Home లైఫ్ స్టైల్ వాట్స్‌యాప్ గుప్పెట్లో ప్రపంచం

వాట్స్‌యాప్ గుప్పెట్లో ప్రపంచం

wts

క్యాపిటల్, మార్కెట్ వంటివి లేకున్నా విజయాన్ని సొంతం చేసుకోవచ్చునని నిరూపించారు వాట్స్‌యాప్ రూపకర్తలు జాన్‌కాన్, బ్రియాన్ ఆక్టన్‌లు. ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలచారు. ప్రొడక్ట్, సర్వీసెస్ కరెక్ట్‌గా ఉంటే ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ప్రజలు మన దగ్గరకు వస్తారని రుజువుచేశారు. ప్రపంచంలో కోట్లాది మందికి ఇప్పుడు వాట్స్‌యాప్ లేకుంటే గంట కూడా గడవని పరిస్థితి. అసలు వాట్స్‌యాప్‌ను ప్రపంచానికి అందించినవారి సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం…

ఒక చిన్న మొబైల్ యాప్‌తో కమ్యూనికేషన్ రంగంలో పెద్ద సంచలనమే సృష్టించారు జాన్‌కాన్, బ్రియాన్ ఆక్టన్‌లు. వీరు స్థాపించిన కంపెనీయే ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వాడుతున్న వాట్స్‌యాప్. ప్రస్తుతానికి వాట్స్‌యాప్ నెలకు 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 30 బిలియన్ మెసేజ్‌లను చేరవేస్తోంది. రూపకర్తల్లో ఒకరైన జాన్ 1976 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌లోని గ్రామీణ ప్రాంతంలో జన్మించాడు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న జాన్, తన తల్లితో కలిసి 1992లో కాలిఫోర్నియాలోని మౌంట్‌వ్యూకి చేరుకున్నాడు. అక్కడ వారికి ఒక సోషల్ సపోర్ట్ ప్రోగ్రాం సహాయం అందించింది. వారి సాయంతో జాన్ ఒక డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌ను పొందాడు. ఉద్యోగ వేట ప్రారంభించాడు. అతడికి ఓటమి కొత్తేమీ కాదు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ తనను రిజక్ట్ చేశాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలోనే తనకు ఇష్టమైన కంప్యూటింగ్ నెట్‌వర్క్‌ను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మాన్యువల్స్‌ను చదువుతూ నాలెడ్జ్‌ను పెంచుకుంటూ పోయాడు. ఇల్లు గడవటం కోసం ఓ గ్రోసరీ స్టోర్‌లో క్లీనర్‌గా జాయినయ్యాడు. ఇంతలో తల్లి క్యాన్సర్ బారిన పడింది. అయినా కుంగిపోలేదు. కష్టాలే ఆయన్ని రాటుదేల్చాయి. రెండేళ్లలోనే కంప్యూటర్ గురించి బాగా ట్రైయిన్ అయిన జాన్ తన తర్వాతి టాస్క్‌ను సెట్ చేసుకోవాలనుకున్నాడు. అదే తనను ప్రోగ్రామింగ్ వైపునకు మళ్లించింది. ఈ అభిరుచితో శాన్‌జోస్ యూనివర్సిటీలో చేరాడు. ఓ పక్కన చదువుకుంటూనే మరో పక్క ఓ కంపెనీలో సెక్యూరిటీ టెస్టర్‌గా పనిచేశాడు. ఆరునెలలు పనిచేసిన తర్వాత జాన్‌కు యాహూలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్‌గా పెద్ద అవకాశం వచ్చింది. వెంటనే జాయినయ్యాడు. అప్పటికీ చదువుకుంటూనే ఉన్నాడు. యాహూ కంపెనీ కూడా మిగతా కంపెనీల్లాగా స్టార్టప్ పొజిషన్‌లోనే ఉంది. ఉద్యోగం రావడంతో చదువుకు మధ్యలోనే ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. 2000లో తల్లి క్యాన్సర్‌తో కన్నుమూసింది. ఒంటరితనం అనుభవించేవాడు. ఆ సమయంలోనే స్నేహితుడైన బ్రియాన్ ఆక్టన్, జాన్‌ను తనతోపాటు సాకర్‌లాంటి ఆటలకు తీసుకెళ్లేవాడు. ఇద్దరూ యాహూలో 9ఏళ్లు కలిసి పనిచేశాడు . ఎంతో టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించుకున్నారు. 2009 జనవరిలో ఐఫోన్ కొన్నాడు జాన్.
ఏడు నెలలు పాతదైన యాప్‌స్టోర్ పూర్తి రేంజ్ యాప్స్‌ను విడుదల చేయాలనే ప్రయత్నంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే వాట్స్‌యాప్ ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తను రూపొందించే యాప్‌లో కొన్ని నిబంధనలు విధించుకున్నాడు. అవేమంటే తమ యాప్‌లో ప్రకటనలు ఉండకూడదు. ప్రజలను శాటిస్‌ఫై చేసేలా ఉండాలి. కస్టమర్ల ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనేవి. అందుకే ఈ ప్రొడక్ట్ మెసేజ్‌లను సేవ్ చేసుకోకుండా తయారుచేశారు. అంతేకాకుండా ఎటువంటి ట్రిక్స్ లేకుండా ప్రొడక్ట్‌ను డెలివరీ చేశారు. ఫిబ్రవరి 24, 2009న తమ ప్రొడక్ట్‌కి వాట్స్‌యాప్ అని పేరు పెట్టారు. అంతలో యాప్‌లోని కొన్ని లోపాలను గమనించారు. వాట్సయాప్ క్రాష్ అవడం, ఒక్కోసారి స్టక్ అవ్వడం చూసి జాన్ నిరాశకు లోనయ్యాడు. కానీ బ్రియాన్ అండగా నిలబడి ధైర్యం చెప్పాడు. మరికొన్ని నెలలు ఇద్దరూ కల్సి పనిచేశారు దానిమీద. తర్వాత యాపిల్ నుంచి సహాయం అందింది. వారు పుష్ నోటిఫికేషన్‌లను వాట్స్‌యాప్‌నకు అందించారు. అప్పటికీ కూడా పెద్దగా గ్రోత్ కనిపించలేదు. జాన్ తన మిత్రుడు బ్రియాన్‌ను తన కంపెనీకి రమ్మని పిలిచాడు. బ్రియాన్ యాహూలో ఉన్న స్నేహితులతో కల్సి రెండు లక్షల యాభైవేల డాలర్లను ఫండింగ్‌గా తీసుకొచ్చాడు. ఇదే బ్రియాన్‌ను వాట్స్‌యాప్‌కు కోఫౌండర్‌ను చేసింది. అప్పటి నుంచి వీరికి తిరుగులేకుండా పోయింది. 2014లో వాట్స్‌యాప్ ఊహించని స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మెసేజింగ్ సర్వీస్ కోట్లాదిమందిని సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ వీరు ఈ యాప్ గురించి ఎక్కడా ప్రమోట్ చేయలేదు. ఎటువంటి ప్రచారం లేకుండా ప్రపంచం మొత్తం చేరుకుంది. 55 మంది ఉద్యోగులతో కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తున్నారు వీరు. అదే ఏడాది ఫేస్‌బుక్ వాట్స్‌యాప్‌ను కొంటున్నట్లు ప్రకటించింది కూడా. ప్రపంచంలోని అతిపెద్ద ఆక్విజేషన్లలో ఇది కూడా ఒకటి. 19 బిలియన్ డాలర్లకు ఈ యాప్‌ను ఫేస్‌బుక్ కొన్నది. అంతేకాకుండా జాన్‌కు ఫేస్‌బుక్ బోర్డ్ మెంబర్‌షిప్ లభించింది. ఫేస్‌బుక్ టేకోవర్ కాంట్రాక్ట్‌ను సిలికాన్‌వ్యాలీలోని ఒక అమ్యూజ్డ్ బిల్డింగ్‌లో సైన్ చేశాడు జాన్. ఒకప్పుడు తన తల్లి కోసం ఫుడ్ స్టాంప్స్ కోసం నిలబడ్డాడు. అదేచోట ఒక కంపెనీకి ఓనర్‌గా మారాడు జాన్. జీవితం వడ్డించిన విస్తరి కాదని, అవకాశాలు వెతుక్కుంటూ రావని అంటారు వీరు. కష్టపడటం ఒక్కటే జీవితంలో సెటిల్ అవడానికి మార్గమంటున్నారు. ఈ మార్గంలో నీతి, నిజాయితీలను మాత్రం వదలకూడదని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు జాన్‌బ్రియాన్‌లు.