Home ఎడిటోరియల్ అవిశ్రాంత యోధుడు డాక్టర్ గౌర్

అవిశ్రాంత యోధుడు డాక్టర్ గౌర్

edt

కార్మికవర్గ హక్కుల కోసం పోరాడి ఎన్నో విజయాలు సాధించిన డాక్టర్ గౌర్ సింగరేణి, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి, ప్రభుత్వ రంగ బ్యాంకు లు, వైద్య ఆరోగ్యశాఖ, ఐడిపిఎల్‌లలో కార్మిక/ ఉద్యోగ యూనియన్‌లకు దీర్ఘకాలం సాటిలేని నాయకునిగా పని చేశారు. రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికైనారు. 1952లో జైలులో ఉండగా తొలిసారి ఎన్నికైనారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య వ్యవస్థకు, రజాకార్ అత్యాచారాలకు వ్యతిరేకంగా 1947 సెప్టెంబర్ 11న కామ్రేడ్స్ రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ పిలుపు ఇచ్చిన రైతాంగ సాయుధ పోరాటంలో డాక్టర్ గౌర్ చురుకైన పాత్ర వహించారు.
డాక్టర్ గౌర్ మంచి తెలివితేటలు గల విద్యార్థి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1943లో ఎం.బి.బి.ఎస్. డిగ్రీ పొందారు. అయితే విద్యార్థిగా ఉండగానే కమ్యూనిజంపట్ల ఆకర్షితుడై 21వ ఏట 1939లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)లో చేరారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రముఖ కవి, కమ్యూనిస్టు, ట్రేడ్ యూనియనిస్టు మఖ్దూం మొహియుద్దీన్‌తో కలిసి 1939 లో రహస్యంగా ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ నెలకొల్పారు. అటు తర్వాత 1946లో ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌ను ఎఐటియుసికి అనుబంధం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో అది ఎంతో సాహసోపేతమైన విప్లవాత్మక చర్య. కమ్యూనిజంపట్ల నిబద్ధత, విశ్వాసం కారణంగా డాక్టర్ గౌర్ వైద్యం ప్రాక్టీసు చేయకుండా యావజ్జీవితాన్ని ప్రజలు, కార్మికుల ప్రయోజనాల కొరకు అంకితం చేశారు. పెన్షన్ బకాయీ రూ. 3 లక్షలను అవసరమైన విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చే నిమిత్తం ఉర్దూ తలీమి ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధునిగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సకు అవకాశమున్న ఆయన అవసరం ఏర్పడిన ప్రతిసారీ ఉస్మానియా జనరల్ ఆసుపత్రినే ఎంచుకున్నారు. ఇతర రోగులతో జనరల్ వార్డుల్లోనే ఉన్నారు. 2011 అక్టోబర్ 7న 83 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన డాక్టర్ గౌర్ భౌతిక కాయాన్ని ఆయన విల్లు ప్రకారం ఉస్మానియా మెడికల్ కాలేజీకి అందజేయటం జరిగింది. డాక్టర్ గౌర్ లౌకికవాది, దేశభక్తుడు, ప్రజల సేవకు జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి, కార్మికుల ప్రయోజనాల కొరకు ఆయన సేవ ప్రశంసనీయం, అవిస్మరణీయం. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎపిబిఇఎఫ్) కు దీర్ఘకాలం పాటు అధ్యక్షునిగా పని చేశారు. బ్యాంక్ ఉద్యోగులతో ఆయన అనుబంధానికొక చిన్న ఉదాహరణ. బ్యాంక్ డెయిలీ డిపాజిట్ కలెక్టర్ల దుస్థితిని గమనించిన ఆయన వారి ప్రయోజనం కొరకు సుదీర్ఘ పోరాటం ద్వారా వారికి ఆప్తుడైనారు. ఆయన మార్గదర్శకత్వం వల్లనే ట్రిబ్యునల్, హైకోర్టు, అంతిమంగా సుప్రీంకోర్టు డిపాజిట్ కలెక్టర్లను “వర్క్‌మన్‌”గా ప్రకటించాయి. 1996లో ఎ.ఐ.బి.ఇ.ఎ. స్వర్ణోత్సవం సందర్భంగా ఇంటర్వూలో డాక్టర్ గౌర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు నేటికీ చెల్లుబాటు అవుతాయి. వాటిలో కొన్ని: ఎ.పి.బి.ఇ.ఎఫ్. అధ్యక్ష బాధ్యతను 195657 ప్రాంతంలో అడ్వొకేట్ నరసింహం నుంచి నేను స్వీకరించాను. ఆ రోజుల్లో అనేక బ్యాంకుల్లో పోరాటాలకు నాయకత్వం వహించాను. ఆంధ్రాబ్యాంక్ ఆఫీసర్లు ప్రారంభించిన పోరాటం మహత్తరమైంది. ఆ సమ్మెలో అనేక కోణాలున్నాయి. సమ్మె అనేక వారాలపాటు సాగింది. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ఒకరోజు నాకు కబురు పెట్టారు. ఐ.డి. చట్టం కింద సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించబోతున్నట్లు నాకు తెలిపారు. సమ్మె చేస్తున్న వారు వర్క్‌మన్ కాదు ఆఫీసర్‌లు అయినందున ఐ.డి. చట్టం కింద సమ్మెను నిషేధించే అధికారం ముఖ్యమంత్రికి లేదని నేను నమ్రతతో చెప్పాను. ముఖ్యమంత్రి నిర్ఘాంతపోయారు.
*** *** ***
ఏ వివాదాన్నయినా ఆషామాషీగా చేబట్టటం, అరకొరగా అధ్యయనం చేయటం నాకు ఇష్టముండదు. దేన్నయినా, క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేయాలి. కేసు పక్కాగా తయారు చేయాలి. అప్పుడే గెలుస్తాం. దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో ఈ అంశానికి ప్రాధాన్యతను వక్కాణించటం లేదు. ఉదాహరణకు, గనుల్లో పని చేస్తు న్న ఉద్యోగులను తీసుకుందాం. అనేక సంవత్సరాల క్రితం వేలాది మందిని తొలగించారు. వారంతా టెంపరరీ అయినందున మనం చేయగలిగింది లేదని నాతో చెప్పారు. నేను పరిస్థితిని లోతుగా అధ్యయనం చేశాను. టెర్మినేషన్ ముందు షోకాజ్ నోటీసు అవసరమని నేను చెప్పాను. వారి నడవడి క పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. టెంపరరీ ఉద్యోగి అయినంతమాత్రాన ఒక వ్యక్తిని మీరు బయటకు పంపలేరు. అంతిమంగా, అత్యున్నత న్యాయస్థానం ఈ వాదనతో ఏకీభవించింది.
*** *** ***
ఇవి కార్మికులు తమ సర్వీసు కండిషన్స్‌ను అనుభవిస్తున్న రోజులు. వారు వాటిని అనుభవించేకొలదీ వారిలో మిలిటెన్సీ తగ్గుతున్నది. మన చుట్టూ విలాస జీవితాన్ని చూస్తున్నాం. ట్రేడ్ యూనియన్ విలువలు తరుగుతున్నాయి. కన్సూమరిజం బ్యాంకు ఉద్యోగులను కూడా ఆవహించింది. ఆఫీసు బేరర్ పదవుల కోసం కామ్రేడ్స్‌లో వ్యామోహం కనిపిస్తున్నది. రాజకీయ నిబద్ధత, పార్టీ శాఖలు సమర్థవంతంగా పని చేయటం లేదు. కార్మికుని ఉత్పాదకత అనేది సగటు ఉత్పత్తి. సాంకేతికత పెద్ద ఎత్తున ప్రవేశించటంతో అది పెరిగింది. అయితే మిగులు విలువ ఎక్కడికి పోతున్నదో ఎవరూ అధ్యయనం చేయటం లేదు. మిగు లు విలువలో తమ వాటాను సమాజం లేక కార్మికుడు పొందటం లేదు. మధ్యదళారులు, సంపన్నులు ఆ మిగులు విలువ పొందుతున్నారు.
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా మనం ఐదేళ్ల క్రితం మన పోరాటం మొదలుపెట్టాం. ప్రభుత్వ రంగంపై తన పట్టును వదులుకోవటానికి ప్రభుత్వం నెమ్మదిగా సిద్ధమవుతున్నది. బ్యాంకింగ్ పరిశ్రమలోనే, ప్రభుత్వ, ప్రైవేటు రంగం, విదేశీ బ్యాంకుల మధ్య వేర్వేరు వడ్డీరేట్లను రిజర్వు బ్యాంక్ అనుమతించింది. అంతిమంగా ఈ గొప్ప ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపరచబడుతుంది, కోల్పోవటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ట్రేడ్ యూనియన్‌లు అవిరామంగా పోరాటాలు చేయాలి. అటువంటి పోరాటాలు వాటి స్వభావరీత్యా రాజకీయ పోరాటమవుతాయి. బ్యాంకుల్లో మీ ఆర్థిక కోర్కెలతో మీరు సమ్మె చేయవచ్చు. అంతిమంగా రాజకీయ యజమానులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు రాజకీయంగా పోరాడాలి. ప్రభుత్వంపైన, దాని కార్మిక విధానాలపైన రాజకీయ విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రైవేటీకరణ, సరళీకరణకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారంటే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారన్న మాట. బ్యాంకుల్లో పనిచేస్తున్న యువతరానికి నా సందేశం ఏమంటే, ఎఐబిఇఎ పతాకాన్ని సమున్నతంగా ఎత్తండి. ఎఐబిఇఎను నిర్మించిన వారి త్యాగాలను ఎన్నడూ మరువకండి. ఉత్తమమైన కస్టమర్ సర్వీసు ద్వారా కస్టమర్ల సద్భావం పొందటం భవిష్యత్‌లో తప్పనిసరి అని మరువకండి. బ్యాంకింగ్ పరిశ్రమలో పునర్వవస్థీకరణ, సంస్కరణలు ప్రజా వ్యతిరేకమైతే వాటికి వ్యతిరేకంగా పోరాడాలని ఎన్నడూ మరువకండి.దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలకు మేలు చేసే బ్యాంకింగ్ విధానాలనే బలపరచాలి. జాతీయకరణకు ముందు అదీ దార్శనికత. బ్యాంకింగ్ పరిశ్రమ తన విధానాల ద్వారా అంతిమంగా సామాన్య మానవునికి మెరుగైన జీవి తం ఇవ్వటంలో యువతరం ఉద్యోగులు చారిత్రక పాత్ర వహించాలి.

* ఎపి & టి బిఇఎఫ్