Home తాజా వార్తలు బ్యాటింగే సమస్య..

బ్యాటింగే సమస్య..

vrt

కలవరపెడుతున్న  టాప్ఆర్డర్

మన తెలంగాణ/క్రీడా విభాగం
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఎసెక్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. దీన్ని కలవర పరిచే అంశంగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన మొదటి బంతికే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశ పరిచాడు. కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధావన్ ఈసారి కూడా జీరోకే వెనుదిరిగాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇక, సిరీస్‌లో జట్టుకు ప్రధాన అస్త్రంగా భావిస్తున్న డాషింగ్ ఆటగాడు చటేశ్వర్ పుజారా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు మాత్రమే చేసి వికెట్ పారేసుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో పుజారాపైనే జట్టుకు భారీ ఆశలు ఉన్నాయి. అతని వైఫల్యం ఆందోళన కలిగించే పరిణామమే. ఇక, మరో స్టార్ అజింక్య రహానె కూడా తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. 17 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జట్టులో కీలక ఆటగాళ్లుగా పరిగణిస్తున్న ధావన్, పుజారా, రహానెలు విఫలమవ్వడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఎసెక్స్‌పైనే ఇలా ఆడితే అండర్సన్, బ్రాడ్ తదితరులతో కూడిన ఫాస్ట్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ధావన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం, రహానె, పుజారాలు విఫలం కావడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి.
సత్తా చాటిన కోహ్లి…
మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో రాణించడం జట్టుకు శుభపరిణామంగానే చెప్పాలి. ఎసెక్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఎసెక్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన కోహ్లి 12 ఫోర్లతో 68 పరుగులు చేయడం జట్టుకు ఊరటనిచ్చే అంశమే. ఈ సిరీస్ కోహ్లి ఇలాగే ఆడితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. మరోవైపు లోకేష్ రాహుల్, దినేష్ కార్తీక్‌లు కూడా బ్యాట్‌ను ఝులిపించడం జట్టుకు మంచి పరిణామంగానే చెప్పొచ్చు. భీకర ఫాంలో ఉన్న లోకేష్ రాహుల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రాహుల్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చూడచక్కని షాట్లతో అలరించిన రాహుల్ తొలి టెస్టులో ఓపెనర్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడనే చెప్పాలి. ఇక, మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో అద్భుంతంగా ఆడాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విజయ్ ఏడు ఫోర్లతో 53 పరుగులు చేశాడు.
జోరుమీదున్నాడు…
మరోవైపు వికెట్ కీపర్‌గా తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న దినేష్ కార్తీక్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఎసెక్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న కార్తీక్ పరుగుల వర్షం కురిపించాడు. వేగంగా ఆడిన కార్తీక్ 14 బౌండరీలతో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో అతనికి తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా హాఫ్ సెంచరీ కొట్టి అందరి దృష్టి ఆకర్షించాడు. ఏడు ఫోర్లతో 51 పరుగులు చేసి సత్తా చాటాడు. మరోవైపు యువ ఆటగాడు రిషబ్ పంత్ కూడా మెరుపులు మెరిపించాడు. ఆడింది కొంత సేపే అయినా చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. ధాటిగా ఆడిన పంత్ ఆరు ఫోర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరుగ్గానే ఆడాడు. ఏడు ఫోర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే మరో ఓపెనర్ ధావన్ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇది జట్టును కలవరానికి గురి చేస్తోంది. చటేశ్వర్ పుజారా కూడా 23 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. పుజారా వైఫల్యం కూడా జట్టును వెంటాడుతోంది. బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ, ఉమేశ్ శర్మలు రాణించడం జట్టుకు శుభపరిణామంగా చెప్పాలి. ఇషాంత్ నాలుగు వికెట్లు పడగొట్టి ట్రాక్‌పైకి వచ్చాడు. ఉమేశ్ కూడా మూడు వికెట్లు తీసి తాను ఫాంలోనే ఉన్నట్టు నిరూపించాడు. ఇద్దరు కలిసి ఏడు వికెట్లు తీయడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. టాప్ ఆర్డర్‌లో కోహ్లి, పంత్, పాండ్య, రాహుల్, కార్తీక్‌లు రాణించడం జట్టుకు ఊరటనిచ్చే అంశమే. తొలి టెస్టులో వీరంతా బ్యాట్‌ను ఝులిపించడం ఖాయమనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం ఉంది. బరిలోకి దిగితేకానీ వీరి సత్తా ఏమిటో తెలియదు.

ధావన్‌పై అభిమానుల ఫైర్…

భారత స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన టి20, వన్డే సిరీస్‌లలో ఆశించిన స్థాయిలో ఆడని ధావన్ తాజాగా ఎసెక్స్‌తో జరిగిన సాధన మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్ కావడంతో విమర్శలు మరింత పెరిగాయి. టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే ఇలా ఆడితే ఇక టెస్టులో ఎలా ఆడుతాడోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ధావన్‌ను తప్పించి టెస్టు జట్టులో లోకేష్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, సోషల్ మీడియా వేదికగా ధావన్‌పై సటైర్లు వేస్తున్నారు. ధావన్ నెట్స్‌లోనే బాగా ఆడుతాడని, గ్రౌండ్‌లోకి దిగితే తొలి బంతికే పెవిలియన్ చేరుతాడని విమర్శిస్తున్నారు. ధావన్ టెస్టులకు పనికి రాడని, అతన్ని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితం చేయాలని మరికొంత మంది సూచించారు. దేశంలో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, వారిని తప్పించి ధావన్‌కు ఎందుకు ఎంపిక చేస్తున్నారో అర్థం కావడం లేదని మరి కొంత మంది అభిమానులు వ్యాఖ్యానించారు.

కోలుకున్న అశ్విన్

aswin

గాయంతో బాధపడుతున్న భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా అశ్విన్ కుడి చేతికి గాయమైంది. దీంతో అతను టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ, అశ్విన్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అది స్వల్ప గాయమేనని తేలింది. దీంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే భారత ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం వల్ల తొలి మూడు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. అంతేగాక మరో ముఖ్య బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా గాయం వల్ల తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ కూడా గాయం బారీన పడడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే వైద్య పరీక్షల్లో అశ్విన్ గాయం స్వల్పమైందని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, శనివారం అశ్విన్ ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కీలక బౌలర్ అశ్విన్ గాయం నుంచి కోలుకోవడంపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. అశ్విన్ ఈ సిరీస్‌లో జట్టుకు చాలా కీలకమని వారు పేర్కొన్నారు. అతని బౌలింగ్‌లో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయమని వారు వివరించారు.