సాహిత్య సృజన చేసినవారే కావడం ఆయన అదృష్టం. ఇంట్లో కవిత్వముండిండి అట్లే కడుపు నిండేందుకు మాత్రం కటకట ఉండింది. కాంగ్రెస్ వాదిగా తన 16వ యేట నుండి ఒక వైపు రజాకార్లను, మరోవైపు కమ్యూనిస్టుల ఆగడాలను కూడా ఆయన స్వయంగా చూసిండు. అనుభవించిండు. ఊరూరా తిరిగి కాంగ్రెస్ భావజాలాన్ని వ్యాప్తి చేసిండు. విజయవాడలోని సాహిత్య సమావేశాలకు తరచుగా హాజరయిండు. అయితే ఖమ్మం పట్టణానికి రమ్మని మోరియా చెప్పినా అక్కడ నేనిమడలేను.. తాను ఊళ్ళోనే ఉంటానని ఒక గ్రామీణు డిగా ప్రపంచాన్ని పరికించిండు. రాసిండు. ప్రజాసేవలో నిమగ్నం కావాలనుకున్న రంగారావుపై ఆయన తండ్రి వత్తిడి తీసుకు రావడంతో అందుకు ఒప్పుకు న్నా డు. అయితే తీరా ముహూర్త సమయానికి రంగారావు తండ్రి చనిపోవడంతో ఆ పెళ్ళి ఆగిపోయింది.
ఆ తర్వాత పూర్వం నిశ్చి తార్థమైన అమ్మాయినే 1955 ఆగస్టు నాలు గున వివాహమాడినాడు. వీరి ద్దరికి 1963 ఫిబ్రవరి 19న ఒక బాబు జన్మించిండు. ఇంట్లో 20 ఏండ్ల పసికందు ఉన్నాడు. మొత్తం సమాజం బాధ్యతంతా తనదిగానే భావించేవాడు గావడంతో తీవ్రమైన వత్తిడికి లోనై 1963 మార్చి 11న ఖమ్మం జిల్లా వైరాలో గుండెపోటుతో మరణించినాడు. ఖమ్మంలోని విజ్ఞాన నికేతనం గ్రంథపాలకుడిగా 195055 మధ్య కాలంలో, ఆ తర్వాతా, అంతకు ముందు హైదరాబాద్ బులిటెన్, ప్రజాపత్రిక, సార థి, ఆంధ్రపత్రిక విలేకరిగా పనిజేసిండు. ఈయన రచనలు తెలుగు స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, సారథి పత్రికల్లో అచ్చయ్యా యి. ఆంధ్రప్రదేశ్ అవతరణానంతరం ఖమ్మంలో ‘హిందీ ప్రేమీ మండలి’ని స్థాపించి, భాషా ప్రచారాన్ని మోరియా ప్రభావంతో చేసినా డు. అలాగే అంతకు ముందు ‘తెలంగాణ రచయితల సంఘం’ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేసిండు. జిల్లాలో సాహిత్య వాతావరణం పెరగ డానికి ఆయన ప్రధాన కారకుడు రంగారావు. యువకుల నుంచి వృద్ధుల వరకూ అందరితో కలసి పనిచేసిండు. ఎవరెక్కడికి రమ్మన్నా అక్కడికి వెళ్ళి తన పాటలు, ఉపన్యాసాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసినాడు. తన సాహిత్యం ద్వారా చిరస్థాయిగా నిలిచిండు. రంగారావు సోదరులు గోవిందరావు, కృష్ణమూర్తిలు ‘అశ్రుతర్పణం’ పేరిట సంస్మరణ సంచికలో ఇట్లా రాసినారు. స్వంతము కోస మొక్క నిమిసం బును యోచన సేయ లేదు, శ్రీమంతులవటంచు దుర్మలిన మత్తు స్త్రోత్రమొనర్చలేదు, వారెంతపదస్థులైన గణియింపగలేదు, నిజమ్ము పల్కుచో సుంత భయమ్మెరుంగవు విశుద్ధము నీ చరితమ్ము సోదరా! అట్లాంటి మహనీయుడి గురించి భవిష్యత్తరాల వారికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321