Home రాష్ట్ర వార్తలు తెలంగాణతో నిశ్చితార్థం ఎపితో పెళ్లి

తెలంగాణతో నిశ్చితార్థం ఎపితో పెళ్లి

kcr

అశోక్ లేలాండ్ డబుల్ గేమ్ 

ముందుగా ఇక్కడ ఎంఒయు కుదుర్చుకుని అక్కడ పరిశ్రమ స్థాపన

హైదరాబాద్ : బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ పెడతామంటూ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి అవగాహనా ఒప్పందం కుదుర్చుకు న్న అశోక్ లేలాండ్ చివరికి రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌ను స్థాపిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 ఎకరాల భూమిని పొందుతోంది. తెలంగాణలో యూనిట్ పెడుతుందా లేదా అన్నది అనుమానమే. గతేడాది అక్టోబర్ 10వ తేదీన సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లతో ప్రగతిభవన్‌లో రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అశోక్ లేలాండ్ సిఎండి వినోద్ కె దాసరి బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను స్థాపించడాని కి ఆసక్తి చూపారు. ఈ మేరకు అవగాహనా ఒప్పం దం కూడా కుదుర్చుకున్నారు. ఆ సంస్థ ప్రతినిధుల కు, సిఎంఒ కార్యాలయ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి మధ్య ఒప్పంద పత్రాల మార్పిడి కూడా జరిగి పోయింది. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని తెల్కపట్ల పారిశ్రామిక పార్కు వద్ద సుమారు 50 ఎకరాల స్థలంలో తొలి దశలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను రూ.500 కోట్లతో నెలకొల్పుతామని, ప్రత్యక్షంగా సుమారు వెయ్యి మందికి, పరోక్షంగా మరికొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వానికి వినోద్ దాసరి హామీ ఇచ్చా రు. ఇందుకోసం ఏడాది కాలాన్ని పరిమితిగా నిర్ణయించుకుంది. కానీ ఏడాది దాటినా ఇప్పటివరకు ఆ సంస్థ నుంచి ఎలాంటి ఆసక్తి కనబడలేదు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ ఎంఒ యు ప్రకారం పనులన్నీ శీఘ్రగతిన జరిగేందుకు చొరవ తీసుకున్నా ఆ సంస్థ నుంచి మాత్రం ఆశించిన తీరులో స్పందన కనిపించలేదు. చివరకు తెలంగాణకు ధోకా ఇచ్చింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్ర
ప్రభుత్వంతో గతేడాది డిసెంబర్‌లో అవగాహనా ఒప్పందం చర్చలు ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకున్న అశోక్ లేలాండ్ సంస్థ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 ఎకరాల స్థలాన్ని విజయవాడ పరిసరాల్లో ఆశించింది. గత నెల చివర్లో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడితో చర్చించిన తర్వాత ఫైనల్ డీల్ కుదిరింది. ఎట్టకేలకు 75 ఎకరాలను మల్లవల్లి సమీపంలోని మీర్జాపురం (కృష్ణా జిల్లా పరిధిలోని హనుమాన్ జంక్షన్, నూజివీడు మార్గంలో) వద్ద సమకూర్చునున్నట్లు సంస్థకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో పాటు ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేయాల్సిందిగా ఎపి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో నడుస్తున్న సుమారు 10,500 బస్సుల్లో 95% అశోక్‌లేలాండ్ బస్సులే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్ళుగా తెలంగాణ పరిధిలోని పది జిల్లాల్లో అశోక్‌లేలాండ్ బస్సులే నడుస్తున్నాయి.గత నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాల్లో అశోక్ లేలాండ్‌కు అతి పెద్ద మార్కెట్ తెలంగాణయే. డ్రైవర్లు, మెకానిక్‌లు కూడా అశోక్‌లేలాండ్ బస్సులకు అలవాటుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అశోక్‌లేలాండ్ బస్సుల తయారీ యూనిట్‌ను, బాడీ బిల్డింగ్ యూనిట్‌ను, అసెంబ్లింగ్ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పడం వల్ల ఆ సంస్థకే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణలో యూనిట్‌ను నెలకొల్పడం ద్వారా అటు అశోక్‌లేలాండ్‌కు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికీ ప్రయోజనం ఉంటుంది. ఇన్ని సానుకూల అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో యూనిట్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చిన అశోక్‌లేలాండ్ చివరకు యూనిట్‌ను మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పడానికి మొగ్గుచూపింది. ఆ రాష్ట్రంలోని ఆర్‌టిసి బస్సుల్లో మెజారిటీ సంఖ్య టాటా తయారీ బస్సులే. మార్కెట్‌ను సృష్టించుకోడానికి ఆ రాష్ట్రంలో అశోక్ లేలాండ్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించడంపై తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే తెలంగాణను విస్మరించడమే ఇప్పుడు చర్చనీయాంశం.
వ్యాపార ప్రయోజనాలను ఆశించి ఆ సంస్థ ఏ రాష్ట్రంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నా తప్పుపట్టాల్సిన పనిలేదు. సంస్థ కార్యకలాపాలను విస్తరించుకోడానికి తగిన వ్యూహాలు ఆ సంస్థకు ఉంటాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త యూనిట్‌ను తెరిచి మార్కెట్‌ను చేజిక్కించుకోవడం ఆ సంస్థ వ్యూహంలో భాగం కావచ్చు. కానీ తెలంగాణను విస్మరించడానికి గల కారణాలపైనే ఇప్పుడు ప్రధాన చర్చ. మార్కెట్ ఉన్న తెలంగాణను ఎందుకు కాదనుకుందనేది ప్రభుత్వ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి తొలుత అవగాహనా ఒప్పందం కుదిరింది కూడా తెలంగాణతోనే. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం వినూత్నంగా, అనుకూలంగా ఉందని అశోక్‌లేలాండ్ ప్రశంసలు కురిపించింది కూడా. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి బస్సుల్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని, రాష్ట్రంలో యూనిట్‌ను స్థాపించినట్లయితే నేరుగా కొనుగోలు చేస్తామని సిఎం ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు అశోక్ లేలాండ్ సంస్థ నుంచే వాహనాలను సమకూర్చుకోవాల్సిందిగా ఆర్‌టిసి అధికారులకు సైతం సిఎం స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ సైతం లారీలను ఈ సంస్థ నుంచే కొనుగోలుచేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజా రవాణా వ్యవస్థ నిర్వహణపై ఆ సంస్థ నుంచి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా ఆర్‌టిసి అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. ప్రొఫెషనల్ డ్రైవింగ్ సెంటర్‌ను నెలకొల్పడంపై కూడా అశోక్‌లేలాండ్‌కు ఆఫర్ ఇచ్చారు. కొత్తగా ఎదుగుతున్న రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం పెట్టుబడులు పెట్టే సంస్థలకు సానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటున్నా, వీటిపట్ల అనేక ప్రైవేటు సంస్థలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా అశోక్‌లేలాండ్ మాత్రం ఎంఒయు దగ్గరే ఆగిపోవడం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉన్నా తెలంగాణలో యూనిట్‌ను నెలకొల్పడంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం విచారకరం.
తెలంగాణతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అధికారులు వ్యాఖ్యానించారు. ఇంతకూ ఆ సంస్థ తెలంగాణలో యూనిట్‌ను స్థాపిస్తుందా లేదా అనే అనుమానంతో స్వయంగా మంత్రి జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సంస్థ ప్రతినిధులతో చివరి సమావేశాన్ని ఏర్పాటుచేసి ఈ అంశంపై అటో ఇటో తేల్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు అశోక్‌లేలాండ్‌కు తెలంగాణ అధికారులు లేఖ రాసినట్లు సమాచారం. టీఎస్‌ఐఐసీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ఆ సంస్థకు సమాచారం తెలియజేశామని, నెల రోజుల్లో వస్తామని సూచనప్రాయంగా తెలిపారని, ఆ సమావేశం తర్వాత మాత్రమే స్థలాన్ని ఇవ్వడమా లేక మరో పరిశ్రమ వస్తే దానికి బదలాయించడమా అనేది తేలిపోతుందని వ్యాఖ్యానించారు. మరో ఉన్నతాధికారి మాట్లాడుతూ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను తీసుకుని నెల రోజుల్లో వస్తామని ఆ సంస్థ నుంచి జవాబు వచ్చిందని, దాన్ని బట్టి ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
నిజానికి అశోక్‌లేలాండ్ కోరినట్లుగా తెల్కపట్ల పారిశ్రామిక పార్కు సమీపంలోనే 50 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం రిజర్వు చేసి ఉంచింది. మరో సంస్థకు కేటాయించకుండా ఇంతకాలం పెండింగ్‌లో ఉంచింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 75 ఎకరాల స్థలాన్ని తీసుకుని అక్కడే యూనిట్‌ను స్థాపించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న యూనిట్ సంగతేంటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.