Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆ ఉద్యోగానికి భార్యగా నీవే అర్హురాలివి…

lawప్ర : నేను నా జీవిత సమస్య గురించి రాస్తున్నాను. నేను ఇంటర్ వరకూ చదువుకున్నాను. నా భర్త గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. నాకు ఒక బాబు (ఐదేళ్ళు). నాకు ఒక ఆడపడుచు వుంది. ఆమె కూడా ఇంటర్ చదివింది. ఆమెకు పెళ్లైంది. మా ఆయనకు నేను పెళ్లి చూపుల్లో కట్నం ఇచ్చుకోలేమని, కావాలంటే నేను డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తానని చెప్పాను. అయినా మా అత్తగారు ఒప్పుకోలేదు. కానీ మా నాన్న మా అక్కకు ఇచ్చినట్లుగా ఒక లక్ష కట్నం, ఐదు తులాల బంగారం పెడతానన్నారు. మా ఆయన వాళ్ళమ్మని ఒప్పించారు. అయితే మా ఆడపడుచుకి రూ.3 లక్షలు కట్నం ఇచ్చి బి.ఇడి టీచర్‌ని చేశారు. అందుకని మా అత్తగారు నన్ను మరో లక్ష అదనపు కట్నం తీసుకురమ్మని రోజూ గొడవ పెడుతుంది. అందుకనే మా ఆయన ఒకరోజు నన్ను పుట్టింట్లో వదిలి వెళ్లారు. వాళ్ల ఇంట్లో ఏమి గొడవలు జరిగాయో తెలీదు. ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయారు. మేమంతా బాధతో బయలుదేరి వెళ్తే మా అత్తగారు మా మీద (అమ్మా, నాన్నలతో) గొడవలు పెట్టి పంపించేసింది. నేను ఆమెతో గొడవలు పడలేకపోయాను. ఒక మూడు నెలలు వుండి మళ్లీ అమ్మావాళ్ళూ నన్ను తీసుకొచ్చారు. అయితే ఆయన ఉద్యోగంలో వుండగా చనిపోయారు. కనుక కారుణ్య ఉద్యోగం కోసం మా అత్తగారు, ఆడపడుచుని దరఖాస్తు చేసుకోమంటుంది. నేను ఎక్కువ కాలం పుట్టింట్లో వుంటున్నందుకు నాకు హక్కులేదని, కోడల్ని కాదని అంటుంది. నేనేం చేయాలి?
-నాగమణి, ఆర్మూరు
జ : నాగమణీ! చిన్న చిన్న సమస్యలు లేకుండా ఏ కుటుంబాలూ వుండవు. కానీ నీ సమస్య క్లిష్టమైనదే! అయితే అత్తగారు అదనపు కట్నం కోసం బాధించడం ఒక సమస్య అయితే, నీ భర్త ఆకస్మాత్తుగా చనిపోవడం మరో పెద్ద సమస్య. నీవు ఇలాంటి పరిస్థితుల్లో చాలా ధైర్యంగా వుండాలి. నిన్ను అదనపు కట్నం కోసం హింసలు పెడుతున్నందుకు నీవు 498-ఎ కేసు పెట్టుకోవచ్చు. అయితే కొడుకు చనిపోయాకా వాళ్లలో మార్పు రావాల్సిన అవసరం వుంది. కోడల్ని, మనవడిని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లకి వుంది. అలాగే కొడుకు స్థానంలో నీవు కూడా వాళ్లకి మద్దతుగా వుండాలి. ఇది పరస్పరం నిర్వర్తించాల్సిన బాధ్యతలు. మరొకరు చెబితే ఆచరించేవి కావు. ఇకపోతే మీ భర్త ప్రభుత్వ ఉద్యోగంలో వుండగా చనిపోయాడు కనుక ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ కార్యక్రమం ద్వారా అమలు చేసే కారుణ్య నియమకాల పథకం ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులకు ఆ ఉద్యోగాన్ని భర్తీ చేస్తారు. అయితే నీవు ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉన్నంత మాత్రాన నీ అర్హత పోలేదు. కేవలం మీ అత్తగారు పెట్టే గొడవల వల్ల వెళ్లానన్నావు. అయితే ఆ ఉద్యోగం పెళ్లైపోయిన మీ ఆడపడుచుకి ఇవ్వరు. భార్యగా నీవు అర్హురాలివి. (Govt. Circular Memo No.58226/ SecA ఎ 2002(2) 6.A Dept.(1-5-2001) ప్రకారం మీరు మీ జిల్లా కలెక్టర్‌కు మీ సమస్యను వినతి పత్రం ద్వారా తెలియజేయండి. అలాగే మీ జిల్లా క్యాపిటల్‌లో న్యాయసేవా సదన్‌లో గానీ, మానవ హక్కుల కమిషన్‌లో కూడా ఒక దరఖాస్తు ఇవ్వండి. మీకు 100శాతం న్యాయం జరుగుతుంది.
కోర్టులో కేసు వేస్తే తప్పక
మీదే న్యాయం

ప్ర: నేను మా మేనకోడలు, మేనల్లుడి జీవితం కోసం వాళ్ళకి కలిగిన కష్టాన్ని మీతో చెప్పుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను తొమ్మిదవ తరగతి చదువుకున్నాను. నేను ఒక హోల్‌సేల్ బియ్యం దుకాణంలో పనిచేస్తాను. మా అక్కని ఒక రెండవ పెళ్లి అతనికిచ్చినేను చదువుకునే (హైస్కూలు) రోజుల్లో పెళ్లి చేశారు. అప్పటికే మా బావకి ఇద్దరు పిల్లలు. (ఒక ఆడ, ఒక మగ) పిల్లలు పుట్టాక, అతని మొదటి భార్యకు మానసిక ఒత్తిడితో మతిస్థిమితం తప్పిందని డాక్టర్ గారు చెప్పారట. ఆమె చాలాకాలం పిచ్చి ఆసుపత్రిలో వుంది. ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్లకు పది ఎకరాల పొలం, సొంత ఇల్లు, ఒక రైస్ మిల్లు కూడా వుంది. ఆ మొదటి భార్య పిల్లలు చిన్నవాళ్లు కనుక వాళ్లని చూడడానికి మా అక్కనిచ్చి రెండవ పెళ్లి చేశారు. మా నాన్న వాళ్ల పాలేరుగా వుండేవారు. అందుకే ఈ పెళ్లి చేశారు. పెళ్లైన ఐదు సంవత్సరాలకు ఆ మొదటి భార్య చనిపోయింది. వాళ్ల పిల్లల్ని మా అక్కే పెంచి, చదివించి పెద్ద చేసింది. వాళ్లు ఇద్దరూ పెద్దవాళ్లు ఒకరికి ప్ళ్లైంది. మరొక అబ్బాయి బి.టెక్ చివరి సంవత్సరంలో వున్నాడు. ఇప్పుడు అక్క కూతురు పదవతరగతి, కొడుకు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. బావ ఆకస్మాత్తుగా మరణించడంతో అక్కనూ, ఇద్దరు పిల్లల్ని వాళ్లు చూడ్డము లేదు. వాళ్ల చదువులకూ, పోషణకూ కూడా కష్టంగా వుంది. వాళ్లు ఈ రెండవ పెళ్లి చెల్లదని, ఈ పిల్లలకూ, భార్యకూ ఆస్తితో సంబంధం లేదని ఈ ఆస్తి మొత్తం మా బావ తండ్రి (పిల్లల తాత) గారి పేరా వుందని అంటున్నారు. మాకు న్యాయం జరగాలంటే మేం ఏం చేయాలి?
– నర్సింహులు, కోదాడ
జ : నర్సింహులు గారూ మీరు రాసిన ఉత్తరంలో మీ అక్క, వారి సంతానం గూర్చి రాశారు. మీ సమస్య నాకు అర్థమైంది. మీ అక్కది రెండవ వివాహం అయినా అది సవ్యమైనదే. ఎందుకంటే మొదటి భార్య మానసిక స్థితి బాగోలేక (పిచ్చి వల్ల) ఆసుపత్రిలో ఎక్కువకాలం వుంచినా పిచ్చి తగ్గని పక్షంలో జీవిత భాగసామి మరో వివాహం చేసుకోవచ్చు. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13 ప్రకారం ఎప్పటికీ తగ్గని పిచ్చి, నయం కాని సుఖవ్యాధులు, కుష్టువ్యాధి లేదా అంటువ్యాధులు వంటివి డాక్టర్ సర్టిఫికేట్ ద్వారా కోర్టులో ప్రూవ్ చేసుకొని విడాకులు పొందినా రెండవ వివాహం చేసుకోవచ్చు. మీ బావ ఆ లెక్క ప్రకారమే చేసుకొని వుండవచ్చు. కనుక మీ అక్క సంతానం కూడా లీగల్ వారసులే. కనుక పెద్ద భార్య సంతానం లాగనే వీరు కూడా వాళ్ల తాతగారి ఆస్తిలో భాగస్వాములే. మీకు అదే ఇంట్లో వుండే హక్కు, హిందూ దత్తత, పోషణ చట్టం 1956 సెక్షన్ 20, 22 ప్రకారం ఒకవేళ అక్రమ సంతానంగా పరిగణింపబడిన వారు కూడా తండ్రి నుండి పోషణ కోరే హక్కు వుంది. తండ్రి మరణానంతరం కూడా అతని ఆస్తి ద్వారా తమను పోషించమనే హక్కు వుంది. కనుక మీ అక్క ఆ ఆస్తికి లీగల్ (భార్య)గా తనూ, తన సంతానం కూడా వస్తాయని కోర్టులో కేసు వేసుకుంటే తప్పక న్యాయం జరుగుతుంది. కనుక మీరు ఎవ్వరికీ భయపడనవసరం లేదు.
దత్తత బిడ్డకు అన్ని రకాల హక్కులు

ప్ర : నేను మా అక్క ప్రీతి గురించి రాస్తున్నాను. మా నాన్నకు మేము ముగ్గురం సంతానం. అన్నయ్య చరణ్, అక్క ప్రీతి, నేను. మా నాన్న తండ్రి (తాతయ్యకు) ఇద్దరు కొడుకులు మా పెదనాన్న, మా నాన్న. మా పెదనాన్నకు ఒకే కొడుకు సురేష్. అయితే మా పెదనాన్న తనకు ఆడపిల్ల (సంతానం) కలగలేదని అక్కను దత్తత తీసుకున్నాడు. పెద్దల సమక్షంలో సాంప్రదాయంగా దత్తత జరిగింది. అప్పటి నుండి అక్కవాళ్ల దగ్గర వుంటుంది. బి.కామ్ పూర్తయ్యాక అక్కకు పెదనాన్నే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అయితే ఈ మధ్యే మా సురేష్ అన్న (పెదనాన్న కొడుకు)పెళ్లి కూడా అయింది. తన ప్ళ్లైన తర్వాత నుండి సురేష్ అన్న, అక్కను పండగలు వస్తే భర్తతో కలిసి వాళ్ల ఇంటికి రావద్దని, మా ఇంటికి వెళ్లమని గొడవలు చేసి పంపిస్తున్నాడు. ఇవి మా పెదనాన్నకు నచ్చక, అన్నయ్యను (సురేష్) వేరేగా కాపురం పెట్టించారు. మా అక్క స్కూల్ సర్టిఫికేట్స్‌లోనూ, కాలేజ్ సర్టిఫికేట్స్‌లోనూ తండ్రిగా మా పెదనాన్న పేరే వుంది. మా అన్నయ్య ఈ దత్తత చెల్లదని మా తాతయ్యకు వున్న 20 ఎకరాల పొలం నాన్నా, పెదనాన్న పదేసి ఎకరాలు పంచుకున్నారు. ఇప్పుడు పెదనాన్న ఆస్తిలో అక్కకి ఏ వాటా ఇవ్వనని గొడవ చేస్తున్నాడు. నిజంగా చెల్లదా?
-శ్రావ్య , జనగాం
జ : శ్రావ్యా! నీవు రాసిన మీ అక్క సమస్య నాకు అర్థమైంది. మీ నాన్న గారు అక్కని పెదనాన్నకు దత్తత ఇచ్చారని రాశావు. తన కూతురు అన్న దగ్గర పెరిగినా తన ఇంటి పిల్లే అనే ఉద్దేశంతో మీ నాన్న గారు ఇచ్చారు కానీ మీ అన్న సురేష్ (కజిన్) ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంతకాలం అయ్యాక, చిన్నతనం నుండి పెరిగి, పెళ్లి కూడా అయ్యాక ఇప్పుడు ఆ దత్తత కాదనడం సరైనది కాదు. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 సెక్షన్ 10 ప్రకారం… దత్తత ఇవ్వబడే అమ్మాయి / అబ్బాయి హిందువు అయివుండి, ఇంతకుముందు దత్తత చేయబడకుండా వుండాలి, అవివాహితులై వుండాలి, 15 సంవత్సరాలు దాటకుండా వుండాలి. ఒకవేళ ఆయా కుటుంబాల్లో అందుకు భిన్నమైన సంప్రదాయాలు వుంటే, వాటిని కూడా అనుసరించవచ్చునని సెక్షన్ 10 చెబుతుంది. కనుక మీ అక్కను చిన్నతనంలోనే దత్తత ఇచ్చారు.
లోయర్ క్లాస్ చదువు నుండి డిగ్రీ వరకూ మీ పెదనాన్న ఇంట్లోనే వుండి చదువుకుంది. అన్ని సర్టిఫికేట్స్‌లో ఆయన పేరే వుందన్నావు. కనుక ఇది లీగల్‌గా చెల్లుతుంది. కనుక మీ అక్కకు దత్త పుత్రికగా ఆ ఇంటిలో అన్నిరకాల హక్కులూ వుంటాయి. అలాగే ఆమెకు మీ పెదనాన్న ఆస్తిలో కూడా వాటా వుంటుంది. ఆమె కూడా లీగల్ వారసురాలే అవుతుంది. అయితే దాన్ని కోర్టులో (అవసరమైన ) ప్రూవ్ చేసుకోవాలి.

Comments

comments