Home తాజా వార్తలు ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది…

ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది…

Arun Jaitley said that bankruptcy of notes was a vital role

నోట్ల రద్దు కీలక పాత్ర పోషించింది

ప్రతిపక్షాల విమర్శలన్నీ తప్పని రుజువయ్యాయి
పన్ను పరిధి విస్తృతమైంది

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ : డీమానిటైజేషన్(నోట్ల రద్దు)పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. పాత నోట్లను రద్దు చేసి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. నోట్ల రద్దుతో ఎలాంటి ఫలితం రాలేదని, దాని వల్ల వచ్చిన ప్రయోజనమేమీ లేదంటూ పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. దీనిపై జైట్లీ స్పందిస్తూ, డీమానిటైజేషన్‌పై చేస్తున్న విమర్శలన్నీ తప్పని నిరూపితమైందని, భారత్ వరుసగా ఐదో సంవత్సరంలోనూ వేగవంతమైన దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని అన్నారు. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని, దీంతో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వానికి నిధుల వనరులు పెరిగాయని, ఇవి మౌలికసదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ‘దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 2 శాతం క్షీణిస్తుందని ప్రతిపక్షాలు చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? ప్రపంచంలోనే అత్యంత వేగవంత వృద్ధి ని సాధిస్తున్న దేశంగా భారత్ వరుసగా ఐదో సంవత్సరం స్థానాన్ని దక్కించుకుంది’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, విమర్శలు తప్పని నిర్థారణ అయిందని, నోట్ల రద్దు ఫలాలేమిటో స్పష్టంగా తెలుస్తున్నాయని మీడియాతో అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు డీమానిటైజేషన్ దోహదం చేసిందని, దీని వల్ల పన్ను పరధి విస్తృతమైందని, పేదలకు మరిన్ని వనరులు సమకూరాయని జైట్లీ వ్యాఖ్యానించారు.

పన్ను పరిధి పెరిగింది
2016 నవంబర్ 8న మోడీ ప్రభుత్వం దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయం తర్వాత పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసి చిన్న నోట్లను తీసుకునేందుకు ప్రజలు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. అయితే దీని వల్ల ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందంటూ జైట్లీ పలు విషయాలను ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఒత్తిడి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్ గౌరవప్రదమైన వృద్ధిని కొనసాగిస్తూ వస్తోందని జైట్లీ అన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు చేపట్టామని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడమే కాదు, ఇది దీర్ఘకాలంలో మరింత దోహదం చేయనుందని అన్నారు. నోట్ల రద్దుతో దేశంలో డిజిటలైజేషన్ పెరిగిందని, పన్ను పరిధి విస్తృతమైందని వెల్లడించారు. వచ్చే సంవత్సరాల్లో నోట్ల రద్దు ప్రయోజనాలు మరిన్ని చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదాయం పన్ను దాఖలు చేసేవారి సంఖ్య 2014 మే నెలలో 3.8 కోట్లు ఉంటే.. ఇప్పుడు 6.86 కోట్లకు చేరిందని అన్నారు.

నోట్ల రద్దుతో చేదు గాయాలు : ప్రతిపక్ష పార్టీలు
అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా నోట్ల రద్దు చేదు గాయాలను మిగిల్చిందంటూ విమర్శలు చేశారు. డీమానిటైజేషన్ కారణంగా ‘మచ్చలు, గాయా లు’ మిగిలాయని, ఎంతటి ఆర్థిక దుస్థితిని ఎదుర్కొన్నది ఇంకా గుర్తుకు వస్తున్నాయన్నారు.

Arun Jaitley said that bankruptcy of notes was a vital role

Telangana Latest News