Home జాతీయ వార్తలు అందుకే పెద్ద నోట్ల రద్దు: జైట్లీ

అందుకే పెద్ద నోట్ల రద్దు: జైట్లీ

Central minister Arun Jaitley

న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 నవంబరు 8న.. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పెద్దనోట్లను రద్దు చేసి ఈ రోజుతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు.‘పెద్ద నోట్ల రద్దుకు నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాల్లో నోట్లరద్దు చాలా కీలకమైంది. ముందుగా విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. పన్నుల చెల్లింపుల ద్వారా ఈ డబ్బును దేశంలోనికి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలా చెల్లించనివారిపై నల్లధనం చట్టం కింద చర్యలు తీసుకుంటోంది. విదేశాల్లో భారతీయులకున్నబ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు’ అని జైట్లీ పేర్కొన్నారు.

డబ్బును స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని, ఒక పద్ధతి గల ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశామని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత నుంచి పన్నుల ఎగవేత తగ్గిందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 20శాతం వరకు పెరిగాయని, ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా వృద్ధి నమోదు చేశాయని  జైట్లీ రాసుకొచ్చారు.