Home కలం తిలాపాపం తలాపిడికెడు!?

తిలాపాపం తలాపిడికెడు!?

logo

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణా సాహిత్య అకాడమీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల జాతర అట్టహాసంగా ముగిసింది. రూ.50 కోట్లు ఖర్చు చేసి ఈ సభల ద్వారా తెలుగు భాషకు ఒనగూడిన ప్రయోజనాలేమిటి? సభల నిర్వహణలో దొర్లిన అపసవ్యత ఎంత? కవులు, రచయితలు,సంఘాల వైఖరులేమిటి? అనే విషయాలు సమీక్షించుకోవాల్సిఉంది. తిలాపాపం తలాపిడికెడు అన్న సామెతను గుర్తుచేసిన తెలుగు సభల సఫలత, విఫలత పై చర్చ అవసరమే కావచ్చును. సభల నిర్వహణ సమయంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, 1 నుండి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జక్టుగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు భాషాభిమానిగా నిరూపించుకొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతిష్టాత్మకంగా భావించిన తెలుగు సభల సంకల్పం నెరవేరింది. సభల నిర్వహణా తీరు, అందుకు ఆయన చేసిన కసరత్తు చిన్నదేం కాదు. అందువల్లనే సభల ఆరంభ, ముగింపు వేడుకలు రాష్ట్ర ప్రజల్ని కట్టిపడేశాయి.
అయితే ఒక్క ప్రతినిధి పై సుమారు ఐదువేల రూపాయల పై చిలుకు భోజనాలు, వసతి, రవాణా సౌకర్యాలపై ఖర్చు చేసారు. వీటి సఫలత ఎంత? 15 నుండి 19 వరకు జరిగిన సభల్లో వ్యూహాత్మక తప్పిదాలు, నిర్వహణా లోపాలు ఒకింత ప్రతినిధులకు అసౌకర్యాలు కలుగజేశాయి. సభల ప్రకటన నుండి ప్రతినిధులకు అంతర్జాల ప్రవేశం కల్పించడంతో చాలామంది తెలంగాణా కవులు ఆహ్వానాల కోసం ఎదురుచూసి అవి రాకపోవడంతో సభలకు దూరంగా ఉండిపోయారు. ఇక సభ కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణలో సమన్వయసమితిలోని కొందరు ప్రముఖుల అనుచర గణాలు అత్యుత్సాహం, అవకాశాలు సైతం మరికొందరిని దూరం చేసాయి. తెలంగాణా రాష్ట్రం పై అపారప్రేమ ఉండి పాల్గొందామని వచ్చిన మరికొందరు కవులు పలకరించే దిక్కు లేక, కనీసం కవిసమ్మేళనంలో పేరు లేక కాలుగాలిన పిల్లుల్లా తిరిగి వెళ్ళిపోయారు. ఇక మొదట 750 మంది కవులకు ఏర్పాటుచేసిన బృహత్ కవిసమ్మేళనం రసాబాస సమ్మేళనంగా మారింది. గ్లోబలీకరణలో భాగంగా తెలుగు రచయితలలో పెరుగుతున్న కీర్తి ఖండూతి అనబడే జబ్బు ఇక్కడ ప్రదర్శించి చివరకు నిర్వాహకులపై పైరవీకారులపై ఆందోళనకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఒకింత తీవ్ర పదజాలంతో అసహనాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. కవి సమ్మేళనం విషయంలో అదనపువేదిక ఏర్పాటుచేసిన నిర్వాహక వర్గం పుస్తక ఆవిష్కరణ విషయంలో కనీసం గౌరవప్రదంగా షెడ్యూల్ లో చేర్చలేకపోవడం, చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణా మహనీయులు పేరుతో తెలుగు అకాడమీ 50 పుస్తకాలు పైగా ప్రచురించింది. వీటి ఆవిష్కరణకు కేవలం రెండంటే రెండే నిమిషాలు టైం కేటాయించారు. ఒక్కో గ్రంధానికి పదిదినాలు కష్టపడి మరుగున పడ్డ తెలంగాణా మహనీయుల చరిత్రలను అందించిన పుస్తక రచయితలకు కనీసం పుస్తక ఆవిష్కరణ సందర్భంలో వేదిక పైకి సైతం పిలవకపోవడం గమనార్హం. ఇది ఈ సభల్లో ఏర్పరిచిన మరో కొత్త సంప్రదాయంగా ముందుకు వచ్చింది. కవిత్వం పేరుతో కొందరు నేతల సిఫార్సులతో కవులుగా అవతారం ఎత్తి మూడువేల పారితోషికం, సన్మానం స్వీకరించిన వ్యక్తులకు దక్కిన కనీస గౌరవం, పుస్తక రచయితలకు ఇవ్వకపోవడం నిర్వాహకుల తప్పిదమే నూటికి నూరుపాళ్ళు ఉంది. స్వాగత తోరణాల ఏర్పాటులో పేరు ఒకరిదైతే ఫోటో ఒకరిది పెట్టడం సరైనది కాదు.
ఇక సభల నిర్వహణా వ్యూహరచనలో సైతం సంప్రదాయిక తెలుగు మూలాలకిచ్చిన భాషాప్రాధాన్యత, తెలంగాణా అస్తిత్వ భాష, యాసకు ఇవ్వలేదనే భావన ప్రతినిధులలో వినిపించింది. ఇక సభలకు 40 దేశాలు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, తెలంగాణా నుండి వచ్చిన ప్రతినిధులకు ఎవరి ప్రాధాన్యతను బట్టి వారికి పీటలు వేశారు. అయితే వారు ఎవరు ఎక్కడ హాజరు కావాలి, ఏ ఈవెంట్ లో పాల్గొనాలనే సూచికలు అందించకపోవడం వలన ప్రతినిధుల్లో స్పష్టత కరువైంది. అందువల్లనే నిర్వహణా స్థలాలు, భోజనశాలల వద్ద కొంత గందరగోళానికి కారణమైంది.
చాలామంది కవులు విస్మయానికి గురయ్యారు. సభల్లో నిర్ణయించిన అంశాలు చెప్పిపోవడం తప్ప తెలుగు భాషా వ్యాప్తి పైగాని, తెలంగాణా సాహిత్యం పై గాని మహాసభల్లో చర్చా వైఖరికి తావులేకుండానే సభలు ముగిసిపోయాయి.
ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలుగు మహాసభల పట్ల ఇప్పటికే తెలంగాణాలో ఉన్న సాహితీ సంస్థల్లో సైతం స్పష్టత కరువయింది. వి.ర.సం. తప్ప రాష్ట్రంలో ఉన్న తెలంగాణా రచయితల వేదిక, తెలంగాణా సాహితి, అ.ర.సం. లాంటి సంస్థలు తమ సభ్యులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఒక్క వి.ర.సం.మాత్రం తెలంగాణా తెలుగు మహాసభలు బహిష్కరించమని విస్పష్ట ప్రకటన చేసింది. 1975లో జలగం వెంగళరావు నిర్వహించిన తెలుగు సభల్ని బహిష్కరించిన విధంగానే విరసం 2017 తెలంగాణా తెలుగు సభల్ని అదే వైఖరితో చూసింది. చిత్రంగా సభలకు ఒక్కరోజు ముందు తెలంగాణా రాష్ట్రప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అతిపెద్ద ఎన్కౌంటర్ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా లో 9 మంది నక్సలైట్లు చనిపోయారు.
దీన్ని ఆలంభనగా విరసం రక్తం అంటుకున్న తెలుగు మహాసభలను బహిష్కరించమని కవులు, రచయితలకు పిలుపునిచ్చింది. అయితే విరసం పిలుపును ఆ సంస్థకు సానుభూతిపరులుగా గతంలో ఉన్న కవులు, రచయితలు పట్టించుకోలేదు. విరసం ఓ మెట్టు దిగి ట్యాంక్ బండ్ మీద శ్రీశ్రీ విగ్రహం వద్ద నిరసన ప్రకటించి నిరసన పిలుపుతో కొంత సడలింపు ప్రదర్శించినా ప్రభుత్వం విరసం నేతల్ని అరెస్ట్ చేసి నిర్భందించింది. ఇది సహేతుక ప్రజాస్వామిక చర్య కాదని రచయితలు, కవులు చర్చించుకోవడం కనిపించింది. ముఖ్యమంత్రి కే.సి.ఆర్. తెలంగాణ సాహిత్యంలో ఉన్న ధిక్కార స్వభావాన్ని నాటి పోతన నుండి నేటి తెలంగాణా ఉద్యమ సాహిత్యం వరకు సోదాహరణంగా వివరించారు. కాని తెలంగాణాలో ప్రజాసాహిత్యం గురించి మాట్లాడే కవులకు, రచయితలకు ధిక్కారంలోని యక్కాలు కనిపించలేదనే ధోరణులు వ్యక్తం అయ్యాయి. మారుతున్న పరిస్థితుల్లో రచయితలు, కవుల్లో పెరుగుతున్న అవకాశవాద ధోరణులకు ఈ సభలు అద్దం పట్టి చూపించాయి.
ప్రపంచ యవనికపై గ్లోబలైజేషన్ విధానాల్ని ధిక్కరించి నిలిచిన తెలంగాణా కవులు సాహిత్యంపై తగిన చర్చలు జరగలేదని అసంతృప్తి ఉంది. అనేక తెలుగుసభల్లో కన్పించిన భాషావేత్తలు మోగించిన బ్యాండ్ మేళమే ఈ సభల్లో కనిపించిందని పెదవి విరిచిన ప్రతినిధులు లేకపోలేదు. ఇక అన్నింటికీ మించి తెలంగాణలో ఈ అర్ధ దశాబ్దిని తన ప్రజాసాహిత్యం తో ఉర్రూతలూగించిన గద్దర్, అందెశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రావూరి భరద్వాజ లాంటి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా అయ్యింది. అన్నింటికీ మంచి ప్రతిదినం పాఠశాలల్లో లక్షలాది గొంతుకలు ఆలపిస్తున్న జయజయహే తెలంగాణా గీతం పాడకపోవడం సభలలో తీరని లోపంగా కనిపించింది.
ఇక ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు లో ముఖ్యమంత్రి చేస్తామన్న ప్రకటన వాయిదా పడటం ఒకింత సభికులలో ఉత్సుకతను నీరుకార్చింది. ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసియార్ 1 నుండి 12 తరగతులకు నిర్బంధ తెలుగు బోధన నిర్ణయం, ముగింపు సభలలో చేసిన సాహిత్య ప్రసంగం సర్వత్రా ప్రశంసనీయమైంది. ఆయన ఈ విషయంలో జనవరి లో భాషావేత్తల సదస్సు ఏర్పాటుచేసి విస్పష్ట ప్రకటన చేస్తామని సమయోచితమైన ప్రకటన కాస్త ఊరట కలిగించింది. తెలంగాణలో నిర్వహించిన తొలి తెలుగు మహాసభలు భాషాస్పూర్తిని ఎంతోకొంత ప్రజల్లో ఆలోచన్లు రేకెత్తించాయి. అయితే తెలుగు భాష అమలు గ్లోబలీకరణ నేపధ్యంలో అంత సులువు కాదు. ముందు పరిపాలన భాష గా తెలుగును అమలులోకి తేవాలి. మన విద్యావ్యవస్థలో మెకాలే ఆలోచనలతో పూసిన అన్యభాషా వ్యామోహాన్ని ఎదుర్కొని మాధ్యమిక స్థాయి వరకు అన్ని సబ్జక్ట్ లు తెలుగు మాధ్యమంలో బోధించేలా కృషి చేయాలి. తెలుగు మాధ్యమంలో చదువుకున్న నిరుద్యోగులకు రాష్ట్ర ఉద్యోగాలలో కొంత వెయిటేజ్ కల్పించాలి. ఇట్లాంటి సవాళ్లు మన ముఖ్యమంత్రి భాషావేత్త కే.సి.ఆర్. ముందు ఉన్నాయి. వీటిని ఆచరణాత్మక దృష్టితో చూసినప్పుడే తెలుగు సభలకు సఫలత లభిస్తుంది. జై తెలంగాణ. —