Home ఎడిటోరియల్ వాణిజ్య యుద్ధం భారత్‌కు సంకటం

వాణిజ్య యుద్ధం భారత్‌కు సంకటం

edit

చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్ రెండవ పదవీ కాలం ముగిసిన తదుపరి కూడా నిరవధికంగా కమ్యూనిస్టు పార్టీ, చైనా అధ్యక్షునిగా కొనసాగే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించటం, ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచటం, చైనా నుంచి దిగుమతులపై మరో 50 బిలియన్ డాలర్ల మేర సుంకాలు పెంచుతానని ప్రకటించటం ప్రపంచ వాణిజ్య యుద్ధం ఆరంభమైందన్న వాతావరణం కలుగజేశాయి. ట్రంప్ రక్షణవాద చర్యలు, చైనా నుంచి ప్రతీకార చర్యలను నిజంగా కవ్విస్తాయా? లేక చర్చల ద్వారా రాజకీయ, ఆర్థిక సర్దుబాట్లతో వివాదం పరిష్కరించుకుంటుందా అనే సందిగ్ధం వాణిజ్య విశ్లేషకులను పీడిస్తున్నది. చైనా ఇంత వరకు పెద్దగా ప్రతీకార చర్యలు తీసుకోలేదు. అమెరికా చర్యలను ప్రభావ రహితం చేసేందుకై ప్రపంచ దేశాల తోడ్పాటు సంపాదించటానికది ప్రయత్నిస్తున్నది.
ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను ట్రంప్ పెంచటంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా ఫస్ట్ విధానంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచుతానని ఎన్నికల ప్రచార కాలంలో ఆయన చేసిన వాగ్దానానికనుగుణంగా ఈ చర్య తీసుకున్నారని కొందరు భావిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల్లో చైనాతో అమెరికా వాణిజ్యలోటు పెరగటానికి ప్రధాన కారణం చైనాయేనని అమెరికా ఆరోపిస్తున్నది. అమెరికా వాణిజ్య లోటులో దాదాపు 47 శాతం, చైనీయులు అమెరికన్ మార్కెట్‌లో కుమ్మరించిన చౌక ఉత్పత్తులే కారణం. అయితే వాణిజ్య లోటు పెరుగుదలకు చైనా ఉక్కు ప్రధానకారణం కాకపోవటం చిత్రం. చైనా ఎగుమతుల్లో ప్రధానమైన వస్తువులు వినియోగ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, యంత్రాలు. చైనా ఉక్కు ఎగుమతి అమెరికా దిగుమతి చేసుకుంటున్న మొత్తం ఉక్కులో 2 శాతం మాత్రమే.
అటువంటప్పుడు, చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ పేల్చిన తూటాకు ఉక్కును ఎందుకు బలి పశువు చేశాడు? చైనా వియత్నాం ద్వారా ఉక్కు దించుతున్నట్లు అమెరికన్ దర్యాప్తు వెల్లడించింది. వియత్నాం నుంచి అమెరికాకు ఉక్కు ఎగుమతులు 2016లో 300 రెట్లు పెరిగాయి. చైనా నుంచి తుప్పును తట్టుకునే ఉక్కు దిగుమతులపై 2015లో అమెరికా డంపింగ్ వ్యతిరేక, సబ్సిడీ వ్యతిరేక సుంకాలు విధించటంతో, సుంకాలు ఎగవేసే నిమిత్తం చైనా తన ఉక్కు ఎగుమతిని వియత్నాం ద్వారా రీరూట్ చేసింది. 2015 లో చైనా ఉక్కుపై సుంకాలు విధించిన తదుపరి వియత్నాం నుంచి అమెరికాలోకి కోల్డ్ రోల్డ్ షీట్‌ల ఎగుమతి సాలీనా 11 మిలియన్ డాలర్ల నుంచి 295 మిలియన్ డాలర్లకు ఒక్కసారి పెరిగిపోయిందని అమెరికా వాణిజ్య శాఖ చెప్పింది. ఈ ఉత్పత్తుల తయారీ చైనాలో జరిగినట్లు ఆ శాఖ వాదిస్తున్నది. ఉత్పత్తి వియత్నాంలో ప్రాసెస్ అయినా దాని విలువలో 90 శాతం చైనాలో ఉద్భవించిందేనని అంటున్నది. దాంతో అమెరికా 2017 లో వియత్నాం నుంచి ఉక్కు దిగుమతులపై కూడా డంపింగ్ వ్యతిరేక సుంకం విధించింది. ప్రస్తుతం అమెరికా తమ దేశంలో ఉపయోగించే ముతక అల్యూమినియంలో 90 శాతం దిగుమతి చేసుకుంటున్నది. బీర్ క్యాన్‌ల నుంచి యుద్ధ విమానాల వరకు వివిధ రకాల ఉత్పత్తుల్లో అల్యూమినియం ఉపయోగిస్తారు. చైనా ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించాక ఆ ధరతో పోటీ పడలేక అమెరికన్ ఉత్పత్తిదారులు కుదేలవటంతో దేశీయ అల్యూమినియం పరిశ్రమ ఉత్పత్తి అకస్మాత్తుగా పడిపోయింది. అమెరికాలో పనిచేస్తున్న అల్యూమినియం కొలుములు 1993లో 23 ఉండగా, అవి 2016లో 5కు తగ్గిపోయాయి. యుద్ధ విమానాలకు అవసరమైన నాణ్యతగల అల్యూమినియం ఉత్పత్తి చేసే కర్మాగారం ఒక్కటి మాత్రమే హవీస్ విల్లీ, కెవై వద్ద పని చేస్తున్నది. ఈ పరిశ్రమ మూతపడితే అమెరికా పూర్తిగా దిగుమతులపై ఆధారపడాల్సిందే.
గత దశాబ్దంలో భారత్ కూడా అమెరికాను వాణిజ్య లోటుకు గురి చేసింది. అది అమెరికా మొత్తం వాణిజ్యలోటులో కేవలం 2.7 శాతం అయినందున అప్రధానం. అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వస్తు సముదాయంలో అమెరికా వాణిజ్య లోటు పెంచగల వస్తువు లేమీ లేవు. అమెరికాకు భారత్ ప్రధాన ఎగుమతులు రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు,రెడీమేడ్ దుస్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు. 201617లో అమెరికాకు భారత్ నుంచి దిగుమతుల్లో వీటి వాటా 54 శాతం కాగా ఉక్కు ఎగుమతి 1.3, అల్యూమినియం 1.1శాతం మాత్రమే. భారత్ తన ఉక్కు ఉత్పత్తిలో 84 శాతం దేశంలోనే వినియోగిస్తున్నది. అందువల్ల ఉకు దిగుమతులపై సుంకాన్ని అమెరికా పెంచటం వల్ల భారత్‌పై ప్రతికూల ప్రభావం బహుస్వల్పం. అయితే భారత్ ఎగుమతి సబ్సిడీలపై అమెరికా వాణిజ్య ప్రతినిధి వ్యక్తం చేసిన ఆందోళన అమెరికాతో భారత్ వాణిజ్య మిగులుపై వ్యతిరేక ప్రభావం చూపవచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వాణిజ్య లోటును వేగంగా పెంచుతున్న దేశాలపై అమెరికా దాడికి దిగే పక్షంలో భారత్ సాలెగూట్లో చిక్కుకుంటుంది. సబ్సిడీలపై రూల్సు పాటించనందుకు డబ్లుటిఒకు తీసుకెళతానని అమెరికా ఇంతకు ముందే భారత్‌ను హెచ్చరించింది. డబ్లుటిఒ రూల్స్ ప్రకారం, తలసరి 1000 అమెరికన్ డాలర్ల వార్షిక జాతీయ ఆదాయాన్ని వరుసగా మూడు సంవత్సరాలు మించిన వర్దమాన దేశాలు ఎగుమతులకు సబ్సిడీలు మంజూరు చేసేందుకు అర్హత కోల్పోతాయి. భారత్ 2013, 2014, 2015 సంవత్సరాల్లో ఈ పరిమితిని అధిగమించినట్లు అమెరికా ఆరోపిస్తున్నది. ముఖ్యంగా చైనాకు గురిపెట్టి ట్రంప్ ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచినప్పటికీ చైనా అదే మోతాదులో ప్రతిచర్యలు తీసుకోకపోవచ్చని కొందరు వాదిస్తున్నారు. చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్ శాశ్వతంగా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశమిచ్చిన రాజ్యాంగ సవరణ ఇటీవల ఆమోదించబడినందున, ఇంత త్వరలోనే అమెరికాతో సంబంధాల దిగజారుడును ఆయన కోరుకోవటం లేదు. అమెరికాకు ఎగుమతులపై చైనా ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ప్రతిచర్యలు తీసుకుంటే ఎక్కువ నష్టపడేది చైనాయే. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయి. అమెరికా సుంకాల పెంపుదల భారత్ అమెరికా వాణిజ్యంపై చూపగల ప్రత్యక్ష ప్రభావం కన్నా అమెరికా వాణిజ్య భాగస్వాముల ప్రతీకార చర్యల గూర్చి భారత్ ఎక్కువగా ఆందోళన చెందుతుందని మూడీస్ పేర్కొన్నది. వాణిజ్య యుద్ధంలో రెండు భాగాలున్నాయి సుంకాలు, సుంకాలయేతరం. భారతదేశం సుంకాలకన్నా సుంకాలయేతర ప్రభావం గూర్చి ఆందోళన చెందుతుంది. వాణిజ్య పరిమాణం తక్కువ కాబట్టి సుంకాల గూర్చిన ఆందోళన అనవసరం. చైనా మేథో ఆస్తి హక్కులు (ఐపిఆర్) అపహరిస్తున్నదని, టెక్నాలజీ బదిలీని పెట్టుబడి నిబంధనల్లో ఆదేశికం చేస్తున్నదని అమెరికా ఆరోపించింది. ఐపిఆర్ రూల్సును అమెరికా కచ్చితంగా పాటించే పక్షంలో అది దీర్ఘకాలంలో భారత్‌కు చేటు చేస్తుందని జెడి మోర్గాన్ అభిప్రాయపడుతున్నది.