Home దునియా పోలియోకి చుక్కలమందు.. మనసుకి అష్టాంగమార్గం

పోలియోకి చుక్కలమందు.. మనసుకి అష్టాంగమార్గం

Buddha

చాలా మంది మనోవైజ్ఞానికులు, మనోవిశ్లేషకులు ఆధునిక శాస్త్రాలనుబట్టి మనస్సు మర్మాల్ని విప్పి చెప్పుతూ ఉంటారు. నిజానికి ఈ మనోమర్మాల కర్మాధిపత్యం బౌద్ధానిదే! బుద్ధునిదే! అలాగే చాలా మంది వ్యక్తిత్వ వికాస రచయితలు, వక్తలు బౌద్ధం చెప్పిన అష్టాంగమార్గాన్ని చేసే పనుల్లో మనస్సుని కేంద్రీకరించుకోడానికి చెప్తూ ఉంటారు. వీరు చెప్పేది పనుల్లో నైపుణ్యం గురించే కాని, అష్టాంగ మార్గంలోని మనోనిర్మాణం గురించికాదు ఇలా రెండు రకాలుగా బౌద్ధం పేరుతో బౌద్ధ నుండి పక్కకే పోతున్నారు. కారణం! వారు వర్తమానంలో బతకలేకపోవడమే! నిజానికి దు:ఖం సుఖం అనే రెండు స్థితులు లేవు. ఉండవు. ఉండేదల్లా వ్యత్యాసమే! ఇది ఉష్ణోగ్రత, శీతలం లాంటిదే! శీతలం, ఉష్ణం అనే రెండు స్థితులు వేరు వేరుగా ఉండవు. అవి అవిభాజ్యాలు. వేరు చేయలేనివి. మంచు గడ్డలు పట్టుకున్న వారికి మామూలు పంపునీరు వెచ్చగానే ఉంటుంది. బాగా కాగిన నీటిలో చేయి ముంచి, అదే చేతిని గోరువెచ్చని నీటిలో పెడితే గోరువెచ్చని నీరు చల్లగా ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతని గ్రహించే స్థాయిని బట్టే శీతోష్ణాలు ఉంటాయి తప్ప శీతలం , ఉష్ణం అనే రెండు వేరు వేరు స్థితులు ఉండవు.

అలాగే వర్తమాన అంశాల్ని స్వీకరించే మనోస్థాయినిబట్టే సుఖ దు:ఖాలు ఉంటాయి ఒకే విషయం ఇద్దరి వ్యక్తుల్లో ఒకరికి సుఖాన్ని మరొకరికి దు:ఖాన్ని కలిగించవచ్చు.ఒకే విషయం ఒక వ్యక్తికి ఒకప్పుడు సుఖాన్ని, మరొకప్పుడు దు:ఖాన్ని కలిగించవచ్చు.ఒకే విషయం ఒక వ్యక్తికి ఎప్పుడూ ఎలాంటి సుఖాన్ని కానీ, దు:ఖాన్ని గానీ కలిగించక పోవచ్చు. “సుఖం” “దు:ఖం” అనేవి జంటలు. ఒకటి ఉంటే మరొకటి ఉండాలి.“దు:ఖం” అనుభూతం అయితేనే సుఖానుభూతి తెలుస్తుంది.“సుఖానుభూతి” పొంది ఉంటేనే దు:ఖం అనుభవానికొస్తుంది కాబట్టి ఏదైనా సరే ‘ఒకే ఒక్క’ అనుభూతి అనేది ఉండదు. మంచీచెడు, సుఖం దు:ఖం, తీపిచేదు, ఎండనీడ ఇవ్వన్నీ ద్వంద్వాలుగా ఉండే అనుభూతులే. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. అందుకే నార్ల వారు
“ ఎండ వెనుకే వాన నిండు హర్షమునిచ్చు
రేయి వెనుకే పగలు హాయినిచ్చు
బాధ వెనుకే సుఖము బహుళమై చెలగురా..” అన్నారు. కానీ, బౌద్ధం ‘దు:ఖం’ లేకుండా చేస్తుందంటే “సుఖాన్ని” పెంచేది అనుకోకూడదు. భూలోక సుఖాలు, పరలోక సుఖాల గురించి అది చెప్పలేదు.

ఎందుకంటే … నీవు “సుఖంగా” బ్రతుకు అంటే … ఆ ‘సుఖం’ పొందడం కోసం ఎదుటివారికి “దు:ఖం” కలిగించడానికి వెనుకాడం. ఆ దు:ఖం తిరిగి మరోసారి తనకే దు:ఖ కారణం అవుతుంది. స్వర్గ సుఖాలకోసం యాగాల్లో బలులు నిర్వహించడం, ‘స్వర్గంలేదు పాడూలేదు ,ఎలాగైనా సరే ఇక్కడే సుఖాల్ని అనుభవించు’ అని చెప్పే వాదాల్ని బుద్దుడు అంగీకరించలేదు.ఈ సుఖదు:ఖాలు అనేవి జన్మలకు సంబంధించిన విషయాలుగా బుద్ధుడు భావించలేదు. సుఖాలు అనుభవించడానికి కొందరు, దు:ఖాలు భరించడానికి కొందరు పెట్టిపుట్టారు అని బుద్ధుడు ఒప్పుకోలేదు. అది ఒక మనోస్థితిగా భావించాడు. సుఖదు:ఖాలకు అతీతమైన అలాంటి మనోస్థితిని సాధించడానికి మార్గం చూపాడు. బుద్ధుడు చూపిన మార్గం సుఖ దు:ఖాలకు అతీతమైంది. ఇది దు:ఖాన్ని ‘నయం’ లేదా ‘బాగు’ చేసుకునే మార్గం కాదు. నిరోధించే మార్గం.

అలాంటి అనుభూతుల్ని కలిగించే విషయాల్ని అసలు మనసులో పడి అలజడి సృష్టించని మార్గాన్ని అన్వేషించాడు. మరలా ఒక్కసారి కాస్త వెనక్కువెళ్ళి చూద్దాం. ఒకే విషయం ఒకసారి దు:ఖాన్ని, ఒకసారి సంతోషాన్ని కల్గిస్తుంది అనుకున్నాం.అంటే … ఇక్కడ దు:ఖం, సంతోషం అనేవి విషయంలో లేవు. మనలోనే ఉన్నాయి. మనం అంటే మన ఆలోచనలే. మన ఆలోచనలు అంటే మన మనోసమన్వయమే! కోర్కెలు అనే స్థితి ఉంది. కాబట్టి కోర్కెలు లేని స్థితి కూడా ఉంటుంది. అదే నిర్వాణ స్థితి. కాబట్టి ఆ మనసుని ఆ నిర్వాణ స్థితికి చేర్చడానికి సుఖ, దు:ఖాలకు అతీతంగా మలచుకోవడమే సమ్యక్ ప్రయత్నం. ఇది అంత తేలిక కాదు. ఆషామాషీ అంతకంటే కాదు.

చాలా మంది బౌద్ధాన్ని దు:ఖవాదంగా భావిస్తారు. “బుద్ధుడు దు:ఖాన్ని ప్రేమించాడు” అని పొరపడ్డ రచయితలూ ఉన్నారు. బుద్ధుడు చెప్పింది దు:ఖ నివారణ సిద్ధాంతం. సుఖదు:ఖ అనుభూతులకు ఆవలగా మనస్సును కేంద్రీకరించే వినూత్న విధానం. కాబట్టి బౌద్ధం వ్యక్తిత్వ వికాసానికి కాదు , వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది. అసలు విత్తనం ఉంటే … ఆ విత్తనం మంచిదైతే అదే మొలకెత్తుతుంది. ంత జాగ్రత్తలు తీసుకున్నా పుచ్చు విత్తనంనుండి ఎ మంచి మొక్కరాదు. వ్యక్తిత్వ నిర్మాణం విత్తనం అయితే, వ్యక్తిత్వ వికాసం దాన్నుండివచ్చే మొలకే.

బౌద్ధం … మన మనస్సును మంచి విత్తనంగా మలుస్తుంది. మంచి విత్తనం నుండి మంచి మొలకే వస్తుంది. మంచి చెట్టుగా వికాసం పొందుతుంది. బౌద్ధం చీడపీడల్ని తట్టుకునేట్టుగా విత్తనాన్ని మలుస్తుంది. ఇప్పుడు ఎందరో శాస్త్రవేత్తలు అలాంటి వంగడాల్ని రూపొందిస్తున్నారు. చాలా జబ్బుల నుండి బైటపడేట్టు మానవ జీనోమేవిధానం ఇప్పుడు ముందుకొచ్చింది. పోలియో అలాగే రూపుమాపబడింది. మశూచి అలాగే మటుమాయమైంది.
పోలియో రోగికి చక్రాల కుర్చీ నిర్మించడం, ఉచితంగా అందించడం, కర్రలు, కాళ్ళు తగిలించడం ఇవ్వన్నీ ఉపశమన మార్గాలు కానీ, పోలియో చుక్కలు అసలు పోలియో రోగాన్ని రాకుండా మన జీన్‌ని బలపరచే ఔషదం
బౌద్ధం కూడా అలాంటిదే!
అది వ్యక్తిత్వ నిర్మాణమనే బీజాన్నే బలవర్థకంగా రూపొందిస్తుంది. మశూచికి ‘టీక’…. పోలియోకి ‘చుక్కలమందు’ లాంటిదే మనసుకు “అష్టాంగమార్గం”. మనసుని సుఖదు:ఖాలకి, రాగవిరాగాలకి అతీతంగా, మనిషిని వర్తమానంలో బ్రతికించే మార్గం అది.